174. నూట డెబ్బది నాల్గవ అధ్యాయము
అర్జునుని యాత్రా వృత్తాంతము విని ధర్మరాజు అభినందించుట.
అర్జున ఉవాచ
తతో మామతివిశ్వస్తం సంరూఢశరవిక్షతమ్ ।
దేవరాజో విగృహ్యేదం కాలే వచనమబ్రవీత్ ॥ 1
అర్జునుడు చెపుతున్నాడు - ఒకనాడు బాణాలచే గాయాలై నమ్మదగిన నన్ను పట్టుకుని దేవరాజు ఇలా అన్నాడు. (1)
దివ్యాన్యస్త్రాణి సర్వాణి త్వయి తిష్ఠంత్ భారత ।
న త్వాభిభవితుం శక్తః మానుషో భువి కశ్చన ॥ 2
భారతా! దివ్యాస్త్రములన్నీ నీ దగ్గరున్నాయి. భూమి మీద ఏమానవుడూ నిన్ను ఓడించలేడు (2)
భీష్మో ద్రోణః కృపః కర్ణః శకునిః సహ రాజభిః ।
సంగ్రామస్థస్య తే పుత్ర కలాం నార్హంతి షోడశీమ్ ॥ 3
కుమారా! యుద్ధంలో నీకు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, రాజులతో కూడిన శకుని పదహారవవంతు కూడా చేయరు. (3)
ఇదం చ మే తమత్రాణం ప్రాయచ్ఛన్మఘవాన్ ప్రభుః ।
అభేద్యం కవచం దివ్యం స్రజం చైవ హిరణ్మయీమ్ ॥ 4
ఇంద్రుడు నాశరీరాన్ని కాపాడే, భేదించబడని ఈ దివ్యమైన కవచాన్నీ, బంగారుమాలనూ ఇచ్చాడు. (4)
దేవదత్తం చ మే శంఖం పునః ప్రాదాన్మహారవమ్ ।
దివ్యం చేదం కిరీటం మే స్వయమింద్రో యుయోజ హ ॥ 5
మళ్ళీ ఎంతోధ్వని చెయ్యగల ఈ దేవదత్త మనబడే శంఖాన్నిచ్చాడు. ఇంద్రుడు తనకు తానుగా ఈ దివ్యమైన కిరీటాన్ని నాకు అమర్చాడు. (5)
తతో దివ్యాని వస్త్రాణి దివ్యాన్యాభరణాని చ ।
ప్రాదాచ్ఛక్రో మమైతాని రుచిరాణి బృహంతి చ ॥ 6
తరువాత ఇంద్రుడు నాకు దివ్యములైన వస్త్రాలను, దివ్యములైన ఆభరణములను ఇచ్చాడు. ఇవి మనోహరములు విశాలమైనవి. (6)
ఏవం సంపూజితస్తత్ర సుఖమస్మ్యుషితో నృప ।
ఇంద్రస్య భవనే పుణ్యే గంధర్వశిశుభిః సహ ॥ 7
రాజా! ఇలా గౌరవాన్ని పొందుతూ పవిత్రమైన ఇంద్రభవనంలో గంధర్వుల పిల్లలతో కలిసి సుఖంగా గడిపాను. (7)
తతో మామబ్రవీచ్ఛక్రః ప్రీతిమానమరైః సహ ।
సమయోఽర్జున గంతుం తే భ్రాతరో హి స్మరంతి తే ॥ 8
తరువాత దేవతలతో కలసియున్న ఇంద్రుడు ప్రీతితో అర్జునా! నీ సోదరులు నిన్ను తలుచుకుంటున్నారు. నీవు వెళ్ళవలసిన సమయమాసన్నమైంది" అన్నాడు. (8)
ఏవమింద్రస్య భవనే పంచ వర్షాణి భారత ।
ఉషితాని మయా రాజన్ స్మరతా ద్యూతజం కలిమ్ ॥ 9
భారతా! మహారాజా! ఈవిధంగా జూదం వల్ల ఏర్పడ్డ దోషం తలుచుకుంటున్న నాకు ఇంద్రుడి భవనంలో ఐదేళ్ళు గడిచాయి. (9)
తతో భవంతమద్రాక్షం భ్రాతృభిః పరివారితమ్ ।
