150. నూట ఏబదియవ అధ్యాయము
తన పూర్వశరీరమును హనుమంతుడు చూపుట, చాతుర్వర్ణ్య ధర్మ ప్రకటనము.
భీమసేన ఉవాచ
పూర్వరూపమదృష్ట్వా తే న యాస్యామి కథంచన ।
యది తేఽహమనుగ్రాహ్యః దర్శయాత్మానమాత్మనా ॥ 1
భీమసేనుడు పలికాడు - నీపూర్వరూపాన్ని చూడక ఏ విధంగాను వెనుతిరగను. నీవు నన్ను అనుగ్రహించి నీ రూపాన్ని నాకు చూపించు. (1)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు భీమేన స్మితం కృత్వా ప్లవంగమః ।
తద్ రూపం దర్శయామాస యద్ వై సాగరలంఘనే ॥ 2
వైశంపాయనుడు చెప్పాడు - ఇలా పలికిన భీముని మాటలు విని హనుమంతుడు సాగరలంఘన సమయంలో ఉన్న రూపం చూపించాడు. (2)
భ్రాతుః ప్రియమభీప్సన్ వై చకార సుమహద్ వపుః ।
దేహస్తస్య తతోఽతీవ వర్ధత్యాయామవిస్తరైః ॥ 3
సద్రుమం కదలీషండం ఛాదయన్నమితద్యుతిః ।
గిరేశ్చోచ్ర్ఛయమాక్రమ్య తస్థౌ తత్ర చ వానరః ॥ 4
సోదరుని హితం కోరి తన స్వరూపాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. అటహ్ని శరీరం ఎత్తు, పొడుగు, వెడల్పులలో నమ్మలేనంతగా విస్తరించింది. అమితతేజస్వి హనుమంతుడు చెట్లతో సహితంగా ఆ అరటితోపును కప్పి గంధమాదనం కంటె ఉన్నతమై ఎదుట నిలిచాడు. (3,4)
సముచ్ర్ఛితమహాకాయః ద్వితీయ ఇవ పర్వతః ।
తామ్రేక్షణస్తీవ్రదంష్ట్రః భృకుటీకుటిలాననః ॥ 5
విశాలమైన, ఉన్నతమైన అతని శరీరం రెండవ పర్వతంలా ఉంది. ఎఱ్ఱటి కళ్ళు, పదునైన కోరలు, వంగిన కనుబొమలు కలిగి ఉన్నాడు. (5)
దీర్ఘలాంగూలమావిద్య దిశో వ్యాప్య స్థితః కపిః ।
తద్ రూపం మహదాలక్ష్య భ్రాతుః కౌరవనందనః ॥ 6
విసిష్మియే తదా భీమః జహృషే చ పునః పునః ।
తమర్కమివ తేజోభిః సౌవర్ణమివ పర్వతమ్ ॥ 7
ప్రదీప్తమివ చాకాశం దృష్ట్వా భీమో న్యమీలయత్ ।
ఆబభాషే చ హనుమాన్ భీమసేనం స్మయన్నివ ॥ 8
ఆ వానరవీరుడు తన తోకను అటూ ఇటూ తిప్పుతూ దిక్కుల వరకు వ్యాపించి కనిపించాడు. ఆ అనిర్వచనీయమయిన సోదరుని రూపాన్ని చూచి భీముడు ఆశ్చర్యపడ్డాడు. మాటిమాటికి రోమాంచం కలిగింది. హనుమంతుడు తేజంలో సూర్యుడిలా కనిపించాడు. బంగారు పర్వతంలా అతని శరీరం మెరుస్తోంది. అతని శరీరకాంతితో ఆకాశం మెరుస్తూంటే చూడలేక భీముడు కళ్ళు మూసుకున్నాడు. హనుమంతుడు నవ్వుతూ భీమసేనునితో అన్నాడు. (6-8)
ఏతావదిహ శక్తస్త్వం ద్రష్టుం రూపం మమానఘ ।
వర్ధేఽహం చాప్యతో భూయో యావన్మే మనసి స్థితమ్ ।
భీమశత్రుషు చాత్యర్థం వర్ధతే మూర్తిరోజసా ॥ 9
నా పెద్ద రూపాన్ని మాత్రమే నీవు చూశావు. ఇంతకన్నా నేను పెరగగలను. ఆ రూపాన్ని నీవు చూడలేవు. నా మనస్సు ఎంత కావాలనుకుంటుందో అంత రూపం నాకు వస్తుంది. భయానక శత్రువుల ఎదుట నా రూపం మరింతగా పెరిగిపోతుంది. (9)
వైశంపాయన ఉవాచ
తదద్భుతం మహారౌద్రం వింధ్యపర్వతసన్నిభమ్ ।
దృష్ట్వా హనూమతో వర్ష్మ సంభ్రాంతః పవనాత్మజః ॥ 10
ప్రత్యువాచ తతో భీమః సంప్రహృష్టతనూరుహః ।
కృతాంజలిరదీనాత్మా హనూమంతమవస్థితమ్ ॥ 11
వైశంపాయనుడు అన్నాడు - హనుమంతుని భయంకరాకారం వింధ్యపర్వతంతో సమానంగా ఉంది. రౌద్రంగా ఉంది. అది చూచి బీముడు కంగారుపడ్డాడు.
