107. నూట ఏడవ అధ్యాయము
నగరపుత్రులు కపిలక్రోధాగ్నిలో నశించుట. అంశుమంతు డు సగరయజ్ఞమును పూర్తిచేయుట.
లోమశ ఉవాచ
ఏతచ్ర్ఛుత్వాంతరిక్షాచ్చ స రాజా రాజసత్తమః ।
యథోక్తం తచ్చకారాథ శ్రద్దధద్ భరతర్షభ ॥ 1
లోమశుడు అన్నాడు.
ఆకాశం నుంచి అశరీరవాణి మాటలు విని సగరుడు దాన్ని విశ్వాసంతో అనుసరించాడు. (1)
ఏకైకశస్తతః కృత్వా బీజం బీజం నరాధిపః ।
ఘృతపూర్ణేషు కుంభేషు తాన్ భాగాన్ విదధే తతః ॥ 2
సగరుడు ఒక్కొక్క బీజాన్ని వేరుచేసి నేతితో నింపిన కుండలలో వాటిని ఉంచాడు. (2)
ధాత్రీశ్చైకైకశః ప్రాదాత్ పుత్రరక్షణతత్పరః ।
తతః కాలేన మహతా సముత్తస్థుర్మహాబలాః ॥ 3
షష్టిః పుత్రసహస్రాణి తస్యాప్రతిమతేజసః ।
రుద్రప్రసాదాద్ రాజర్షేః సమజాయంత పార్థివ ॥ 4
పుత్రుల సంరక్షణకు వేరువేరుగా దాదులను నియమించాడు. చాలాకాలానికి సాటిలేని బలవంతులు అయిన కుమారులు పుట్టారు. తేజోవంతుడైన సగరునికి రుద్రుని అనుగ్రహం వల్ల అరవైవేలమంది కుమారులు కలిగారు. (3,4)
తే ఘోరాః క్రూరకర్మాణః ఆకాశపరిసర్పిణః ।
బహుత్వాచ్చావజానంతః సర్వాన్ లోకాన్ సహామరాన్ ॥ 5
వారు కఠినులు, ఆకాశా సంచరించగల వారు, క్రూరకర్మలు చేసేవారు. ఎక్కువమంది అగుటచే దేవతలతో సహా లోకాలన్నింటిని అవహేళన చేయసాగారు. (5)
త్రిదశాంశ్చాప్యబాధంత తథా గంధర్వరాక్షసాన్ ।
సర్వాణి చైవ భూతాని శూరాః సమరశాలినః ॥ 6
యుద్ధభూమిలో శోభించే ఆ రాజకుమారులు దేవతలను, గంధర్వులను, రాక్షసులను ప్రాణులు అందరినీ మిక్కిలి బాధించారు. (6)
వధ్యమానాస్తతో లోకాః సాగరైర్మందబుద్ధిభిః ।
బ్రహ్మాణం శరణం జగ్ముః సహితాః సర్వదైవతైః ॥ 7
అల్పబుద్ధులైన నగరపుత్రులచే బాధింపబడిన జనులు దేవతలతో కలిసి బ్రహ్మను శరణుకోరారు. (7)
తానువాచ మహాభాగః సర్వలోకపితామహః ।
గచ్ఛధ్వం త్రిదశాః సర్వే లోకైః సార్ధం యథాగతమ్ ॥ 8
సర్వలోకసృష్టికర్త, మహాభాగుడు అయిన బ్రహ్మ "మీరందరు ఎలా, ఎవరితో వచ్చారో అలా, వారితో మీ మీస్థానాలకు తిరిగివెళ్ళండి. (8)
నాతిదీర్షేన కాలేన సాగరాణాం క్షయో మహాన్ ।
భవిష్యతి మహాఘోరః స్వకృతైః కర్మభిః సురాః ॥ 9
కొద్దిరోజులలో వారు ఆచరించిన అపరాధాలచే మిక్కిలి కఠినులయిన సగరపుత్రులు నాశనం కాగలరు. (9)
ఏవముక్తాస్తు తే దేవాః లోకాశ్చ మనుజేశ్వర ।
పితామహమనుజ్ఞాప్య విప్రజగ్ముర్యతాగతమ్ ॥ 10