గంధమాదనపాదస్య పర్వతస్యాస్య మూర్ధవి ॥ 10
తరువాత గంధమాదనపర్వతపాదమైన ఈ పర్వతం మీద సోదరులతో కలిసి ఉన్న నిన్ను చూశాను. (10)
యుధిష్ఠిర ఉవాచ
దిష్ట్యా ధనంజయాస్త్రాణి త్వయా ప్రాప్తాని భారత ।
దిష్ట్యా చారాధితో రాజా దేవానామీశ్వరః ప్రభుః ॥ 11
దిష్ట్యా చ భగవాన్ స్థాణుః దేవ్యా సహ పరంతప ।
సాక్షాద్ దృష్టః స్వయుద్ధేన తోషితశ్చ త్వయానఘ ॥ 12
యుధిష్ఠిరుడు అన్నాడు - ధనంజయా! అదృష్టం వల్ల నీవు అస్త్రాలను పొందావు. అదృష్టం వల్ల దేవతలకు ప్రభువైన ఇంద్రుణ్ణి ఆరాధించగలిగావు. అదృష్టం వల్ల భగవంతుడైన శివుని పార్వతితో సహా సాక్షాత్కరింపచేసుకున్నావు. నీయుద్ధంతో ఆ శివుని మెప్పించావు. (11,12)
దిష్ట్యా చ లోకపాలైస్త్వం సమేతో భరతర్షభ ।
దిష్ట్యా వర్ధామహే పార్థ దిష్ట్యాసి పునరాగతః ॥ 13
అదృష్టం వల్ల లోకపాలకుల్ని నీవు కలిశావు. అదృష్టం వల్ల ప్రగతిని సాధించాం. అదృష్టం వల్ల తిరిగివచ్చావు. (13)
అద్య కృత్స్నాం మహీం దేవీం విజితాం పురమాలినీమ్ ।
మన్యే చ ధృతరాష్ట్రస్య పుత్రానపి వశీకృతామ్ ॥ 14
ఈనాడు పట్టణాల వరుసతో విరాజిల్లే భూమినంతా జయించబడినట్లు ధృతరాష్ట్రుని కొడుకులందరినీ అదుపులోకి తెచ్చుకున్నట్లు అనుకుంటున్నాను. (14)
ఇచ్ఛామి తాని చాస్త్రాణి ద్రష్టుం దివ్యాని భారత ।
యైస్తథా వీర్యవంతస్తే నివాతకవచా హతాః ॥ 15
భారతా! ఆ దివ్యములైన అస్త్రాలను చూడాలనుకుంటున్నాను. చాలా పరాక్రమం గల ఆ నివాతకవచులు వాటితోనే గదా చంపబడ్డారు. (15)
అర్జున ఉవాచ
శ్వః ప్రభాతే భవాన్ ద్రష్టా దివ్యాన్యస్త్రాణి సర్వశః ।
నివాతకవచా ఘోరా యైర్మయా వినిపాతితాః ॥ 16
అర్జునుడు చెపుతున్నాడు. నేను నివాతకవచులను కూల్చిన ఆ దివ్యాస్త్రాలన్నింటినీ రేపుప్రొద్దున నీవు చూడగలవు. (16)
వైశంపాయన ఉవాచ
ఏవమాగమనం తత్ర కథయిత్వా ధనంజయః ।
భ్రాతృభిః సహితః సర్వైః రజనీం తామువాస హ ॥ 17
వైశంపాయనుడు చెపుతున్నాడు.
ఇలా అర్జునుడు తన రాక గూర్చి తెలిపి సోదరులందరితో ఆ రాత్రి అక్కడ గడిపాడు. (17)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి అస్త్రదర్శనసంకేతే చతుఃసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 174 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున అస్త్రప్రదర్శనసంకేతమను నూట డెబ్బది నాల్గవ అధ్యాయము. (174)