137. నూట ముప్పది ఏడవ అధ్యాయము

భరద్వాజుడు పుత్రశోకముతో విలపించి రైభ్యుని శపించి అగ్నిలో ప్రవేశించుట.

లోమశ ఉవాచ
భరద్వాజస్తు కౌంతేయ కృత్వా స్వాధ్యాయమాహ్నికమ్ ।
సమిత్కలాపమాదాయ ప్రవివేశ స్వమాశ్రమమ్ ॥ 1
లోమశుడు పలికాడు - భరద్వాజుడు ప్రతి దినం చేసే స్వాధ్యాయాన్ని పూర్తిచేసి. చాలా సమిధలు గైకొని, ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. (1)
తం స్మ దృష్ట్వా పురా సర్వే ప్రత్యుత్తిష్ఠంతి పావకాః ।
న త్వేనముపతిష్ఠంతి హతపుత్రం తదాగ్నయః ॥ 2
గతంలో అతనిని చూచి అగ్నులన్నీ లేచి స్వాగతం పలికేవి. అతని పుత్రుడు చంపబడ్డాడు. కావున అగ్నులు పూర్వం వలె లేచి నిలబడి స్వాగతం చెప్పలేదు. (2)
వైకృతం త్వగ్నిహోత్రే సః లక్షయిత్వా మహాతపాః ।
తమంధం శూద్రమాసీనం గృహపాలమథాబ్రవీత్ ॥ 3
అగ్నిహోత్ర గృహంలో ఈ మార్పును గమనించి, మహాతపస్వి అయిన భరద్వాజుడు అక్కడ కూర్చున్న అంధగృహరక్షకుని ఇలా అడిగాడు. (3)
కిం తు మే నాగ్నయః శూద్ర ప్రతినందంతి దర్శనమ్ ।
త్వం చాపి న యథాపూర్వం కచ్చిత్ క్షేమమిహాశ్రమే ॥ 4
కచ్చిన్న రైభ్యం పుత్రో మే గతవానల్పచేతనః ।
ఏతదాచక్ష్వ మే శీఘ్రం న హి శుద్ధ్యతి మే మనః ॥ 5
దాసుడా! నా అగ్నులు పూర్వంలాగ నన్ను స్వాగతించకపోవడానికి కారణం ఏమిటి? ఒకవైపు నీడ కూడ పూర్వం మాదిరిగా లేవు. ఈ ఆశ్రమంలో అందరూ కుశలంగా ఉన్నారా? మందబుద్ధిగల నా పుత్రుడు రైభ్యుని వద్దకు పోలేదు కదా? ఈ విషయాన్ని నాకు శీఘ్రంగా చెప్పు. నా మనస్సు శాంతించటం లేదు. (4,5)
శూద్ర ఉవాచ
రైభ్యం యాతో నూనమయం పుత్రస్తే మందచేతనః ।
తథా హి నిహతః శేతే రాక్షసేన బలీయసా ॥ 6
శూద్రుడు పలికాడు - నీ కుమారుడు మందబుద్ధితో రైభ్యుని చేరి, బలవంతుడైన రాక్షసునిచే చంపబడి, భూమిపై పడి ఉన్నాడు. (6)
ప్రకాల్యమానస్తేనాయం శూలహస్తేన రక్షసా ।
అగ్న్యాగారం ప్రతి ద్వారి మయా దోర్భ్యాం నివారితః ॥ 7
శూలహస్తుడైన రాక్షసునిచే తరుమబడి ఇతడు ఈ అగ్ని శాలద్వారంలో నాచే నివారింపబడినాడు. (7)
తతః స విహతాశోఽత్ర జలకామోఽశుచిర్ర్ధువమ్ ।
నిహతః సోఽతివేగేన శూలహస్తేన రక్షసా ॥ 8
నిశ్చయంగా అపవిత్రుడవటం వలన జలంకోసం ఇక్కడకు వచ్చాడు. శూలహస్తుడైన రాక్షసునిచే అతివేగంగా చంపబడ్డాడు. (8)
భరద్వాజస్తు తచ్ర్ఛుత్వా శూద్రస్య విప్రియం మహత్ ।
గతాసుం పుత్రమాదాయ విలలాప సుదుఃఖితః ॥ 9
భరద్వాజుడు పుత్రమరణవార్తను శూద్రుని నుంచి విని, మరణించిన పుత్రుని గూర్చి ఎక్కువగా దుఃఖించాడు. (9)
భరద్వాజ ఉవాచ
బ్రాహ్మణానాం కిలార్థాయ నను త్వం తప్తవాంస్తపః ।
ద్విజానామనధీతా వై వేదాః సంప్రతిభాంత్వితి ॥ 10
భరద్వాజుడు పలికాడు - బ్రాహ్మణుల హితంకోరి నీవు తపస్సు చేశావు. బ్రాహ్మణులు అభ్యసించకపోయినా వేదజ్ఞానం కలగాలని నీ సంకల్పం. (10)