బ్రహ్మమాట విన్న జనులు, దేవతలు ఆయన అనుమతి గైకొని తమ తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళారు. (10)
తతః కాలే బహుతిథే వ్యతీతే భరతర్షభ ।
దీక్షితః సగరో రాజా హయమేధేన వీర్యవాన్ ॥ 11
చాలకాలం గడచిన పిదప పరాక్రమవంతుడైన సగరుడు అశ్వమేధయజ్ఞదీక్ష స్వీకరించాడు. (11)
తస్యాశ్వో వ్యచరద్ భూమిం పుత్రైః స పరిరక్షితః ।
(సర్వైరేవ మహోత్సాహైః స్వచ్ఛందప్రచరో నృప ।)
సముద్రం స సమాసాద్య నిస్తోయం భీమదర్శనమ్ ॥ 12
రక్ష్యమాణః ప్రయత్నేన తత్రైవాంతరధీయత ।
తత సాగరాస్తాత హృతం మత్వా హయోత్తమమ్ ॥ 13
ఆగమ్య పితురాచఖ్యుః అదృశ్యం తురగం హృతమ్ ।
తేనోక్తా దిక్షు సర్వాసు సర్వే మార్గత వాజినమ్ ॥ 14
(ససముద్రవనద్వీపాం విచరంతః వసుంధరామ్ ।)
అతని యజ్ఞాశ్వం ఉత్సాహవంతులు అయిన అతని పుత్రులచే సంరక్షింపబడుతూ స్వేచ్ఛగా భూమిపై తిరిగి జలశూన్య మయిన సముద్రతీరానికి వచ్చింది. ప్రయత్నపూర్వకంగా రక్షింపబడుతున్నా ఆ గుర్రం అక్కడే అంతర్ధానం అయ్యింది. శ్రేష్ఠాశ్వం అపహరింపబడినట్లు భావించి సగరపుత్రులు తండ్రి వద్దకు చేరి వృత్తాంతాన్ని నివేదించారు. అతని ఆజ్ఞపై అన్ని దిక్కులా గుర్రంకోసం వెతకటం ప్రారంభించారు. (12-14)
తతస్తే పితురాజ్ఞాయ దిక్షు సర్వాసు తం హయమ్ ।
అమార్గంత మహారాజ సర్వం చ పృథివీతలమ్ ॥ 15
తతస్తే సాగరాః సర్వే సముపేత్య పరస్పరమ్ ।
నాధ్యగచ్ఛంత తురగమ్ అశ్వహర్తారమేవ చ ॥ 16
సప్తసముద్ర వన ద్వీప సహితంగా భూమినంతటిని వెదికారు. తండ్రి ఆజ్ఞను గ్రహించి అన్నిదిక్కులా అశ్వంకోసం వెదికారు. సగరపుత్రులందరు పరస్పరం కలిశారు గాని గుఱ్ఱం జాడగాని, గుఱ్ఱాన్ని అపహరించినవాని జాడగాని తెలుసుకోలేకపోయారు. (15,16)
ఆగమ్య పితరం చోచుః తతః ప్రాంజలయోఽగ్రతః ।
ససముద్రవనద్వీపా సనదీనదకందరా ॥ 17
సపర్వతవనోద్దేశా నిఖీలేన మహీ నృప ।
అస్మాభిర్విచితా రాజన్ శాసనాత్ తవ పార్థివ ॥ 18
న చాశ్వమధిగచ్ఛామః నాశ్వహర్తారమేవ చ ।
శ్రుత్వా తు వచనం తేషాం స రాజా క్రోధమూర్ఛితః ॥ 19
ఉవాచ వచనం సర్వాన్ తదా దైవవశాన్నృప ।
అనాగమాయ గచ్ఛధ్వం భూయో మార్గత వాజినమ్ ॥ 20
యజ్ఞియం తం వినా హ్యశ్వం నాగంతవ్యం హి పుత్రకాః ।
ప్రతిగృహ్య తు సందేశం పితుస్తే సగరాత్మజాః ॥ 21
భూయ ఏవ మహీం కృత్స్నాం విచేతుముపచక్రముః ।
అథాపశ్యంత తే వీరాః పృథివీమవదారితామ్ ॥ 22
