135. నూట ముప్పది అయిదవ అధ్యాయము

యువక్రీత చరిత్ర.

లోమశ ఉవాచ
ఏషా మధువిలా రాజన్ సమంగా సంప్రకాశతే ।
ఏతత్ కర్దమిలం నామ భరతస్యాభిషేచనమ్ ॥ 1
లోమశుడిలా అన్నాడు.
రాజా! ఈ ప్రకాశిమ్చే నది పేరు మధువిల. దీనినే సమంగ అంటారు. ఇదే కర్దమిలక్షేత్రం. ఇక్కడే భరతుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. (1)
అలక్ష్మ్యా కిల సంయుక్తః వృత్రం హత్వా శచీపతిః ।
ఆప్లుతః సర్వపాపేభ్యః సమంగాయాం వ్యముచ్యత ॥ 2
శచీపతి అయిన ఇంద్రుడు వృత్రుని వధించిన కారణంగా రాజ్యలక్ష్మికి దూరమైనాడు. అతడు సమంగానదీస్నానం చేసి పాపవిముక్తుడయ్యాడు. (2)
ఏతద్ వినశనం కుక్షౌ మైనాకస్య నరర్షభ ।
అదితిర్యత్ర పుత్రార్థం తదన్నమపచత్ పురా ॥ 3
మైనాకపర్వతమధ్యంలో వినశన తీర్థం ఉంది. అదితి ఇక్కడే పుత్రులను కోరి సాధ్యదేవతలకు బ్రహ్మౌదనం అనే అన్నం సిద్ధం చేసింది. (3)
ఏనం పర్వతరాజానామ్ ఆరుహ్య భరతర్షభాః ।
అయశస్యామసంశబ్ద్యామ్ అలక్ష్మీం వ్య్పనోత్స్యథ ॥ 4
భరతశ్రేష్ఠులారా! పర్వతశ్రేష్ఠుడైన హిమాలయాన్ని అధిరోహించి అపకీర్తిని వ్యాపింపచేసే పేరు కూడ పలుకరాని దారిద్ర్యదశను దూరం చేయండి. (4)
ఏతే కనఖలా రాజన్ ఋషీణాం దయితా నగాః
ఏషా ప్రకాశతే గంగా యుధిష్ఠిర మహానదీ ॥ 5
రాజా! ఇది కనఖలా పర్వతశ్రేణి. ఇక్కడే మహానది గంగ మిక్కిలి ప్రకాశవంతంగా ఉంది. (5)
సనత్కుమారో భగవాన్ అత్ర సిద్ధిమగాత్ పురా ।
ఆజమీఢావగాహ్యైనాం సర్వపాపైః ప్రమోక్ష్యసే ॥ 6
పూర్వకాలంలో సనత్కుమారమహర్షి ఇక్కడే స్నానం చేసి సిద్ధులను పొందాడు - ధర్మరాజా! ఈ నదిలో స్నానమాడు - పాపాల నుండి విముక్తుడవవుతావు. (6)
అపాం హ్రదం చ పుణ్యాఖ్యం భృగుతుంగం చ పర్వతమ్ ।
ఉష్ణీగంగే చ కౌంతేయ సామాత్యః సముపస్పృశ ॥ 7
కౌంతేయా! జలంతో నిండిన ఈ పుణ్యసరోవరంలో, భృగుతుంగ పర్వతం మీది ఉష్ణీగంగ అనే తీర్థంలో నీవు నీ మంత్రులతో స్నానం చెయ్యి. (7)
ఆశ్రమః స్థూలశిరసః రమణీయః ప్రకాశతే ।
అత్ర మానం చ కౌంతేయ క్రోధం చైవ వివర్జయ ॥ 8
కౌంతేయా! ఇది స్థూలశిరుని అందమైన ఆశ్రమం. ఇక్కడ అభిమానాన్ని, కోపాన్ని విడచిపెట్టాలి. (8)
ఏష రైభ్యాశ్రమః శ్రీమాన్ పాండవేయ ప్రకాశతే ।
భారద్వాజో యత్ర కవిః యవక్రీతో వ్యనశ్యత ॥ 9
పాండవా! ఇది రైభ్యుని రమణీయాశ్రమం. విద్వాంసుడు భరద్వాజుని పుత్రుడు అయిన యవక్రీతుడు ఇక్కడే నశించాడు. (9)
యుధిష్టిర ఉవాచ
కథం యుక్తోఽభవదృష్టిః భరద్వాజః ప్రతాపవాన్ ।
కిమర్థం చ యవక్రీతః పుత్రోఽనశ్యత వై మునేః ॥ 10
యుధిష్టిరుడు ప్రశ్నించాడు.
