173. నూట డెబ్బది మూడవ అధ్యాయము

అర్జునుడు పౌలోమ కాలకేయులను సంహరించుట.

అర్జున ఉవాచ
నివర్తమానేన మయా మహద్ దృష్టం తతోఽపరమ్ ।
పురం కామచరం దివ్యం పావకార్కసమప్రభమ్ ॥ 1
అర్జునుడు చెపుతున్నాడు.
తరువాత నేను తిరిగి వస్తున్నప్పుడు అగ్ని సూర్యులకాంతితో, దివ్యమైన పెద్ద పట్టణాన్ని చూశాను. అది కామగమనం కలది. (1)
రత్నద్రుమమయైశ్చిత్రైః సుస్వరైశ్చ పతత్త్రిభిః ।
పౌలోమైః కాలకంజైశ్చ నిత్యహృష్టైరధిష్ఠితమ్ ॥ 2
తియ్యగా కూస్తున్న పక్షులతో అనేక విధాలైన రత్నమయమైన చెట్లున్నాయి. అక్కడ ఎప్పుడూ సంతోషం వీడని పౌలోమ, కాలకంజులనే రాక్షసులు నివసిస్తున్నారు. (2)
గోపురాట్టాలకోపేతం చతుర్ద్వారం దురాసదమ్ ।
సర్వరత్నమయం దివ్యం అద్భుతోపమదర్శనమ్ ॥ 3
ఆ నగరం గోపురాలతో ఎత్తైనభవనాలతో, నాలుగు ప్రక్కలా ద్వారాలుండి శత్రువులు ప్రవేశించలేనిది రత్నాలమయము దివ్యమూ అయిన ఆ నగరం చూడటానికి అద్భుతంగా ఉంది. (3)
ద్రుమైః పుష్పఫలోపేతైః సర్వరత్నమయైర్వృతమ్ ।
తథా పతత్త్రిభిర్దివ్యైః ఉపేతం సుమనోహరైః ॥ 4
అన్ని రత్నాలతో నిండిన పూలు, పండ్లతో కూడిన చెట్లతో నిండి ఉంది. మనోహరమైన పక్షులతో కూడి ఉంది. (4)
అసురైర్నిత్యముదితైః శూలర్ ష్టిముసలాయుధైః ।
చాపముద్గరహస్తైశ్చ స్రగ్విభిః సర్వతో వృతమ్ ॥ 5
పూలదండలు దాల్చిన వారితో నిండి ఆ నగరం సదా సంతోషంగా ఉంటుంది. శూలాలు, ఋష్టులు, రోకళ్లు, ధనుస్సులు ఈటెలు ధరించినవారితో నిండి ఉంది. (5)
తదహం ప్రేక్ష్య దైత్యానాం పురమద్భుతదర్శనమ్ ।
అపృచ్ఛం మాతలిం రాజన్ కిమిదం వర్తతేఽద్భుతమ్ ॥ 6
రాజా! అద్భుతంగా కనబడే ఆ రాక్షసుల పట్టణాన్ని చూసి నేను ఈ అద్భుతమేమిటని మాతలినడిగాను. (6)
మాతలిరువాచ
పులోమా నామ దైతేయీ కాలకా చ మహాసురీ ।
దివ్యం వర్షసహస్రం తే చేరతుః పరమం తపః ॥ 7
తపసోఽంతే తతస్తాభ్యాం స్వయంభూరదదద్ వరమ్ ।
అగృహ్ణీతాం వరం తే తు సుతానామల్పదుఃఖతామ్ ॥ 8
మాతలి చెపుతున్నాడు - దైత్యవంశానికి చెందిన పులోమ, కాలక, ఇద్దరూ వేయి దివ్యసంవత్సరాళు గొప్ప తపస్సు చేశారు. తపస్సు ముగిసినప్పుడు వారిద్దరికీ బ్రహ్మ వరమిచ్చాడు. వారిద్దరూ తమ కుమారులకు దుఃఖం కలుగకూడదని వరం పొందారు. (7,8)
అవధ్యతాం చ రాజేంద్ర సురరాక్షసపన్నగైః ।
పురం సురమణీయం చ ఖచరం సుమహాప్రభమ్ ॥ 9
సర్వరత్నైః సముదితం దుర్ధర్షమమరైరపి ।
మహర్షియక్షగంధర్వపన్నగాసురరాక్షసైః ॥ 10
సర్వకామగుణోపేతం వీతశోకమనామయమ్ ।
బ్రహ్మణా భరతశ్రేష్ఠ కాలకేయకృతే కృతమ్ ॥ 11
తదేతత్ ఖపురం దివ్యం చరత్యమరవర్జితమ్ ।