తిరిగి వచ్చి, తండ్రికి నమస్కరించి, ఎదుట నిలబడి 'సముద్రవనసహితం, నదీనదగుహలతో సహా పర్వతవన ప్రాంతాలతో కూడిన భూమి అంతా నీ ఆజ్ఞతో మేము వెదికాము. అశ్వాన్నిగాని, అశ్వచోరునిగాని పట్టుకోలేకపోయాం" అన్నారు. ఈ మాటలు విన్న రాజు కోపంతో వివేకం కోల్పోయాడు. దైవవశంగా వారందరితో సగరుడు ఇలా అన్నాడు 'గుఱ్ఱాన్ని వెదకండి, దొరకేవరకు తిరిగిరావద్దు. యజ్ఞాశ్వం లేకుండా ఇంటికి రావద్దు' తండ్రి ఆజ్ఞానుసారం సాగరులు తిరిగి భూమిని అంతటిని వెదకటం ప్రారంభించారు. ఒక చోట భూమిపై ఏర్పడిన బిలాన్ని చూశారు. (17-22)
సమాసాద్య బిలం తచ్చాప్యఖనన్ సగరాత్మజాః ।
కుద్దాలైర్హ్రేషుకైశ్చైవ సముద్రం యత్నమాస్థితాః ॥ 23
ఆ బిలప్రదేశానికి వచ్చి సగరపుత్రులందరు గునపాలు, పారలతో సముద్రాన్ని త్రవ్వడానికి ప్రయత్నం చేశారు. (23)
స ఖన్యమానః సహితైః సాగరైర్వరుణాలయః ।
అగచ్ఛత్ పరమామార్తిం దీర్యమాణః సమంతతః ॥ 24
అసురోరగరక్షాంసి సత్త్వాని వివిధాని చ ।
ఆర్తనాదమకుర్వంత వధ్యమానాని సాగరైః ॥ 25
వారందరు త్రవ్విన సముద్రం అన్నివైపుల నుంచి ఎంతో బాధను అనుభవించింది. సగరపుత్రులచే చంపబడిన రాక్షసులు, సర్పాలు, అసురులు, మిగిలిన ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. (24,25)
ఛిన్నశీర్షా విదేహాశ్చ భిన్నత్వగస్థిసంధయః ।
ప్రాణినః సమదృశ్యంత శతశోఽథ సహస్రశః ॥ 26
తలలు తెగి, శరీరం ఛిన్నాభిన్నమై, ఎముకలు, సంధులు ఊడిన ప్రాణులు ఎన్నో వందలకొద్దీ కనిపించాయి. (26)
ఏవం హి ఖనతాం తేషాం సముద్రం వరుణాలయమ్ ।
వ్యతీతః సుమహాన్ కాలః న చాశ్వః సమదృశ్యత ॥ 27
వరుణనివాసమయిన సముద్రం త్రవ్వుతుండగనే చాలా సమయం గడచింది. అశ్వం మాత్రం కనిపించలేదు. (27)
తతః పూర్వోత్తరే దేశే సముద్రస్య మహీపతే ।
విదార్య పాతాలమథ సంక్రుద్ధాః సగరాత్మజాః ॥ 28
అపశ్యంత హయం తత్ర విచరంతం మహీతలే ।
కపిలం చ మహాత్మానం తేజోరాశిమనుత్తమమ్ ।
తేజసా దీప్యమానం తు జ్వాలాభిరివ పావకమ్ ॥ 29
సాగరులు మిక్కిలి కోపించి, సముద్రపు ఈశాన్యదేశాన చీల్చి, పాతాళం చేరి, అక్కడ తిరుగుతున్న గుర్రాన్ని చూచారు. తేజోవంతుడై, కాంతితో అగ్నిజ్వాలల వలె ప్రకాశిమ్చే కపిలుని చూశారు. (28,29)
తే తం దృష్ట్వా హయం రాజన్ సంప్రహృష్టతనూరుహాః ।
అనాదృత్య మహాత్మానం కపిలం కాలచోదితాః ॥ 30
సంక్రుద్ధాః సంప్రధావంత అశ్వగ్రహణకాంక్షిణః ।
తతః క్రుద్ధో మహారాజ కపిలో మునిసత్తమః ॥ 31
