120. నూట ఇరువదియవ అధ్యాయము

సాత్యకి పౌరుషవచనాలు, శ్రీకృష్ణుని ఆజ్ఞపై పాండవులు పయోష్ణీనదీతీరమున వసించుట.

సాత్యకిరువాచ ఉవాచ
న రామ కాలః పరిదేవనాయ
యదుత్తరం త్వత్ర తదేవ సర్వే ।
సమాచరామో హ్యనతీతకాలం
యుధిష్ఠిరో యద్యపి నాహ కించిత్ ॥ 1
సాత్యకి పలికాడు - బలరామా! ఇది కూర్చునిఇ విలపించే సమయం కాదు. మనం ముందుగా ఏదో ఒకటి చెయ్యాలి. అది అందరం కలిసి మాత్రం చెయ్యాలి. ధర్మజుడు మనకేమీ చెప్పకపోయినా కాలయాపన చెయ్యక మనం శత్రువులకు సమాధానం చెప్పాలి. (1)
యే నాథవంతోఽద్య భవంతి లోకే
తే నాత్మనా కర్మ సమారభంతే ।
తేషాం తు కార్యేషు భవంతి నాథాః
శిబ్యాదయో రామ యథా యయాతేః ॥ 2
ఈ లోకంలో ఎవరికి ప్రభువులు ఉన్నారో, సహాయకులు ఉన్నారో వారు స్వయంగా ఏ పనినీ ప్రారంభింపనవసరం లేదు. వారికి అన్నిపనుల్లోను సహాయకులు, స్నేహితులు ఉంటారు. యయాతిని ఉద్ధరించటంలో శిబి మొదలయినవారు సహాయపడ్డారు గదా! (2)
యేషాం తథా రామ సమారభంతే
కార్యాణి నాథా స్వమతేన లోకే ।
తే నాథవంతః పురుషప్రవీరాః
నానాథవత్ కృచ్ర్ఛమవాప్నువంతి ॥ 3
ప్రపంచంలో ఎవని పనులు అతని సహాయకులు ఆలోచించి ప్రారంభిస్తారో ఆ పురుషశ్రేష్ఠులే సహాయకులు కలవారు. వారు అనాథలవలె ఎప్పుడూ కష్టాన్ని పొందరు. (3)
కస్మాదిమౌ రామజనార్దనౌ చ
ప్రద్యుమ్నసాంబౌ చ మయా సమేతౌ ।
వసంత్యరణ్యే సహసోదరీయః
త్రైలోక్యనాథానభిగమ్య పార్థాః ॥ 4
బలరామకృష్ణులు, ప్రద్యుమ్నసాంబులు, నాతో కలిసి త్రైలోక్యనాథులు వారిని సేవిస్తున్నా పార్థులు అరణ్యంలో ఏ కారణం చేతో నివసిస్తూనే ఉన్నారు. (4)
నిర్యాతు సాధ్వద్య దశార్హసేనా
ప్రభూతనానాయుధచిత్రవర్మా ।
యమక్షయం గచ్ఛతు ధార్తరాష్ట్రః
సబాంధవో వృష్ణిబలాభిభూతః ॥ 5
త్వం హ్యేవ కోపాత్ పృథివీమపీమాం
సంవేష్టయేస్తిష్ఠతు శార్ ఙ్గధన్వా ।
స ధార్తరాష్ట్రం జహి సానుబంధం
వృత్రం యథా దేవపతిర్మహేంద్రః ॥ 6
చిత్రవిచిత్రాయుధాలు, కవచాలు ధరించి యాదవసేన ఈ రోజునే యుద్ధానికి బయలుదేరటం ఉత్తమం. దుర్యోధనుడు యాదవసేనచే జయింపబడి బంధు, సోదర, బలగాలతో యముని వద్దకు వెళ్ళుగాక. భగవానుడు శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా పాల్గొనకపోయినా మీరే క్రోధాగ్నిలో ఈ భూమండలాన్ని అగ్నిజ్వాలల్లో మండించగలరు. అది దేవరాజు అయిన మహేంద్రుడు పరివారంతో కూడిన వృత్రుని చంపటంతో సమానం. (5,6)
భ్రాతా చ మే యః స సఖా గురుశ్చ
జనార్దనస్యాత్మసమశ్చ పార్థః ।
