108. నూట యెనిమిదవ అధ్యాయము
భగీరథుడు తపస్సు చేయుట, గంగను భరించుటకు శంకరుని కోరుట.
లోమశ ఉవాచ
స తు రాజా మహేష్వాసః చక్రవర్తీ మహారథః ।
బభూవ సర్వలోకస్య మనోనయననందనః ॥ 1
లోమశుడు చెప్పాడు - అందరి మనస్సులకు, నేత్రాలకు ఆనందాన్ని ప్రసాదించగ్ల అతడు చక్రవర్తిగా, మహాధన్విగా, మహారథుడుగా ప్రశంసలు పొందాడు. (1)
స శుశ్రావ మహాబాహుః కపిలేన మహాత్మనా ।
పితౄణాం నిధనం ఘోరమ్ అప్రాప్తిం త్రిదివస్య చ ॥ 2
స రాజ్యం సచివే న్యస్య హృదయేన విదూయతా ।
జగామ హిమవత్పార్శ్యం తపస్తప్తుం నరేశ్వర ॥ 3
కలిప్లుని కారణంగా తన పితృదేవతలకు కలిగిన నాశాన్ని, స్వర్గపాప్ర్తి లేకపోవటమూ సంపూర్ణంగా విన్నాడు. మంత్రులపై రాజ్యభారం ఉంచి బాధపడుతూ హిమాలయం చరియలకు తపస్సు చేయటానికి వెళ్ళాడు. (2,3)
ఆరిరాధయుషుర్గంగాం తపసా దగ్ధకిల్బిషః ।
సోఽపశ్యత నరశ్రేష్ఠ హిమవంతం నగోత్తమమ్ ॥ 4
శృంగైర్బహువిధాకారైః ధాతుమద్భిరలంకృతమ్ ।
పవనాలంబిభిర్మేఘైః పరిషిక్తం సమంతతః ॥ 5
తపస్సుచే పాపాలు పోగొట్టుకొని, గంగను ఆరాధించటానికి భగీరథుడు ముందు హిమవంతుని దర్శించాడు. గైరికాది ధాతువులచే ప్రకాశిస్తూ, అనేక శిఖరాలతో, గాలి ఆధారంగా పర్వతం నలువైపులా కదలుతున్న మేఘాలతో నిండిన హిమాలయాన్ని చూశాడు. (4,5)
నదీకుంజనితంబైశ్చ ప్రాసాదైరుపశోభితమ్ ।
గుహాకందరసంలీనసింహవ్యాఘ్రనిషేవితమ్ ॥ 6
ఆ పర్వతం నదులు, పొదలు, తీరాలు, మందిరాలతో నిండి ఉంది. గుహలు, కందరాలలో సింహాలు, వ్యాఘ్రలు దాగి ఉన్నాయి. (6)
శకునైశ్చ విచిత్రాంగైః కూజద్భిర్వివిధా గిరః ।
భృంగరాజైస్తథా హంసైః దాత్యూహైర్జలకుక్కుటైః ॥ 7
మయూరైః శతపత్రైశ్చ జీవంజీవకకోకిలైః ।
చకోరైరసితాపాంగైః తథా పుత్రప్రియైరపి ॥ 8
ఆ పర్వతం మీద విచిత్ర వర్ణాలతో కూడిన శరీరాలతో, ఎన్నో కూతలు కూస్తూ చాలా పక్షులు ఉన్నాయి. వాటిలో తుమ్మెదలు, హంసలు, చాతకాలు, నీటికోళ్లు, నెమళ్లు, బెగ్గురులు, కొంగలు, కోకిలలు, నల్లని క్రీగన్నులు కల చకోరాలు, పుత్రప్రియలు కూడా ఉన్నాయి. (7,8)
జలస్థానేషు రమ్యేషు పద్మినీభిశ్చ సంకులమ్ ।
సారసానాం చ మధురైః వ్యాహృతైః సమలంకృతమ్ ॥ 9
సుందరజలాశయాలు తామరతీగలతో నిండి ఉన్నాయి. బెగ్గురుపక్షుల మధురధ్వనులతో అది మారుమ్రోగుతోంది. (9)