తపస్సుచే ప్రతాపవంతుడు అయిన భరద్వాజుడు ఎలా యోగంలో ప్రవేశించాడు? ఆ ముని కుమారుడు యవక్రీతుడు ఎందుకు నశించాడు? (10)
ఏతత్ సర్వం యతావృత్తం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ।
కర్మభిర్దేవకల్పానాం కీర్త్యమానైర్భృశం రమే ॥ 11
వీటిని అన్నింటిని నిజంగా వినగోరుతున్నాను. దేవతలతో సమానులయిన ఋషుల చరిత్ర వింటే నా మనస్సుకు చాలా ఆనందం కలుగుతుంది. (11)
లోమశ ఉవాచ
భరద్వాజశ్చ రైభ్యశ్చ సఖాయౌ సంబభూవతుః ।
తావూషతురిహాత్యంతమ్ ప్రీయమాణావనంతరమ్ ॥ 12
లోమశుడు అన్నాడు - భరద్వాజుడు, రైభ్యుడు. ఇద్దరూ ప్రాణస్నేహితులు. వారు నిరంతరం ఈ వనంలో చాలా ప్రేమతో నివసించేవారు. (12)
రైభ్యస్య తు సుతావాస్తామ్ అర్వావసుపరావసూ ।
ఆసీద్ యవక్రీః పుత్రస్తు భరద్వాజస్య భారత ॥ 13
రైభ్యునికి అర్వావసువు, పరావసువు అను ఇద్దరు కుమారులు. భరద్వాజునికి యవక్రీతుడను ఒక్కడే కుమారుడు. (13)
రైభ్యో విద్వాన్ సహాపత్యః తపస్వీ చేతరోఽభవత్ ।
తయోశ్చాప్యతులా కీర్తిః బాల్యాత్ ప్రభృతి భారత ॥ 14
రైభ్యుడు, అతని పుత్రులు కూడ విద్వాంసులే. భరద్వాజుడు కేవలం తపస్సంపన్నుడు. బాల్యంలోనే వీరిరువురి కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. (14)
యవక్రీః పితరం దృష్ట్వా తపస్వినమసత్కృతమ్ ।
దృష్ట్వా చ సత్కృతం విప్రై రైభ్యం పుత్రైః సహానఘ ॥ 15
తాపసి అయిన తన తండ్రిని సత్కారం లేనివానిగా, పుత్రులతో కూడిన రైభ్యుని సత్కరింపబడేవానిగా బ్రాహ్మణులు ఆదరించటాన్ని యవక్రీతుడు గమనించాడు. (15)
పర్యతప్యత తేజస్వీ మన్యునాభిపరిప్లుతః ।
తపస్తేపే తతో ఘోరం వేదజ్ఞానాయ పాండవ ॥ 16
దానితో తేజోవంతుడైన యవక్రీతుడు దుఃఖాన్ని పొంది, దాని ద్వారా క్రోధాన్ని పొంది, వేదాల జ్ఞానానికై గొప్ప తపస్సు చేశాడు. (16)
స సమిద్ధే మహత్యగ్నౌ శరీరముపతాపయన్ ।
జనయామాస సంతాపమ్ ఇంద్రస్య సుమహాతపాః ॥ 17
మహాతపస్వి అయిన యవక్రీతుడు ప్రజ్జ్వలింపబడే అగ్నిలో తన శరీరాన్ని తపింపచేసి, ఇంద్రుని మనస్సులో సంతాపాన్ని కలిగించాడు. (17)
తత ఇంద్ర యవక్రీతమ్ ఉపగమ్య యుధిష్ఠిర ।
అబ్రవీత్ కస్య హేతోస్త్యమ్ ఆస్థితస్తప ఉత్తమమ్ ॥ 18
యుధిష్ఠిరా! ఇంద్రుడు యవక్రీతుని వద్దకు వచ్చి " నీవు ఎందుకు ఘోరతపస్సు చేస్తున్నావు" అని అడిగాడు. (18)
