119. నూట పందొమ్మిదవ అధ్యాయము
ప్రభాసతీర్థమున బలరాముడు పాండవులకు సానుభూతి తెల్పుట.
జనమేజయ ఉవాచ
ప్రభాసతీర్థమాసాద్య పాండవా వృష్ణయస్తథా ।
కిమకుర్వన్ కథాశ్చైషాం కాస్తత్రాసంస్తపోధన ॥ 1
తే హి సర్వే మహాత్మానః సర్వశాస్త్రవిశారదాః ।
వృష్ణయః పాండవాశ్చైవ సుహృదశ్చ పరస్పరమ్ ॥ 2
జనమేజయుడు అన్నాడు.
ప్రభాస తీర్థాన్ని చేరిన యాదవులు, పాండవులు ఏమి చేశారు? వారి మధ్య సంభాషణ ఎలా సాగింది? మహాత్ములు సర్వశాస్త్రపారంగతులు అయిన యాదవపాండవులు ఒకరికొకరు హితాన్ని ఆచరించే వారుకదా! (1,2)
వైశంపాయన ఉవాచ
ప్రభాసతీర్థం సంప్రాప్య పుణ్యం తీర్థం మహోదధేః ।
వృష్ణయః పాండవాన్ వీరాః పరివార్యోపతస్థిరే ॥ 3
సముద్రతీరతీర్థాల్లో పవిత్రం అయింది ప్రభాసతీర్థం. అక్కడకు చేరిన యాదవవీరులు పాండవులచుట్టూ చేరి కూర్చున్నారు. (3)
తతో గోక్షీరకుందేందుమృణాలరజతప్రభః ।
వనమాలీ హలీ రామః బభాషే పుష్కరేక్షణమ్ ॥ 4
పిమ్మట ఆవుపాలు, మొల్లపూలు, చంద్రుడు, తామర తూళ్ళు, వెండి వంటి తెల్లదనం కల్గి, హలాయుధుడైన బలరాముడు శ్రీకృష్ణునితో అన్నాడు. (4)
బలదేవ ఉవాచ
న కృష్ణ ధర్మశ్చరితో భవాయ
జంతోరధర్మశ్చ పరాభవాయ ।
యుధిష్ఠిరో యత్ర జటీ మహాత్మా
వనాశ్రయః క్లిశ్యతి చీరవాసాః ॥ 5
బలదేవుడు పలికాడు - ఆచరించిన ధర్మం అభ్యుదయ కారణం కాదు. ఆచరించిన ఆధర్మం పరాజయకారణమూ కాదు. మహాత్ముడైన యుధిష్ఠిరుడు నారబట్టలు కట్టి. జడలు ధరించి వనంలో బాధలు పడుతున్నాడు. (5)
దుర్యోధనశ్చాపి మహీం ప్రశాస్తి
న చాస్య భూమిర్వివరం దదాతి ।
ధర్మాదధర్మశ్చరితో వరీయాన్
ఇతీవ మన్యేత నరోఽల్పబుద్ధిః ॥ 6
దుర్యోధనే చాపి వివర్ధమానే
యుధిష్ఠిరే చాసుఖమాత్తరాజ్యే ।
కిం త్వత్ర కర్తవ్యమితి ప్రజాభిః
శంకా మిథః సంజనితా నరాణామ్ ॥ 7
అధర్మపరాయణుడైన దుర్యోధనుడు భూమిని పరిపాలిస్తున్నాడు. అతనిని భూదేవి తనలో కలుపుకోవడం లేదు. మందబుద్ధులు ఇది చూచి ధర్మం చేయటం కంటె అధర్మం ఆచరించటం మేలు అని భావిస్తారు. దుర్యోధనుడు ప్రతిదినం వృద్ధిని పొందుతుంటే, ధర్మజుడు రాజ్యాన్ని కోల్పోయి దుఃఖిస్తుంటే మనుష్యులు ఏమి ఆచరించాలి? అనే సందేహం వారిలో వారికి కలుగుతోంది. (6,7)
అయం స ధర్మప్రభవో నరేంద్రః
ధర్మే ధృతః సత్యధృతిః ప్రదాతా ।
చలేద్ధి రాజ్యాచ్చ సుఖాచ్చ పార్థః
ధర్మాదపేతస్తు కథం వివర్ధేత్ ॥ 8
ధర్మరాజు సాక్షాత్తుగా యమధర్మరాజు కుమారుడు. ధర్మాన్ని, సత్యాన్ని ఆశ్రయించి దానశీలి అయి ఉన్నాడు. ధర్మజుడు రాజ్యాన్ని, సుఖాన్ని విడుస్తాడు. కాని ధర్మాన్ని విడువడు. ధర్మాన్ని విడచి ఎవడు అభ్యుదయాన్ని పొందగలడు? (8)
కథం ను భీష్మశ్చ కృపశ్చ విప్రః
ద్రోణశ్చ రాజా చ కులస్య వృద్ధః ।