భీముని శరీరంపై పులకాంకురాలు కలిగాయి. చేతులు జోడించి ఉదార హృదయంతో ఎదుట నిలబడి హనుమంతునితో అన్నాడు. (10-11)
దృష్టం ప్రమాణం విపులం శరీరస్యాస్య తే విభో ।
సంహరస్వ మహావీర్య స్వయమాత్మానమాత్మనా ॥ 12
మహానుభావా! నీ శరీరపు వైశాల్యం ప్రత్యక్షంగా చూచాను. నీవు నీ అంతట నీ శారీరాన్ని తగ్గించు. (12)
న హి శక్నోమి త్వాం ద్రష్టుం దివాకరమివోదితమ్ ।
అప్రమేయమనాధృష్యం మైనాకమివ పర్వతమ్ ॥ 13
నీవు ఉదయించిన సూర్యునివలె వెలిగిపోతున్నావు. నేను నీవైపు చూడలేను. నీవు సాటిలేని మైనాక పర్వతంలా కనిపిస్తున్నావు. (13)
విస్మయశ్చైవ మే వీర సుమహాన్ మనసోఽద్య వై ।
యద్ రామస్త్వయి పార్శ్వస్థే స్వయం రావణమభ్యగాత్ ॥ 14
నేడు నా మనస్సులో ఈ విషయాన్ని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. నివు ప్రక్కనే ఉండగా శ్రీరాముడు రావణసంహారం చేశాడు. (14)
త్వమేవ శక్తస్తాం లంకాం సయోధాం సహవాహనామ్ ।
స్వబాహుబలమాశ్రిత్య వినాశయితుమంజసా ॥ 15
నీవు ఒక్కడివే బాహుబలాన్ని ఆశ్రయించి యోధులు, వాహనాలతో కూడిన లంకను వేగంగా నాశనం చేయ సమర్థుడవు. (15)
న హి తే కించిదప్రాప్యం మారుతాత్మజ విద్యతే ।
తవ నైకస్య పర్యాప్తః రావణః సగణో యుధి ॥ 16
నీకు అసాధ్యం ఏదీ లేదు. యుద్ధభూమిలో సైనికులతో సహా కలిసినా కూడా రావణుడు నిన్నొక్కడినీ ఎదిరించలేడు. (16)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు భీమేన హనూమాన్ ప్లవగోత్తమః ।
ప్రత్యువాచ తతో వాక్యం స్నిగ్ధగంభీరయా గిరా ॥ 17
వైశంపాయనుడు పలికాడు. భీముని మాటలు విని కపిశ్రేష్ఠుడు హనుమంతుడు మాటల్లో స్నేహం, గాంభీర్యం కనిపించేలా ఇలా అన్నాడు. (17)
హనూమానువాచ
ఏవమేతన్మహాబాహో యథా వదసి భారత ।
భీమసేన న పర్యాప్తో మమాసౌ రాక్షసాధమః ॥ 18
హనుమంతుడు పలికాడు - నీవు పలికినది నిజమే. ఆ రాక్షసాధముడు నిజానికి నాకు ఎదురుపడలేడు. (18)
మయా తు నిహతే తస్మిన్ రావణే లోకకంటకే ।
కీర్తిర్నశ్యేత్ రాఘవస్య తత ఏతదుపేక్షితమ్ ॥ 19
లోకకంటకుడు రావణుడు నాచేతుల్లో చస్తే శ్రీరాముని కీర్తి తగ్గి ఉండేది అని ఉపేక్షించాను. (19)
తేన వీరేణ తం హత్వా సగణం రాక్షసాధమమ్ ।
ఆనీతా స్వపురం సీతా కీర్తిశ్చాఖ్యాపితా నృషు ॥ 20
పరాక్రమవంతుడైన రాముడు రాక్షస గణసహితంగా రావణుని చంపి సీతను అయోధ్యకు తీసుకొనివచ్చాడు. దీనివల్ల మనుష్యుల్లో ఆయన కీర్తి విస్తరించింది. (20)
