151. నూట ఏబది ఒకటవ అధ్యాయము
హనుమంతుడు భీముని ఊరడించి అంతర్ధానమగుట.
వైశంపాయన ఉవాచ
తతః సంహృత్య విపులం తద్ వపుః కామతః కృతమ్ ।
భీమసేనం పునర్దోర్భ్యాం పర్యష్వజత వానరః ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - పిమ్మట స్వేచ్ఛగా పెంచిన రూపాన్ని తగ్గించి హనుమంతుడు భీముని గాఢంగా రెండు బాహువులతో కౌగిలించుకున్నాడు. (1)
పరిష్వక్తస్య తస్యాశు భ్రాత్రా భీమస్య భారత ।
శ్రమో నాశముపాగచ్ఛత్ సర్వం చాసీత్ ప్రదక్షిణమ్ ॥ 2
సోదరుని కౌగిలించుకొన్న భీముని అలసట ఒక్కసారిగా నశించింది. అంతా అతనికి అనుకూలంగా సవ్యంగా కనపడసాగింది. (2)
బలం చాతిబలో మేనే న మేఽస్తి సదృశో మహాన్ ।
తతః పునరథోవాచ పర్యశ్రునయనో హరిః ॥ 3
భీమానభాష్య సౌహార్దాద్ బాష్పగద్గదయా గిరా ।
గచ్ఛ వీర స్వమావాసం స్మర్తవ్యోఽస్మి కథాంతరే ॥ 4
బలశాలి భీమునికి తన బలం పెరిగిందని అనిపించింది. నాతో సమానమైనవాడు లేడు అనుకొన్నాడు. పిమ్మట హనుమంతుడు కళ్ళల్లో నీరు నిండగా సుహృద్భావంతో గద్గదస్వరంతో భీమునితో ఇలా పలికాడు. నీవు నీ నివాసానికి వెళ్ళు. ప్రసంగాల మధ్యలో అప్పుడప్పుడు నన్ను తలచుకో. (3,4)
ఇహస్థశ్చ కురుశ్రేష్ఠ న నివేద్యోఽస్మి కర్హిచిత్ ।
ధనదస్యాలయాచ్చాపి విసృష్టానాం మహాబల ॥ 5
దేశకాల ఇహాయాతుం దేవగంధర్వయోషితామ్ ।
మమాపి సఫలం చక్షుః స్మారితశ్చాస్మి రాఘవమ్ ॥ 6
రామాభిధానం విష్ణుం హి జగద్ధృదయనందనమ్ ।
సీతావక్ర్తారవిందార్కం దశాస్యధ్వాంతభాస్కరమ్ ॥ 7
మానుషం గాత్రసంస్పర్శం గత్వా భీమ త్వయా సహ ।
తదస్మద్దర్శనం వీర కౌంతేయామోఘమస్తు తే ॥ 8
నేను ఇక్కడ నివసిస్తున్నాను అని ఎవరితోను చెప్పకు. కుబేరుని భవనాన్ని వదలి వచ్చే దేవాంగనలు, గంధర్వ స్త్రీలు వచ్చే సమయం ఆసన్నమైంది.
నిన్ను చూసిన నా కళ్ళు సఫలతను పొందాయి. నీవంటి మానవశరీర స్పర్శచే భగవంతుడు శ్రీరాముని శరీర స్పర్శ గుర్తుకు వచ్చింది.
శ్రీరాముడు సాక్షాత్తుగా శ్రీమహావిష్ణువు. జగత్తుకు పరిపూర్ణ ఆనందాన్ని ఇచ్చేవాడు. సీతాదేవి ముఖపద్మానికి సూర్యుడు. రావణుడు అనే చీకటిని పోగొట్టే సూర్యుడు.