యవక్రీత ఉవాచ
ద్విజానామనధీతా వై వేదాః సురగణార్చిత ।
ప్రతిభాంత్వితి తప్యేఽహమ్ ఇదం పరమకం తపః ॥ 19
యవక్రీతుడు అన్నాడు - ద్విజాతులకు చదవకుండానే వేదాల జ్ఞానం కలగాలి అని నేను ఘోరతపస్సు ప్రారంభించాను. (19)
స్వాధ్యాయార్థం సమారంభః మయాయం పాకశాసన ।
తపసా జ్ఞాతుమిచ్ఛామి సర్వజ్ఞానాని కౌశిక ॥ 20
నేను స్వాధ్యాయం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను, తపస్సు ద్వారా అన్ని విషయాల జ్ఞానాన్ని పొందాలి అనుకొంటున్నాను. (20)
కాలేన మహతా వేదాః శక్యా గుర్రుముఖాద్ విభో ।
ప్రాప్తుం తస్మాదయం యత్నః పరమో మే సమాస్థితః ॥ 21
గురుముఖంగా వేదాలజ్ఞానం చాలా కాలంగా శిష్యులకు సంప్రాప్తిస్తోంది. నా ప్రయత్నమంతా వేగంగా వేదజ్ఞానం ద్విజాతులకు కలగడం కోసమే. (21)
ఇంద్ర ఉవాచ
అమార్గ ఏష విప్రర్షే యేన త్వం యాతుమిచ్ఛసి ।
కిం విఘాతేన తే విప్ర గచ్ఛాధీహి గురోర్ముఖాత్ ॥ 22
ఇంద్రుడు పలికాడు.
బ్రహ్మర్షీ! నీవు పయనించ దలచిన ఈ మార్గం సరి అయినది కాదు. స్వాధ్యాయాన్ని గురువు నుంచి నేర్చుకొంటే నీకు ఏం నష్టం కలుగుతోంది? రా! గురువునుండే వేదం నేర్చుకో. (22)
లోమశ ఉవాచ
ఏవముక్త్వాః గతః శక్రః యవక్రీరపి భారత ।
భూయ ఏవాకరోద్ యత్నం తపస్యమితవిక్రమః ॥ 23
లోమశుడు అన్నాడు - ఇలా పలికి ఇంద్రుడు అదృశ్యం అయ్యాడు. అత్యంత పరాక్రమంతో యవక్రీతుడు మళ్ళీ తపస్సు చేశాడు. (23)
ఘోరేణ తపసా రాజన్ తప్యమానో మహత్ తపః ।
సంతాపయామాస భృశం దేవేంద్రమితి నః శ్రుతమ్ ॥ 24
అతడు ఘోరతపస్సుతో తపఃఫలాన్ని సాధిస్తూ దేవరాజైన ఇంద్రుని తపింపచేశాడు అని మేం విన్నాం. (24)
తం తథా తప్యమానం తు తపస్తీవ్రం మహామునిమ్ ।
ఉపేత్య జలభిద్ దేవః వారయామాస వై పునః ॥ 25
అశక్యోఽర్థః సమారబ్ధః నైతద్ బుద్ధికృతం తవ ।
ప్రతిభాస్యంతి వై వేదాః తవ చైవ పితుశ్చ తే ॥ 26
యవక్రీతుని తపస్సుని గమనించి మళ్లీ ఇంద్రుడు అతనిని సమీపించి, వారిస్తూ ఇలా అన్నాడు. ప్రారంభించిన ఈ ప్రయత్నం ఫలించేది కాదు. నీ ఆలోచన సరి అయింది కాదు. నీకు, నీ తండ్రికి వేదాలు భాసిస్తాయి. (25,26)
యవక్రీత ఉవాచ
న చైతదేవం క్రియతే దేవరాజ మమేప్సితమ్ ।
మహతా నియమేనాహం తప్స్యే ఘోరతరం తపః ॥ 27
ఇంద్రా! నీవు నా కోరికను తీర్చనట్లయితే నేను మరల కఠోరతపస్సు ఆచరిస్తాను. ఆ సమయంలో అసాధ్యం అయిన నియమాలు పాటిస్తాను. (27)