కిన్నరైరప్సరోభిశ్చ నిషేవితశిలాతలమ్ ।
దిగ్వారణవిషాణాగ్రైః సమంతాద్ ధృష్టపాదపమ్ ॥ 10
కిన్నరులు, అప్సరసలు రాళ్లపై కూర్చుని ఉన్నారు. దిగ్గజదంతాలతో చెట్లు అన్నివైపులా రాచుకొనబడుతూ కనిపించాయి. (10)
విద్యాధరానుచరితం నానారత్నసమాకులమ్ ।
విషోల్బణభుజంగైశ్చ దీప్తజిహ్వైర్నిషేవితమ్ ॥ 11
ఒక వైపు రత్నాలు, మరొకవైపు విద్యాధరులు విషాన్ని గ్రక్కుతూ భుజంగాలు నాలుకలు చాచి ఆ ప్రదేశంలో తిరుగుతున్నాయి. (11)
క్వచిత్ కనకసంకాశం క్వచిద్ రజతసన్నిభమ్ ।
క్వచిదంజనపుంజాభం హిమవంతముపాగమత్ ॥ 12
ఒక చోట బంగారపు రంగు, మరొకచోట వెండిరంగు, మరొక చోట కాటుకరంగుతో సమానమైన హిమాలయాన్ని భగీరథుడు చేరాడు. (12)
స తు తత్ర నరశ్రేష్ఠః తపో ఘోరం సమాశ్రితః ।
ఫలమూలాంబుసంభక్షః సహస్రపరివత్సరాన్ ॥ 13
ఆ రాజు చాలా వేల సంవత్సరాలు ఫలాలు, దుంపలు, నీరు భక్షించి తపస్సు చేశాడు. (13)
సంవత్సరసహస్రే తు గతే దివ్యే మహానదీ ।
దర్శయామాస తం గంగా తదా మూర్తిమతీ స్వయమ్ ॥ 14
దేవతల వేయిసంవత్సరాలు గడవగా మహానది గంగ ఆకారం దాల్చి అతని ముందు ప్రత్యక్షం అయింది. (14)
గంగోవాచ
కిమిచ్ఛసి మహారాజ మత్తః కిం చ దదాని తే ।
తద్ బ్రవీహి నరశ్రేష్ఠ కరిష్యామి వచస్తవ ॥ 15
గంగ పలికింది - నా నుంచి ఏమి ఆశిస్తున్నావు? నీకేమి ఈయగలను? అడుగు. నీమాటల్ని ఆచరిస్తా. (15)
ఏవముక్తః ప్రత్యువాచ రాజా హైమవతీం తదా ।
(నదీం భగీరథో రాజన్ ప్రణిపత్య కృతాంజలిః ।)
పితామహా మే వరదే కపిలేన మహానది ॥ 16
అన్వేషమాణాస్తురగం నీతా వైవస్వతక్షయమ్ ।
షష్టిస్తాని సహస్రాణి సాగరాణాం మహాత్మనామ్ ॥ 17
కపిలం దేవమాసాద్య క్షణేన నిధనం గతాః ।
తేషామేవం వినష్టానాం స్వర్గే వాసో న విద్యతే ॥ 18
యావత్ తాని శరీరాణి త్వం జలైర్నాభిషించసి ।
తావత్ తేషాం గతిర్నాస్తి సాగరాణాం మహానది ॥ 19
స్వర్గం నయ మహాభాగే మత్పితౄన్ సగరాత్మజాన్ ।
తేషామర్థేన యాచామి త్వామహం వై మహానది ॥ 20
ఈ మాటలు విన్న భగీరథుడు హైమవతీనదికి అంజలి ఘటించి నమస్కరించి అన్నాడు - నా పితామహులు యజ్ఞాశ్వాన్ని వెదకుతూ కపిలుని క్రోధాగ్నితో యమలోకం చేరారు. వారు అరవైవేలమంది. సగరుని పుత్రులు. కపిలుని ఆశ్రమం చేరి క్షణకాలంలో నశించారు. ముని కోపాగ్నిలో భస్మమైన వారికి స్వర్గనివాసం లేదు. ఆ సగరపుత్రుల శరీరాలకు నీ జలస్పర్శ లేకపోతే ఉత్తమ గతులు లేవు. సగరపుత్రులందరినీ స్వర్గాన్ని చేర్చు. వారిని ఉద్ధరించమని నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. (16-20)
