118. నూట పదునెనిమిదవ అధ్యాయము

యుధిష్ఠిరుడు ప్రభాసక్షేత్రమున తపస్సు చేయుట - యాదవ పాండవుల కలయిక.

వైశంపాయన ఉవాచ
గచ్ఛన్ స తీర్థాని మహానుభావః
పుణ్యాని రమ్యాణి దదర్శ రాజా ।
సర్వాణి విప్రైరుపశోభితాని
క్వచిత్ క్వచిద్ భారత సాగరస్య ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
భారతా! ముందుకు సాగుతూ ధర్మరాజు సముద్రతీరంలోని సుందరతీర్థాలన్నింటినీ చూశాడు. వాటిల్లో చాలామంది బ్రాహ్మణులు నివసిస్తున్నారు. దానివల్ల సాగరశోభ పెరగసాగింది. (1)
స వృత్తవాంస్తేషు కృతాభిషేకః
సహానుజః పార్థివపుత్రపౌత్రః ।
సముద్రగాం పుణ్యతమాం ప్రశస్తాం
జగామ పారిక్షిత పాండుపుత్రః ॥ 2
సదాచారాన్ని పాటించే ఆ ధర్మరాజు ఆ తీర్థాల్లో స్నానమాడి, సోదరులతో కలిసి, సముద్రంలో కలిసే పవిత్ర ప్రశస్తానదీతీరానికి చేరాడు. (2)
తత్రాపి చాప్లుత్య మహానుభావః
సంతర్పయామాస పితౄన్ సురాంశ్చ ।
ద్విజాతిముఖ్యేషు ధనం విసృజ్య
గోదావరీం సాగరగామగచ్ఛత్ ॥ 3
అతడు ఆ నదిలోనూ స్నానం చేసి పితరులకు, దేవతలకు తర్పణాలు విడచాడు. బ్రాహ్మణశ్రేష్ఠులకు ధన దానం చేసి, సాగరగామిని అయిన గోదావరిని చేరుకొన్నాడు. (3)
తతో విపాప్మా ద్రవిడేషు రాజన్
సముద్రమాసాద్య చ లోకపుణ్యమ్ ।
అగస్త్యతీర్థం చ మహాపవిత్రం
నారీతీర్థాన్యథ వీరో దదర్శ ॥ 4
గోదావరిలో స్నానం చేసి, పవిత్రుడై, ద్రవిడదేశంలో తిరుగుతూ, భూలోకంలో పవిత్రమైన సముద్రతటాన్ని చేరుకొని స్నానాదులను ఆచరించి, ముందుకు సాగి, అగస్త్యతీర్థ, నారీతీర్థాలు దర్శించాడు. (4)
వి॥సం॥ నారీ తీర్థాని అయిదుగురు అప్సరసలు ముని శాపం వలన మొసళ్ళుగా మారి నివసిస్తూ అర్జునుని వలన శాపవిముక్తి పొందిన తీర్థాలు నారీ తీర్థాలు. (నీల)
తత్రార్జునస్యాగ్ర్యధనుర్ధరస్య
నిశమ్య తత్ కర్మ నరైరశక్యమ్ ।
సంపూజ్యమానః పరమర్షిసంఘైః
పరాం ముదం పాండుసుతః స లేభే ॥ 5
స తేషు తీర్థేష్వభిషిక్తగాత్రః
కృష్ణాసహాయః సహితోఽనుజైశ్చ ।
సంపూజయన్ విక్రమమర్జునస్య
రేమే మహీపాల పతిః పృథివ్యాః ॥ 6
అక్కడ మానవులకు దుర్లభమయిన పరాక్రమం కల అర్జునుని గొప్పతనాన్ని విని, ప్రసన్నుడై, ఋషి సంఘాలచే పూజింపబడి, ధర్మరాజు వారి సత్కారాన్ని అందుకొని ఆనందించాడు. ద్రౌపదితో, సోదరులతో కలిసిన ధర్మజుడు ఆ ఐదుతీర్థాల్లో మునిగి అర్జునుని పరాక్రమాన్ని ప్రశంసిస్తూ ఆనందాన్ని అనుభవించాడు. (5,6)
తతః సహస్రాణి గవాం ప్రదాయ
తీర్థేషు తేష్వంబుధరోత్తమస్య ।
హృష్టః సహ భ్రాతృభిరర్జునస్య
సంకీర్తయామాస గవాం ప్రదానమ్ ॥ 7
సముద్రతీరతీర్థాల్లో అర్జునుడు వేయిగోవులను దానమిచ్చాడని తెలిసి, సంతోషం పట్టలేక ధర్మజుడు అతని గోదానాన్ని పదేపదే కీర్తించాడు. (7)
స తాని తీర్థాని చ సాగరస్య
