175. నూట డెబ్బది ఐదవ అధ్యాయము
అర్జునుని దివ్యాస్త్రప్రదర్శనమును నారదుడు నివారించుట.
వైశంపాయన ఉవాచ
తస్యాం రాత్య్రాం వ్యతీతాయాం ధర్మరాజో యుధిష్ఠిరః ।
ఉత్థాయావశ్యకార్యాణి కృతవాన్ భ్రాతృభిః సహ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - యుధిష్ఠిరుడు ఆ రాత్రి గడువగానే లేచి సోదరులతో కలిసి అవసరమైన దైనందిన కార్యక్రమాలను ముగించాడు. (1)
తతః సంచోదయామాస సోఽర్జునం భ్రాతృనందనమ్ ।
దర్శయాస్త్రాణి కౌంతేయ యైర్జితా దానవాస్త్వయా ॥ 2
తరువాత యుధిష్ఠిరుడు సోదరులకు ఆనందాన్ని చేకూర్చే అర్జునుడితో నీవు ఏ అస్త్రాలతో దానవుల్ని జయించావో వాటిని చూపించు అని ప్రేరేపించాడు. (2)
తతో ధనంజయో రాజన్ దేవైర్దత్తాని పాండవః ।
అస్త్రాణి తాని దివ్యాని దర్శయామాస భారత ॥ 3
రాజా! తరువాత పాండవుడైన అర్జునుడు దేవతలిచ్చిన ఆ దివ్యాస్త్రములను చూపించసాగాడు. (3)
యథాన్యాయం మహాతేజాః శౌచం పరమమాస్థితః ।
(నమస్కృత్య త్రినేత్రాయ వాసవాయ చ పాండవః ।)
గిరికూబరపాదాక్షం శుభవేణు త్రివేణుమత్ ॥ 4
పార్థివం రథమాస్థాయ శోభమానో ధనంజయః ।
దివ్యేన సంవృతస్తేవ కవచేన సువర్చసా ॥ 5
ధనురాదాయ గాండీవం దేవదత్తం స వారిజమ్ ।
శోశుభ్యమానః కౌంతేయః ఆనుపూర్వ్యాన్మహాభుజః ॥ 6
అస్త్రాణి తాని దివ్యాని దర్శనాయోపచక్రమే ।
అథ ప్రయోక్ష్యమాణేషు దివ్యేష్వస్త్రేషు తేషు వై ॥ 7
సమాక్రాంతా మహీ పద్భ్యాం సమకంపత సద్రుమా ।
క్షుభితాః సరితశ్చైవ తథైవ చ మహోదధిః ॥ 8
యథావిధిగా స్నానాదులుచేసి శుచియై శివుడికి, ఇంద్రుడికీ నమస్కరించాడు. కొండ కూర్చునే చోటుగాను, కొండకిరుప్రక్కలూ రథచక్రాలుగా, చక్కని వెదుళ్ళే త్రివేణు (కూర్చునే చోటును రథ చక్రాలను కలిపేసాధనం) గా మట్టిరథాన్నెక్కి శోభించే అర్జునుడు మెరిసే దివ్యమైన కవచం తొడుగుకున్నాడు. శంఖాన్ని తీసుకుని శోభిల్లుతూ ఆ దివ్యాస్త్రాలను చూపించసాగాడు. ఆ దివ్యాస్త్రములు ప్రయోగించబడుతూ ఉంటే అర్జునుని పాదాలచేత అదమబడిన భూమి చెట్లతో కలిసి కంపించసాగింది. నదులూ సముద్రమూ కల్లోలం చెందాయి. (4-8)
శైలాశ్చాపి వ్యదీర్యంత న వవౌ చ సమీరణః ।
న బభాసే సహస్రాంశుః న జజ్వాల చ పావకః ॥ 9
కొండలు బ్రద్దలౌతున్నాయి. గాలివీచటం లేదు. సూర్యుడు ప్రకాశించటం లేదు. అగ్ని(నిప్పు) మండటం లేదు. (9)
న వేదాః ప్రతిభాంతి స్మ ద్విజాతీనాం కథంచన ।
అంతర్భూమిగతా యే చ ప్రాణీనో జనమేజయ ॥ 10
పీడ్యమానాః సముత్థాయ పాండవం పర్యవారయన్ ।
వేపమానాః ప్రాంజలయస్తే సర్వే వికృతాననాః ॥ 11
దహ్యమానాస్తదాస్త్రైస్తే యాచంతి స్మ ధనంజయమ్ ।
తతో బ్రహ్మర్షయశ్చైవ సిద్ధా యే చ మహర్షయః ॥ 12
జంగమాని చ భూతాని సర్వాణ్యేవావతస్థిరే ।
దేవర్షయశ్చ ప్రవరాః తథైవ చ దివౌకసః ॥ 1
యక్షరాక్షసగంధర్వాః తథైవ చ పతత్త్రిణః ।
ఖేచరాణి చ భూతాని సర్వాణ్యేవావతస్థిరే ॥ 14
ద్విజులకు వేదాళు స్ఫురించటం లేదు. జనమేజయా! భూమిలోపలి భాగంలోని ప్రాణులు బాధింపబడుతూ పైకి లేచి అర్జునుని వారించాయి. ఆ ప్రాణులన్నీ వికృతమైన ముఖాలతో వణుకుతూ చేతులు జోడించి ఆ అస్త్రాల వల్ల తగులబడుతూ అర్జునుని యాచించాయి. తరువాత బ్రహ్మర్షులు, సిద్ధులు, మహర్షులు, కదిలేప్రాణులన్నీ సమీపించాయి. శ్రేష్ఠులైన దేవర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, పక్షులు ఆకాశంలో తిరిగే ప్రాణులన్నీ సమీపించాయి. (10-14)