రాజా! వారు ఆ గుర్రాని చూసి, సంతోషంతో గగుర్పాటును పొంది, కపిల మహర్షిని లెక్కచేయక, కోపించి, గుర్రాన్ని పట్టుకోవాలని పరుగులు తీశారు. దానితో మునివర్యుడైన కపిలుడు కోపించాడు. (30,31)
వాసుదేవేతి యం ప్రాహుః కపిలం మునిపుంగవమ్ ।
స చక్షుర్వికృతం కృత్వా తేజస్తేషు సముత్సృజన్ ॥ 32
దదాహ సుమహాతేజాః మందబుద్ధీన్ స సాగరాన్ ।
వాసుదేవుడు అని అందరూ ఎవరిని కీర్తిస్తున్నారో అతడు కపిలుడు. అతడు కోపించి వారందరిపై తన కంటి తేజస్సును విడచాడు. మందబుద్ధిగలవారిని అందరిని కపిలుడు భస్మం చేశాడు. (32 1/2)
తాన్ దృష్ట్వా భస్మసాద్ భూతాన్ నారదః సుమహాతపాః ॥ 33
సగరాంతికమాగచ్ఛత్ తచ్చ తస్మై న్యవేదయత్ ।
స తచ్ర్ఛుత్వా వచో ఘోరం రాజా మునిముఖోద్గతమ్ ॥ 34
ముహూర్తం విమనా భూత్వా స్థాణోర్వాక్యమచింతయత్ ।
(స పుత్రనిధనోద్భూతదుఃఖేన సమభిప్లుతః ।
ఆత్మానమాత్మనాఽఽశ్వాస్య హయమేవాన్వచింతయత్ ॥)
అంశుమంతం సమాహూయ అసమంజః సుతం తదా ॥ 35
పౌత్రం భరతశార్దూల ఇదం వచనమబ్రవీత్ ।
షష్టిస్తాని సహస్రాణి పుత్రాణామమితౌజసామ్ ॥ 36
కాపిలం తేజ ఆసాద్య మత్కృతే నిధనం గతాః ।
తవ చాపి పితా తాత పరిత్యక్తో మయానఘ ।
ధర్మం సంరక్షమాణేన పౌరాణాం హితమిచ్ఛతా ॥ 37
అంతలో మహాతపస్వి నారదుడు సగరుని సమీపానికి వచ్చి జరిగిన వృత్తాంతాన్ని నివేదించాడు. నారదముని నోటి నుంచి వెలువడిన ఆ ఘోరవార్తను విని సగరుడు కొద్దిసేపు మనసు అదుపు తప్పి శంకరుని మాటలను గుర్తుచేసుకోసాగాడు.
రాజా! సగరుడు అసమంజసుని కొడుకూ, తన మనుమడూ అయిన అంశుమంతుని పిలిచి ఇలా అన్నాడు.
'నా కొరకు నా పుత్రులందరు కపిలుని తేజస్సులో బూడిద అయ్యారు. పౌరుల రక్షణకోసం ధర్మాన్ని రక్షించే నేను నీ తండ్రిని కూడ విడచిపెట్టాను.' (33-37)
యుధిష్ఠిర ఉవాచ
కిమర్థం రాజశార్దూలః సగరః పుత్రమాత్మజమ్ ।
త్యక్తవాన్ దుస్త్యజం వీరం తన్మే బ్రూహి తపోధన ॥ 38
అపుడు యుధిష్టిరుడు అడిగాడు. 'ఏ కారణంగా సగరుడు విడువవీలుకాని పుత్రుని విడచిపెట్టాడో నాకు చెప్పు.' (38)
లోమశ ఉవాచ
అసమంజా ఇతి ఖ్యాతః సగరస్య సుతో హ్యభూత్ ।
యం శైబ్యా జనయామాస పౌరాణాం స హి దారకాన్ ॥ 39
(క్రీడతః సహసాఽఽసాద్య తత్ర తత్ర మహీపతే ।)
గలేషు క్రోశతో గృహ్య నద్యాం చిక్షేప దుర్బలాన్ ।
తతః పౌరాః సమాజగ్ముః భయశోకపరిప్లుతాః ॥ 40
సగరం చాభ్యభాషంత సర్వే ప్రాంజలయః స్థితాః ।
త్వం నస్త్రాతా మహారాజ పరచక్రాదిభిర్భయాత్ ॥ 41
లోమశుడు చెప్పాడు.
