147. నూట నలువది ఏడవ అధ్యాయము

హనుమద్భీమసేనుల సంభాషణ.

వైశంపాయన ఉవాచ
ఏతచ్ర్ఛుత్వా వచస్తస్య వానరేంద్రస్య ధీమతః ।
భీమసేనస్తదా వీరః ప్రోవాచామిత్రకర్షణః ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - బుద్ధిమంతుడు భీముడు హనుమంతుని మాటలు విని తిరిగి ఇలా పలికాడు. (1)
భీమ ఉవాచ
కో భవాన్ కిం నిమిత్తం వా వానరం వపురాస్థితః ।
బ్రాహ్మణానంతరో వర్ణః క్షత్రియస్త్వాం తు పృచ్ఛతి ॥ 2
భీముడు పలికాడు.
నీవు ఎవడవు? ఎందుకు ఈ కోతి రూపాన్ని పొందావు. నేను బ్రాహ్మణుని అనంతరం ఉండే క్షత్రియ వర్గానికి చెందినవాడిని. (2)
కౌరవః సోమవంశీయః కుంత్యా గర్భేణ ధారితః ।
పాండవో వాయుతనయః భీమసేన ఇతి శ్రుతః ॥ 3
నేను చంద్రవంశపురాజును, కురు కులంలో కుంతీగర్భంలో పుట్టాను. నేను వాయువు అనుగ్రహంతో పుట్టిన పాండవుణ్ణి నన్ను అందరూ భీమసేనుడు అంటారు. (3)
స వాక్యం కురువీరస్య స్మితేన ప్రతిగృహ్య తత్ ।
హనూమాన్ వాయుతనయో వాయుపుత్రమభాషత ॥ 4
కురువీరుడైన భీమసేనుని మాటలు చిరునవ్వుతో విని వాయుకుమారుడయిన హనుమంతుడు భీమునితో ఇలా అన్నాడు. (4)
హనూమానువాచ
వానరోఽహం న హే మార్గం ప్రదాస్యామి యథేప్సితమ్ ।
సాధు గచ్ఛ నివర్తస్వ మా ట్వం ప్రాప్స్యసి వైశసమ్ ॥ 5
హనుమంతుడు పలికాడు. నేను వానరుడను. నీకు నీ కోరిక కొద్దీ దారిని ఇవ్వలేను. నీవు వెనుకకు తిరగటం మంచిది. దుఃఖాన్ని పొందకు. (5)
భీమసేన ఉవాచ
వైశసంవాస్తు యద్వాన్యత్ న త్వాం పృచ్ఛామి వానర ।
ప్రయచ్ఛ మార్గముత్తిష్ఠ మా మత్తః ప్రాప్స్యసే వ్యథామ్ ॥ 6
భీముడు బదులు పలికాడు. నా ప్రాణాలు కష్టాల్లో పడినా, ఏ దుష్పరిణామం జరిగినా నిన్ను ఏ మాత్రం అడుగను. లే. నాకు పోవడానికి దారి ఇయ్యి. నా వల్ల నీవు వ్యధ పొందవు. (6)
హనూమానువాచ
నాస్తి శక్తిర్మమోత్థాతుం వ్యాధినా క్లేశితో హ్యహమ్ ।
యద్యవశ్యం ప్రయాతవ్యం లంఘయిత్వా ప్రయాహి మామ్ ॥ 7
హనుమంతుడు పలికాడు. నాకు పైకి లేచే శక్తి లేదు. వ్యాధితో బాధ పడుతున్నాను. తప్పక వెళ్ళాలి అనుకుంటే నన్ను దాటి ముందుకు సాగు. (7)
భీమ ఉవాచ
నిర్గుణః పరమాత్మా తు దేహమ్ వ్యాప్యావతిష్ఠతే ।
తమహం జ్ఞానవిజ్ఞేయం నావమన్యే న లంఘయే ॥ 8
భీమసేనుడు పలికాడు - నిర్గుణుడైన పరమాత్మ ప్రాణులందరిలో నెలకొనియున్నాడు. ఆ జ్ఞానం కల నేను మిమ్ము అవమానించు. దాటి వెళ్ళను. (8)
