211. రెండు వందల పదకొండవ అధ్యాయము

పంచమహాభూతాల గుణములు - ఇంద్రియ నిగ్రహము.

మార్కండేయ ఉవాచ
ఏవముక్తః స విప్రస్తు ధర్మవ్యాధేన భారత ।
కథామకథయద్ భూయః మనసః ప్రీతివర్దనమ్ ॥ 1
మార్కండేయ మహర్షి అన్నాడు - భరతవంశీయా! ధర్మ వ్యాధుడు ఇలా చెప్పగా కౌశికుడు మనస్సుకు సంతోషం కలిగించే విషయాన్ని చెప్పటం ప్రారంభించాడు. (1)
బ్రహ్మణ ఉవాచ
మహాభూతాని యాన్యాహుః పంచ ధర్మభృతాం వర ।
ఏకైకస్య గుణాన్ సమ్యక్ పంచానామపి మే వద ॥ 2
బ్రాహ్మణుడు ఇలా ప్రశ్నించాడు - ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! పంచభూతాలు అని చెప్పేవాటిల్లో ఒక్కొక్కదాని గుణాలను నాకు చెప్పు. (2)
వ్యాధ ఉవాచ
భుమిరాపస్తథా జ్యోతిః వాయురాకాశమేవ చ ।
గుణోత్తరాణి సర్వాణి తేషాం వక్ష్యామి తే గుణాన్ ॥ 3
వ్యాధుడన్నాడు - బ్రాహ్మణా! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు భూతాలలో ముందుముందుని ఉత్తరోత్తరంగా ఉన్నవాని గుణాలతో కూడి ఉంటాయి. వాటి గుణాలను చెపుతాను. (3)
భూమిః పంచగుణా బ్రహ్మన్ ఉదకం చ చతుర్గుణమ్ ।
గుణాస్త్రయస్తేజసి చ త్రయశ్చాకాశవాతయోః ॥ 4
భూమిలో ఐదు గుణాలు, నీళ్లలో నాలుగు గుణాలు, తేజస్సులో మూడు, వాయువులో రెండు, ఆకాశంలో ఒకటి - గుణాలు ఉన్నవి. (4)
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ పంచమః ।
ఏతే గుణాః పంచ భూయేః సర్వేభ్యో గుణవత్తరా ॥ 5
శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు గుణాలు ఉన్నందువల్ల భూమి అన్నిభూతాలకన్నా అధిక గుణాలు కలిగి ఉన్నది. (5)
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసశ్చాపి ద్విజోత్తమ ।
అపామేతే గుణా బ్రహ్మన్ కీర్తితాస్తవ సువ్రత ॥ 6
శబ్దం, స్పర్శ, రూపం, రసం అనే నాలుగు నీళ్ళగుణాలు కౌశికా! వీటిని గూర్చి నీకు ఇంతకు ముందే చెప్పాను. (6)
శబ్దః స్పర్శశ్చ రూపం చ తేజసోఽథ గుణాస్త్రయః ।
శబ్ద స్పర్శశ్చ వాయౌ తు శబ్దశ్చాకాశ ఏవ తు ॥ 7
శబ్దం, స్పర్శ, రూపం అనే మూడు తేజస్సు గుణాలు, శబ్దం, స్పర్శ అనేవి రెండూ వాయుగుణాలు. శబ్దం ఒక్కటే ఆకాశగుణం. (7)
ఏతే పంచదశ బ్రహ్మన్ గుణా భూతేషు సందసు ।
వర్తంతే సర్వభూతేషు యేషు లోకాః ప్రతిష్ఠితా ॥ 8
ఇలా పంచభూతాలలో ఈ పదిహేనుగుణాలు ఉన్నవి. సమస్తజగత్తు వీటి మీదనే స్థాపితమై ఉన్నది. (8)