పౌలోమాధ్యుషితం వీర కాలకంజైశ్చ దానవైః ॥ 12
రాజేంద్రా! దేవతలు రాక్షసులు, పాములచే చావులేకుండానూ, కాంతితో ఆకాశంలో తిరిగే చాలా అందమైన పట్టణాన్నీ కోరారు. వారు కోరుకున్న ఆ విమాననగరం అన్నిరత్నాలు కలది. దేవతలు, మహర్షులు, యక్షులు, గంధర్వులు, పన్నగులు, అసురులు, ధ్వంసం చెయ్యలేరు. బ్రహ్మ కాలకేయులకోసం నిర్మించిన ఆ నగరం అన్నికోర్కెలను తీర్చే గుణాలు కలది. శోకము, రోగమూ అక్కడ ఉండవు. దేవతలు లేని ఈ దివ్యమైన ఆకాశనగరంలో పౌలోములు, దానవులైన కాలకంజులు నివసిస్తున్నారు. (9-12)
హిరణ్యపురమిత్యేవం ఖ్యాయతే నగరం మహత్ ।
రక్షితం కాలకేయైశ్చ పౌలోమైశ్చ మహాసురైః ॥ 13
ఈ నగరం హిరణ్యపురంగా పులువబడుతోంది. దీన్ని మహాసురులైన కాలకేయులు పౌలోములు రక్షిస్తూంటారు. (13)
త ఏతే ముదితా రాజన్ అవధ్యాః సర్వదైవతైః ।
నివసంత్యత్ర రాజేంద్ర గతోద్వేగా నిరుత్సుకాః ॥ 14
రాజా! వారందరూ దేవతల చేత చంపబడరు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. రాజేంద్రా! వారు దుఃఖమూ, ఆసక్తి లేకుండా ఉంటారు. (14)
మానుషాన్మృత్యురేతేషాం నిర్దిష్టో బ్రహ్మణా పురా ।
ఏతానపి రణే పార్థ కాలకంజాన్ దురాసదాన్ ।
వజ్రాస్త్రేణ నయస్వాశు వినాశం సుమహాబలాన్ ॥ 15
బ్రహ్మ వీరికి మనుష్యుడివల్ల చావును నిశ్చయించాడు. కుంతీకుమారా! బలవంతులై, ఎదురింపలేని ఈ కాలకంజుల్ని కూడా యుద్ధంలో వజ్రాస్త్రంతో వెంటనే నాశనం చెయ్యి. (15)
అర్జున ఉవాచ
సురాసురైరవధ్యం తద్ అహం జ్ఞాత్వా విశాంపతే ।
అబ్రువం మాతలిం హృష్టః యాహ్యేతత్ పురమంజసా ॥ 16
అర్జునుడుంటున్నాడు.
రాజా! దేవాసురులు జయించలేని, ఆహిరణ్యపురం గురించి తెలుసుకొని సంతోషించాను. త్వరగా ఈ పట్టణానికి తీసుకువెళ్ళమని మాతలితో అన్నాను. (16)
త్రిదశేశద్విషో యావత్ క్షయమస్త్రైర్నయామ్యహమ్ ।
న కథంచిద్ధి మే పాపా న వధ్యా యే సురద్విషః ॥ 17
నేను ఇంద్రశత్రువుల్ని అస్త్రాలతో క్షీణింపచెయ్యవద్దా? దేవతల్ని ద్వేషించే పాపులు నాకు ఎలాగైనా సరే చంపదగినవారే కదా? (17)
ఉవాహ మాం తతః శీఘ్రం హిరణ్యపురమంతికాత్ ।
రథేన తేన దివ్యేన హరియుక్తేన మాతలిః ॥ 18
అప్పుడు మాతలి గుర్రాలు పూన్చిన ఆ దివ్య రథం మీద నన్ను వెంటనే హిరణ్యపురం తీసుకెళ్ళాడు. (18)
తే మామాలక్ష్య దైతేయాః విచిత్రాభరణాంబరాః ।
సముత్పేతుర్మహావేగాః రథానాస్థాయ దంశితాః ॥ 19
విచిత్రమైన ఆభరణాలు, వస్త్రాలు ధరించిన ఆ దైత్యులు నన్ను గమనించి కవచాలు తొడుక్కుని రథాల మీద చాలా వేగంగా వచ్చి నా మీద విరుచుకుపడ్డారు. (19)
తతో నాలీకనారాచైః భల్లైః శక్త్యృష్టితోమరైః ।