యద్యాగమైర్న విద్యాం చ తమహం భూతభావనమ్ ।
క్రమేయం త్వాం గిరిం చైవ హనూమానివ సాగరమ్ ॥ 9
శాస్త్రాలు చదివిన నాకు ఆ భగవంతుని స్వరూప జ్ఞానం లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని దాటిన విధంగా ఈ పర్వతాన్ని మిమ్మల్ని దాటి వేస్తాను. (9)
హనూమానువాచ
క ఏష హనుమాన్ నామ సాగరో యేన లంఘితః ।
పృచ్ఛామి త్వాం నరశ్రేష్ఠ కథ్యతాం యది శక్యతే ॥ 10
హనుమంతుడు పలికాడు - ఆ హనుమంతుడు ఎవడు? సముద్రాన్ని ఎందుకు దాటాడు? అతని గురించి చెప్పగలిగితే చెప్పు అని అడుగుతున్నాను. (10)
భీమ ఉవాచ
భ్రాతా మమ గుణశ్లాఘ్యః బుద్ధిసత్త్వబలాన్వితః ।
రామాయణేఽతివిఖ్యాతః శ్రీమాన్ వానరపుంగవః ॥ 11
భీముడు అన్నాడు. వానరశ్రేష్ఠుడు హనుమంతుడు నా అన్న. ప్రశంసింప దగిన సద్గుణాలు కలవాడు. బుద్ధిబలం, ధైర్యం కలవాడు. రామాయణంలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన శ్రీమంతుడు. (11)
రామపత్నీకృతే యేన శతయోజనవిస్తృతః ।
సాగరః ప్లవగేంద్రేణ క్రమేణైకేన లంఘితః ॥ 12
ఆ హనుమంతుడు రాముని భార్యను వెదికేవేళలో నూరుయోజనాల విస్తారం గల సముద్రాన్ని ఒక్క అంగలో దాటినవాడు. (12)
స మే భ్రాతా మహావీర్యః తుల్యోఽహం తస్య తేజసా ।
బలే పరాక్రమే యుద్ధే శక్తోఽహం తవ నిగ్రహే ॥ 13
ఆ పరాక్రమవంతుడు నా సోదరుడు. అతని తేజంతో సమానమైన తేజస్సుకలవాడిని. బలంలో, పరాక్రమంలో, యుద్ధంలో నిన్ను ఎదుర్కొనటంలో సమర్థుడిని. (13)
ఉత్తిష్ఠ దేహి మే మార్గం పశ్య మే చాద్య పౌరుషమ్ ।
మచ్ఛాసనమకుర్వాణం త్వాం వా నేష్యే యమక్షయమ్ ॥ 14
పైకి లే. నాకు దారిని ఇయ్యి. నా పౌరుషాన్ని ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తావు. నా ఆజ్ఞను పాటించని నిన్ను యమసదనానికి పంపుతాను. (14)
వైశంపాయన ఉవాచ
విజ్ఞాయ తం బలోన్మత్తం బాహువీర్యేణ దర్పితమ్ ।
హృదయేనావహస్యైనం హనూమాన్ వాక్యమబ్రవీత్ ॥ 15
వైశంపాయనుడు పలికాడు.
బాహువీర్యంతో గర్వితునిగా, బలమత్తునిగా అతనిని తెలిసికొని హనుమంతుడు మనస్సులోనే అపహసించుకొని అతనితో అన్నాడు. (15)
హనూమానువాచ
ప్రసీద నాస్తి మే శక్తిః ఉత్థాతుం జరయానఘ ।
మమానుకంపయా త్వేతత్ పుచ్ఛముత్సార్య గమ్యతామ్ ॥ 16
హనుమంతుడు పలికాడు.
నాపై దయ చూపు. నాకు పైకి లేచే శక్తి లేదు. ముసలితనం ఆవరించింది. నాపై దయతో నాతోకను కొంచెంగా తొలగించి ముందుకు సాగు. (16)
వైశంపాయన పలికాడు.
