212. రెండు వందల పండ్రెండవ అధ్యాయము
త్రిగుణస్వరూపము - వాని ఫలము.
మార్కండేయ ఉవాచ
ఏవం తు సూక్ష్యే కథితే ధర్మవ్యాధేన భారత ।
బ్రాహ్మణః స పునః సూక్ష్మం పప్రచ్ఛ సుసమాహితః ॥ 1
మార్కండేయుడు అన్నాడు. భరతవంశీయా! ఈ రీతిగా ధర్మవ్యాధుడు సూక్ష్మధర్మాన్ని నిరూపించిన పిదప కౌశికుడు ఏకాగ్రచిత్తుడై ఇంకొక సూక్ష్మ విషయాన్ని అడిగాడు. (1)
బ్రాహ్మణ ఉవాచ
సత్త్వస్య రజసశ్చైవ తమసశ్చ యథాతథమ్ ।
గుణాంస్తత్త్వేన మే బ్రూహి యతావదిహ పృచ్ఛతః ॥ 2
బ్రాహ్మణుడు అన్నాడు - ఈ సందర్భానికి తగిన రీతిగా అడుగుతున్న నాకు సత్త్వం, రజస్సు, తమస్సు అనే వాటి గుణాలను యథార్థరూపంగా - ఉన్నది ఉన్నట్లుగా - చెప్పవలసింది. (2)
వ్యాధ ఉవాచ
హంత తే కథయిష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి ।
తేషాం గుణాన్ పృథక్త్వేన నిబోధ గదతో మమ ॥ 3
ధర్మవాధుడు అన్నాడు - కౌశికా! నీవు అడిగినదానికి సరైన సమాధానం చెపుతను విను. సత్త్వ రజస్తమస్సులనే గుణాలను విడివిడిగా చెపుతాను తెలుసుకో. (3)
మోహాత్మకం తమస్తేషాం రజ ఏషాం ప్రవర్తకమ్ ।
ప్రకాశబహులత్వాచ్చ సత్త్వం జ్యాయ ఇహోచ్యతే ॥ 4
ఈ మూడింటిలో తమోగుణం మోహాత్మకం మోహాన్ని కలిగించేది. వీటిల్లో రజోగుణం పనులలో ప్రవర్తింపజేసేది. సత్త్వగుణం అధిక ప్రకాశవంతం (ఉజ్జ్వలం) కాబట్టి అన్నిటికంటే శ్రేష్ఠం అంటారు. (4)
అవిద్యాబహులో మూఢః స్వప్నశీలో విచేతనః ।
దుర్హృషీకస్తమోధ్వస్తః సక్రోధస్తామసోఽలసః ॥ 5
అజ్ఞానం అధికంగా గలవాడు, మూర్ఖుడు, ఒళ్లు తెలియకుండా ఎప్పుడూ నిద్రపోయేవాడు, ఇంద్రియ జయం లేనివాడు, వివేకం లేనివాడు, కోపిష్ఠి, సోమరి తామసుడు. (5)
ప్రవృత్తవాక్యో మంత్రీ చ యో నరాగ్ర్యోఽనసూయకః ।
విధిత్సమానో విప్రర్షే స్తబ్ధో మానీ స రాజసః ॥ 6
లోక విషయాలు మాత్రమే మాట్లాడేవాడు, సలహాలు ఇవ్వటంలో నేర్పరి, ఇతరుల గుణాలలో దోషాలను చూడనివాడు, మిక్కిలి ఆశ కలవాడు, నమస్కరింపనివాడు, అభిమానం ఎక్కువగా ఉన్నవాడు రాజసుడు (6)
ప్రకాశబహులో ధీరః నిర్విధిత్సోఽనసూయకః ।
అక్రోధనో నరో ధీమాన్ దాంతశ్చైవ స సాత్త్వికః ॥ 7
ప్రకాశం (జ్ఞానం) అధికంగా గలవాడు, ధీరుడు, ఆసక్తి లేనివాడు, ఇతరులదోషాలు చూసే స్వభావం లేనివాడు, కోపం లేనివాడు, బుద్ధిమంతుడు, జితేంద్రియుడు సాత్త్వికుడు. (7)
సాత్త్వికస్త్వథ సంబుద్ధః లోకవృత్తేన క్లిశ్యతే ।
యదా బుధ్యతి బోద్ధవ్యం లోకవృత్తం జుగుప్సతే ॥ 8
పుణ్యపాప ఫలాల సంచయము యొక్క పరిణామాన్ని తెలుసుకొనే వారే శిష్టులు. వారినే ఇతర శిష్టులు సమ్మతిస్తారు. (8)
వైరాగ్యస్య చ రూపం తు పూర్వమేవ ప్రవర్తతే ।
మృదుర్భవత్యహంకారః ప్రసీదత్యార్జవం చ యత్ ॥ 9
సాత్త్వికునిలో వైరాగ్యలక్షణం ముందుగానే కలుగుతుంది. అహంకారం తగ్గుతుంది. ఋజుప్రవర్తన వ్యక్తం అవుతుంది. (9)
తతోఽస్య సర్వద్వంద్వాని ప్రశామ్యంతి పరస్పరమ్ ।
న చాస్యం సంశయో నామ క్వచిద్ భవతి కశ్చన ॥ 10
తరువాత ఇతనిలో ఉండే రాగద్వేషాదులయిన ద్వంద్వాలు పరస్పరం ఉపశమిస్తాయి. ఇతనికి ఎప్పుడూ ఏ మాత్రమూ సంశయం కలుగదు. (10)
శూద్రయోనౌ హి జాతస్య సద్గుణానుపతిష్ఠతః ।
వైశ్యత్వం లభతే బ్రహ్మన్ క్షత్రియత్వం తథైవ చ ॥ 11
ద్విజోత్తమా! శూద్రజాతిలో జన్మించినా ఉత్తమ గుణాలను ఆశ్రయిస్తే వైశత్వాన్ని, క్షత్రియత్వాన్ని పొందుతాడు. (11)
ఆర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్యమభిజాయతే ।
గుణాస్తే కీర్తితాః సర్వే కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥ 12
ఋజుప్రవర్తన కలిగి ఉంటే అతనికి బ్రాహ్మణత్వం కలుగుతుంది. ఈ విధంగా గుణాలను అన్నింటినీ నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలి అనుకొంటున్నావు? (12)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే ద్వాదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 212 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణవ్యాధసంవాదమను రెండువందల పన్నెండవ అధ్యాయము. (212)