యదర్థమైచ్ఛన్ మనుజాః సుపుత్రం
శిష్యం గురుశ్చాప్రతికూలవాదమ్ ॥ 7
సోదరుడు, స్నేహితుడు, గురువు, శ్రీకృష్ణుని ఆత్మబంధువు అయిన అర్జునుడు ఇప్పుడు ఇక్కడ లేడు. దేనికొరకు మానవులు మంచి కుమారునీ, గురువుకు ప్రతికూలం కాని శిష్యునీ కోరుతారో ఆ సమయం ఇప్పుడు ఆసన్నం అయింది. (7)
యదర్థమభ్యుద్యతముత్తమం తత్
కరోతి కర్మాగ్ర్యమపారణీయమ్ ।
తస్యాస్త్రవర్షాణ్యహముత్తమాస్త్రః
విహత్య సర్వాణి రణేఽభిభూయ ॥ 8
యోగ్యుడైన శిష్యుడు, ఉత్తమపుత్రుడు శస్త్రాస్త్రాలు ధరించి, అపారపరాక్రమాన్ని చూపే సమయం ఇదే. నేను ఒక్కడినే యుద్ధభూమిలో గొప్పగొప్ప ఆయుధాలతో శత్రువులనందర్నీ అస్త్రవర్షంతో నాశనం చేసి సైనికులను జయిస్తాను. అట్టివారు మాకూ ఉన్నారు. (8)
కాయాచ్ఛిరః సర్పవిషాగ్నికలపైః
శరోత్తమైరున్మథితాస్మి రామ ।
ఖడ్గేన చాహం నిశితేన సంఖ్యే
మాయాచ్ఛిరస్తస్య బలాత్ ప్రమథ్య ॥ 9
సర్పం, అగ్ని, విషం వీటితో సమానమైన బాణాలతో శత్రువుల శిరస్సులను మొండెము నుంచి వేరు చేస్తాను. యుద్ధభూమిలో తీక్ష్ణధార కల ఖఢ్గంతో వారి శిరస్సును బలంగా తెగనరకుతాను. (9)
తతోఽస్య సర్వాననుగాన్ హనిష్యే
దుర్యోధనం చాపి కురూంశ్చ సర్వాన్ ।
ఆత్తాయుధం మామిహ రౌహిణేయ
పశ్యంతు భైమా యుధి జాతహర్షాః ॥ 10
ఆ దుర్యోధనుని సైనికులందర్నీ, కౌరవులనందర్నీ చంపివేస్తాను. యుద్ధంలో భయంకరంగా పోరాడే యోధులు హర్షోత్సాహాలతో నా శస్త్రాస్త్రాల వేగాన్ని చూస్తారు. (10)
నిఘ్నంతమేకం కురుయోధముఖ్యాన్
అగ్నిం మహాకక్షమివాంతకాలే ।
ప్రద్యుమ్నముక్తాన్ నిశితాన్ న శక్తాః
సోఢుం కృపద్రోణవికర్ణకర్ణాః ॥ 11
ప్రళయకాలమందలి అగ్ని గడ్డివామును అవలీలగా నాశనం చేసినట్లు నేను ఒక్కడినే కౌరవసేనను నాశనం చేస్తాను. ప్రద్యుమ్నుడు విడిచిన బాణాలను కృప, ద్రోణ, వికర్ణ, కర్ణులు సహింపలేరు. (11)
జానామి వీర్యం చ జయాత్మజస్య
కార్ ష్ణిర్భవత్యేషు యథా రణస్థః ।
సాంబః ససూతం సరథం భూజాభ్యాం
దుఃశాసనం శాస్తు బలాత్ ప్రమథ్య ॥ 12
నేను అభిమన్యుని పరాక్రమం తెలిసినవాడను. సమరభూమిలో నిలచిన ప్రద్యుమ్నుని శక్తిని ఎఱుగుదును. వీరశ్రేష్ఠుడైన సాంబుడు దుశ్శాసనుని అణచిపెట్టి తన రెండు చేతులతో సారథి, రథాలతో కూడిన దుశ్శాసనుని శాసింపగలడు. (12)
న విద్యతే జాంబవతీసుతస్య
రణే విషహ్యం హి రణోత్కటస్య ।
ఏతేన బాలేన హి శంబరస్య
దైత్యస్య సైన్యం సహసా ప్రణున్నమ్ ॥ 13
