121. నూట ఇరువది యొకటవ అధ్యాయము

గయుని ప్రశంస, నర్మదామాహాత్మ్యము, సుకన్యాచ్యవనుల కథ.

లోమశ ఉవాచ
నృగేణ యజమానేన సోమేనేహ పురందరః ।
తర్పితః శ్రూయతే రాజన్ స తృప్తో ముదమభ్యగాత్ ॥ 1
లోమశుడు ఇలా అన్నాడు.
పయోష్ణీనదీ తీరాన నృగుడు యజ్ఞం చేసి సోమరసంతో ఇంద్రుని తృప్తి పరచాడు. ఆ సమయంలో ఇంద్రుడు సంపూర్ణంగా తృప్తిని పొంది, ఆనందంలో మునిగిపోయాడు అని లోకంలో కథ ప్రచారంలో ఉంది. (1)
ఇహ దేవైః సహేంద్రైశ్చ ప్రజాపతిభిరేవ చ ।
ఇష్టం బహువిధైర్యజ్ఞైః మహద్భిర్భూరిదక్షిణైః ॥ 2
ఇచట ఇంద్రసహితులైన దేవతలు, ప్రజాపతులు కూడ అధికదక్షిణలు కల అనేక యజ్ఞాలతో భగవానుని సేవించారు. (2)
ఆమూర్తరయసశ్చేహ రాజా వజ్రధరం ప్రభుమ్ ।
తర్పయామాస సోమేన హయమేధేషు సప్తసు ॥ 3
అమూర్తరయుని పుత్రుడైన గయుడు ఇక్కడే ఏడు అశ్వమేధయాగాలు చేసి సోమరసంతో వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రునికి సంతుష్టిని కలిగించాడు. (3)
తస్య సప్తసు యజ్ఞేసు సర్వమాసీద్ధిరణ్మయమ్ ।
వానస్పత్యం చ భౌమం చ యద్ ద్రవ్యం నియతం మఖే ॥ 4
ఆయన ఏడు యజ్ఞాల్లో మట్టితోను, కర్రలతోను చేసే ద్రవ్యా(పాత్ర)లన్నింటిని బంగారంతో చేయించాడు. (4)
చషాలయూపచమసాః స్థాల్యః పాత్ర్యః స్రుచః స్రువాః ।
తేష్వేవ చాస్య యజ్ఞేషు ప్రయోగాః సప్త విశ్రుతాః ॥ 5
యజ్ఞంలో ప్రధానంగా చషాలం (గోళాకారకాష్ఠం) యూపస్తంభం, పాత్రలు, గిన్నెలు, వండిన సామగ్రిని ఉంచేపాత్రలు, స్రుక్కులు, స్రువాలు అనే ఏడు సాధనాలు వాడతారు. (5)
సప్తైకైకస్య యూపస్య చషాలాశ్చోపరి స్థితాః ।
తస్య స్మ యూపాన్ యజ్ఞేషు భ్రాజమానాన్ హిరణ్మయాన్ ॥ 6
స్వయముత్థాపయామాసుః దేవాః సేంద్రా యుధిష్ఠిర ।
తేషు తస్య మఖాగ్ర్యేషు గయస్య పృథివీపతేః ॥ 7
అమాద్యదింద్రః సోమేన దక్షిణాభిర్ద్విజాతయః ।
ప్రసంఖ్యానానసంఖ్యేయాన్ ప్రత్యగృహ్ణన్ ద్విజాతయః ॥ 8
ధర్మజా! ఒక్కొక్క యూపస్తంభంపై ఏడేసి చషాలాలు ఉంచారు. ఆ యజ్ఞంలో సువర్ణమయయూపస్తంభాలు ఉన్నాయి. ఇంద్రాదులు స్వయంగా వచ్చి నిలబడ్డారు. రాజైన గయుని యజ్ఞంలో ఇంద్రుడు సోమరసంతో, బ్రాహ్మణులు భూరిదక్షిణలతో హర్షోన్మత్తులై కనిపించారు. బ్రాహ్మణులు దక్షిణరూపంగా లెక్కలేనన్ని ధనరాశులను గ్రహించారు. అది ఇంత అని చెప్పటం కష్టం. (6-8)
సికతా వా యథా లోకే యథా వా దివి తారకాః ।