ప్రత్యఘ్నన్ దానవేంద్రా మాం క్రుద్ధాస్తీవ్రపరాక్రమాః ॥ 20
కోపంతో ప్రచండమైన పరాక్రమం గల ఆ దానవరాజులు నన్ను నాలీకములు, బాణములు, బల్లెములు, శక్తులు, కర్రలు తోమరములతో కొట్టసాగారు. (20)
తదహం శరవర్షేణ మహతా ప్రత్యవారయమ్ ।
శస్త్రవర్షం మహద్ రాజన్ విద్యాబలముపాశ్రితః ॥ 21
వ్యామోహయం చ తాన్ సర్వాన్ రథమార్గైశ్చరన్ రణే ।
తేఽన్యోన్యమభిసమ్మూఢాః పాతయంతి స్మ దానవాన్ ॥ 22
రాజా! నేను విద్యాబలంతో ఆ బాణవర్షాన్ని పెద్దబాణవర్షంతో తిప్పికొట్టాను. యుద్ధభూమిలో విభిన్న రథమార్గాల్లో తిరుగుతూ వారందర్నీ మోహపెట్టాను. వారంతా దిక్కుతోచక ఒకరినొకరు దానవుల్ని నేలకూలుస్తున్నారు. (21,22)
తేషామేవం విమూఢానామ్ అన్యోన్యమభిధావతామ్ ।
శిరాంసి విశిఖైర్దీప్తైర్న్యహనం శతసంఘశః ॥ 23
ఇలా దిక్కుతోచక ఒకరినొకరు ఢీకొంటున్న వారివందల తలలను మంటలు కక్కుతున్న బాణాలతో త్రుంచేశాను. (23)
తే వధ్యమానా దైతేయాః పురమాస్థాయ తత్ పునః ।
ఖముత్పేతుః సనగరా మాయామాస్థాయ దానవీమ్ ॥ 24
చంపబడుతున్న ఆ దైత్యులు మళ్ళీ ఆ నగరాన్ని చేరుకుని రాక్షసమాయను ప్రయోగించి నగరంతో సహా ఆకాశంలోకి ఎగిరారు. (24)
తతోఽహం శరవర్షేణ మహతా కురునందన ।
మార్గమావృత్య దైత్యానాం గతిం చైషామవారయమ్ ॥ 25
కురునందనా! అప్పుడు నేను బాణాలవాన కురిపించి దైత్యుల మార్గాన్ని కప్పేసి వారికదలికను కట్టడి చేశాను. (25)
తత్ పురం ఖచరం దివ్యం కామగం సూర్యసప్రభమ్ ।
దైతేయైర్వరదానేన ధార్యతే స్మ యథాసుఖమ్ ॥ 26
సూర్యకాంతిగల దివ్యమైన ఆ పట్టణం కోరినచోటుకు ఆకాశంలో వెళుతుంది. దానిని వరంగా పొందటం చేత దైత్యులు సుఖంగా ఆకాశంలో దాన్ని అంటిపెట్టుకోగలిగారు. (26)
అంతర్భూమౌ నిపతతి పునరూర్ధ్వం ప్రతిష్ఠతే ।
పునస్తిర్యక్ ప్రయాత్యాశు పునరప్సు నిమజ్జతి ॥ 27
ఆ పట్టణం భూమిలోపలికి చొచ్చుకొనిపోతుంది. మళ్ళీ పైకి ఎగురుతుంది. అడ్డంగా వెళుతుంది. వేగంగా నీళ్ళలో మునుగుతుంది. (27)
అమరావతిసంకాశం తత్ పురం కామగం మహత్ ।
అహమస్త్రైర్బహువిధైః ప్రత్యగృహ్ణం పరంతప ॥ 28
అమరావతి వలె గొప్పదైన ఆ పట్టణం స్వేచ్ఛగా వెళుతుంది. అనేక విధాలైన అస్త్రాలతో నేను దాన్ని అడ్డుకున్నాను. (28)
తతోఽహం శరజాలేన దివ్యాస్త్రమదితేన చ ।
వ్యగృహ్ణం సహ దైతేయైః తత్ పురం పురుషర్షభ ॥ 29
పురుషశ్రేష్ఠా! దివ్యమైన అస్త్రాలతో అభిమంత్రించి వదిలిన బాణసమూహంతో రాక్షసుల్ని ఆ పట్టణాన్ని ముక్కలు ముక్కలు చెయ్యసాగాను. (29)
విక్షతం చాయసైర్బాణైః మత్ప్రయుక్తైరజిహ్మగైః ।
మహీమభ్యపతద్ రాజన్ ప్రభగ్నం పురమాసురమ్ ॥ 30
