136. నూట ముప్పది ఆరవ అధ్యాయము
యవక్రీతుడు రైభ్యుని కోడలితో వ్యభిచరించి రాక్షసునిచేతిలో చనిపోవుట.
లోమశ ఉవాచ
చంక్రమ్యమాణః స తదా యవక్రీరకుతోభయః ।
జగామ మాధవే మాసి రైభ్యాశ్రమపదం ప్రతి ॥ 1
లోమశుడు పలికాడు - ఆ రోజుల్లో యవక్రీతుడు నిర్భయంగా భూమి నాలుగు దిక్కుల తిరుగసాగాడు. వైశాఖమాసంలో ఒకనాడు రైభ్యుని ఆశ్రమం చేరాడు. (1)
స దదర్శాశ్రమే రమ్యే పుష్పితద్రుమభూషితే ।
విచరంతీం స్నుషాం తస్య కిన్నరీమివ భారత ॥ 2
పుష్పించిన చెట్లతో అందంగా ఉన్న ఆశ్రమంలో ఆడుకిన్నెరలా మెరిసిపోతూ సంచరిస్తున్న రైభ్యుని కోడలిని చూశాడు. (2)
యవక్రీస్తామువాచేదమ్ ఉపాతిష్ఠస్వ మామితి ।
నిర్లజ్జో లజ్జయా యుక్తాం కామేన హృతచేతనః ॥ 3
ఆమెను చూస్తూనే కామపరవశుడై, ఆలోచననాశక్తి నశించి, సిగ్గుపడే ఆమెతో సిగ్గు లేకుండా " నన్ను నీవు సంతోషపెట్టు" అని అడిగాడు. (3)
సా తస్య శీలమాజ్ఞాయ తస్మాచ్ఛాపాచ్చ బిభ్యతీ ।
తేజస్వితాం చ రైభ్యస్య తథేత్యు క్త్వాఽఽజగామ హ ॥ 4
యవక్రీతుని శీలస్వభావాలు తెలిసిన ఆమె అతని శాపానికి భయపడింది. రైభ్యుని తేజాన్ని స్మరించి, అలాగే అని అంగీకరించి, అతని సమీపానికి చేరింది. (4)
తత ఏకాంతమున్నీయ మజ్జయామాస భారత ।
ఆజగామ తదా రైభ్యః స్వమాశ్రమమరిందమ ॥ 5
ఏకాంతానికి తీసుకుపోయి రమించి, యవక్రీతుడు ఆమెను శోకసముద్రంలో ముంచేవాడు. ఇంతలో రైభ్యుడు తన ఆశ్రమానికి వచ్చాడు. (5)
రుదతీం చ స్నుషాం దృష్ట్వా భార్యామార్తాం పరావసోః ।
సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచా పర్యపృచ్ఛద్ యుధిష్టిర ॥ 6
సా తస్మై సర్వమాచష్ట యవక్రీభాషితం శుభా ।
ప్రత్యుక్తం చ యవక్రీతం ప్రేక్షాపూర్వం తథాఽఽత్మనా ॥ 7
తనకోడలు పరావసుని భార్య దుఃఖించుచున్నదని గుర్తించి, మధురస్వరంతో అనునయిస్తూ ఏడవడానికి కారణమడిగాడు. పవిత్ర లక్షణాలు గల ఆంఎ పూర్తి ఉదంతాన్ని మామకు చెప్పింది. స్వయంగా, బాగా ఆలోచించి, తాను చేసిన ఆచరణ అంతా వివరించింది. (6,7)
శృణ్వానస్యైవ రైభ్యస్య యవక్రీత విచేష్టితమ్ ।
దహన్నివ తదా చేతః క్రోధః సమభవన్మహాన్ ॥ 8
యవక్రీతుని చేష్ట వింటూనే రైభ్యుని హృదయం భయంకర క్రోధంతో ప్రజ్వలించింది. అతని అంతఃకరణాన్ని బూడిద చేస్తున్నట్లు అయింది. (8)
స తదా మన్యునాఽఽవిష్టః తపస్వీ కోపనో భృశమ్ ।
అవలుప్య జటామేకాం జుహావాగ్నౌ సుసంస్కృతే ॥ 9
తాపసి అయిన రైభ్యుడు స్వభావం చేతనే కోపశీలి. ఆ సమయంలో క్రోధం అతన్ని పూర్తిగా ఆవేశించింది. తన జటను ఒక దానిని పెరికి బాగా శోస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన అగ్నిలో హోమం చేశాడు. (9)
తతః సమభవన్నారీ తస్యా రూపేణ సమ్మితా ।
అవలుచ్యాపరాం చాపి జుహావాగ్నౌ జటాం పునః ॥ 10
ఒక స్త్రీ రూపంలో కృత్య ఆవిర్భవించింది. ఆమె తన కోడలితో సమానం అయిన రూపసంపద కలిగి ఉంది. మళ్ళీ ఒక జటను పెరికి అగ్నిలో పడవేశాడు. (10)
తతః సమభవద్ రక్షః ఘోరాక్షం భీమదర్శనమ్ ।
అబ్రూతాం తౌ తదా రైభ్యం కిం కార్యం కరవావహై ॥ 11