తద్ గచ్ఛ విపులప్రజ్ఞ భ్రాతుః ప్రియహితే రతః ।
అరిష్టం క్షేమమధ్వానం వాయునా పరిరక్షితః ॥ 21
తెలివిగలవాడా! నీవు సోదరుని హితం కోరి వాయుదేవునిచే రక్షింపబడుతూ క్లేశంలేని కుశలమయిన దారిలో పొమ్ము. (21)
ఏష పంథాః కురుశ్రేష్ఠ సౌగంధికవనాయ తే ।
ద్రక్ష్యసే ధనదోద్యానం రక్షితం యక్షరాక్షసైః ॥ 22
ఇదీ సౌగంధికవనానికి పోయేదారి. ఇది యక్షరాక్షసులచే రక్షింపబడే కుబేరుని ఉద్యానవనం. (22)
న చ తే తరసా కార్యః కుసుమావచయః స్వయమ్ ।
దైవతాని హి మాన్యాని పురుషేణ విశేషతః ॥ 23
అక్కడకు చేరి వెంటనే ఆ సరోవరంలోని పూలను కోయవద్దు. ప్రత్యేకించి మనుష్యులచే దేవతల రూపాలు గౌరవింపతగినవి. (23)
బలిహోమనమస్కారైః మంత్రైశ్చ భరతర్షభ ।
దైవతాని ప్రసాదం హి భక్త్యా కుర్వంతి భారత ॥ 24
పూజ, హోమము, నమస్కారం, మంత్రం, భక్తిభావం ఉంటే దేవతలు ప్రసన్నులై దయచూపుతారు. (24)
మా తాత సాహసం కార్షీః స్వధర్మం పరిపాలయ ।
స్వధర్మస్థః పరం ధర్మం బుధ్యస్వ గమయస్వ చ ॥ 25
నీవు దుస్సాహసం చేయవద్దు. నీ ధర్మాన్ని ఆచరించు స్వధర్మనిష్ఠుడవై పరమధర్మాన్ని తెలిసి ఆచరించు. (25)
న హి ధర్మమవిజ్ఞాయ వృద్ధాననుపసేవ్య చ ।
ధర్మర్థౌ వేదితుం శక్యౌ బృహస్పతిసమైరపి ॥ 26
ధర్మస్వరూపం తెలియక, పెద్దల్ని సేవింపక బృహస్పతి సమానులైనా ధర్మార్థాలు తెలుసుకొనలేరు. (26)
అధర్మో యత్ర ధర్మాఖ్యో ధర్మశ్చాధర్మ సంజ్ఞితః ।
స విజ్ఞేయో విభాగేన యత్ర ముహ్యంత్యబుద్ధయః ॥ 27
ఒక్కొక్కప్పుడు అధర్మం ధర్మంగాను, ధర్మం అధర్మం గాను పిలువబడుతుంది. ధర్మాధర్మాల స్వరూపం వేరుగా తెలుసుకోవాలి. బుద్ధిహీనులు ఈ విషయంలో మోహాన్ని పొందుతారు. (27)
ఆచారసంభవో ధర్మో ధర్మే వేదాః ప్రతిష్ఠితాః ।
వేదైర్యజ్ఞాః సముత్పన్నాః యజ్ఞైర్దేవాః ప్రతిష్ఠితాః ॥ 28
సదాచారం వల్ల ధర్మం ఏర్పడుతుంది. ధర్మమందే వేదాలు స్థిరపడ్డాయి. వేదాల వల్ల యజ్ఞాలు పుట్టాయి. యజ్ఞాల చేతనే దేవతల ప్రతిష్ఠ నిలబడుతోంది. (28)
వేదాచారవిధానోక్తైః యజ్ఞైర్ధార్యంతి దేవతాః ।
బృహస్పత్యుశనఃప్రోక్తైః నయైర్ధార్యంతి మానవాః ॥ 29
వేదాచార విధానాలు చెప్పే యజ్ఞాల ద్వారా దేవతల జీవనం నడుస్తోంది. బృహస్పతి శుక్రాచార్యుడు చెప్పిన నీతులే మానవులకు రక్షకములు. (29)