అన్యోన్యం నాతివర్తంతే సమ్యక్ చ భవతి ద్విజ ।
యదా తు విషమం భావమ్ ఆచరంతి దరాదరాః ॥ 9
తదా దేహీ దేహమన్యం వ్యతిరోహతి కాలతః ।
అనుపూర్వ్యా వినశ్యంతి జాయంతే చానుపూర్వశః ॥ 10
బ్రాహ్మణశ్రేష్ఠా! ఈ పంచభూతాలు ఒక దాన్ని ఒకటి అతిక్రమించకుండా ఉంటాయి. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. అన్నీ కలిసే చక్కగా ఉంటాయి. చరాచరా (వ్యక్తావ్యక్తా)లైన పంచభూతాలు విషమాలు (సమంగాలేనివి) ఐనప్పుడు ఈ జీవుడు కాలప్రేరణతో (తన సంకల్పానుసారం) ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. ఈ పంచభూతాలు మృత్యువు కలిగినప్పుడు ప్రతిలోమక్రమంలో అదృశ్యం అవుతాయి. ఉత్పత్తి అయ్యేటప్పుడు అనులోమక్రమంలో ఏర్పడుతాయి. (9,10)
తత్ర తత్ర హి దృశ్యంతే ధాతవః పాంచభౌతికాః ।
యైరావృతమిదం సర్వం జగత్ స్థావరజంగమమ్ ॥ 11
విభిన్న శరీరాలలో పంచభూతాల నుంచి ఏర్పడిన రక్తాది ధాతువులు ఉన్నాయి. ఈ సమస్త చరాచర జగత్తు వాటితో వ్యాప్తమై ఉన్నది. (11)
ఇంద్రియైః సృజ్యతే యద్ తత్తద్ వ్యక్తమితి స్మృతమ్ ।
తదవ్యక్తమితి జ్ఞేయం లింగగ్రాహ్యమతీంద్రియమ్ ॥ 12
బాహ్యేంద్రియాలతో దేనికి దేనికి సంసర్గం కలుగుతుందో అది వ్యక్తమనీ, ఇంద్రియగ్రాహ్యం కాకుండా అనుమాన ప్రమాణంతో తెలుసుకునేది అవ్యక్తమనీ భావించాలి. (12)
యథాస్వం గ్రాహకాణ్యేషాం శబ్దాదీనామిమాని తు ।
ఇంద్రియాణి యదా దేహీ ధారయన్నివ తప్యతే ॥ 13
తమతమ విషయాలను అతిక్రమించకుండా (ఈ శబ్దాది విషయాలను గ్రహించే) ఈ ఇంద్రియాలను ఆత్మ తన వశంచేసుకొన్నప్పుడు అది తపస్సు చేస్తున్నట్లు ఉంటుంది. (13)
లోకే వితతమాత్మానం లోకం చాత్మని పశ్యతి ।
పరావరజ్ఞో యః శక్తః స తు భూతాని పశ్యతి ॥ 14
తనను అన్నిలోకాల్లో వ్యాపించిన వానినిగాను, తనలో లోకాలు అన్నీ ఉన్నట్లుగాను అతడు చూస్తాడు. ఇలా సగుణ బ్రహ్మను తెలుసుకునే సమర్థుడైన జ్ఞాని అన్ని ప్రాణులను ఆత్మరూపంగా చూస్తాడు. (14)
వి॥సం॥ బ్రహ్మవేత్తలకు సోపాధికము, నిరుపాధికము అని రెండు అవస్థలున్నాయి. సర్వాత్ముడు సోపాధికుడు, నీరూపుడు నిరుపాధికుడు -
సోపాధిర్నిరుపాధిశ్చ ద్వేధా బ్రహ్మవిదుచ్యతే ।
సోపాధికః స్యాత్సర్వాత్మా నిరూపాఖ్యోఽనుపాధికః ॥ (నీల)
పశ్యతః సర్వభూతాని సర్వావస్థాసు సర్వదా ।
బ్రహ్మభూతస్య సంయోగః నాశుభేనోపపద్యతే ॥ 15