రాజా! నేను వదిలిన సూటి ఇనుపబాణాలచేత బాగా దెబ్బతిన్న ఆ అసురుల నగరం ఛిన్నాభిన్నమై నేలకొరిగింది. (30)
తే వధ్యమానా మద్బాణైః వజ్రవేగైరయస్మయైః ।
పర్యభ్రమంత వై రాజన్ అసురాః కాలచోదితాః ॥ 31
రాజా! పిడుగుపాటుతో సమానమైన వేగం గల నా ఇనుపబాణాలచేత వారు చంపబడుతూ ఉన్నారు. మృత్యువు తరుముతూంటే అన్నిప్రక్కలకు పరుగుతీస్తున్నారు. (31)
తతో మాతలిరారుహ్య పురస్తాన్నిపతన్నివ ।
మహీమవాతరత్ క్షిప్రం రథేనాదిత్యవర్చసా ॥ 32
వెంటనే మాతలి ఆకాశంలో పైకి లేచి సూర్యకాంతిని పోలిన రథాన్ని వారి ఎదుట ఒక్క ఉదుటున నిలపబోతున్నట్లు నేలపై దింపాడు. (32)
తతో రథసహస్రాణి షష్టిస్తేషామమర్షిణామ్ ।
యుయుత్సూనాం మయా సార్ధం పర్యవర్తంత భారత ।
తాన్యహం నిశితైర్బాణైః వ్యధమం గార్ధ్రరాజితైః ॥ 33
భారతా! యుద్ధం చెయ్యాలని రగులుతున్నవారు అరవైవేల రథాలతో నన్ను చుట్టుముట్టారు. గద్దముక్కుల అమరిక చేత పదునైన బాణాలతో వారిని నేను గాయపరచసాగాను. (33)
తే యుద్ధే సన్న్యవర్తంత సముద్రస్య యథోర్మయః ।
నేమే శక్యా మానుషేణ యుద్ధేనేతి ప్రచింత్య తత్ ॥ 34
తతోఽహమానుపూర్వ్యేణ దివ్యాన్యస్త్రాణ్యయోజయమ్ ।
కాని వాళ్ళు సముద్రపు కెరటాల్లాగా యుద్ధం చెయ్యటానికి నావైపు వస్తున్నారు. దానిని బట్టి మానవపద్ధతుల్లో వీరిని జయించటం కుదరదనుకొని నేను వరుసగా దివ్యాస్త్రాలను ప్రయోగించాను. (34 1/2)
తతస్తాని సహస్రాణి రథినాం చిత్రయోధినామ్ ॥ 35
అస్త్రాణి మమ దివ్యాని ప్రత్యఘ్నన్ శనకైరివ ।
తరువాత రథాన్నధిరోహించి విచిత్రంగా యుద్ధం చేస్తున్న వేలదానవులు మెల్లమెల్లగా నాదివ్యమైన అస్త్రములను అడ్డుకోసాగారు. (35 1/2)
రథమార్గాన్ విచిత్రాంస్తే విచరంతో మహాబలాః ॥ 36
ప్రత్యదృశ్యంత సంగ్రామే శతశోఽథ సహస్రశః ।
మహాబలులైన ఆ దానవులు రథాలను వివిధరీతుల్లో పోనిస్తూ వందలు, వేలసంఖ్యలో యుద్ధంలో కనబడ్డారు. (36 1/2)
విచిత్రముకుటాపీడాః విచిత్రకవచధ్వజాః ॥ 37
విచిత్రాభరణాశ్చైవ నందయంతీవ మే మనః ।
విచిత్రములైన కిరీటాలను అమర్చుకున్నారు. విచిత్రములైన తొడుగులను జెండాలను కలిగి ఉన్నారు. వారి ఆభరణాలు విచిత్రంగా ఉన్నాయి. అలా ఉన్న వారంతా నామనస్సు నానందపరుస్తూ ఉన్నారు. (37 1/2)
అహం తు శరవర్షైస్తాన్ అస్త్రప్రచుదితైః రణే ॥ 38
నాశక్నువం పీడయితుం తే తు మాం ప్రత్యపీడయన్ ।
దివ్యాస్త్రములతో అభిమంత్రించి నేను యుద్ధంలో బాణాలవాన కురిపించి కూడ వారిని బాధించలేకపోయాను. కాని వారు మాత్రం నన్ను పీడించసాగారు. (38 1/2)
తైః పీడ్యమానో బహుభిః కృతాస్త్రైః కుశలైర్యుధి ॥ 39