షణ్యాకరవణిజ్యాభిః కృష్యాగోజావిపోషణైః ।
వార్తయా ధార్యతే సర్వం ధర్మై రేతైర్ద్విజాతిభిః ॥ 30
అంగళ్ళు, పన్నులు, వర్తకాలు, వ్యవసాయం, గోవులు, మేకల, గొఱ్ఱెల పెంపకం, ఇలాంటి ధర్మానుకూలాలైన జీవనవృత్తుల ద్వారా మూడువర్ణాల వారు అందరూ లోకాన్ని రక్షిస్తున్నారు. (30)
త్రయీ వార్తా దంసనీతిః తిస్రో విద్యా విజానతామ్ ।
తాభిః సమ్యక్ ప్రయుక్తాభిః లోకయాత్రా విధీయతే ॥ 31
వేదత్రయం, వార్త, దండనీతి ఇది క్రమంగా బ్రాహ్మణుల, వైశ్యుల, క్షత్రియుల జీవ్కను నిర్వహించేవి. తెలివైన వారిచే ఈ వృత్తులు సరిగా ప్రయోగింపబడటం చేత లోకయాత్ర నిర్వహించబడుతోంది. (31)
సా చేద్ ధర్మకృతా న స్యాత్ త్రయీధర్మమృతే భువి ।
దండనీతిమృతే చాపి నిర్మర్యాదమిదం భవేత్ ॥ 32
లోకయాత్ర ధర్మంగా లేకపోతే, భూమిపై వేదోక్త ధర్మం పాలింపబడకపోతే, దండనీతి సక్రమంగా లేకపోతే ఇదంతా మర్యాదలేనిది అవుతుంది. (32)
వార్తాధర్మే హ్యవర్తిన్యో వినశ్యేయురిమాః ప్రజాః ।
సుప్రవృత్తైస్త్రిభిర్హ్యేతైః ధర్మం సూయంతి వై ప్రజాః ॥ 33
ప్రజలు కృషి, గోరక్ష, వాణిజ్యములందు, ఆసక్తులు కానియెడల నశిస్తారు. చక్కగా ప్రదర్శిస్తే ఈ మూడు వృత్తులూ ప్రజల్లో ధర్మాన్ని పెంచుతాయి. (33)
ద్విజాతీనామృతం ధర్మః హ్యేకశ్చై వైకలక్షణః ।
యజ్ఞాధ్యయనదానాని త్రయః సాధారణాః స్మృతాః ॥ 34
ద్విజాతులకు ముఖ్యధర్మం సత్యమే. ఇది ధర్మపు ప్రధాన లక్షణం. యజ్ణ్య, స్వాధ్యాయ, దానాలు మూడూ ద్విజుల సామాన్య ధర్మాలు. (34)
యాజనాధ్యాపనం విప్రే ధర్మశ్చైవ ప్రతిగ్రహః ।
పాలనం క్షత్రియాణాం వై వైశ్యధర్మశ్చ పోషణమ్ ॥ 35
యజ్ఞాలు చేయించటం, చదువు చెప్పటం, దాన స్వీకారం బ్రాహ్మణుల లక్షణాలు. క్షత్రియులు పరిపాలన చెయ్యాలి. వైశ్యులు పశువుల్ని పోషించాలి. (35)
శుశ్రూషా చ ద్విజాతీనాం శూద్రాణాం ధర్మ ఉచ్యతే ।
భైక్ష్యహోమవ్రతైర్హీనాః తథైవ గురువసితాః ॥ 36
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని సేవించటమే శూద్రుల ధర్మం, భైక్ష్యం, హోమం, వ్రతం లేకుండానే మిగిలిన వర్ణాల సేవయే వారికి ముఖ్యం. (36)
క్షత్రధర్మోఽత్ర కౌంతేయ తవ ధర్మోఽత్ర రక్షణమ్ ।
స్వధర్మం ప్రతిపద్యస్వ వినీతో నియతేంద్రియః ॥ 37
అందరినీ రక్షించటం క్షత్రియుల కర్తవ్యం. అందుకే నీధర్మం కూడ అదే. నీ ధర్మాన్ని నీవు ఆచరించు. వినయంతో, జితేంద్రియుడవై ఉండు. (37)
