152. నూట ఏబది రెండవ అధ్యాయము

భీముడు సౌగంధిక వనమునకు వెడలుట.

వైశంపాయన ఉవాచ
గతే తస్మిన్ హరివరే భీమోఽపి బలినాం వరః ।
తేన మార్గేణ విపులం వ్యచరద్ గంధమాదనమ్ ॥ 1
వైశంపాయనుడు పలికాడు - హనుమంతుడు అంతర్ధానం అయ్యాక బలశాలి భీముడు అతడు చెప్పిన దారిలో గంధమాదన పర్వతంపై తిరుగసాగాడు. (1)
అనుస్మరన్ వపుస్తస్య శ్రియం చాప్రతిమాం భువి ।
మాహాత్మ్యమనుభావం చ స్మరన్ దాశరతేర్యయౌ ॥ 2
దారిలో ఆయన రూపాన్నీ విశాల శరీరాన్నీ బంగారు రంగు కాంతినీ తలచుకుంటూ శ్రీరాముని గొప్పతనం, ప్రభావం భావించుకుంటూ ముందుకు సాగాడు. (2)
స తాని రమణీయాని వనాన్యుపవనాని చ ।
విలోకయామాస తదా సౌగంధికవనేప్సయా ॥ 3
పుల్లద్రుమవిచిత్రాణి సరాంసి సరితస్తథా ।
నానాకుసుమచిత్రాణి పుష్పితాని వనాని చ ॥ 4
సౌగంధిక వనం కోసం బయలుదేరి మధ్యలో అక్కడ సుందరవనాల్ని ఉద్యానవనాల్ని చూశాడు.
వికసించిన చెట్లతో విచిత్రం అయిన, సరస్సులు, నదులు గల్గి అనేక రకాల పుష్పాలతో ప్రకాశించే వనాల్ని పరికించాడు. (3,4)
మత్తవారణయూథాని పంకక్లిన్నాని భారత ।
వర్షతామివ మేఘానాం వృందాని దదృశే తదా ॥ 5
శరీరమంతా బురదతో ఉన్న మదించిన ఏనుగుల గుంపుల్ని కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్ని అవలోకించారు. (5)
హరిణైశ్చపలాపాంగైః హరిణీసహితైర్వనమ్ ।
సశష్పకవలైః శ్రీమాన్ పథి దృష్ట్వా ద్రుతం యయౌ ॥ 6
నోటిలో గడ్డిపరకలు గల్గి చంచలమైన కళ్లున్న ఆడులేళ్ళతో కూడిన మగ లేళ్ళను చూస్తూ భీమసేనుడు వేగంగా నడవసాగాడు. (6)
మహిషైశ్చ వరాహైశ్చ శార్దూలైశ్చ నిషేవితమ్ ।
వ్యపేతభీర్గిరిం శౌర్యాద్ భీమసేనో వ్యగాహత ॥ 7
అడవిదున్నలు, అడవి పందులు పెద్దపులులు సంచరించే ఆ వనంలో నిర్భయంగా పరాక్రమంతో తిరుగసాగాడు. (7)
కుసుమానంతగంధైశ్చ తామ్రపల్లవకోమలైః ।
యాచ్యమాన ఇవారణ్యే ద్రుమైర్మారుతకంపితైః ॥ 8
అంతులేని పువ్వుల గంధాలతో, ఎఱ్ఱటి చిగురుటాకులవలె మృదువైన గాలిచే కదల్పబడిన చెట్లచే అరణ్యంలో భీముడు యాచింపబడుతున్న వానివలె ఉన్నాడు. (8)
కృతపద్మాంజలిపుటాః మత్తషట్పదసేవితాః ।
ప్రియతీర్థవనా మార్గే పద్మినీః సమతిక్రమన్ ॥ 9
పద్మములు అనే దోసిలి ఘటించి మదించిన తుమ్మెదలచే సేవింపబడే ప్రియతీర్థ వనాలనూ నదులనూ మార్గంలో దాటుతూ పోతున్నాడు. (9)
మజ్జమానమనోదృష్టిః ఫుల్లేషు గిరిసానుషు ।
ద్రౌపదీవాక్యపాథేయో భీమః శీఘ్రతరం యయౌ ॥ 10
భీముని మనస్సు, దృష్టి వికసించిన పర్వత సానువులందు లగ్నమైంది. ద్రౌపదీ వచనాలే అతనికి దారిలో అన్నంగా అయి శీఘ్రంగా బయలుదేరాడు. (10)
పరివృత్తేఽహని తతః ప్రకీర్ణహరిణే వనే ।
కాంచనైర్విమలైః పద్మైః దదర్శ విపులాం నదీమ్ ॥ 11
రోజు గడుస్తుండగా నాలుగువైపులా లేళ్ళు తిరిగే వనంలో బంగారు పద్మాలు గల విశాలానదిని వీక్షించాడు. (11)
హంసకారండవయుతాం చక్రవాకోపశోభితామ్ ।
రచితామివ తస్యాద్రేః మాలాం వినులపంకజామ్ ॥ 12
ఆ నది హంసలు, కారండవాలు, చక్రవాక పక్షులతో ప్రకాశిస్తోంది. ఆ నది ఆ పర్వతానికి స్వచ్ఛసుందర పద్మాలతో దండను తయారుచేసి అర్పిస్తున్నట్లు ఉంది. (12)
తస్యాం నద్యాం మహాసత్త్వః సౌగంధికవనం మహత్ ।
అపశ్యత్ ప్రీతిజననం బాలార్కసదృశద్యుతి ॥ 13
ఆ నదిలో గొప్ప సౌగంధికవనాన్ని భీమసేనుడు చూశాడు. ఆ వనం ప్రభాతకాల సూర్యుని కాంతిలా ప్రీతిని కలిగిస్తోంది. (13)
తద్ దృష్ట్వా లబ్ధకామః స మనసా పాండునందనః ।
వనవాసపరిక్లిష్టాం జగామ మనసా ప్రియామ్ ॥ 14
ఆ వనాన్ని చూచి భీముడు మనస్సులో "కోరిక తీరింది." అని భావించి వనవాసంతో బాధపడే ద్రౌపదిని మనస్సులో గుర్తుచేసుకొన్నాడు. (14)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌగంధికాహరణే ద్విపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 152 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌగంధికాహరణము అను నూట యేబది ఏబది రెండవ అధ్యాయము. (152)