జాంబవతి కుమారుడు సాంబుడు యుద్ధంలో ప్రచండ పరాక్రమవంతుడిగా మారిపోతాడు. ఇతనిచే బాల్యంలోనే శంబరాసురుని సేన అంతా నాశనం చేయబడింది కదా! (13)
వృత్తోరురత్యాయతపీనబాహుః
ఏతేన సంఖ్యే నిహతోఽశ్వచక్రః ।
కో నామ సాంబస్య మహారథస్య
రణే సమక్షం రథమభ్యుదీయాత్ ॥ 14
ఇతని పిక్కలు గుండ్రంగా ఉంటాయి. చేతులు, పొడవుగా, బలంగా ఉంటాయి. యుద్ధంలో వీటితో అశ్వారోహకులను ఎందరినో చంపగలడు. సంగ్రామ భూమిలో మహారథుడైన సాంబుని ఎదుట ఎవడు నిలువగలడు? (14)
యథా ప్రవిశ్యాంతరమంతకస్య
కాలే మనుష్యో న వినిష్ర్కమేత ।
తథా ప్రవిశ్యాంతరమస్య సంఖ్యే
కో నామ జీవన్ పునరావ్రజేత ॥ 15
అంత్యకాలంలో యముని చేతుల నుండి బయటపడలేని మనుజుని వలె యుద్ధభూమిలో సాంబుని అధీనమైనవాడు జీవితాన్ని తిరిగి పొందలేడు. (15)
ద్రోణం చ భీష్మం చ మహారథౌ తౌ
సుతైర్వృతం చాప్యథ సోమదత్తమ్ ।
సర్వాణి సైన్యాని చ వాసుదేవః
ప్రధక్ష్యతే సాయకవహ్నిజాలైః ॥ 16
వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు మహారథులైన ద్ర్రోణభీష్ములను, పుత్రసహితంగా సోమదత్తుని, కౌరవసేననంతటినీ బాణాగ్నిజ్వాలల్లో భస్మం చేస్తాడు. (16)
కిం నామ లోకేష్వవిషహ్యమస్తి
కృష్ణస్య సర్వేషి సదేవకేషు ।
ఆత్తాయుధస్యోత్తమబాణపాణేః
చక్రాయుధస్యాప్రతిమస్య యుద్ధే ॥ 17
చేతిలో ఆయుధం, బాణాలు, చక్రాయుధం కల కృష్ణుని పరాక్రమాన్ని యుద్ధంలో సహింపగలవాడు దేవతలతో కూడిన సమస్తలోకాల్లో ఎవడూ లేడు. (17)
తతోఽనిరుద్ధోఽప్యసిచర్మపాణిః
మహీమిమాం ధార్తరాష్ట్రైర్విసంజ్ఞైః ।
హృతోత్తమాంగైర్నిహతైః కరోతు
కీర్ణాం కుశైర్వేదిమివాధ్వరేషు ॥ 18
గదోల్ముకౌ బాహుకభానునీథాః
శూరశ్చ సంఖ్యే నిశఠః కుమారః ।
రణోత్కటౌ సారణచారుదేష్ణౌ
కులోచితం విప్రథయంతు కర్మ ॥ 19
కత్తిడాలు స్వీకరించిన అనిరుద్ధుడు కూడ యజ్ఞంలో వేది దర్భలతో కప్పబడినట్లు యుద్ధభూమిని శత్రువుల తలలతో, మొండెములతో కప్పుతాడు. గదుడు, ఉల్ముకుడు, బాహుకుడు, భానుడు, నీథుడు, ప్రత్యేకించి యుద్ధవీరుడు నిశఠుడు, సారణ, చారుదేష్ణులు వీరందరు కులానికి తగిన పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. (18,19)
సవృష్ణిభోజాంధకయోధముఖ్యా
సమాగతా సాత్వతశూరసేనా ।
హత్వా రణే తాన్ ధృతరాష్ట్రపుత్రాన్
లోకే యశః స్ఫీతముపాకరోతు ॥ 20
యాదవవంశీయుల వృష్ణి, భోజ, అంధక సాత్త్వత, శూరసేన జాతీయుల సేన యుద్ధంలో ధృతరాష్ట్రపుత్రులను సమూలంగా చంపి లోకంలో కీర్తిని విస్తరింపచేస్తుంది. (20)