ప్రవ్రాజ్య పార్థాన్ సుఖమాప్నువంతి
ధిక్ పాపబుద్ధీన్ భరతప్రధానాన్ ॥ 9
భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, కుంతీపుత్రులను రాజ్యం నుంచి వెడల గొట్టి సుఖాన్ని అనుభవిస్తున్నారు. భరతకుల వృద్ధులకు నింద అగుగాక! వారి బుద్ధి ఎల్లప్పుడు పాపం వైపే సాగుతోంది. (9)
కిం నామ వక్ష్యత్యవనిప్రధానః
పితౄన్ సమాగమ్య పరత్ర పాపః ।
పుత్రేషు సమ్యక్ చరితం మయేతి
పుత్రానపాపాన్ వ్యపరోప్య రాజ్యాత్ ॥ 10
పాపాత్ముడైన ధృతరాష్ట్రుడు పరలోకంలో పితరులను కలిసి తన చర్యలను ఏవిధంగా సమర్థించుకొంటాడు? "పాండుపుత్రుల పట్ల నేను సక్రమంగా వ్యవహరించాను." అని చెప్పగలడా? రాజ్యం నుంచి వెడల గొట్టి, మోసగించిన దానికి సమాధానం అతని వద్ద ఏది? (10)
నాసౌ ధియా సంప్రతి పశ్యతి స్మ
కిం నామ కృత్వాహమచక్షురేవమ్ ।
జాతః పృథివ్యామితి పార్థివేషు
ప్రవ్రాజ్య కౌంతేయమితి స్మ రాజ్యాత్ ॥ 11
'నేత్రాలతో ఏ పాపం చేయడం వల్ల నాకీ అంధత్వం వచ్చింది? అని అతని బుద్ధి ఆలోచించటం లేదు. 'కుంతీపుత్రుని రాజ్యానికి దూరం చేసి' భూతలంపై మళ్ళీ రాజులతో పుట్టితే నా దశ ఎట్లుంటుంది? అని ఆలోచించటం లేదు. (11)
నూనం సమృద్ధాన్ పితృలోకభూమౌ
చామీకరాభాన్ క్షితిజాన్ ప్రపుల్లాన్ ।
విచిత్రవీర్యస్య సుతః సపుత్రః
కృత్వా నృశంసం బత పశ్యతి స్మ ॥ 12
విచిత్రవీర్యుని పుత్రుడైన ధృతరాష్ట్రుడు అతని పుత్రుడైన దుర్యోధనుడు ఈ క్రూరమైన పనులు చేసి పితృలోకంలో బంగారం వలె మెరిసే వికసించిన పూలు కల వృక్షాలను నిశ్చయంగా కలలో చూస్తున్నారు. (మృత్యువు సమీపించింది అని దీని అర్థం.) (12)
వ్యూఢోత్తరాంసాన్ పృథులోహితాక్షాన్
నేమాన్ స్మ పృచ్ఛన్ స శృణోతి నూనమ్ ।
ప్రాస్థాపయద్ యత్ సవనం సశంకః
యుధిష్ఠిరం సానుజమాత్తశస్త్రమ్ ॥ 13
దృఢస్కందాలు, విశాలనేత్రాలు గల పెద్దలు భీష్మాదులు ధృతరాష్ట్రుడు విషయం ప్రశ్నిస్తాడో అది ఆచరించటం లేదు. సోదరసహితుడై ఆయుధ ధారి అయిన యుధిష్ఠిరుని పట్ల భయంతో మోసంతో వనానికి పంపాడు. (13)
యోఽయం పరేషాం పృతనాం సమృద్ధాం
నిరాయుధో దీర్ఘభుజో నిహన్యాత్ ।
శ్రుత్వైవ శబ్దం హి వృకోదరస్య
ముంచంతి సైన్యాని శకృత్ సమూత్రమ్ ॥ 14
గొప్ప బాహువులు గల, శత్రువులను శస్త్రాస్త్రాలు లేకుండ చంప గల భీమసేనుని సింహనాదం విని శత్రుగణాలు ఒక్కసారిగా మలమూత్రాలు విడుస్తారు. (14)
స క్షుత్పిపాసాధ్వకృశస్తరస్వీ
సమేత్య నానాయుధబానపాణిః ।
వనే స్మరన్ వాసమిమం సుఘోరం
శేషం న కుర్యాదితి నిశ్చితం మే ॥ 15
వేగవంతుడైన ఆ భీముడు ఆకలి దప్పికలచేత, మార్గసంచారం చేతనూ బలహీనుడైనాడు. ఈ భయంకర వనవాసఘోరాన్ని స్మరిస్తూ యుద్ధసమయంలో ఎవరినీ ప్రాణాలతో విడువడు అని నా అభిప్రాయం. (15)