వ్యథితోఽస్మి మహాయుద్ధే భయం చాగాన్మహన్మమ ।
అస్త్రాల పరిజ్ఞానంతో యుద్ధంలో నేర్పరులయిన అనేక దానవుల చేత పీడించబడుతూ యుద్ధంలో బాధపడ్డాను. నాకు చాలా భయం వేసింది. (39 1/2)
తతోఽహం దేవదేవాయ రుద్రాయ ప్రయతో రణే ॥ 40
(ప్రయతః ప్రణతో భూత్వా నమస్కృత్య మహాత్మనే ।)
స్వస్తి భూతేభ్య ఇత్యుక్త్వా మహాస్త్రం సమచోదయమ్ ।
తరువాత యుద్ధభూమిలో నేను ఏకాగ్రతతో దేవదేవుడూ మహాత్ముడూ అయిన రుద్రునికి నమస్కరించి ప్రాణులన్నింటికి శుభం కలగాలని పలికి గొప్పదైన పాశుపతాస్త్రాన్ని తలచుకొన్నాను. (40 1/2)
యత్ తద్ రౌద్రమితి ఖ్యాతం సర్వామిత్రవినాశనమ్ ॥ 41
(మహత్ పాశుపతం దివ్యం సర్వలోకనమస్కృతమ్ ।)
తతోఽపశ్యం త్రిశిరసం పురుషం నవలోచనమ్ ।
త్రిముఖం షడ్ భుజం దీప్తమ్ అర్కజ్వలనమూర్థజమ్ ॥ 42
దానిని రౌద్రాస్త్రమని కూడా అంటారు. అది శత్రువులందర్నీ నశింపచేస్తుంది. ఆ దివ్యమైన పాశుపతాస్త్రం ప్రపంచవాసులందరిచేత నమస్కరించదగినది. ఆ పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఒక దివ్యపురుషుణ్ణి చూశాను. ఆయనకు మూడుతలలు, తొమ్మిదికళ్ళు, మూడు ముఖాలు, ఆరుభుజాలూ ఉన్నాయి. (41,42)
లేలిహానైర్మహానాగైః కృతచీరమమిత్రహన్ ।
(భక్తానుకంపినం దేవం నాగయజ్ఞోపవీతినమ్ ।
విభీస్తతస్తదస్త్రం తి ఘోరం రౌద్రం సనాతనమ్ ॥ 43
దృష్ట్వా గాండీవసంయోగమ్ ఆనీయ భరతర్షభ ।
నమస్కృత్వా త్రినేత్రాయ శర్వాయామితతేజసే ॥ 44
ముక్తవాన్ దానవేంద్రాణాం పరాభావాయ భారత ।
ముక్తమాత్రే తతస్తస్మిన్ రూపాణ్యాసన్ సహస్రశః ॥ 45
శత్రుసంహారకా! నాలుకలను చాచుతున్న పెద్దపెద్దపాములే ఆయనకు వస్త్రంగా ఉన్నాయి. భక్తులననుగ్రహించే ఆ దేవుడు పామునే యజ్ఞోపవీతంగా ధరించాడు. ఆయన దర్శనం చేత నాభయమంతా తొలగిపోయింది. భరతశ్రేష్ఠా! మళ్ళీ నేను భయంకరమూ సనాతనమూ అయిన ఆ పాశుపతాస్త్రాన్ని గాండీవధనుస్సుకు అమర్చి అమితతేజస్సు గల శివుని చూచి నమస్కరించి ఆ దానవేంద్రుల్ని నశింపచెయ్యటానికి విడిచిపెట్టాను. వెంటనే దానినుండి వేల ఆకారాలు పుట్టుకొచ్చాయి. (43-45)
మృగాణామథ సింహానాం వ్యాఘ్రాణాం చ విశాంపతే ।
ఋక్షాణాం మహిషాణాం చ పన్నగానాం తథా గవామ్ ॥ 46
శరభాణాం గజానాం చ వానరాణాం చ సంఘశః ।
ఋషభాణాం వరాహాణాం మార్జారాణాం తథైవ చ ॥ 47
శాలావృకాణాం ప్రేతానాం భురుండానాం చ సర్వశః ।
గృధ్రాణాం గరుడానాం చ చమరాణాం తథైవ చ ॥ 48
దేవానాం చ ఋషీణాం చ గంధర్వాణాం చ సర్వశః ।
పిశాచానాం సయక్షాణాం తథైవ చ సురద్విషామ్ ॥ 49
గుహ్యకానాం చ సంగ్రామే నైర్ ఋతానాం తథైవ చ ।