శైబ్యవలన సగరునికి అసమంజసుడు అనే కుమారుడు కలిగాడు. అతడు పౌరులబిడ్డలను ఆటలలో శీఘ్రంగా అందుకొని మెడలు పట్టి నదిలోనికి విసరివేసేవాడు. పౌరులందరు భయంలో, శోకంలో మునిగిపోయి ఒకసారి సగరుని వద్దకు వచ్చారు. పౌరులందరు దోసిలి ఘటించి సగరునితో విన్నవించుకున్నారు. 'మీరు పరసేనల నుండి మమ్ము రక్షించేవారు. (39-41)
అసమంజో భయాద్ ఘోరాత్ తతో నస్ర్తాతుమర్హసి ।
పౌరాణాం వచనం శ్రుత్వా ఘోరం నృపతిసత్తమః ॥ 42
ముహూర్తం విమనా భూత్వా సచివానిదమబ్రవీత్ ।
అసమంజాః పురాదద్య సుతో మే విప్రవాస్యతామ్ ॥ 43
అసమంజసుని వలన కలిగిన ఘోరభయం నుండి మీరే రక్షించాలు.' పౌరుల మాటలు విన్న నృపశ్రేష్ఠుడు సగరుడు రెండు ఘడియల పాటు కలవరపడి మంత్రులతో ఇలా అన్నాడు. 'ఈ నగరం నుండి నా పుత్రుడు అసమంజసుని వెడలగొట్టండి. (42,43)
యది వో మత్ర్పియం కార్యమ్ ఏతచ్ఛీఘ్రం విధీయతామ్ ।
ఏవముక్తా నరేంద్రేణ సచివాస్తే నరాధిప ॥ 44
యథోక్తం త్వరితాశ్చక్రుః యథాఽఽజ్ఞాపితవాన్ నృపః ।
ఏతత్ తే సర్వమాఖ్యాతం యథా పుత్రో మహాత్మనా ॥ 45
పౌరాణాం హితకామేన సగరేణ వివాహితః ।
అంశుమాంస్తు మహేష్వాసః యదుక్తః సగరేణ హి ।
తత్ తే సర్వం ప్రవక్ష్యామి కీర్త్యమానం నిబోధ మే ॥ 46
మీరు నా హితాన్ని కోరితే ఈ పనిని వెంటనే ఆచరించండి' రాజు మాటలు విన్న మంత్రులందరు రాజాజ్ఞానుసారం దానిని ఆచరించారు. పౌరుల హితంకోరిన సగరుడు పుత్రుని వెడలగొట్టినాడు. ఆ సమయాన సగరుడు అంశుమంతునితో అన్న పలుకులు వినిపిస్తాను విను. (44-46)
సగర ఉవాచ
పితుశ్చ తేఽహం త్యాగేన పుత్రాణాం నిధనేన చ ।
అలాభేన తథాశ్వస్య పరితప్యామి పుత్రక ॥ 47
సగరుడు అన్నాడు. నీ జనకుని త్యాగం చేతనూ ఇతర కుమారుల మరణంచే తనూ అశ్వం లభింపకపోవటంచే తనూ బాధపడుతున్నాను. (47)
తస్మాద్ దుఃఖాభిసంతప్తం యజ్ఞవిఘ్నాచ్చ మోహితమ్ ।
హయస్యానయనాత్ పౌత్ర నరకాన్మాం సముద్ధర ॥ 48
యజ్ఞ విఘ్నంచే వివేకం కోల్పోయి దుఃఖం అనుభవిస్తున్న నాకు అశ్వాన్ని తీసుకొని వచ్చి ఇచ్చి, నాకు నరకగతి లేకుండా చూడు. (48)
అంశుమానేవముక్తస్తు సగరేణ మహాత్మనా ।
జగామ దుఃఖాత్ తం దేశం యత్ర వై దారితా మహీ ॥ 49
అంశుమంతుడు సగరుని పలుకులు విని దుఃఖంతో తనతండ్రులచే భూమి చీల్చబడినచోటుకు చేరాడు. (49)
స తు తేనైవ మార్గేణ సముద్రం ప్రవివేశ హ ।
అపశ్యచ్చ మహాత్మానం కపిలం తురగం చ తమ్ ॥ 50
అతడు ఆ మార్గంలోనే సముద్రంలోకి ప్రవేశించాడు. అక్కడ తాపసి కపిలుని, ఆ యజ్ఞాశ్వాన్నీ చూశాడు. (50)
స దృష్ట్వా తేజసో రాశిం పురాణమృషిసత్తమమ్ ।