న హ్యస్య వీర్యేన బలేన కశ్చిత్
సమః పృథివ్యామపి విద్యతేఽన్యః ।
స శీతవాతాతపకర్శితాంగో
న శేషమాజావహృత్సు కుర్యాత్ ॥ 16
ఇతని బలంతో, పరాక్రమంతో సమానమైనవాడు వేరొకడు భూమిపై లేడు. చలిగాలి, ఎండ వీటిచే ఇతని శరీరం ఇప్పుడు కృశించింది. కాని యుద్ధంలో శత్రువుల్లో ఒక్కణ్ణి కూడ విడువడు. (16)
ప్రాచ్యాం నృపానేకరథేన జిత్వా
వృకోదరః సానుచరాన్ రణేషు ।
స్వస్త్యాగమద్ యోఽతిరథస్తరస్వీ
సోఽయం వనే క్లిశ్యతి చీరవాసాః ॥ 17
యః సింధుకూలే వ్యజయన్నృదేవాన్
సమాగతాన్ దాక్షిణాత్యాన్ మహీపాన్ ।
తం పశ్యతేమం సహదేవమద్య
తరస్వినం తాపసవేషరూపమ్ ॥ 18
పూర్వదిగ్విజయయాత్రలో ఒక్కడే భీముడు రాజులందర్నీ సేనతో సహా జయించి తిరిగి వచ్చాడు. ఈనాడు నారబట్టలు కట్టి, ఆ వేగం తగ్గి, అడవిలో కష్టాలు అనుభవిస్తున్నాడు. సముద్రతీరంలో దక్షిణదిక్కున ఎదిరించిన రాజులందరినీ జయించిన సహదేవుడు తాపసవేషధారియై దిగులతో నున్నాడు. (17,18)
యః పార్థివానేకరథేన జిగ్యే
దిశం ప్రతీచీం ప్రతి యుద్ధశౌండః ।
సోఽయం వనే మూలఫలేన జీవన్
జటీ చరత్యద్య మలాచితాంగః ॥ 19
నకులుడు ఒక్కడే పడమర దిక్కున ఉన్న రాజులందరినీ యుద్ధనిపుణతతో జయించాడు. ఇప్పుడు కందమూలఫలాలతో జీవయాత్ర సాగిస్తున్నాడు. జడలు కట్టి మాసిన శరీరంతో ఉన్నాడు. (19)
సత్రే సమృద్ధేఽతిరథస్య రాజ్ఞః
వేదీతలాదుత్పతితా సుతా యా ।
సేయం వనే వాసమివం సుదుఃఖం
కథం సహత్యద్య సతీ సుఖార్హా ॥ 20
ద్రుపదుని యాగంలో యజ్ఞవేది నుంచి పుట్టిన ద్రౌపది సుఖాలకు యోగ్యురాలు, పతివ్రత అయినా ఇదేవనంలో దుఃఖాన్నే ఎలా సహిస్తోంది? (20)
త్రివర్గముఖ్యస్య సమీరణస్య
దేవేశ్వరస్యాప్యథవాశ్వినోశ్చ ।
ఏషాం సురాణాం తనయాః కథం ను
వనేచరన్ హ్యస్తసుఖాః సుఖార్హాః ॥ 21
ధర్మ, వాయు, ఇంద్ర అశ్వినీదేవతలపుత్రులు అయిన వీరు సుఖాన్ని అనుభవించడానికి యోగ్యులై ఉండి కూడా వనవాసం చేస్తూ, మోసగింపబడి సుఖానికి దూరం అయ్యారు. (21)
జితే హి ధర్మస్య సుతే సభార్యే
సభ్రాతృకే సానుచరే నిరస్తే ।
దుర్యోధనే చాపి వివర్ధమానే
కథం న సీదత్యవనిః సశైలా ॥ 22
భార్యతో, సోదరులతో సహా ధర్మరాజు ద్యూతంలో ఓడిపోయాడు. అనుచరులను కోల్పోయాడు. అవినీతిపరాయణుడైన దుర్యోధనుడు వృద్ధిని పొందుతుంటే పర్వతసహితమయిన భూమి ఎందుకు కుంగిపోవటం లేదో నాకు తెలియటం లేదు. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం బలరామవాక్యే ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 119 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో బలరామవాక్యమను నూట పందొమ్మిదవ అధ్యాయము. (119)