సమిద్ధేఽగ్నావుపకృత్యాంగమంగం
హోష్యామి వా మఘవంస్తన్నిబోధ ।
యద్యేతదేవం న కరోషి కామం
మమేప్సితం దేవరాజేహ సర్వమ్ ॥ 28
నివు నా పూర్తిమనోరథాన్ని తీర్చనట్లయితే నా శరీరంలోని ప్రతి అవయవాన్ని క్రమంగా తీసి అగ్నిలో హోమం చేస్తాను. ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుంచుకో. (28)
లోమశ ఉవాచ
నిశ్చయం తమభిజ్ఞాయ మునేస్తస్య మహాత్మనః ।
ప్రతివారణహేత్వర్థం బుద్ధ్యా సంచింత్య బుద్ధిమాన్ ॥ 29
లోమశుడు పలికాడు. ఆ మహాత్ముని నిశ్చయం తెలిసిన, బుద్ధిమంతుడైన ఇంద్రుడు అతనిని నివారించే ఉపాయాన్ని ఆలోచించాడు. (29)
తతః ఇంద్రోఽకరోద్ రూపం బ్రాహ్మణస్య తపస్వినః ।
అనేకశతవర్షస్య దుర్బలస్య సయక్ష్మణః ॥ 30
వెంటనే ఇంద్రుడు బ్రాహ్మణరూపం ధరించాడు. అతడు తాపసి. వందల ఏళ్ళు కలవాడు. క్షయరోగంతో బాధపడుతూ దుర్బలుడుగా మారాడు. (30)
యవక్రీతస్య యత్ తీర్థమ్ ఉచితం శౌచకర్మణి ।
భాగీరథ్యాం తత్ర సేతుం వాలుకాభిశ్చకార సః ॥ 31
గంగాతీరంలో యవక్రీతుడు ఎక్కడ స్నానాచమనాలు చేస్తాడో అక్కడ ఇసుకతో సేతువును నిర్మించాడు. (31)
యదాస్య వదతో వాక్యం న స చక్రే ద్విజోత్తమః ।
వాలుకాభిస్తతః శక్రః గంగాం సమభిపూరయన్ ॥ 32
బ్రాహ్మణశ్రేష్ఠుడైన యవక్రీతుడు తన మాటను విననందు వల్ల బ్రాహ్మణవేషధారి ఇంద్రుడు గంగానదిని ఇసుకతో నింపసాగాడు. (32)
వాలుకాముష్టిమనిశం భాగీరథ్యాం వ్యసర్జయత్ ।
సేతుమభ్యారభచ్ఛక్రః యవక్రీతం నిదర్శయన్ ॥ 33
ఇంద్రుడు ఒక్కొక్క పిడికిలితో ఇసుకను గంగలో వేస్తూ యవక్రీతునికి చూపించి గంగపై సేతునిర్మాణం ఆరంభించాడు. (33)
తం దదర్శ యవక్రీతః యత్నవంతం నిబంధనే ।
ప్రహసంశ్చాబ్రవీద్ వాక్యమ్ ఇదం స మునిపుంగవః ॥ 34
ప్రయత్నశీలి అయిన ఆ బ్రాహ్మణేంద్రుని చూసి యవక్రీతుడు నవ్వుకొని అతనితో ఇలా అన్నాడు. (34)
కిమిదం వర్తతే బ్రహ్మన్ కిం చ తే హ చికీర్షితమ్ ।
అతీవ హి మహాన్ యత్నః క్రియతేఽయం నిరర్థకః ॥ 35
ఇదేమి? మీరు దేన్ని కోరి ఈ ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎంత గొప్పగా యత్నించినా ఇది వ్యర్థమే. (35)
ఇంద్ర ఉవాచ
బంధిష్యే సేతునా గంగాం సుఖః పంథా భవిష్యతి ।
క్లిశ్యతే హి జనస్తాత తరమాణః పునః పునః ॥ 36
ఇంద్రుడు పలికాడు.