ప్రణమ్య శిరసా భూమౌ కార్యమస్మై న్యవేదయత్ ॥ 51
తేజోరాశి, మునిశ్రేష్ఠుడు, ప్రాచీన కాలంనాటి ఋషి అయిన కపిలుని చూచి శిరసు భూమిపై ఆన్చి నమస్కరించి వచ్చిన పనిని తెలియజేశాడు. (51)
తతః ప్రీతో మహారాజ కపిలోంఽశుమతోఽభవత్ ।
ఉవాచ చైనం ధర్మాత్మా వరదోఽస్మీతి భారత ॥ 52
సంతోషంలో మునిగిన కపిలుడు ప్రసన్నుడై "నేను నీకు వరం ఇవ్వాలి అని అనుకొంటున్నాను" అన్నాడు. (52)
స వవ్రే తురగం తత్ర ప్రథమం యజ్ఞకారణాత్ ।
ద్వితీయం వరకం వవ్రే పితౄణాం పావనేచ్ఛయా ॥ 53
యజ్ఞసమాప్తికై ముందుగా అశ్వాన్ని ఇమ్మని ప్రార్థించాడు. పితరులను తరింపతలచి రెండవవరాన్ని కూడా కోరాడు. (53)
తమువాచ మహాతేజాః కపిలో మునిపుంగవః ।
దదాని తవ భద్రం తే యద్ యత్ ప్రార్థయసేఽనఘ ॥ 54
త్వయి క్షమా చ ధర్మశ్చ సత్యం చాపి ప్రతిష్ఠితమ్ ।
త్వయా కృతార్థః సగరః పుత్రవాంశ్చ త్వయా పితా ॥ 55
మునిశ్రేష్ఠుడైన కపిలుడు "నీకు శుభాన్ని, నీవు కోరిన వరాలను ఇస్తాను" నీలో ఓర్పు, ధర్మం, సత్యపాలనం ఉన్నాయి. నీచే సగరౌడు కృతార్థుడు అయ్యాడు. నీ తండ్రి నీ కారణంగా పుత్రవంతుడు అయినాడు అని భావిస్తున్నాను. (54,55)
తవ చైవ ప్రభావేణ స్వర్గం యాస్యంతి సాగరాః ।
(శలభత్వం గతా హ్యేతే మమ క్రోధహుతాశనే।)
పౌత్రాశ్చ తే త్రిపథగాం త్రిదివాదానయిష్యతి ॥ 56
పావనార్థం సాగరాణాం తోషయిత్వా మహేశ్వరమ్ ।
హయం నయస్వ భద్రం తే యజ్ఞియం నరపుంగవ ॥ 57
నీ మహిమచేతనే సగరపుత్రులు అందరు స్వర్గానికి చేరుతారు. నా క్రోధాగ్నిలో మిడుతలవలె నీ తండ్రులు మాడిపోయారు. నీ మనుమడు స్వర్గం నుంచి గంగను తీసుకొని రాగలడు. తపస్సుచే శంకరుని సంతోషపెట్టి వారిని తరింపచేస్తాడు. యజ్ఞాశ్వాన్ని తీసుకొని వెళ్ళు. నీకు మేలు కలుగుతుంది" అన్నాడు. (56,57)
యజ్ఞః సమాప్యతాం తాత సగరస్య మహాత్మనః ।
అంశుమానేవముక్తస్తు కపిలేన మహాత్మనా ॥ 58
ఆజగామ హయం గృహ్య యజ్ఞవాటం మహాత్మనః ।
సోఽభివాద్య తతః పాదౌ సగరస్య మహాత్మనః ॥ 59
మూర్ధ్ని తేనాప్యుఘ్రాతః తస్మై సర్వం న్యవేదయత్ ।
యథా దృష్టం శ్రుతం చాపి సాగరాణాం క్షయం తథా ॥ 60
తం చాస్మై హయమాచష్ట యజ్ఞవాటముపాగతమ్ ।
తచ్ర్ఛుత్వా సగరో రాజా పుత్రజం దుఃఖమత్యజత్ ॥ 61
అంశుమంతుడు గుఱ్ఱాన్ని తీసుకొని యజ్ఞశాలకు వచ్చి సగరుని పాదాలకు నమస్కరించాడు. శిరస్సుపై తాకి చుంబించిన అతడు పూర్తివృత్తాంతాన్ని సగరపుత్రుల నాశాన్ని విన్నది విన్నట్లు, చూసింది చూసినట్లు వివరించాడు. అశ్వం యజ్ఞశాల చేరింది అని చెప్పాడు. అది విన్న సగరుడు పుత్రులను కోల్పోయిన దుఃఖాన్ని మరచిపోయాడు. (58-61)