ఏవముక్తే హనుమతా హీనవీర్యపరాక్రమమ్ ।
మనసాచింతయద్ భీమః స్వబాహుబలదర్పితః ॥ 17
వైశంపాయనుడు పలికాడు.
హనుమంతుడు పలికిన మాటలు విని తన బాహుబలంతో గర్వితుడై అతనిని తనకంటె తక్కువ పరాక్రమవంతునిగా మనస్సులో భావించిచాడు. (17)
పుచ్ఛే ప్రగృహ్య తరసా హీనవీర్యపరాక్రమమ్ ।
సాలోక్యమంతకస్యైనం నయామ్యద్యేహ వానరమ్ ॥ 18
మనస్సులో ఇలా సంకల్పించి అతనిని తక్కువ పరాక్రమం కలవానిగా అనుకొని వేగంగా తోకపట్టుకొని యమలోకానికి విసరివేస్తాను అని నిశ్చయించుకున్నాడు. (18)
సావజ్ఞమథ వామేన స్మయన్ జగ్రాహ పాణినా ।
న చాశకచ్చాలయితుం భీమః పుచ్ఛం మహాకపేః ॥ 19
చులకనభావంతో ఎడమచేతితో నవ్వుతూ తోకను పట్టుకున్నాడు. ఆ తోకను భీముడు కదప లేకపోయాడు. (19)
ఉచ్చిక్షేప పునర్దోర్భ్యామ్ ఇంద్రాయుధమివోచ్ర్ఛితమ్ ।
నోద్ధర్తుమశకద్ భీమః దోర్భ్యామపి మహాబలః ॥ 20
ఇంద్రధనుస్సు కొనల వలె సమున్నతాలైన తన రెండు భుజాలతో తోకను ఎత్తప్రయత్నించి విఫలుడైనాడు. (20)
ఉత్క్షిప్తభ్రూర్వివృత్తాక్షః సంహతభ్రుకుటీముఖః ।
స్విన్నగాత్రోఽభవద్ భీమః నచోద్ధర్తుం శశాక తమ్ ॥ 21
కనుబొమలు ఎగిరివేస్తూ, కళ్ళను గిరగిరా తిప్పుతూ కనుబొమముడిని బిగించాడు. చెమట పట్టింది. కాని ఆ తోకను పైకి ఎత్త లేకపోయాడు. (21)
యత్నవానపి తు శ్రీమాన్ లాంగూలోద్ధరణోద్ధురః ।
కపేః పార్శ్వగతో భీమః తస్థౌ వ్రీడానతాననః ॥ 22
ప్రణిపత్య చ కౌంతేయః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ।
ప్రసీద కపిశార్దూల దురుక్తం క్షమ్యతాం మమ ॥ 23
ఎంత ప్రయత్నించినా తోకను పైకెత్తలేక సిగ్గుతో తలవంచుకొని ఆ వానరుని ప్రక్కనే ఉండిపోయాడు.
అతని సమీపానికి చేరి నమస్కరించి దోసిలి ఘటించి ఇలా పలికాడు. అనుగ్రహించు, వానరశ్రేష్ఠా, నేను కఠోరంగా మాట్లాడాను క్షమించు అని కోరాడు. (22-23)
సిద్ధో వా యదివా దేవో గంధర్వో వాథ గుహ్యకః ।
పృష్టః సన్ కామ్యయా బ్రూహి కస్త్వం వానరరూపధృక్ ॥ 24
నీవు సిద్ధుడవు కాని, దేవతపు కాని, గంధర్వుడవు కాని, గుహ్యకుడివిగాని అయి ఉండాలి. వానర రూపం ధరించటంలో ఆంతర్యాన్ని నాకు వివరించి చెప్పు అన్నాడు. (24)
న చేద్ గుహ్యం మహాబాహో శ్రోతవ్యం చేద్ భవేన్మమ ।
శిష్యవత్ త్వాం తు పృచ్ఛామి ఉపపన్నోఽస్మి తేఽనఘ ॥ 25
ఇది రహస్యం కాకపోతే నాకు తప్పక వినిపించు. శిష్యుడు గురువును కోరినట్లు కోరుతున్నాను. నీ శరణు కోరుతున్నాను. దయతో నాకు తెలుపు. (25)
హనూమానువాచ
యత్ తే మమ పరిజ్ఞానే కౌతూహలమరిందమ ।
తత్ సర్వమఖిలేన త్వం శృణు పాండవనందన ॥ 26
హనుమంతుడు పలికాడు.