పుణ్యాని చాన్యాని బహూని రాజన్ ।
క్రమేణ గచ్ఛన్ పరిపూర్ణకామః
శూర్పారకం పుణ్యతమం దదర్శ ॥ 8
సముద్రతీర్థాలను, ఇతర తీర్థాలను సేవించిన ధర్మరాజు సంచరిస్తూ కోరికలు తీరి పుణ్యమయం అయిన శూర్పారక తీర్థాన్ని దర్శించాడు. (8)
తత్రోదధేః కంచిదతీత్య దేశం
ఖ్యాతం పృథివ్యాం వనమాససాద ।
తప్తం సురైస్తత్ర తపః పురస్తా
దిష్టం తథా పుణ్యపరైర్నరేంద్రైః ॥ 9
సముద్రంలోని కొంతభాగాన్ని దాటి, భూమండలంలో ప్రఖ్యాతి చెందిన వనాన్ని చేరుకొన్నాడు. పూర్వకాలంలో అక్కడ దేవతలు తపస్సు చేశారు. పుణ్యాత్ములు రాజులు యజ్ఞయాగాలు చేశారు. (9)
స తత్ర తామగ్ర్యధనుర్ధరస్య
వేదీం దదర్శాయతపీనబాహుః ।
ఋచీకపుత్రస్య తపస్విసంఘః
సమావృతాం పుణ్యకృదర్చనీయామ్ ॥ 10
అక్కడ పొడవై, బలిసిన బాహువులు కల ధర్మరాజు ధనుర్ధారి, ఋచీకవంశజుడు అయిన పరశురాముని వేదిని చూశాడు. అది పుణ్యపురుషులకు పూజింపతగినది. తాపసులు అక్కడ ఎప్పుడూ నివసిస్తూ ఉంటారు. (10)
తతో వసూనాం వసుధాధిపః స
మరుద్గణానాం చ తథాశ్వినోశ్చ ।
వైవస్వతాదిత్యధనేశ్వరాణామ్
ఇంద్రస్య విష్ణోః సవితుర్విభోశ్చ ॥ 11
భవస్య చంద్రస్య దివాకరస్య
పతేరపాం సాధ్యగణస్య చైవ ।
ధాతుః పితౄణాం చ తథా మహాత్మా
రుద్రస్య రాజన్ సగణస్య చైవ ॥ 12
సరస్వత్యాః సిద్ధగణస్య చైవ
పుణ్యాశ్చ యే చాప్యమరాస్తథాన్యే ।
పుణ్యాని చాప్యాయతనాని తేషాం
దదర్శ రాజా సుమనోహరాణి ॥ 13
అనంతరం ధర్మరాజు వసువులు, మరుద్గణాలు, అశ్వినీదేవతలు, సూర్య, యమ, కుబేర, విష్ణు, ఇంద్రాదులు, శివ, చంద్ర, సూర్య, వరుణ, సాధ్యగణాలు, బ్రహ్మ, పితృగణ, ప్రమథ గణ రుద్ర, సరస్వతీ, సిద్ధగణాల యొక్క పుణ్యమయ మందిరాలను చూసి, అంతులేని ఆనందం పొందాడు. (11-13)
తేషూపవాసాన్ విబుధానుపోష్య
దత్త్వా చ రత్నాని మహాంతి రాజా ।
తీర్థేషు సర్వేషు పరిప్లుతాంగః
పునః స శూర్పారకమాజగామ ॥ 14
ఆ తీర్థాల్లో నివసిమ్చే బ్రాహ్మణులను వస్త్రరత్నాదులతో సత్కరించి, అక్కడ ఉన్న అన్ని తీర్థాల్లో స్నానం చేసి, తిరిగి మళ్ళీ శూర్పారకక్షేత్రానికి వచ్చాడు. (14)
స తేన తీర్థేన తు సాగరస్య
పునః ప్రయాతః సహ సోదరీయైః ।
ద్విజైః పృథివ్యాం ప్రథితం మహద్భిః
తీర్థం ప్రభాసం సముపాజగామ ॥ 15
అక్కడి నుంచి బయలుదేరి సోదరులతో, భార్యతో సాగరతీర్థాలమార్గంలో ప్రభాసక్షేత్రానికి చేరుకొన్నాడు. అది బ్రాహ్మణుల కారణంగా భుమండలంలో ప్రసిద్ధక్షేత్రం. (15)
తత్రాభిషిక్తః పృథులోహితాక్షః
సహానుజైర్దేవగణాన్ పితౄంశ్చ ।
సంతర్పయామాస తథైవ కృష్ణా
తే చాపి విప్రాః సహ లోమశేన ॥ 16
ఆ తీర్థంలో సోదరులతో కలిసి స్నానం చేసి, ధర్మరాజు దేవతలను, పితరులను ఆరాధించాడు. అదేవిధంగా అతనితో కలిసి యాత్ర చేస్తున్న ద్రౌపది, బ్రాహ్మణులు, లోమశుడు స్నానాంతరం తర్పణాలు విడిచారు. (16)