తతో పితామహశ్చైవ లోకపాలాశ్చ సర్వశః ।
భగవాంశ్చ మహాదేవః సగణోఽభ్యాయయౌ తదా ॥ 15
తరువాత అక్కడికి బ్రహ్మ, లోకపాలకులందరూ, గణాలతో కలిసి భగవంతుడైన మహాదేవుడు (శివుడు) చేరుకున్నారు. (15)
తతో వాయుర్మహారాజ దివ్యైర్మాల్యైః సుగంధిభిః ।
అభితః పాండవం చిత్రైః అవచక్రే సమంతతః ॥ 16
తరువాత వాయుదేవుడు అన్ని ప్రక్కల నుండి అర్జునుడిపై పరిమళం వెదజల్లే విచిత్రములైన పూలవాన కురిపించాడు.(16)
జగుశ్చ గాథా వివిధా గంధర్వాః సురచోదితాః ।
ననృతుః సంఘశశ్చైవ రాజన్నప్సరసాం గణాః ॥ 17
రాజా! దేవతల చేత ప్రేరేపించబడి గంధర్వులు అనేకరకాల గాథలను గానం చేశారు. అప్సరసల సమూహాలు గుంపులుగా చేరి నాట్యం చేశారు (17)
తస్మింశ్చ తాదృశే కాలే నారదశ్చోదితః సురైః ।
ఆగమ్యాహ వచః పార్థం శ్రవణీయమిదం నృప ॥ 18
రాజా! అలాంటి ఆ సమయంలో దేవతల ప్రేరణతో నారదుడు వచ్చి అర్జునుడు వినదగిన మాటలను చెప్పాడు. (18)
అర్జునార్జున మా యుంక్ష్వ దివ్యాన్యస్త్రాణి భారత ।
నైతాని నిరధిష్టానే ప్రయుజ్యంతే కథంచన ॥ 19
అర్జునా! అర్జునా! దివ్యములైన అస్త్రాలను ప్రయోగించకు, వీటిని గురిలేకుండా ఎక్కడపడితే అక్కడ ఎన్నటికీ ప్రయోగించకూడదు. (19)
అధిష్ఠానే న వా నార్తః ప్రయుంజీత కదాచన ।
ప్రయోగేషు మహాన్ దోషః హ్యస్త్రాణాం కురునందన ॥ 20
గురి ఉన్నా తనకే సంకటపరిస్థితి లేకుండా ఎప్పటికీ ప్రయోగించకూడదు. అస్త్రాలను తగిన కారణం లేకుండా తగని చోట ప్రయోగించటం చాలా దోషం అన్నాడు. (20)
ఏతాని రక్ష్యమాణాని ధనంజయ యథాగమమ్ ।
బలవంతి సుఖార్హాణి భవిష్యంతి న సంశయః ॥ 21
ధనంజయా! శాస్త్రప్రకారం వీటిని కాపాడితే అవి బలంగా ఉంటాయి. సుఖాన్నిస్తాయనటంలో సందేహం లేదు. (21)
అరక్ష్యమాణాన్యేతాని త్రైలోక్యస్యాపి పాండవ ।
భవంతి స్మ వినాశాయ మైవం భూయః కృథాః క్వచిత్ ॥ 22
అజాతశత్రో త్వం చైవ ద్రక్ష్యసే తాని సంయుగే ।
యోజ్యమానాని పార్థేన ద్విషతామవమర్దనే ॥ 23
పాండవా! వీటిని కాపాడుకొనకపోతే మూడులోకాల్ని నాశనం చేస్తాయి. మళ్ళీ ఎప్పుడూ ఇలా చెయ్యకు. ధర్మరాజా! శత్రువుల్ని అణచటానికి అర్జునుడు యుద్ధంలో వీటిని ప్రయోగించినపుడు నీవు చూడవచ్చు అన్నాడు. (22,23)
వైశంపాయన ఉవాచ
నివార్యాథ తతః పార్థం సర్వే దేవా యథాగతమ్ ।
జగ్మురన్యే చ యే తత్ర సమాజగ్ముర్నరర్షభ ॥ 24
వైశంపాయనుడు చెపుతున్నాడు - తరువాత అర్జునుని వారించి అక్కడికి వచ్చిన దేవతలందరూ ఇతరులు కూడా వచ్చిన దోవనే వెళ్ళిపోయారు. (24)
తేషు సర్వేషు కౌరవ్య ప్రతియాతేషు పాండవాః ।
తస్మిన్నేవ వనే హృష్టాః త ఊషుః సహ కృష్ణయా ॥ 25
వారంతా వెళ్ళిపోగా పాండవులు ద్రౌపదితో కలిసి ఆ వనంలోనే సంతోషంగా నివసించసాగారు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి అస్త్రదర్శనే పంచసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 175 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచ యుద్ధపర్వమను ఉపపర్వమున అస్త్రదర్శనమను నూట డెబ్బది ఐదవ అధ్యాయము. (175)