నీ మనస్సులో నన్ను గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటే నా వృత్తాంతాన్ని పూర్తిగా విను. (26)
అహం కేసరిణః క్షేత్రే వాయునా జగదాయుషా ।
జాతః కమలపత్రాక్ష హనూమాన్ నామ వానరః ॥ 27
నేను జగత్ర్పాణ స్వరూపుడైన వాయుదేవత అనుగ్రహంతో కేసరి అనే బలవంతుడైన వానరుని క్షేత్రంలో పుట్టాను. నాపేరు హనుమంతుడు. (27)
సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ్స్ వాలినమ్ ।
సర్వే వానరరాజానః తథా వానరయూథపాః ॥ 28
ఉపతస్థుర్మహావీర్యాః మమ చామిత్రకర్షణ ।
సుగ్రీవేణాభవత్ ప్రీతిః అనిలస్యాగ్నినా యథా ॥ 29
పూర్వకాలంలో వానర రాజులు, వానర గణపతులు మహాపరాక్రమవంతులు సూర్యపుత్రుని సుగ్రీవుని, ఇంద్ర పుత్రుని వాలిని సేవించారు. వాయువుకు అగ్ని స్నేహితుడైనట్లు ఆ రోజుల్లో నాకు సుగ్రీవునితో స్నేహం ఉండేది. (28-29)
నికృతః స తతో భ్రాత్రా కస్మింశ్చిత్ కారణాంతరే ।
ఋష్యమూకే మయా సార్ధం సుగ్రీవో న్యవసచ్చిరమ్ ॥ 30
ఒకానొక కారణంగా వాలి తన సోదరుని సుగ్రీవుని ఇంటి నుంచి వెడలగొట్టాడు. అప్పుడు చాలారోజులపాటు నాతో సుగ్రీవుడు కలిసి ఉన్నాడు. (30)
అథ దాశరథిర్వీరః రామో నామ మహాబలః ।
విష్ణుర్మానుషరూపేణ చచార వసుధాతలమ్ ॥ 31
ఆ సమయంలో మహాబలవంతుడు. దశరథపుత్రుడు శ్రీరాముడు విష్ణువు యొక్క మానుష రూపాంగా భూమికి అవతారంగా దిగి వచ్చాడు. (31)
స పితుః ప్రియమన్విచ్ఛన్ సహభార్యః సహానుజః ।
సధనుర్ధన్వినాం శ్రేష్ఠః దండకారణ్యమాశ్రితః ॥ 32
అతడు తండ్రికి ఇష్టాన్ని చేయగోరి సోదరునితో, భార్యతో కలిసి దండకారణ్యానికి చేరాడు. (32)
తస్య భార్యా జనస్థానాత్ ఛలేనాపహృతా బలాత్ ।
రాక్షసేంద్రేణ బలినా రావణేన దురాత్మనా ॥ 33
సువర్ణరత్నచిత్రేణ మృగరూపేణ రక్షసా ।
వంచయిత్వా నరవ్యాఘ్రం మారీచేన తదానఘ ॥ 34
దండకారణ్యానికి చేరిన శ్రీరాముని భార్య బలవంతంగా బలశాలి రాక్షసరాజు దురాత్ముడైన రావణునిచే మోసంతో అపహరింపబడింది.
రాముని వంచించి బంగారు రత్నకాంతుల శరీరం గల మాయలేడి రూపంలో వచ్చిన మారీచునిచే మోసగించాడు. (33-34)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం హనుమద్భీమసంవాదే సప్తచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 147 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో హనుమద్భీమసంవాదము అను నూట నలువది ఏడవ అధ్యాయము. (147)