స ద్వాదశాహం జలవాయుభక్షః
కుర్వన్ క్షపాహస్సు తదాభిషేకమ్ ।
సమంతతోఽగ్నీనుపదీపయిత్వా
తేపే తపో ధర్మభృతాం వరిష్ఠః ॥ 17
ధర్మరాజు పన్నెండురోజులు జలవాయుభక్షణం మాత్రం చేసి రాత్రి, పగటివేళల్లో స్నానం ఆచరిస్తూ అన్నివైపులా అగ్నిని వెలిగించు కొని తపస్సు సలిపాడు. (17)
తముగ్రమాస్థాయ తపశ్చరంతం
శుశ్రావ రామశ్చ జనార్దనశ్చ ।
తౌ సర్వవృష్ణిప్రవరౌ ససైన్యౌ
యుధిష్ఠిరం జగ్మతురాజమీఢమ్ ॥ 18
అదే సమయంలో ప్రభాసతీర్థంలో ధర్మరాజు కఠిన తపస్సు ఆచరిస్తున్నాడని తెలిసిన యాదవప్రముఖులు శ్రీకృష్ణబలరాములు తమ సైన్యాలతో సహా యుధిష్ఠిరుని కలవడానికి వచ్చారు. (18)
తే వృష్ణయః పాండుసుతాన్ సమీక్ష్య
భూమౌ శయానాన్ మలదిగ్ధగాత్రాన్ ।
అనర్హతీం ద్రౌపదీం చాపి దృష్ట్వా
సుదుఃఖితాశ్చుక్రుశురార్తనాదమ్ ॥ 19
ఆ యాదవులు భూమిపై శయనిస్తూ దుమ్ము ధూళి గల శరీరాలు గల పాండవులను, కష్టాలు అనుభవింపదగని ద్రౌపదినీ చూచి మిక్కిలిగా దుఃఖించి ఆర్తనాదాలు చేశారు. (19)
తతః స రామం చ జనార్దనం చ
కార్ ష్ణిం సాంబం చ శినేశ్చ పౌత్రమ్ ।
అన్యాంశ్చ వృష్ణీనుపగమ్య పూజాం
చక్రే యథాధర్మమహీనసత్త్వః ॥ 20
అంతకష్టంలోను ధర్మరాజు శ్రీకృష్ణుని, బలరాముని, ప్రద్యుమ్నుని, సాంబుని, సాత్యకిని ఇతర యాదవ వీరులను పూజించి, ఆదరసత్కారాలు కావించాడు. (20)
తే చాపి సర్వాన్ ప్రతిపూజ్య పార్థాః
తైః సత్కృతాః పాండుసుతైస్తథైవ ।
యుధిష్ఠిరం సంపరివార్య రాజన్
ఉపావిశన్ దేవగణా యథేంద్రమ్ ॥ 21
పాండుపుత్రుల సత్కారాలు పొందిన యాదవులు కూడ ప్రతిగా సత్కారాలు చేశారు. దేవతలు ఇంద్రుని చుట్టు మూగినట్లు ధర్మరాజును వారందరు చుట్టి కూర్చున్నారు. (21)
తేషాం స సర్వం చరితం పరేషాం
వనే చ వాసం పరమప్రతీతః ।
అస్త్రార్థమింద్రస్య గతం చ పార్థం
నివేశనం హృష్టమనాః శశంస ॥ 22
యుధిష్ఠిరుడు వారికి శత్రువుల అపకారాలను, వనవాసాన్ని, అస్త్రసంపాదనకై అర్జునుని ఇంద్రలోకప్రవేశాన్ని ఆనందంతో వివరించాడు. (22)
శ్రుత్వా తు తే తస్య వచః ప్రతీతాః
తాంశ్చాపి దృష్ట్వా సుకృశానతీవ ।
నేత్రోద్భవం సమ్ముముచుర్మహార్హా
దుఃఖార్తిజం వారి మహానుభావాః ॥ 23
ధర్మరాజు మాటలు విని, అతనిని ఊరడించి, పాండవుల దుర్బలతను గమనించి మహానుభావులైన యాదవులు దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తూ కన్నీరు పెట్టారు. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం ప్రభాసే యాదవపాండవసమాగమే అష్టాదశాధికశతతమోఽధ్యాయః ॥ 118 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున యాదవ పాండవ సమాగమము అను నూట పదునెనిమిదవ అధ్యాయము. (118)