153. నూట ఏబది మూడవ అధ్యాయము
కుబేరుని అనుచరులు భీమునిరాకను గురించి ప్రశ్నించుట.
వైశంపాయన ఉవాచ
స గత్వా నలినీం రమ్యాం రాక్షసైరభిరక్షితామ్ ।
కైలాసశిఖరాభ్యాశే దదర్శ శుభకాననామ్ ॥ 1
కుబేరభవనాభ్యాశే జాతాం పర్వతనిర్ఘరైః ।
సురమ్యాం విపులచ్ఛాయాం నానాద్రుమలతాకులామ్ ॥ 2
వైశంపాయనుడు అన్నాడు - ఈవిధంగా ముందుకుసాగి భీముడు కైలాస పర్వత శిఖరం మీద రాక్షస గణం చేత్ రక్షింపబడే సుందరవనాన్నీ, రమణీయ సరోవరాన్నీ చూశాడు. ఆ సరస్సు పర్వతజలంతో నిపబడుతోంది. చూడటానికి చాలా అందంగా దట్టమైన నీడలు కలిగి ఎన్నో చెట్లు లతలతో వ్యాప్తమై ఉంది. (1,2)
హరితాంబుజసంఛన్నాం దివ్యాం కనకపుష్కరామ్ ।
నానాపక్షిజనాకీర్ణాం సూపతీర్థామకర్దమామ్ ॥ 3
ఆకుపచ్చని తామరలతో కప్పబడి ఆ సరోవరం ఉంది. బంగారు రంగు తామరపూలు ఉన్నాయి. అనేక జాతుల పక్షులు ఉన్నాయి. బురదలేని రేవులు చాల అందంగా కనిపించాయి. (3)
అతీవరమ్యాం సుజలాం జాతాం పర్వతసానుషు ।
విచిత్రభూతాం లోకస్య శుభామద్భుతదర్శనామ్ ॥ 4
కొండచరియల మీద నుంచి జారే సుందర జలంతో నిండి ఆ సరోవరం చాలా అందంగా ఆశ్చర్యకరంగా లోకానికి మంగళకరంగా కనిపిస్తోంది. (4)
తత్రామృతరసం శీతం లఘు కుంతీసుతః శుభమ్ ।
దదర్శ విమలం తోయం పిబంశ్చ బహు పాండవః ॥ 5
భీముడు ఆ సరోవరంలో అమృతపు రుచితో సమానమయిన చల్లని స్వచ్ఛమైన జలాన్ని పొట్టనిండా తాగాడు. (5)
తాం తు పుష్కరిణీం రమ్యాం దివ్యసౌగంధికావృతామ్ ।
జాతరూపమయైః పద్మైః ఛన్నాం పరమగంధిభిః ॥ 6
వైదూర్యవరనాలైశ్చ బహుచిత్రైర్మనోరమైః ।
హంసకారండవోద్ధూతైః సృజద్భిరమలం రజః ॥ 7
ఆ సరోవరం దివ్యసౌగంధికాలతో నిండి (రమణీయంగా) ఉంది. సుగంధభరితం అయిన బంగారు తామరలతో కప్పబడి ప్రకాశిస్తోంది.