మనుష్య్ల శరీర సంస్పర్శ నీ ద్వారా పొందాను. నాదర్శనం నీకు అమోఘమైన ఫలాన్ని ఇస్తుంది. (5-8)
భ్రాతృత్వం త్వం పురస్కృత్య వరం వరయ భారత ।
యది తావన్మయా క్షుద్రా గత్వా వారణసాహ్వయమ్ ॥ 9
ధార్తరాష్ట్రా నిహంతవ్యా యావదేతత్ కరోమ్యహమ్ ।
శిలయా నగరం వాపి మర్దితవ్యం మయా యది ॥ 10
బద్ధ్వా దుర్యోధనం చాద్య ఆనయామి తవాంతికమ్ ।
యావదేతత్ కరోమ్యద్య కామం తవ మహాబల ॥ 11
నీవు నన్ను పెద్ద అన్నగా భావించి ఏదైనా వరం కోరుకో. నీ కోరిక అదే అయితే గజపురంలో ప్రవేశించి నీచులైన ధార్తరాష్ట్రుల్ని చంపివేస్తాను.
రాళ్ళతో నగరాన్ని నాశనం చేసి నీవశం చేస్తాను. దుర్యోధనుని బంధించి నీవద్దకు తీసుకువస్తాను. నీ కోరిక ఏదైనా అది తప్పక తీరుస్తాను. (9-11)
వైశంపాయన ఉవాచ
భీమసేనస్తు తద్ వాక్యం శ్రుత్వా తస్య మహాత్మనః ।
ప్రత్యువాచ హనూమంతం ప్రహృష్టేనాంతరాత్మనా ॥ 12
వైశంపాయనుడు పలికాడు - మహాత్ముడు ఆంజనేయుని మాటలు విని భీమసేనుడు మిక్కిలి హర్షోల్లాసాలతో హనుమంతునితో అన్నాడు. (12)
కృతమేవ త్వయా సర్వం మమ వానరపుంగవ ।
స్వస్తి తేఽస్తు మహాబాహో కామయే త్వాం ప్రసీద మే ॥ 13
నా పని అంతా మీరు చేసినట్లే భావిస్తాను. మీకు మంగళం అగుగాక! నా కోరిక ఏమంటే మీరు ఎల్లప్పుడు నా పట్ల దయతో ఉండండి. (13)
సనాథాః పాండవాః సర్వే త్వయా నాథేన వీర్యవన్ ।
తవైవ తేజసా సర్వాన్ విజేష్యామో వయం పరాన్ ॥ 14
మీవంటి సంరక్షకుని పొందిన పాండవులు రక్షకుడు కలవారు అయ్యారు. మీ ప్రభావంచే మేం మా శత్రువుల్ని జయిస్తాం. (14)
ఏవముక్తస్తు హనుమాన్ భీమసేనమభాషత ।
భ్రాతృత్వాత్ సౌహృదాచ్చైవ కరిష్యామి ప్రియం తవ ॥ 15
ఇలా పలికిన భీముని మాటలు విని హనుమంతుడు సొదరుడవు అవటం వలన, స్నేహం వలన నీకు ప్రియాన్ని ఆచరిస్తాను. గ్రహించు అన్నాడు. (15)
చమూం విగాహ్య శత్రూణాం శరశక్తిసమాకులామ్ ।
యదా సింహరవం వీర కరిష్యసి మహాబల ॥ 16
తదాహం బృంహయిష్యామి స్వరవేణ రవం తవ ।
విజయస్వ ధ్వజస్థశ్చ నాదాన్ మోక్ష్యామి దారుణాన్ ॥ 17
శత్రూణాం యే ప్రాణహరాః సుఖం యేన హనిష్యథ ।
ఏవమాభాష్య హనుమాన్ తదా పాండవనందనమ్ ॥ 18
మార్గమాఖ్యాయ భీమాయ తత్రైవాంతరధీయత ॥ 19
బాణశక్తిచే పీడితులైన శత్రువుల సేనలో ప్రవేశించి నీవు సింహనాదం చేసినప్పుడు దానితో కలిపి నేను సింహనాదాన్ని చేసి దాని శక్తిని పెంచుతాను.
నేను అర్జునుని రథంపై ధ్వజరూపంలో ఉండి భయంకర సింహనాదాల్ని చేస్తాను.
వారిని మీరు తేలికగా చంపగలరు, అని పలికి భీమునికి మార్గాన్ని తెలిపి హనుమంతుడు అక్కడే అంతర్ధానం అయ్యాడు. (16-19)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గంధమాదనప్రవేశే హనుమద్భీమసంవాదే ఏకపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 151 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గంధమాదన ప్రవేశమున హనుమద్భీమసంవాదము అను నూట యేబది ఒకటవ అధ్యాయము. (151)