అందులోంచి ఒక రాక్షసుడు ఆవిర్భవించాడు. అతని కన్నులు చాల భయంకరంగా ఉన్నాయి. ఆకారం భయంకరంగా ఉంది. వారిరువురు రైభ్యునితో 'మీ ఆజ్ఞ పాలిస్తాం' అని అన్నారు. (11)
తావబ్రవీదృషిః క్రుద్ధః యవక్రీర్వధ్యతామితి ।
జగ్మతుస్తౌ తథేత్యుక్తా యవక్రీతజిఘాంసయా ॥ 12
క్రోధంతో నిండిన మహర్షి 'యవక్రీతుని చంపండి" అన్నాడు. వారు అలాగే అని యవక్రీతుని చంపే కోరికతో అతని వెంటపడ్డారు. (12)
తతస్తం సముపాస్థాయ కృత్యా సృష్టా మహత్మనా ।
కమండలుం జహారాస్య మోహయిత్వేవ భారత ॥ 13
రైభ్యుడు సృష్టించిన కృత్య అతని ముందు అందమైఅ స్త్రీగా ప్రత్యక్షమై, అతనిని మోహపరవశుని చేసి, అతని కమండలం అపహరించింది. (13)
ఉచ్ఛిష్టం తు యవక్రీతమ్ అపకృష్టకమండలుమ్ ।
తత ఉద్యతశూలః సః రాక్షసః సముపాద్రవత్ ॥ 14
కమండలం దూరమైన వెంటనే అతని శరీరం అపవిత్రం అయిపోయింది. ఆ దశలో ఆ రాక్షసుడు చేతిలో త్రిశూలంతో యవక్రీతునివైపు పరుగుపెట్టాడు. (14)
తమాపతంతం సంప్రేక్ష్య శూలహస్తం జిఘాంసయా ।
యవక్రీః సహసోత్థాయ ప్రాద్రవద్ యేన వై సరః ॥ 15
శూలహస్తుడై రాక్షసుడు తరుముతుండగా 'నన్ను చంపడానికి వస్తున్నాడు' అని తలచి యవక్రీతుడు ఒక మార్గంలో పరుగెత్తాడు. ఆ మార్గం ఒక సరోవరం వైపుగా సాగింది. (15)
జలహీనం సరో దృష్ట్వా యవక్రీస్త్వరితః పునః ।
జగామ సరితః సర్వా తాశ్చాప్యాసన్ విశోషితాః ॥ 16
ఇతడు వెళ్ళడంతో సరోవరంలో నీరు ఇంకిపోసాగింది. సరోవరాన్ని అన్నివైపులా చూస్తూ పరుగెడుతుంటే వెళ్ళినచోటల్లా నీరు ఇంకిపోయింది. (16)
స కాల్యమానో ఘోరేణ శూలహస్తేన రక్షసా ।
అగ్నిహోత్రం పితుర్భీతః సహసా ప్రవివేశ హ ॥ 17
చేతిలో శూలం తీసుకొని భయానకరాక్షసుడు పరుగెత్తి రాగా యువక్రీతుడు భయంతో తండ్రి అగ్నిహోత్ర గృహంలో ప్రవేశించాడు. (17)
స వై ప్రవిశమానస్తు శూద్రేణాంధేన రక్షిణా ।
నిగృహీతో బలాద్ ద్వారి సోఽవాతిష్టత పార్థివ ॥ 18
ఆ సమయంలో ఒక శూద్రజాతీయుడు అగ్నిహోత్రగృహాధికారిగా ఉన్నాడు. అతడు అంధుడు. అతడు గుమ్మళోకి వస్తున్న యవక్రీతుని బలంగా పట్టుకొంటే అతడు అక్కడే ఆగిపోయాడు. (18)
నిగృహీతం తు శూద్రేణ యవక్రీతం స రాక్షసః ।
తాడయామాస శూలేన స భిన్నహృదయోఽపతత్ ॥ 19
శూద్రుడు పట్టుకొన్న యవక్రీతుని ఆ రాక్షసుడు శూలంతో గుండెల్లో పొడవగా ప్రాణాలు పోయి అక్కడే నేలపై పడ్డాడు. యవక్రీతుడు. (19)
యవక్రీతం స హత్వా తు రాక్షసో రైభ్యమాగమత్ ।
అనుజ్ణాతస్తు రైభ్యేణ తయా నార్యా సహావసత్ ॥ 20
యవక్రీతుని చంపి, రాక్షసుడు రైభ్యుని వద్దకు వచ్చాడు. రైభ్యుని అనుజ్ఞ పొంది, తన భార్యతో కలిసి, అతనిని సేవింపసాగాడు. (20)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం యవక్రీతోపాఖ్యానే షట్ త్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 136 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున లోమశతీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున యవక్రీతోపాఖ్యనము అను నూట ముప్పది ఆరవ అధ్యాయము. (136)