లోమశ ఉవాచ
ఏతచ్ర్ఛుత్వా వచో రాజ్ఞః గంగా లోకనమస్కృతా ।
భగీరథమిదం వాక్యం సుప్రీతా సమభాషత ॥ 21
లోమశుడు పలికాడు - రాజు మాటలు విని, విశ్వవంద్య అయిన గంగ ప్రసన్నురాలై భగీరథునితో ఇలా పలికింది. (21)
కరిష్యామి మహారాజ వచస్తే నాత్ర సంశయః ।
వేగం తు మమ దుర్ధార్యం పతంత్యా గగనాద్ భువమ్ ॥ 22
'నీ మాటలను ఆచరించటానికి నేను అంగీకరించాను. కాని ఆకాశం నుండి భూమికి చేరేటప్పుడు నా వేగం సహింపశక్యం కానిది. (22)
న శక్తస్త్రిషు లోకేషు కశ్చిద్ ధారయితుం నృప ।
అన్యత్ర విబుధశ్రేష్ఠాత్ నీలకంఠాన్మహేశ్వరాత్ ॥ 23
దేవతాగ్రగణ్యుడు శంకరుని విడచి మూడు లోకాల్లోనూ వేరొకరు నా వేగాన్ని ధరింపలేరు. (23)
తం తోషయ మహాబాహో తపసా వరదం హరమ్ ।
స తు మాం ప్రచ్యుతాం దేవః శిరసా ధారయిష్యతి ॥ 24
వరాలనిచ్చే శంకరుని తపస్సుతో సంతోషపరచు. స్వర్గం నుంచి జారే నన్ను శంకరుడు తన శిరస్సుతో ధరిస్తాడు. (24)
స కరిష్యతి తే కామం పితౄణాం హితకామ్యయా ।
(తపసాఽఽరాధితః శంభుః భగవాన్ లోకభావనః ।)
ఏతచ్ర్ఛుత్వా తతో రాజన్ మహారాజో భగీరథః ॥ 25
కైలాసం పర్వతం గత్వా తోషయామాస శంకరమ్ ।
తపస్తీవ్రముపాగమ్య కాలయోగేన కేనచిత్ ॥ 26
నీ పితరుల హితాన్ని కోరి తపస్సు వలన భగవంతుడు, విశ్వరూపుడు అయిన శివుడు నీ కోరికను తీర్చగలడు.' వెంటనే భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు చేసి కొంతకాలానికి శంకరుని ప్రసన్నం చేసుకొన్నాడు. (25,26)
అగృహ్ణాచ్చ వరం తస్మాద్ గంగాయా ధారణే నృప ।
స్వర్గే వాసం సముద్దిశ్య పితౄణాం స నరోత్తమః ॥ 27
రాజా! గంగను ధరించటానికి ఆయన నుంచి పితృదేవతల స్వర్గప్రాప్తికై వరం తీసుకొన్నాడు ఆ నరోత్తముడు. (27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యోపాఖ్యానే అష్టాధికశతతమోఽధ్యాయః ॥ 108 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున అగస్త్యోపాఖ్యానము అను నూట ఎనిమిదవ అధ్యాయము. (108)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో మొత్తం కలిపి 28 శ్లోకాలు)