ఝషాణాం గజవక్త్రాణామ్ ఉలూకానాం తథైవ చ ॥ 50
మీనవాజిసరూపాణాం నానాశస్త్రాసిపాణినామ్ ।
తథైవ యాతుధానానాం గదాముద్గరధారిణామ్ ॥ 51
రాజా! లేళ్ళు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, దున్నపోతులు, పాములు, ఆవులు, శరభమృగాలు, ఏనుగులు, కోతి గుంపులు, ఎద్దులు, పందులు అలాగే పిల్లులు, తోడేళ్ళు,
ప్రేతరూపాలు, భురుండములు, రాబందులు, గ్రద్దలు, చమరీమృగాలు, దేవతలు ఋషులు, గందర్వులు, పిశాచాలు, యక్షులు, రాక్షసులు, గుహ్యకులు, నైర్ ఋతులు, చేపలు, ఏనుగు ముఖాలవారు, గుడ్లగూబలు, చేపల్లాగా, గుర్రాలలాగా ఉన్న వ్యక్తులు ఆ యుద్ధంలో పుట్టుకొచ్చారు. వారందరిచేతిలో అనేక శస్త్రాలు, అస్త్రాలూ ఉన్నాయి. అలాగే గదలు, ఈటెలు (కట్టెలు) ధరించిన రాక్షసులూ ఏర్పడ్డారు. (46-51)
ఏతైశ్చాన్యైశ్చ బహుభిః నానారూపధరైస్తథా ।
సర్వమాసీజ్జగద్ వ్యాప్తం తస్మిన్నస్త్రే విసర్జితే ॥ 52
త్రిశిరోభిశ్చతుర్దంష్ట్రైః చతురాస్యైశ్చతుర్భుజైః ।
అనేకరూపసంయుకైః మాంసమేదోవసాస్థిభిః ॥ 53
వీరితో పాటు అనేక ఇతర రూపాలు ధరించినవారితో జగమంతా నిండిపోయింది. ఆ పాశుపతాస్త్రాన్ని విడిచినంతనే మూడుతలలవారు, నాలుగుకోరలవారు, నాలుగుముఖాలవారు, నాలుగుభుజాలవారు అనేక ఆకారాలు దాల్చి వెలువడ్డారు. వాళ్ళు మాంసము, మేదస్సు, వస, ఎముకలు కలిగి ఉన్నారు. (52,53)
అభీక్ష్ణం వధ్యమానాస్తే దానవా నాశమాగతాః ।
అర్కజ్వలనతేజోభిః వజ్రాశనిసమప్రభైః ॥ 54
అద్రిసారమయైశ్చాన్యైః బాణైరపి నిబర్హణైః ।
న్యహనం దానవాన్ సర్వాన్ ముహూర్తేనైవ భారత ॥ 55
వారందరిచేత చావుదెబ్బలు తిని దానవులు నశించారు. అప్పుడు సూర్యాగ్నులతో సమానమైన తేజస్సు గల, వజ్రాయుధం, పిడుగుల్లా వెలుగొందే శత్రునాశకములైన లోహపు బాణాలతో దానవులందర్నీ రెండుఘడియల్లో చంపేశాను. (54,55)
గాండీవాస్త్రప్రణున్నాంస్తాన్ గతాసూన్ నభసశ్చ్యుతాన్ ।
దృష్ట్వాహం ప్రణమం భూయః త్రిపురఘ్నాయ వేధసే ॥ 56
గాండీవం విడిచిన అస్త్రాలతో నుజ్జునుజ్జై ప్రాణాలు పోగొట్టుకొని ఆకాశం నుండి నేలపై పడ్డారు. ఇది చూసి నేను మళ్ళీ త్రిపురాలను నశింపచేసిన శంకరభగవానుడికి ప్రణామం చేశాను. (56)
తథా రౌద్రాస్త్రనిష్పిష్టాన్ దివ్యాభరణభూషితాన్ ।
నిశమ్య పరమం హర్షమ్ అగమద్ దేవసారథిః ॥ 57
దివ్యమైన ఆభరణాలను అలంకరించుకున్న దానవులు అలా రౌద్రాస్త్రంతో నుజ్జునుజ్జవటం విని దేవేంద్రుడి సారథియైన మాతలి చాలా సంతోషించాడు. (57)
తదసహ్యం కృతం కర్మ దేవైరపి దురాసదమ్ ।
దృష్ట్వా మాం పూజయామాస మాతలిః శక్రసారథిః ॥ 58