ఈ సేతునిర్మాణం గంగానదిపై చేస్తాను. గంగను దాటటానికి మంచి మార్గం సిద్ధమవుతుంది. దీన్ని దాటడానికి జనులు మాటిమాటికి ప్రయాసపడుతున్నారు. (36)
యవక్రీత ఉవాచ
నాయం శక్యస్త్వయా బద్ధుం మహానోఘస్తపోధన ।
అశక్యాద్ వినివర్తస్వ శక్యమర్థం సమారభ ॥ 37
యవక్రీతుడు పలికాడు.
నీకు సేతునిర్మాణం సాధ్యం కాదు. ఇది గొప్ప ప్రవాహం గల నది. అశక్యం అయిన పని నుంచి బుద్ధిని మరల్చి సాధ్యం అయ్యే పని ప్రారంభించు. (37)
ఇంద్ర ఉవాచ
యథైవ భవతా చేదం తపో వేదార్థముద్యతమ్ ।
అశక్యం తద్వదస్మాభిః అయం భారః సమాహితః ॥ 38
నీవు చదువకుండా వేదజ్ఞానం పొందాలని తపస్సు ప్రారంభించావు. అది అసాధ్యం. అలాగే నేను గంగానదికి సేతువు కట్టాలని ప్రారంభించాను. (38)
యవక్రీత ఉవాచ
యథా తవ నిరర్థోఽయమ్ ఆరంభస్త్రిదశేశ్వర ।
తథా యది మమాపీదం మన్యసే పాకశాసన ॥ 39
క్రియతాం యద్ భవేచ్ఛక్యం త్వయా సురగణేశ్వర ।
వరాంశ్చ మే ప్రయచ్ఛాన్యాన్ యైరన్యాన్ భవితాస్మ్యతి ॥ 40
యవక్రీతుడు అన్నాడు - మీ సేతుబంధనం నిరర్థకం అయినట్లే నా ప్రయత్నం కూడా నిష్ప్రయోజనం అని నీవు భావిస్తే సాధ్యమైన దాన్ని ఆచరించు. నాకు మంచి వరాలనిమ్ము. వాటిద్వారా నేను వృద్ధిని పొంది, ప్రతిష్ఠను గైకొంటాను. (39,40)
లోమశ ఉవాచ
తస్మై ప్రాదాద్ వరానింద్రః ఉక్తవాన్ యాన్ మహాతపాః ।
ప్రతిభాస్యంతి తే వేదాః పిత్రా సహ యథేప్సితాః ॥ 41
యచ్ఛాన్యత్ కాంక్షసే కామం యవక్రీర్గమ్యతామితి ।
స లబ్ధకామః పితరం సమేత్యాథేదమబ్రవీత్ ॥ 42
అతనికై వరాలను ఇంద్రుడు అనుగ్రహించాడు. 'నీ తండ్రితో సహా నీకు వేదజ్ఞానం యతేచ్ఛగా కలుగుతుంది. నీ కోరిక తీరుతుంది. నీవు తపస్సును వీడి ఆశ్రమానికి వెళ్ళు.' అన్నాడు. ఇలా వరాలు పొంది, కోరికలు తీర్చుకొని, తండ్రివద్దకు చేరి యవక్రీతుడిలా అన్నాడు. (41,42)
యవక్రీత ఉవాచ
ప్రతిభాస్యంతి వై వేదాః మమ తాతస్య చోభయోః ।
అతి చాన్యాన్ భవిష్యావః వరా లబ్ధాస్తదా మయా ॥ 43
యవక్రీతుడు పలికాడు. - తండ్రీ! నీకు, నాకు వేదజ్ఞానం సంపూర్ణంగా కలుగుతుంది. మనం ఇతరుల కంటె గొప్పవారం కాగలం. ఈ వరాలన్నీ నాకు సిద్ధించాయి. (43)
భరద్వాజ ఉవాచ
దర్పస్తే భవితా తాత వరాన్ లబ్ధ్వా యథేప్సితాన్ ।
స దర్పపూర్ణః కృపణః క్షిప్రమేవ వినంక్ష్యసి ॥ 44
భరద్వాజుడు అన్నాడు. నాయనా! ఈ విధంగా మనోరథాలను, వరాలను పొంది మానవుడు అహంకారియై, దీనుడై, చివరికి శీఘ్రంగా నశిస్తాడు. (44)
అత్రాప్యుదాహరంతీమాః గాతా దేవైరుదాహృతాః ।