తతోఽభిమన్యుః పృథివీం ప్రశాస్తు
యావద్ వ్రతం ధర్మభృతాం వరిష్ఠః ।
యుధిష్ఠిరః పారయతే మహాత్మా
ద్యూతే యథోక్తం కురుసత్తమేన ॥ 21
ధర్మవేత్తలలో అగ్రగణ్యుడైన ధర్మరాజు ద్యూతంలోని నియమం ప్రకారం వనవాసం చేస్తూంటే అంతవరకు అభిమన్యుడు ఈ భూమిని పరిపాలిస్తాడు. (21)
అస్మత్ర్పముక్తైర్విశిఖైర్జితారిః
తతో మహీం భోక్ష్యతి ధర్మరాజః ।
నిర్ధార్తరాష్ట్రాం హతసూతపుత్రామ్
ఏతద్ధి నః కృత్యతమం యశస్యమ్ ॥ 22
మనబాణాలచే శత్రువులను జయించి పదమూడు సంవత్సరాలు గడచిన పిమ్మట ధర్మరాజు రాజ్యాన్ని అనుభవిస్తాడు. ధార్తరాష్ట్రులు లేకుండా చేయటమూ, కర్ణుని చంపటమూ మనం చేయవలసినపని. దీనివలన మనకీర్తి పెరుగుతుంది. (22)
వాసుదేవ ఉవాచ
అసంశయం మాధవ సత్యమేతద్
గృహ్ణీమ తే వాక్యమదీనసత్త్వ ।
స్వాభ్యాం భుజాభ్యామజితాం తు భూమిం
నేచ్ఛేత్ కురూణామృషభః కథంచిత్ ॥ 23
వాసుదేవుడు ఇలా అన్నాడు - మధువంశాగ్రణీ! నీ మాటలు ముమ్మాటికీ నిజం. దీనిలో కొంచెం కూడ సందేహం లేదు. నీ మాటలను నేను సమర్థిస్తున్నాను. కాని కురుకుల భూషణుడైన ధర్మరాజు తన భుజాలతో జయింపని భూమిని ఎన్నడూ అనుభవింపడు. (23)
న హ్యేష కామాన్నభయాన్న లోభాద్
యుధిష్ఠిరో జాతు జహ్యాత్ స్వధర్మమ్ ।
భీమార్జునౌ చాతిరథౌ యమౌ చ
తథైవ కృష్ణా ద్రుపదాత్మజేయమ్ ॥ 24
కోరికతోగాని, భయంతోగాని, లోభంతోకాని ధర్మరాజు స్వధర్మాన్ని ఎన్నడూ విడువడు. అలాగే అతిరథులు భీమార్జునులు, కవలలు నకుల సహదేవులు, ద్రుపదపుత్రి ద్రౌపది తమతమ ధర్మాలను ఎన్నడూ విడువరు. (24)
ఉభౌ హి యుద్ధేఽప్రతిమౌ పృథివ్యాం
వృకోదరశ్చైవ ధనంజయశ్చ ।
కస్మాన్న కృత్స్నాం పృథివీం ప్రశాసేత్
మాద్రీసుతాభ్యాం చ పురస్కృతోఽయమ్ ॥ 25
భీమార్జునులు ఇద్దరే యుద్ధంలో ఈ భూమిపై సాటిలేనివారు. నకుల సహదేవులతో, భీమార్జునులతో కలిసిన ధర్మజుడు భూమిని శాసించకుండా ఎలా ఉంటాడు? (25)
యదా తు పంచాలపతిర్మహాత్మా
సకేకయశ్చేదిపతిర్వయం చ ।
యుధ్యేమ విక్రమ్య రణే సమేతః
తదైవ సర్వే రిపవో హి న స్యుః ॥ 26
పాంచాల రాజు, కేకయుడు, చేదిరాజు, మనమందరం కలిసి యుద్ధంలో పరాక్రమం చూపితే అపుడే శత్రువులనే వారు ఇక ఉండరు. (26)
యుధిష్ఠిర ఉవాచ
నేదం చిత్రం మాధవ యద్ బ్రవీషి
సత్యం తు మే రక్ష్యతమం న రాజ్యమ్ ।
కృష్ణస్తు మాం వేద యథావదేకః
కృష్ణం చ వేదాహమథో యథావత్ ॥ 27
