148. నూట నలువది ఏనిమిదవ అధ్యాయము

హనుమంతుడు సంక్షేపముగా రాముని చరిత్ర వినిపించుట.

హనూమానువాచ
హృతదారః సహ భ్రాత్రా పత్నీం మార్గన్ స రాఘవః ।
దృష్టవాన్ శైలశిఖరే సుగ్రీవం వానరర్షభమ్ ॥ 1
భార్య అపహరింపబడగా సోదరునితో కలిసి ఆమెను అన్వేషిస్తూ శ్రీరాముడు ఋష్యమూక పర్వతంపై వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుని చూశాడు. (1)
తేన తస్యాభవత్ సఖ్యం రాఘవస్య మహాత్మనః ।
స హత్వా వాలినం రాజ్యే సుగ్రీవమభిషిక్తవాన్ ॥ 2
అతనితో శ్రీరామునికి అగ్ని సాక్షికంగా స్నేహం కుదిరింది. శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవుని కిష్కింధా రాజ్యానికి రాజును చేశాడు. (2)
స రాజ్యం ప్రాప్య సుగ్రీవః సీతాయాః పరిమార్గణే ।
వానరాన్ ప్రేషయామాస శతకోఽథ సహస్రశః ॥ 3
ఆ సుగ్రీవుడు రాజ్యాన్ని పొంది సీతను వెదకటానికి వందల కొద్దీ, వేలకొద్దీ వానరులను అన్ని దిక్కులకూ పంపాడు. (3)
తతో వానరకోటీభిః సహితోఽహం నరర్షభ ।
సీతాం మార్గన్ మహాబాహో ప్రయాతో దక్షిణాం దిశమ్ ॥ 4
పిమ్మట వానరకోటులతో కూడి నేను సీతను అన్వేషిస్తూ దక్షిణ దిక్కుగా బయలుదేరాను. (4)
తతః ప్రవృత్తిః సీతాయాః గృధ్రేణ సుమహాత్మనా ।
సంపాతినా సమాఖ్యాతా రావణస్య నివేశనే ॥ 5
మహాత్ముడు వృద్ధుడు అయిన సంపాతి 'రావణుని గృహంలో నిర్బంధింపబడిన' దని సీత వృత్తాంతాన్ని వివరించాడు. (5)
తతోఽహం కార్యసిద్ధ్యర్థం రామస్యాక్లిష్టకర్మణః ।
శతయోజనవిస్తీర్ణమర్ణనం సహసాఽఽప్లుతః ॥ 6
అవలీలగా కార్యం ఆచరించే రాముని కార్యసిద్ధికై నేను నూరు యోజనాల సముద్రాన్ని శీఘ్రంగా ఎగిరి ఆవలి ఒడ్డుకు చేరాను. (6)
అహం స్వవీర్యాదుత్తీర్య సాగరం మకరాలయమ్ ।
సుతాం జనకరాజస్య సీతాం సురసుతోపమామ్ ॥ 7
దృష్టవాన్ భరతశ్రేష్ఠ రావణస్య నివేశనే ।
సమేత్య తామహం దేవీం వైదేహీం రాఘవప్రియామ్ ॥ 8
దగ్ధ్వా లంకామశేషేణ సాట్టప్రాకారతోరణామ్ ।
ప్రత్యాగతశ్చాస్య పునః నామ తత్ర ప్రకాశ్య వై ॥ 9
నేను మొసళ్ళతో నిండిన సముద్రాన్ని నా బలంతో దాటి దివ్యసౌందర్యం గల సీతాదేవిని రావణుని లంకలో చూశాను.
రాఘవపత్ని సీతను అశోకవనంలో కలిసి ప్రాకారాలు, అంతస్థుల భవనాలు, తోరణద్వారాలు కల లంకను తగులబెట్టి శ్రీరాముని పేరును చాటి చెప్పి తిరిగి వచ్చాను. (7-9)
మద్వాక్యం చావధార్యాశు రామో రాజీవలోచనః ।
స బుద్ధిపూర్వం సైన్యస్య బద్ధ్వా సేతుం మహోదధౌ ॥ 10
వృతో వానరకోటీభిః సముత్తీర్ణో మహార్ణవమ్ ।
తతో రామేణ వీరేణ హత్వా తాన్ సర్వరాక్షసాన్ ॥ 11
రణే తు రాక్షసగణం రావణం లోకరావణమ్ ।
నిశాచరేంద్రం హత్వా తు సభ్రాతృసుతబాంధవమ్ ॥ 12
నా మాటలు విని తామరల వంటి కళ్ళు గల రాముడు ఆలోచించి సముద్రంపై ఆనకట్టకట్టి సైన్యంతో సహా వానరకోటులతో మహాసముద్రాన్ని దాటాడు.