అన్ని స్థితుల్లో ఎల్లప్పుడూ సమస్తప్రాణులను ఆత్మరూపంతో చూసే బ్రహ్మభూతుడైన జ్ఞానికి అపవిత్రమైన కర్మలతో సంబంధం కలగదు. (15)
అజ్ఞానమూలం తం క్లేశమ్ అతివృత్తస్య పౌరుషమ్ ।
లోకవృత్తిప్రకాశేన జ్ఞానమార్గేణ గమ్యతే ॥ 16
అజ్ఞానం వల్ల కలిగిన క్లేశాన్ని అతిక్రమించిన ఆ మహాపురుషుడు లౌకికమైన తప్పనిపనులు మాత్రమే చేస్తూ జ్ఞానమార్గంతో మోక్షం పొందుతాడు. (16)
అనాదినిధనం జంతుమ్ ఆత్మయోనిం సదావ్యయమ్ ।
అనౌపమ్యమమూర్తం చ భగవానాహ బుద్ధిమాన్ ॥ 17
మేధావి, భగవంతుడైన బ్రహ్మదేవుడు తన నిఃశ్వాసాలైన వేదాలలో ముక్తుడైన జీవుని గురించి ఆద్యంతాలు లేనివాడు, స్వయంభువు, అవికారి (మార్పులేనివాడు), సాటిలేనివాడు, నిరాకారుడు అని చెప్పాడు. (17)
తపోమూలమిదం సర్వం యన్మాం విప్రానుపృచ్ఛసి ।
ఇంద్రియాణ్యేవ సంయమ్య తపో భవతి నాన్యథా ॥ 18
విప్రా! వీటికి అన్నిటికి తపస్సే మూలం. ఇంద్రియాలను నిగ్రహించుకోవటం వల్లనే తపస్సు సిద్ధిస్తుంది కాని ఇంకో విధంగా కాదు. నీవు అడిగినదానికి ఇదే నా సమాధానం. (18)
ఇంద్రియాణ్యేవ తత్ సర్వం యత్ స్వర్గనరకావుభౌ ।
నిగృహీతవిసృష్టాని స్వర్గాయ నరకాయ చ ॥ 19
స్వర్గనరకాలకు రెండింటికి ఇంద్రియాలే కారణం. ఇంద్రియ నిగ్రహం వల్ల స్వర్గమూ, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్ల నరకమూ కలుగుతాయి. (19)
ఏష యోగవిధిః కృత్స్నః యావదింద్రియధారణమ్ ।
ఏతన్మూలం హి తపసః కృత్స్నస్య నరకస్య చ ॥ 20
మనస్సుతో గూడా ఇంద్రియాలను తనలో ఉంచుకోవటమే యోగ సంపూర్ణానుష్ఠానం అవుతుంది. ఇదే తపస్సుకు అంతకూ మూలం. ఇంద్రియాలను వశంలో ఉంచుకోకపోవటమే నరకప్రాప్తికి హేతువు అవుతుంది. (20)
ఇంద్రియాణాం ప్రసంగేన దోషవమూర్చ్ఛంత్యసంశయమ్ ।
సంనియమ్య తు తాన్యేవ తతః సిద్ధిం సమాప్నుయాత్ ॥ 21
ఇంద్రియాలకు అనుచిత విషయాలతో సంబంధం వల్లనే దుష్కార్యాలు చేయటం మొదలైన దోషాలు కలుగుతాయి. ఆ ఇంద్రియాలనే చక్కగా వశంలో ఉంచుకొంటే తరువాత సిద్ధిని పొందవచ్చు. (21)
షణ్ణామాత్మని నిత్యానామ్ ఐశ్వర్యం యోఽధిగచ్ఛతి ।
న స పాపైః కుతోఽనర్థైః యుజ్యతే విజితేంద్రియః ॥ 22
శరీరంలోనే ఎప్పుడూ ఉండే మనస్సుతో కూడా ఆరు ఇంద్రియాల మీద అధికారం సంపాదించిన జితేంద్రియుడైన వ్యక్తి పాపపుపనుల జోలికి పోడు. అలాంటప్పుడు అతనికి పాపం వల్ల కలిగే అనర్థాలు ఎలా సంభవిస్తాయి? (22)