ఆ తామరల కాడలు వైడూర్యపురంగులో ఉన్నాయి. చూడటానికి చిత్రంగా, అందంగా ఉన్నాయి. హంసలు కారండవాలు ఆ సరస్సులో తిరుగుతున్నాయి. నిర్మలమైన పుప్పొడి వాటికి అంటుకుంటోంది. (6,7)
ఆక్రీడం రాజరాజస్య కుబేరస్య మహాత్మనః ।
గంధర్వైరప్సరోభిశ్చ దేవైశ్చ పరమార్చితామ్ ॥ 8
అది రాజాధిరాజు బుద్ధిమంతుడూ అయిన కుబేరుని క్రీడాస్థలం. గంధర్వులు, అప్సరసలు, దేవతలు దాని గొప్పతనాన్ని పొగడుతారు. (8)
సేవితామృషిభిర్దివ్యైః యక్షైః కింపురుషైస్తథా ।
రాక్షసైః కిన్నరైశ్చాపి గుప్తాం వైశ్రవణేన చ ॥ 9
దివ్యఋషి గణం, యక్షులు, కింపురుషులు, రాక్షసులు, కిన్నరులు దాన్ని సేవిస్తున్నారు. కుబేరుడే ప్రత్యేకశ్రద్ధతో దానికి రక్షణవలయం ఏర్పాటుచేశాడు. (9)
తాం చ దృష్ట్వైవ కౌంతేయః భీమసేనో మహాబలః ।
బభూవ పరమప్రీతో దివ్యం సంప్రేక్ష్య తత్ సరః ॥ 10
బలవంతుడు భీమసేనుడు ఆ సరస్సును చూచి మిక్కిలి ఆనందంతో ప్రసన్నుడు అయ్యాడు. (10)
తచ్చ క్రోధవశా నామ రాక్షసా రాజశాసనాత్ ।
రక్షంతి శతసాహస్రాః చిత్రాయుధపరిచ్ఛదాః ॥ 11
మహారాజు కుబేరుని ఆజ్ఞానుసారం క్రోధవశులనే రాక్షసులు చిత్రవిచిత్ర ఆయుధాలతో వేషభాషలతో లక్షమంది దానిని పరిరక్షిస్తున్నారు. (11)
తే తు దృష్ట్వైవ కౌంతేయమ్ అజినైః ప్రతివాసితమ్ ।
రుక్మాంగదధరం వీరం భీమం భీమపరాక్రమమ్ ॥ 12
సాయుధం బద్ధనిస్త్రింశమ్ అశంకితమరిందమమ్ ।
పుష్కరేప్సుముపాయాంతమ్ అన్యోన్యమభిచుక్రుశుః ॥ 13
ఆ సమయంలో భయానక పరాక్రమాన్ని ప్రదర్శించ గల భీముడు లేడి చర్మాన్ని ధరించి ఉన్నాడు. బంగారు భుజాభరణాలు ధరించాడు. ధనుస్సు గద మొదలైన ఆయుధాలు వ్రేలాడదీసుకున్నాడు.
శత్రువుల్ని చీల్చటంలో సమర్థుడు, భయం లేనివాడు, తామరల్ని తీసుకుపోవాలనే కాంక్ష గల భీముని చూచిన ఆ రాక్షసుల మధ్య కోలాహలం బయల్దేరింది. (12-13)
అయం పురుషశార్దూలః సాయుధోఽజినసంవృతః ।
యచ్చికీర్షురిహ ప్రాప్తః తత్ సంప్రష్టుమిహార్హథ ॥ 14
నరశ్రేష్ఠుడు ఆయుధ ధారియై మృగచర్మాన్ని కప్పుకొని దేన్ని కోరి ఇక్కడకు వచ్చాడు? అడిగి తెలుసుకోవాలి. (14)
తతః సర్వే మహాబాహుం సమాసాద్య వృకోదరమ్ ।
తేజోయుక్తమపృచ్ఛంత కస్త్వమాఖ్యాతుమర్హసి ॥ 15
అప్పుడు వారందరు వృకోదరుని సమీపించి 'నీవెవరవు ఎందుకు వచ్చావు? అని' అన్నారు. (15)
మునివేషధరశ్చైవ సాయుధశ్చైవ లక్ష్యసే ।
యదర్ధమభిసంప్రాప్తః తదాచక్ష్వ మహామతే ॥ 16
మునివేషం ధరించి, ఆయుధాలు గ్రహించి దేనికోసం వచ్చావు? దాన్ని పూర్తిగా చెప్పు అని ప్రశ్నించాడు. (16)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌగంధికాహరణే త్రిపంచాదధికశతతమోఽధ్యాయః ॥ 153 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌగంధికాహరణము అను నూట ఏబది మూడవ అధ్యాయము. (153)