మునిరాసీత్ పురా పుత్ర బాలధిర్నామ వీర్యవాన్ ॥ 45
ఈ విషయంలో దేవతలు చెప్పిన కథను వివరిస్తాను. విను. పూర్వకాలంలో శక్తిమంతుడు అయిన బాలధి అనే పేరు గల తాపసి ఉండేవాడు. (45)
స పుత్రశోకాదుద్విగ్నః తపస్తేపే సుదుష్కరమ్ ।
భవేన్మమ సుతోఽమర్త్యః ఇతి తం లబ్ధవాంశ్చ సః ॥ 46
పుత్రులు లేని కారణంగా సంతాపం పొంది అసాధ్యం అయిన తపస్సు ఆచరించాడు. దేవతాసమానుడు అయిన పుత్రుడు కలగాలని తపస్సు చేశాడు. చివరికి ఒక కుమారుణ్ణి పొందాడు. (46)
తస్య ప్రసాదో వై దేవైః కృతో న త్వమరైః సమః ।
నామర్త్యో విద్యతే మర్త్యోః నిమిత్తాయుర్భవిష్యతి ॥ 47
అతనిపై దేవతలు దయ చూపారు. కాని దేవతలతో అతనిని సమానునిగా చేయలేదు. వరాలు ఇస్తూనే 'మరణధర్మం కల మానవుడు ఎన్నడూ దేవసమానుడు కాడు. ఏదో ఒక నిమిత్తంగా ఇట్తని ఆయువు తీరుతుంది' అన్నారు. (47)
బాలధిరువాచ
యథేమే పర్వతాః శశ్వత్ తిష్ఠంతి సురసత్తమాః ।
అక్షయాస్తన్నిమిత్తం మే సుతస్యాయుర్భవిష్యతి ॥ 48
బాలధి అన్నాడు - ఈ పర్వతాలు అక్షయాలు అయినట్లు నా కుమారుడు కూడా చిరంజీవి కావాలి. ఈ పర్వతాలే అతని ఆయువుకు నిమిత్తాలు. ఈ పర్వతాలు ఇక్కడ శాశ్వతంగా ఉన్నంత వరకు నా పుత్రునికి మరణం రాకూడదు. (48)
భరద్వాజ ఉవాచ
తస్య పుత్రస్తదా జజ్ఞే మేధావీ క్రోధనస్తదా ।
స తచ్ఛ్రుత్వాకరోద్ దర్పమ్ ఋషీంశ్చైవావమన్యత ॥ 49
భరద్వాజుడు పలికాడు - పిమ్మట బాలధికి పుత్రుడు జన్మించాడు. అతని మేధ ఎక్కువగా ఉన్నందున మేధావి అని విఖ్యాతి కల్గింది. స్వభావం చేత అతడు క్రోధశీలి. తన ఆయుర్దాయం విషయంలో దేవతల వరదానం విని, గర్వంతో ఋషులను అవమానించసాగాడు. (49)
వికుర్వాణో మునీనాం చ వ్యచరత్ స మహీమిమామ్ ।
ఆససాద మహావీర్యం ధనుషాక్షం మనీషిణామ్ ॥ 50
ఇంతేకాక ఋషులను, మునులను పరాభవించాలనే అబిప్రాయంతో భూమిపై తిరగసాగాడు. ఒకనాడు మేధావి గొప్పశక్తిమంతుడు, విద్వాంసుడు అయిన ధనుషాక్షుని చేరాడు. (50)
తస్యాపచక్రే మేధావీ తం శశాప స వీర్యవాన్ ॥
భవ భస్మేతి చోక్తః సః న భస్మ సమపద్యత ॥ 51
అతనిని పరాభవించగా ఆ వీర్యవంతుడు మేధావిని "బూడిద కమ్ము" అని శపించాడు. కాని అతడు బూడిద కాలేదు. (51)
ధనుషాక్షస్తు తం దృష్ట్వా మేధావినమనామయమ్ ।
నిమిత్హమస్య మహిషైః భేదయామాస వీర్యవాన్ ॥ 52
ధనుషాక్షుడు ధ్యానంలో మేధావిని రోగహూనునిగా, మృత్యుహీనునిగా తెలుసుకొన్నాడు, అతని ఆయుర్దాయాన్ని నశింపచేసే కారణం తెలిసి, దున్నపోతులతో పర్వతాలను చీల్చాడు. (52)