రథః శరీరం పురుషస్య దృష్టమ్
ఆత్మా నియంతేంద్రియాణ్యాహురశ్వాన్ ।
తైరప్రమత్తః కుశలీ సదశ్వైః
దాంతైః సుఖం యాతి రథీవ ధీరః ॥ 23
కంటికి కనపడే ఈ స్థూలశరీరం రథం అనీ, ఆత్మ (బుద్ధి) సారథి అనీ, ఇంద్రియాలను గుర్రాలు అనీ శ్రుతివాక్కులు చెపుతున్నవి. నేర్పరి, జాగ్రత్తకల ధీరుడయిన సారథి ఉత్తమాశ్వాలను తన వశంలో ఉంచుకొని సుఖంగా ప్రయాణం చేసినట్లు అప్రమత్తుడు, కుశలుడు, ధీరుడు అయిన పురుషుడు ఇంద్రియాలను వశంచేసుకొని సుఖంగా జీవితమార్గంలో ప్రయాణిస్తాడు. (23)
షణ్ణామాత్మని యుక్తానామ్ ఇంద్రియాణాం ప్రమాథినామ్ ।
యో ధీరో ధారయేద్ రశ్మిన్ స స్యాత్ పరమసారథిః ॥ 24
తన శరీరంలో ఉంటూనే క్షోభను కలిగించే ఇంద్రియాలు అనే ఆరు గుర్రాల పగ్గాలను జాగ్రత్తగా పట్టుకొని నడిపించే ధీరుడే ఉత్తమసారథి అవుతాడు. (24)
ఇంద్రియాణాం ప్రపృష్టానాం హయానామివ వర్త్మసు ।
ధృతిం కుర్వీత సారథ్యే ధృత్యా తాని జయేద్ ధ్రువమ్ ॥ 25
మార్గాలలో పరుగెత్తే గుర్రాలలాగా రాగద్వేషాది విషయాలలో సంచరించే ఇంద్రియాలను వశం చేసుకోవటానికి ధైర్యంతో ప్రయత్నం చేయాలి. ధీరతతో ప్రయత్నం చేసేవానికి వాటిమీద విజయం తప్పక లభిస్తుంది. (25)
ఇంద్రియాణాం విచరతాం యన్మనోఽను విధీయతే ।
తదస్య హరతే బుద్ధిం నావం వాయురివాంభసి ॥ 26
నీళ్ళల్లో ప్రయాణించే పడవను గాలివాటం నడిపినట్లే విషయాల్లో సంచరిమ్చే ఇంద్రియాలతో గూడిన మనస్సు అనే ఒక్క ఇంద్రియమే దృఢత్వం లేని వ్యక్తి బుద్ధిని నడుపుతుంది. (చూ. భగవద్గీత అధ్యా. 2 శ్లో. 67) (26)
యేషు విప్రతిపద్యంతే షట్సు మోహాత్ ఫలాగమమ్ ।
తేష్వధ్యవసితాధ్యాయీ విందతే ధ్యానజం ఫలమ్ ॥ 27
మానవులు అందరూ అజ్ఞానం వల్ల ఈ ఆరుఇంద్రియాల ద్వారా గలిగే ఫలప్రాప్తి విషయంలో సందేహగ్రస్తులవుతారు. కాని వాటి దోషాలను గుర్తించే విరాగి వాటిని నిగ్రహించి ధ్యానప్రాప్తమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. (27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే ఏకాదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 211 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యా పర్వమను ఉపపర్వమున బ్రాహ్మణ వ్యాధసంవాదమను రెండువందల పదకొండవ అధ్యాయము. (211)