అంశుమంతం సంపూజ్య సమాపయత తం క్రతుమ్ ।
సమాప్తయజ్ఞః సగరః దేవైః సర్వైః సభాజితః ॥ 62
అంశుమంతుని ప్రశంసించి సగరుడు యజ్ఞాన్ని పూర్తిచేశాడు. యజ్ఞాన్ని ఆచరించిన అతడు దేవతలందరిచే సత్కరింపబడినాడు. (62)
పుత్రత్వే కల్పయామాస సముద్రం వరుణాలయమ్ ।
ప్రశాస్య సుచిరం కాలం రాజ్యం రాజీవలోచనః ॥ 63
పౌత్రే భారం సమావేశ్య జగామ త్రిదివం తదా ।
అంశుమానపి ధర్మాత్మా మహీం సాగరమేఖలామ్ ॥ 64
ప్రశశాస మహారాజ యథైవాస్య పితామహః ।
తస్య పుత్రః సమభవద్ దిలీపో నామ ధర్మవిత్ ॥ 65
కమలనేత్రుడయిన సగరుడు సముద్రాన్నే తన పుత్రునిగా భావించాడు. చిరకాలం రాజ్యాన్ని పరిపాలించాడు. అంశుమంతునిపై రాజ్యభారం ఉంచి స్వర్గం చేరాడు. ధర్మాత్ముడైన అంశుమంతుడు సాగరంచే చుట్టబడిన భూమిని అంతటినీ సగరుని వలెనే శాసించాడు. అతనికి ధర్మవేత్త అయిన దిలీపుడు అనే కుమారుడు పుట్టాడు. (63-65)
తస్మై రాజ్యం సమాధాయ అంశుమానపి సంస్థితః ।
దిలీపస్తు తతః శ్రుత్వా పితౄణాం నిధనం మహత్ ॥ 66
పర్యతప్యత దుఃఖేన తేషాం గతిమచింతయత్ ।
గంగావతరణే యత్నం సుమహచ్చాకరోన్నృపః ॥ 67
దిలీపునికి రాజ్యం అప్పగించి, అంశుమంతుడు కూడ స్వర్గానికి చేరాడు. దిలీపుడు పితరుల మరణవార్తను విని మిక్కిలి దుఃఖంతో తపించి వారికి ఉత్తమగతులు కలగడం కోసం ఆలోచించాడు. గంగను భూమిపై దింపుటకు గొప్పప్రయత్నం చేశాడు. (66,67)
న చావతారయామాస చేష్టమానో యథాబలమ్ ।
తస్య పుత్రః సమభవత్ శ్రీమాన్ ధర్మపరాయణః ॥ 68
భగీరథ ఇతి ఖ్యాతః సత్యవాగనసూయకః ।
అభిషిచ్య తు తం రాజ్యే దిలీపో వనమాశ్రితః ॥ 69
(భగీరథం మహాత్మానం సత్యధర్మపరాయణమ్ ।)
తాను యథాశక్తిగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అతనికి ధర్మపరాయణుడు తేజోమూర్తి, శ్రీమంతుడు అయిన భగీరథుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి పట్టాభిషేకం చేసి దిలీపుడు వానప్రస్థానికి చేరాడు. (68,69)
తపః సిద్ధిసమాయోగాత్ స రాజ్ భరతర్షభ ।
వనాజ్జగామ త్రిదివం కాలయోగేన భారత ॥ 70
తపస్సు వలన కలిగిన సిద్ధులచే ఆ దిలీపుడు కొంతకాలానికి వానప్రస్థం నుంచి స్వర్గానికి చేరుకొన్నాడు. (70)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యమాహాత్మ్యకథనే సప్తాధికశతతమోఽధ్యాయః ॥ 107 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో అగస్త్యమాహాత్మ్యము అను నూట ఏడవ అధ్యాయము. (107)
(దాక్షిణాత్య అధికపాఠం 3 1/2 శ్లోకాలతో కలిపి 73 1/2 శ్లోకాలు)