స మిమిత్తే వినష్టే తు మమార సహసా శిశుః ।
తం మృతం పుత్రమాదాయ విలలాప తతః పితా ॥ 53
నిమిత్తం నాశనం కాగా ఆ శిశువు శీఘ్రంగా మరణించాడు. మృతపుత్రుని గైకొని ఆ తండ్రి మిక్కిలిగా రోదించాడు. (53)
లాలప్యమానం తం దృష్ట్వా మునయః పరమార్తవత్ ।
ఊచుర్వేదవిదః సర్వే గాథాం యాం తాం నిబోధ మే ॥ 54
దీనమానవుని వలె విలపిస్తున్న అతని దగ్గర చేరి మునులు ఒక గాధను వినిపించారు. అది విను. (54)
న దిష్టమర్థమత్యేతుమ్ ఈశో మర్త్యః కథంచన ।
మహిషైర్భేదయామాస ధనుషాక్షో మహీధరాన్ ॥ 55
మరణ ధర్మం గల మానవుడు దైవవిధానాన్ని ఎదిరించలేడు. అందుకే ధనుషాక్షుడు పర్వతాలను దున్నలతో చీల్చి, అతనిని చంపాడు. (55)
ఏవం లబ్ధ్వా వరాన్ బాలా దర్పపూర్ణాస్తపస్వినః ।
క్షిప్రమేవ వినశ్యంతి యథా న స్యాత్ తథా భవాన్ ॥ 56
తాపసబాలకుడు వరాలు పొందినా గర్వంతో నిండి ఉన్నందున శీఘ్రంగా నశించాడు. నీవు మాత్రం ఆవిధంగా ఉండరాదు. (56)
ఏష రైభ్యో మహావీర్యః పుత్రౌ చాస్య తథావిధౌ ।
తం యథా పుత్ర నాభ్యేషి తథా కుర్యాస్త్వతంద్రితః ॥ 57
ఈ రైభ్యముని శక్తిశాలి. అతని ఇద్దరు కుమారులు అలాంటివారే. నీవు సోమరితనం వీడి రైభ్యుని వద్దకు పోకుండా జాగ్రత్తపడు. (57)
స హి క్రుద్ధః సమర్థస్త్వాం పుత్ర పీడయితుం రుషా ।
రైభ్యశ్చాపి తపస్వీ చ కోపనశ్చ మహానృషిః ॥ 58
నిన్ను హెచ్చరించటానికి ఇదే కారణం. రైభ్యుడు తాపసి, కోపశీలుడు, కోపిస్తే నీకు తీవ్రమైన అపకారం చేయగలడు. (58)
యవక్రీత ఉవాచ
ఏవం కరిష్యే మా తాపం తాత కార్షీః కథంచన ।
యథా హి మే భవాన్ మాన్యః తథా రైభ్యః పితా మమ ॥ 59
యవక్రీతుడు పలికాడు.
నేను అలాగే చేస్తాను. మీరు మనస్సులో సంతాపాన్ని విడచిపెట్టండి. మీరు నాకు పూజింపతగినవారైనట్లే, రైభ్యుడు కూడ నాకు పితృసమానుడే. (59)
లోమశ ఉవాచ
ఉక్త్వా స పితరం శ్లక్ష్ణం యవక్రీరకుతోభయః ।
విప్రకుర్వనృషీనన్యాన్ అతుస్యత్ పరయా ముదా ॥ 60
లోమశుడు పలికాడు.
తండ్రితో ఇలా తియ్యగా పలికి యవక్రీతుడు నిర్బయంగా వ్యవహరిస్తున్నాడు. ఇతర మునులకు బాధ కలిగించి సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. (60)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం యవక్రీతోపాఖ్యానే పంచత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 135 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో యవక్రీతోపాఖ్యనము అను నూట ముప్పది అయిదవ అధ్యాయము. (135)