దేవతలకు కూడా సాధ్యంకాని తట్టుకోలేని నా పనిని చూసి దేవేంద్రుడి సారథియైన మాతలి నన్ను చాలా ప్రశంసించాడు. (58)
ఉవాచ వచనం చేదం ప్రీయమాణః కృతాంజలిః ।
సురాసురైరసహ్యం హి కర్మ యత్ సాధితం త్వయా ॥ 59
చేతులు జోడించి ప్రీతితో "దేవాసురులకు సాధ్యంకాని పని చేశా"వన్నాడు. (59)
న హ్యేతత్ సంయుగే కర్తుమ్ అపి శక్తః సురేశ్వరః ।
(ధ్రువం ధనంజయ ప్రీతః త్వయి శక్రః పురార్దన ।)
సురాసురైరవధ్యం హి పురమేతత్ ఖగం మహత్ ॥ 60
త్వయా విమథితం వీర స్వవీర్యతపసో బలాత్ ।
హిరణ్యపురాన్ని ధ్వంసం చేసిన ధనంజయా! ఇలా యుద్ధం చెయ్యటానికి దేవరాజు ఇంద్రుడు కూడా చాలడు తప్పక నీపట్ల ఇంద్రుడెంతో ప్రసన్నుడౌతాడు. వీరుడా! నీ పరాక్రమంతో తపోబలంతో దేవాసురులు ధ్వంసం చెయ్యలేని, ఆకాశంలో తిరిగే ఈ పట్టణం ధ్వంసమయింది (60 1/2)
విధ్వస్తే ఖపురే తస్మిన్ దానవేషు హతేషు చ ॥ 61
వినదంత్యః స్త్రియః సర్వా నిష్పేతుర్నగరాద్ బహిః ।
ప్రకీర్ణకేశ్యో వ్యథితాః కురర్య ఇవ దుఃఖితాః ॥ 62
ఆ ఆకాశపట్టణం ధ్వంసం చెయ్యబడింది. దానవులు చంపబడ్డారు. పెడబొబ్బలు, పెడుతూ, జుట్టువిరబోసుకుని బాధతో ఆడులేళ్ళవలె దుఃఖంతో వారిస్త్రీలంతా నగరం బయటకు వచ్చారు. (61,62)
పేతుః పుత్రాన్ పితౄన్ భ్రాతౄన్ శోచమానా మహీతలే ।
రుదత్యో దీనకంఠ్యస్తు నినదంత్యో హతేశ్వరాః ॥ 63
ఉరాంసి పరినిఘ్నంత్యః విస్రస్తస్రగ్విభూషణాః ।
కొడుకులు, తండ్రులు, సోదరులకోసం ఏడుస్తూ నేలమీద పడ్డారు భర్తలను కోల్పోయి దీనమైన గొంతుకలతో ఏడుస్తూ, పెడబొబ్బలు పెడుతూ ధరించిన పూలు ఆభరణాలు జారిపోగా రొమ్ములు బాదుకుంటున్నారు. (63 1/2)
తచ్ఛోకయుక్తమశ్రీకం దుఃఖదైన్యసమాహతమ్ ॥ 64
న బభౌ దానవపురం హతత్విట్కం హతేశ్వరమ్ ।
గంధర్వనగరాకారం హతనాగమివ హ్రదమ్ ॥ 65
శుష్కవృక్షమివారణ్యమ్ అదృశ్యమభవత్ పురమ్ ।
ఆ దానవుల పట్టణం శోకంలో నిండిపోయింది. శోభను కోల్పోయింది. దుఃఖం దీనత అంతటా వ్యాపించాయి. ఆ నగరవాసులు, ప్రభువులు చంపబడ్డారు. పాడుబడింది. గంధర్వనగరం పేరులోనే మిగిలిపోయింది. ఏనుగు చంపబడ్డ నీటిమడుగులా ఎండినచెట్లున్న అడవిలా ఆ పట్టణం కనబడుతోంది. (64,65 1/2)
మాం తు సంహృష్టమనసం క్షిప్రం మాతలిరానయత్ । 66
దేవరాజస్య భవనం కృతకర్మాణమాహవాత్ ।
కర్తవ్యాన్ని ముగించి మనసంతా సంతోషంతో నిండిన నన్ను మాతలి వెంటనే యుద్ధరంగం నుండి దేవరాజు భవనానికి తీసుకొని వచ్చాడు. (66 1/2)
హిరణ్యపురముత్సృజ్య నిహత్య చ మహాసురాన్ ॥ 67
నివాతకవచాంశ్చైవ తతోఽహం శక్రమాగమమ్ ।
మమ కర్మ చ దేవేంద్రం మాతలిర్విస్తరేణ తత్ ॥ 68