యుధిష్ఠిరుడు పలికాడు - సాత్యకీ నీ పలుకులు సత్యాలు. నీవంటి వీరునికి ఆశ్చర్యం అనేది లేదు. కాని నాకు సత్యాన్ని
రక్షించటమే ప్రధానం. రాజ్య ప్రాప్తి కాదు. నా స్వరూపం పూర్తిగా శ్రీకృష్ణునికి తెలుసు. అలాగే శ్రీకృష్ణుని స్వరూపం నాకు బాగా తెలుసు. (27)
యదైవ కాలం పురుషప్రవీరః
వేత్స్యత్యయం మాధవ విక్రమస్య ।
తదా రణే త్వం చ శినిప్రవీర
సుయోధనం జేష్యసి కేశవశ్చ ॥ 28
శినివంశప్రధానవీరుడా! సాత్యకీ! శ్రీకృష్ణుడు పరాక్రమం చూపడానికి సమయాన్ని నిర్ణయిస్తే అప్పుడు నీవూ, శ్రీకృష్ణుడూ అందరూ కలిసి సుయోధనుని జయుస్తారు. (28)
ప్రతిప్రయాంత్వద్య దశార్హవీరాః
దృష్టోఽస్మి నాథైర్నరలోకనాథైః ।
ధర్మేఽప్రమాదం కురుతాప్రమేయాః
ద్రష్టాస్మి భూయః సుఖినః సమేతాన్ ॥ 29
యాదవవీరులందరూ ఇప్పుడే ద్వారకకు బయలుదేరండి. మీరు మాకు ప్రభువులు, సహాయకులు, అంతేకాక లోకానికి అంతటికీ రక్షకులు. మీతో కలియటమే నాకు ఆనందాన్ని ఇచ్చే విషయం. ధర్మపాలనలో మీరు ఎల్లప్పుడు సావధానులై ఉండాలి. మళ్ళీ నేను మిమ్ములను ఒకచోట చేరగా చూస్తాను. (29)
తేఽన్యోన్యమామంత్ర్య తథాభివాద్య
వృద్ధాన్ పరిష్వజ్య శిశూంశ్చ సర్వాన్ ।
యదుప్రవీరాః స్వగృహాణి జగ్ముః
తే చాపి తీర్థాన్యనుసంవిచేరుః ॥ 30
యాదవపాండవులు ఒకరితో ఒకరు సంప్రదించుకొని, వృద్ధులకు నమస్కరించి, బాలురను తనివితీరా కౌగిలించుకొని, తమతమ గృహాలకు వెళ్ళారు. పాండవులు ఇదివరకటిలాగే తీర్థయాత్ర ప్రారంభించారు. (30)
విసృజ్య కృష్ణం త్వథ ధర్మరాజః
విదర్భరాజోపచితాం సుతీర్థామ్ ।
జగామ పుణ్యాం సరితం పయోష్ణీం
సభ్రాతృభృత్యః సహ లోమశేన ॥ 31
శ్రీకృష్ణునికి వీడ్కోలు పలికి ధర్మరాజు లోమశమహర్షితో, సోదరులతో, సేవకులతో, భార్యతో కలిసి విదర్భరాజుచే పూజలను పొంది, ఉత్తమతీర్థాలు గల పయోష్ణీనదీ తీరాన్ని చేరాడు. (31)
సుతేన సోమేన విమిశ్రతోయాం
పయః పయోష్ణీం ప్రతి సోఽధ్యువాస ।
ద్విజాతిముఖ్యైర్ముదితైర్మహాత్మా
సంస్తూయమానః స్తుతిభిర్వరాభిః ॥ 32
ఆ నదీజలంలో యజ్ఞంలోని సోమరసం కలిసింది. పయోష్ణీనదీతీరంలో ఆ జలాన్ని త్రాగి అక్కడే నివసించారు. ఆ సమయాన ప్రసన్నులయిన బ్రాహ్మణులు ధర్మరాజు అనేకవిధాల కొనియాడారు. (32)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం యాదవగమనే వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 120 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున యాదవగమనము అను నూట ఇరువదియవ అధ్యాయము. (120)