తరువాత రాముడు యుద్ధంలో బంధుమిత్ర పరివార సమేతంగా రాక్షసవీరుల్ని, లోకకంటకుడైన రావణుని చంపివేశాడు. (10-12)
రాజ్యేఽభిషిచ్య లంకాయాం రాక్షసేంద్రం విభీషణమ్ ।
ధార్మికం భక్తిమంతం చ భక్తానుగట్తవత్సలమ్ ॥ 13
తతః ప్రత్యాహృతా భార్యా నష్టా వేదశ్రుతిర్యథా ।
తయైవ సహితః సాధ్వ్యా పత్న్యా రామో మహాయశాః ॥ 14
గత్వా తతోఽతిత్వరితః స్వాం పురీం రఘునందనః ।
అధ్యావసత్ తతోఽయోధ్యామ్ అయోధ్యాం ద్విషతాం ప్రభుః ॥ 15
తతః ప్రతిష్ఠితో రాజ్యే రామో నృపతిసత్తమః ।
వరం మయా యాచితోఽసౌ రామో రాజీవలోచనః ॥ 16
యావద్ రామ కథేయం తే భవేల్లోకేషు శత్రుహన్ ।
తావజ్జీవేయమిత్యేవం తథాస్త్వితి చ సోఽబ్రవీత్ ॥ 17
రావణుని చంపి రాముడు భక్తికల, భక్తుల పట్ల ప్రేమ గల ధార్మికుడైన విభీషణుని లంకారాజ్యానికి రాజుగా చేశాడు.
నష్టపోయిన వేదవిద్య వలె రామునిచే తన భార్య తిరిగి తీసుకొని రాబడింది. సాధ్వియైన సీతతో కలిసి కీర్తిమంతుడు రాముడు వేగంగా అయోధ్యాపురికి తిరిగివచ్చాడు.
పిమ్మట శత్రువుల్ని లొంగదీయగల శ్రీరాముడు అయోధ్యా రాజసింహాసనంపై ఆసీనుడై అయోధ్యాపురిలో నివసించాడు.
ఆ సమయంలో రాముని ఒక వరం అడిగాను. నీ కథ లోకంలో శాశ్వతంగా ఉన్నంతవరకు నేను జీవించే వరం ఇయ్యి. అని. రాముడు సంతోషించి వెంటనే అంగీకరించాడు. (13,17)
సీతాప్రసాదాచ్చ సదా మామిహస్థమరిందమ ।
ఉపతిష్ఠంతి దివ్యా హి భోగా భీమ యథేప్సితాః ॥ 18
శత్రుభయంకరుడా! భీమసేనా! ఆ సీతాదేవి కృపచే ఇక్కడ నివసిస్తూ స్వేచ్ఛానుసారం దివ్యభోగాల్ని అనుభవిస్తున్నాను. (18)
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ ।
రాజ్యం కారితవాన్ రామః తతః స్వభవనం గతః ॥ 19
రాముడు పదకొండు వేల్ సంవత్సరాలు రాజ్యం చేసి తరువాత తన వైకుంఠానికి చేరాడు. (19)
తదిహాప్సరసస్తాత గంధర్వాశ్చ సదానఘ ।
తస్య వీర్యస్య చరితం గాయంతో రమయంతి మామ్ ॥ 20
ఈ స్థానంలో అప్సరసలు, గంధర్వులు రాముని గుణగానం చేస్తూ నన్ను ఆనందపరుస్తున్నారు. (20)
అయం చ మార్గో మర్త్యానామ్ అగమ్యః కురునందనః ।
తతోఽహం రుద్ధవాన్ మార్గం తవేమం దేవసేవితమ్ ॥ 21
ధర్షయేద్ వా శపదే వాపి మా కశ్చిదితి భారత ।
దివ్యో దేవపథో హ్యేష నాత్ర గచ్ఛంతి మానుషాః ।
యదర్థమాగతశ్చాపి అత ఏవ సరశ్చ తత్ ॥ 22
ఈ మార్గం మనుష్యులకు ప్రవేశింపవీలైంది కాదు. అందుకే నేను దేవతలు సేవించే దారిని అడ్డగించి పడుకున్నాను.
ఈ మార్గంలో వస్తుండగా ఎవడు నిన్ను అడ్డుకోలేదు. శపించలేదు. ఇది దేవతలు సంచరించే దారి. మానవులు సంచరించలేరు. నీవు వెళ్ళాలనుకున్న సరోవరం ఇదే. (21-22)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం భీమకదలీషండప్రవేశే షట్ చత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 148 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో హనుమద్భీమ సంవాదము అను నూట నలువది ఎనిమిదవ అధ్యాయము. (148)