సర్వం విశ్రావయామాస యథాభూతం మహాద్యుతే ।
నివాత కవచుల్ని చంపి, హిరణ్యపురాన్ని విడిచి తరువాత నేను ఇంద్రుణ్ణి సమీపించాను. నేను చేసిన ఆ పనిని ఉన్నది ఉన్నట్లు చాలా వివరంగా మాతలి దేవేంద్రుడికి వినిపించాడు. (67,68 1/2)
హిరణ్యపురఘాతం చ మాయానాం చ నివారణమ్ ॥ 69
నివాతకవచానాం చ వధం సంఖ్యే మహౌజసామ్ ।
తచ్ఛ్రుత్వా భగవాన్ ప్రీతః సహస్రాక్షః పురందరః ॥ 70
హిరణ్యపురాన్ని ధ్వంసం చెయ్యడం, రాక్షసుల మాయలను చిత్తుచెయ్యడం, శక్తిమంతులైన నివాతకవచుల్ని యుద్ధంలో చంపటం విని భగవంతుడైన ఇంద్రుడు ప్రీతిచెందాడు. (69,70)
మరుద్భిః సహితాః శ్రీమాన్ సాధు సాద్విత్యథాబ్రవీత్ ।
(పరిష్వజ్య చ మాం ప్రేమ్ణా మూర్ష్ని చాఘ్రాయ సస్మితమ్ ।)
తతో మాం దేవరాజో వై సమాశ్వాస్య పునః పునః ॥ 71
అబ్రవీద్ విబుధైః పార్ధమ్ ఇదం స మధురం వచః ।
అతిదేవాసురం కర్మ కృతమేవ త్వయా రణే ॥ 72
మరుత్తులతో కూడి శ్రీమంతుడైన ఇంద్రుడు బాగుబాగు అని నన్నభినందించి ప్రేమతో కౌగిలించుకొని చిరునవ్వుతో నా తల వాసన చూశాడు.
తరువాత దేవరాజైన ఇంద్రుడు నన్ను మాటిమాటికి ఊరడిస్తూ దేవతలతో కలిసి - నీవు యుద్ధంలో దేవాసురులకు సాధ్యం కానిపని చేశావని మధురంగా పలికాడు. (71,72)
గుర్వర్థశ్చ కృతః పార్థ మహాశత్రూన్ ఘ్నతా మమ ।
ఏవమేవ సదా భావ్యం స్థిరేణాజౌ ధనంజయ ॥ 73
అసమ్మూఢేన చాస్త్రాణాం కర్తవ్యం ప్రతిపాదనమ్ ।
అవిషహ్యో రణే హి త్వం దేవదానవరాక్షసైః ॥ 74
ధనంజయా! నా గొప్పశత్రువులైన దానవుల్ని చంపి గురుదక్షిణ చెల్లించావు. ఇలాగే యుద్ధంలో ఎప్పుడూ స్థిరంగా ఉండు. వివేకంతో అస్త్రాలను ప్రయోగించు.
యుద్ధంలో నీవు దేవదానవ రాక్షసులకు అసాధ్యుడవు. (73-74)
సయక్షాసురగంధర్వైః సపక్షిగణపన్నగైః ।
వసుధాం చాపి కౌంతేయ త్వద్బాహుబలనిర్జితామ్ ।
పాలయిష్యతి ధర్మాత్మా కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 75
యక్ష అసుర గంధర్వులకు పక్షిసమూహాలకు పాములకు ఎదుర్కొన లేనివాడవు. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు నీ బాహుబలంచేత జయించిన భూమిని పరిపాలిస్తాడు. (75)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి హిరణ్యపురదైత్యవధే త్రిసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 173 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున హిరణ్యపురదైత్యవధ అను నూట డెబ్బది మూడవ అధ్యాయము (173)
(దాక్షిణాత్య అధికపాఠం 2 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 77 1/2 శ్లోకాలు.)