తథా కల్యాణశీలస్త్వం బ్రాహ్మణేషు మహాత్మసు ।
అనాగాః సర్వభూతేషు కర్కశత్వముపేయివాన్ ॥ 11
బ్రాహ్మణుల పట్ల మంగళమైన ఆలోచన కలిగిన నీవు నిరపరాధులను ప్రాణులందరిని హింసించే కాఠిన్యాన్ని పొందావు. (11)
ప్రతిషిద్ధో మయా తాత రైభ్యావసథదర్శనాత్ ।
గతవానేవ తం ద్రష్టుం కాలాంతకయమోపమమ్ ॥ 12
యః స జానన్ మహాతేజాః వృద్ధస్యైకం మమాత్మజమ్ ।
గతవానేవ కోపస్య వశం పరమదుర్మతిః ॥ 13
రైభ్యుని ఆశ్రమానికి పోవద్దని పదే పదే హెచ్చరించినా నీవు పెడచెవిన పెట్టి కాల, అంతక, యమ సదృశుడు అయిన అతనిని చూడటానికి పోయావు. తేజోవంతుడు, గొప్పవాడు అయినా ఆయన బుద్ధి నీచమైంది. నీవు నావంటి ముదుసలికి ఒక్కడవే పుత్రుడవు అని తెలిసినా అతడు కోపానికి లొంగిపోయాడు. (12,13)
పుత్రశోకమనుప్రాప్తః ఏష రైభ్యస్య కర్మణా ।
త్యక్ష్యామి త్వామృతే పుత్ర ప్రాణానిష్టతమాన్ భువి ॥ 14
రైభ్యుని కఠిన కర్మ వశాత్తు పుత్రశోకాన్ని పొందాను. ప్రాణాలు ఇష్టమైనవి అయినా నీవు లేనందున వాటిని తప్పక విడుస్తాను. (14)
యథాహం పుత్రశోకేన దేహం త్యక్ష్యామి కిల్బిషీ ।
తథా జ్యేష్ఠః సుతో రైభ్యం హింస్యాచ్ఛీఘ్రమనాగసమ్ ॥ 15
పాపాత్ముడను అయిన నేను పుత్రశోకంతో వ్యాకులత చెంది నా శరీరాన్ని విడుస్తున్నాను. అలాగే రైభ్యుని జ్యేష్ఠపుత్రుడు నిరపరాధి అయిన తన తండ్రిని హత్య చెయ్యాలి. (15)
సుఖినో వై నరా యేషాం జాత్యా పుత్రో న విద్యతే ।
తే పుత్రశోకమప్రాప్య విచరంతి యథాసుఖమ్ ॥ 16
లోకంలో పుత్రసంతానం లేని వారే అదృష్టవంతులు. వారు పుత్రోశోకాన్ని అనుభవించక సుఖిస్తారు. (16)
యే తు పుత్రకృతాచ్ఛోకాద్ భృశం వ్యాకులచేతసః ।
శపంతీష్టాన్ సఖీనార్తాః తేభ్యః పాపతరో ను కః ॥ 17
పుత్రశోకంతో కలవరపాటు చెంది సఖులను, ప్రియులను శపించిన ఆర్తుల కంటె పాపాత్ముడు ఎవడు? (17)
పరాసుశ్చ సుతో దృష్టః శప్తశ్చేష్టః సఖా మయా ।
ఈదృశీమాపదం కోఽత్ర ద్వితీయోఽనుభవిష్యతి ॥ 18
నేను నా పుత్రుని మరణం చూచి భరించలేక మిత్రుని శపించాను. ఇలాంటి ఆపదను నా కంటె వేరొకడు ఎవడు అనుభవిస్తాడు? (18)
లోమశ ఉవాచ
విలప్యైవం బహువిధం భరద్వాజోఽదహత్ సుతమ్ ।
సుసమిద్ధం తతః పశ్చాత్ ప్రవివేశ హుతాశనమ్ ॥ 19
లోమశుడు పలికాడు.
ఈవిధంగా దుఃఖించి, భరద్వాజుడు పుత్రునికి దహనసంస్కారాలు చేసి, మండుతున్న అగ్నిలో స్వయంగా ప్రవేశించాడు. (19)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం యవక్రీతోపాఖ్యానే సప్తత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 137 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున యవక్రీతోపాఖ్యనము అను నూట ముప్పది ఏడవ అధ్యాయము. (137)