వృద్ధైః సమ్మంత్ర్య సద్భిశ్చ బుద్ధిమద్భిః శ్రుతాన్వితైః ।
ఆస్థితః శాస్తి దండేన వ్యసనీ పరిభూయతే ॥ 38
వృద్ధులతో, సత్పురుషులతో, బుద్ధిమంతులతో వేదవిద్వాంసులతో చర్చించి వారి దయ కులోనై దండనీతిని పాటించు. వ్యసనపరుడైన రాజుకు పరాభవం ఎదురౌతుంది. (38)
నిగ్రహానుగ్రహైః సమ్యగ్ యదా రాజా ప్రవర్తతే ।
తదా భవంతి లోకస్య మర్యాదాః సువ్యవస్థితాః ॥ 39
నిగ్రహాను గ్రహాలతో రాజు లోకాన్ని పరిపాలిస్తే లోకంలో మర్యాదలు, నియమాలు స్థిరపడతాయి. (39)
తస్మాద్ దేశే చ దుర్గే చ శత్రుమిత్రబలేషు చ ।
నిత్యం చారేణ బోద్ధవ్యం స్థానం వృద్ధిః క్షయస్తథా ॥ 40
అందువలన దేశంలో, కోటలో తన శత్రువుల మిత్రుల సైనికుల స్థితి, వృద్ధి క్షయాల పరిస్థితి చారుల ద్వారా ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. (40)
రాజ్ఞాముపాయశ్చారశ్చ బుద్ధిమంత్రపరాక్రమాః ।
నిగ్రహప్రగ్రహౌ చైవ దాక్ష్యం వై కార్యసాధకమ్ ॥ 41
సామ, భేద, దాన, దండోపాయలు, గుప్త చారులు, ఉత్తమబుద్ధి, సురక్షిత మంత్రాంగం, పరాక్రమం, నిగ్రహానుగ్రహాలు సామర్థ్యం సర్వరాజులకూ కార్యసాధకాలు. (41)
సామ్నా దానేన భేదేన దండేనోపేక్షణేన చ ।
సాధనీయాని కర్మాణి సమాసవ్యాసయోగతః ॥ 42
సామ, దాన, భేద, దండ, ఉపేక్షలనే నీతుల్ని విడివిడిగా గాని, అన్నింటిని గాని ప్రయోగించి కార్యాల్ని సాధించాలి. (42)
మంత్రమూలా నయాః సర్వే చారాశ్చ భరతర్షభ ।
సుమంత్రితేన యా సిద్ధిః తాం ద్విజైః సహ మంత్రయేత్ ॥ 43
సకలరాజనీతులూ, గుప్తచారులూ మంత్రాంగంపై ఆధారపడి ఉంటాయి. ద్విజులతో చక్కగా సంప్రదించి నిర్ణయించిన మంత్రాంగం అన్నిచోట్ల ఫలిస్తుంది. (43)
స్త్రియా మూఢేన బాలేన లుబ్ధేన లఘునాపి వా ।
న మంత్రయీత గుహ్యాని యేషు చోన్మాదలక్షణమ్ ॥ 44
స్త్రీ, మూఢ, బాల, లోభి, నీచపురుషులతో మంత్రాంగం చేయరాదు. వారిలో ఉన్మాద లక్షణం ఉంటుంది. (44)
మంత్రయేత్ సహ విద్వద్భిః శక్తైః కర్మాణి కారయేత్ ।
స్నిగైశ్చ నీతివిన్యాసాన్ మూర్ఖాన్ సర్వత్ర వర్జయేత్ ॥ 45
విద్వాంసులతో మంత్రాంగం చెయ్యాలి. సమర్థులచే పనుల చేయించాలి. స్నేహితులతో నీతులను ప్రయోగించాలి. మూర్ఖుల్ని పూర్తిగా విడచిపెట్టాలి. (45)
ధార్మికాన్ ధర్మకార్యేషు అర్థకార్యేషు పండితాన్ ।