యథా వావర్షతో ధారాః అసంఖ్యేయాః స్మ కేనచిత్ ॥ 9
తథైవ తదసంఖ్యేయం ధనం యత్ ప్రదదౌ గయః ।
సదస్యేభ్యో మహారాజ తేషు యజ్ఞేషు సప్తసు ॥ 10
గయుడు ఆ ఏడుయజ్ఞాల్లో సదస్యులకు ఇచ్చిన ధనం అసంఖ్యాకం. వాటిని లెక్కించటం ఇసుకరేణువుల వలె, నక్షత్రాల వలె, వర్షధారల వలె అసాధ్యం. (9,10)
భవేత్ సంఖ్యేయమేతద్ధి యదేతత్ పరికీర్తితమ్ ।
న తస్య శక్యాః సంఖ్యాతుం దక్షిణా దక్షిణావతః ॥ 11
పైన చెప్పిన ఇసుకరేణువులు ఒకప్పుడు లెక్కింపశక్యం కావచ్చు. కాని భూరిదక్షిణల ధనం లెక్కింపవీలుకాదు. (11)
హిరణ్మయీభిర్గోభిశ్చ కృతాభిర్విశ్వకర్మణా ।
బ్రాహ్మణాంస్తర్పయామాస నానాదిగ్భ్యః సమాగతాన్ ॥ 12
అల్పావశేషా పృథివీ చైత్యైరాసీన్మహాత్మనః ।
గయస్య యజమానస్య తత్ర తత్ర విశాంపతే ॥ 13
అనేకవైపుల నుంచి వచ్చిన బ్రాహ్మణులకు విశ్వకర్మచే తయారుచేయబడిన బంగారు గోవులనిచ్చి సంతుష్టిని కలిగించారు. గయుడు యజమానియై ఆ ఏడుయజ్ఞాలు చేసినప్పుడు నిర్మించిన మందిరాలు లేని భూమి చాల తక్కువగా మిగిలి ఉంది. (12,13)
స లోకాన్ ప్రాప్తవానైంద్రాన్ కర్మణా తేన భారత ।
సలోకతాం తస్య గచ్ఛేత్ పయోష్ణ్యాం య ఉపస్పృశేత్ ॥ 14
భారతా! ఆ యజ్ఞకర్మల ప్రభావంచే అతడు ఇంద్రలోకాలు పొందాడు. ఎవడీ నదిలో స్నానం చేస్తాడో వాడికీ ఇంద్రలోక భోగం కలుగుతుంది. (14)
తస్మాత్ త్వమత్ర రాజేంద్ర భ్రాతృభిః సహితోఽచ్యుత ।
ఉపస్పృశ్య మహీపాల ధూతపాప్మా భవిష్యసి ॥ 15
కావున ధర్మరాజా! నీవు సోదరులతో కలిసి ఇక్కడ స్నానమాచరిస్తే పాపాల నుంచి విముక్తిని పొందుతావు. (15)
వైశంపాయన ఉవాచ
స పయోష్ణ్యాం నరశ్రేష్ఠః స్నాత్వా వై భ్రాతృభిః సహ ।
వైదూర్యపర్వతం చైవ నర్మదాం చ మహానదీమ్ ॥ 16
(ఉద్దిశ్య పాండవశ్రేష్ఠః స ప్రతస్థే మహీపతిః ।)
సమాగమత తేజస్వీ భ్రాతృభిః సహితోఽనఘ ।
తత్రాస్య సర్వాణ్యాచఖ్యౌ లోమశో భగవానృషిః ॥ 17
తీర్థాని రమణీయాని పుణ్యాన్యాయతనాని చ ।
యథాయోగం యథాప్రీతి ప్రయయౌ భ్రాతృభిః సహ ।
తత్ర తత్రాదదాద్ విత్తం బ్రాహ్మణేభ్యః సహస్రశః ॥ 18
వైశంపాయనుడు పలికాడు - ధర్మరాజు సోదరులతో, భార్యతో ఆ పయోష్ణీనదిలో మునిగి, వైడూర్యపర్వతాన్ని, నర్మదానదిని చేరాలని తలంచి, అక్కడి నుంచి బయలుదేరాడు. సోదరులతో కలిసి కొంతకాలానికి ఆ ప్రదేశానికి చేరాడు. లోమశుడు ధర్మజునికి సుందరమైన తీర్థాలను, పవిత్రమైన మందిరాలను పరిచయం చేశాడు. ప్రతిచోట ధర్మరాజు బ్రాహ్మణులకు ధనం దానం చేస్తూనే ఉన్నాడు. (16-18)