స్త్రీషు క్లీబాన్ నియుంజీత క్రూరాన్ క్రూరేషు కర్మసు ॥ 46
ధర్మకార్యాల్లో ధార్మికుల్ని, ధన విషయాల్లో అర్థశాస్త్ర పండితుల్ని, స్త్రీల విషయంలో నపుంసకుల్ని, కఠినమైన పనుల్లో క్రూరుల్ని నియమించాలి. (46)
స్వేభ్యశ్చైవ పరేభ్యశ్చ కార్యాకార్యసముద్భవా ।
బుద్ధిః కర్మసు విజ్ఞేయా రిపూణాం చ బలాబలమ్ ॥ 47
కార్యప్రారంభంలో స్నేహితుల, శత్రుపక్షాల అభిప్రాయం తీసుకోవాలి. అటువంటి కార్యాకార్యవివేకబుద్ధితో శత్రువుల బలాబలాలను వారి కర్మములలో తెలుసుకోవాలి. (47)
బుద్ధ్యా స్వప్రతిపన్నేషు కుర్యాత్ సాధుష్వనుగ్రహమ్ ।
నిగ్రహం చాప్యశిష్టేషు నిర్మర్యాదేషు కారయేత్ ॥ 48
స్వబుద్ధితో ఆలోచించి శరణాగతుల విషయంలో శ్రేష్ఠమైన పనులు చేయువారి విషయంలో అనుగ్రహం చూపాలి. మర్యాదల్ని మంటగలిపే వారియెడల దండనీతిని చూపించాలి. (48)
నిగ్రహే ప్రగ్రహే సమ్యగ్ యదా రాజా ప్రవర్తతే ।
తదా భవతి లోకస్య మర్యాదా సువ్యవస్థితా ॥ 49
నిగ్రహానుగ్రహాల్లో ఉండి రాజు పారిపాలిస్తే లోకంలో మర్యాదలు (హద్దులు) సురక్షితాలై ఉంటాయి. (49)
ఏష తేఽభిహితః పార్థ ఘోరో ధర్మో దురన్వయః ।
తం స్వధర్మవిభాగేన వినయస్థోఽనుపాలయ ॥ 50
నేను నీకు ఈ కఠోరరాజ్యధర్మాన్ని ఉపదేశించాను. దీని మర్మం తెలియటం అసాధ్యం. ధర్మాన్ని విభాగం చేసికొని వినయశీలివై దీన్ని ఆచరించు. (50)
తపోధర్మదమేజ్యాభిః విప్రా యాంతి యథా దివమ్ ।
దానాతిథ్యక్రియాధర్మైః యాంతి వైశాశ్చ సద్గతిమ్ ॥ 51
క్షత్రం యాతి తథా స్వర్గం భువి నిగ్రహపాలనైః ।
సమ్యక్ ప్రణీతదండా హి కామద్వేషవివర్జితాః ।
అలుబ్ధా విగతక్రోధాః సతాం యాంతి సలోకతామ్ ॥ 52
తపస్సు, ధర్మం, ఇంద్రియనిగ్రహం, యజ్ఞాచరణల ద్వారా మానవులు (బ్రాహ్మణులు) స్వర్గాన్ని చేరుకుంటారు. దాన ఆతిధ్య, రూప ధర్మాలతో వైశ్యులు ఉత్తమగతులు పొందుతారు.
నిగ్రహానుగ్రహపాలనచే క్షత్రియులు స్వర్గాన్ని అందుకుంటారు. బాగా దండనీతిని ప్రయోగించి కామ, ద్వేష రహితులై, లోభం లేక, కోపాన్ని విడచిన క్షత్రియులు సత్పురుషుల లోకాన్ని చేరుకుంటారు. (51,52)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం హనుమద్భీమసంవాదే పంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 150 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో హనుమద్భీమసంవాదమను నూట యేబదియవ అధ్యాయము. (150)