లోమశ ఉవాచ
దేవానామేతి కౌంతేయ తథా రాజ్ఞాం సలోకతామ్ ।
వైదూర్యపర్వతం దృష్ట్వా నర్మదామవతీర్య చ ॥ 19
లోమశుడు పలికాడు - కౌంతేయా! వైడూర్యపర్వతం చూసి నర్మదానదిలో దిగి స్నానం చేసి మానవుడు దేవతల, పుణ్యాత్ములైన రాజుల లోకాన్ని చేరుతాడు. (19)
సంధిరేష నరశ్రేష్ఠ త్రేతాయా ద్వాపరస్య చ ।
ఏనమాసాద్య కౌంతేయ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 20
కౌంతేయా! ఈ పర్వతం త్రేతాయుగ, ద్వాపరయుగాల మధ్యలో బయటపడింది. దీన్ని చేరిన మానవుడు పాపాల నుండి బయటపడతాడు. (20)
ఏష శర్యాతియజ్ఞస్య దేశస్తాత ప్రకాశతే ।
సాక్షాద్ యత్రాపిబత్ సోమమ్ అశ్విభ్యాం సహ కౌశికః ॥ 21
నాయనా! ఇది శర్యాతి యజ్ఞం చేసిన ప్రదేశం. దివ్యంగా వెలుగుతోంది. అశ్వినీదేవతలతో కలిసి కౌశికుడు ఇక్కడ ప్రత్యక్షంగా సోమరసం త్రాగాడు. (21)
చుకోప భార్గవశ్చాపి మహేంద్రస్య మహాతపాః ।
సంస్తంభయామాస చ తం వాసవం చ్యవనః ప్రభుః ।
సుకన్యాం చాపి భార్యాం స రాజపుత్రీమవాప్తవాన్ ॥ 22
(నాసత్యౌ చ మహాభాగ కృతవాన్ సోమపీథినౌ ।)
భృగునందనుడైన చ్యవనుడు ఇంద్రునిపై కోపించి అతనిని ఇక్కడ స్తంభింపచేశాడు. రాజపుత్రి సుకన్యను భార్యగా పొందాడు. మునిశ్రేష్ఠుడైన చ్యవనుడు ఇక్కడే అశ్వినీదేవతలను సోమరసంతో సంతృప్తులను గావించాడు. (22)
యుధిష్ఠిర ఉవాచ
కథం విష్టంభితస్తేన భగవాన్ పాకశాసనః ।
కిమర్థం భార్గవశ్చాపి కోపం చక్రే మహాతపాః ॥ 23
యుధిష్ఠిరుడు అడిగాడు - ఏ కారణంగా భార్గవుడైన చ్యవనుడు కోపించి పాకశాసనుని స్తంభింపచేశాడు? (23)
నాసత్యౌ చ కథం బ్రహ్మన్ కృతవాన్ సోమపీథినౌ ।
ఏతత్ సర్వం యథావృత్తమ్ ఆఖ్యాతు భగవాన్ మమ ॥ 24
అశ్వినీదేవతలు ఎలా ఈ యజ్ఞంలో సోమరసాన్ని త్రాగారు? ఇది అంతా నాకు సవివరంగా చెప్పు. (24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌకన్యే ఏకావింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 121 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌకన్యమను నూట ఇరువది ఒకటవ అధ్యాయము. (121)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 25 శ్లోకాలు.)