106. నూట ఆరవ అధ్యాయము

సగరుడు సంతానము కొరకు శివునికై తపస్సు చేసి వరములను పొందుట.

లోమశ ఉవాచ
తానువాచ సమేతాంస్తు బ్రహ్మా లోకపితామహః ।
గచ్ఛధ్వం విబుధాః సర్వే యథాకామం యథేప్సితమ్ ॥ 1
లోమశుడు పలికాడు - తన వద్దకు వచ్చిన దేవతలతో బ్రహ్మ 'ఇప్పుడు మీరు మీ స్వేచ్ఛానుసారం ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి' అన్నాడు. (1)
మహతా కాలయోగేన ప్రకృతిం యాస్యతేఽర్ణవః ।
జ్ఞాతీంశ్చ కారణం కృత్వా మహారాజో భగీరథః ॥ 2
పూరయిష్యతి తో యౌఘైః సముద్రం నిధిమంభసామ్ ।
చాలాకాలం తరువాత సముద్రం తన రూపాన్ని తిరిగి పొందుతుంది. భగీరథుడు జ్ఞాతుల నుద్ధరించాలని సముద్రాన్ని అపారజలరాశులతో నింపుతాడు. (2 1/2)
పితామహవచః శ్రుత్వా సర్వే విబుధసత్తమాః ।
కాలయోగం ప్రతీక్షంతః జగ్ముశ్చాపి యతాగతమ్ ॥ 3
దేవతలు అందరూ బ్రహ్మమాటలు విని సమయంకోసం ఎదురుచూస్తూ తిరిగి తమ ప్రదేశాలకు చేరారు. (3)
యుధిష్ఠిర ఉవాచ
కథం వై జ్ఞాతయో బ్రహ్మన్ కారణం చాత్ర కిం మునే ।
కథం సముద్రః పూర్ణశ్చ భగీరథప్రతిశ్రయాత్ ॥ 4
యుధిష్ఠిరుడు అడిగాడు - భగీరథుని జ్ఞాతులు సముద్రపూరణం ఎలా చేశారు? భగీరథుని ఆశ్రయించే సముద్రం ఎలా నిండింది? (4)
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుఅం విస్తరేణ తపోధన ।
కథ్యమానం త్వయా విప్ర రాజ్ఞాం చరితముత్తమమ్ ॥ 5
రాజుల ఉత్తమ చరిత్ర నీచే వివరింపబడితే విస్తరంగా వినాలని ఉంది. (5)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు విప్రేంద్రః ధర్మరాజ్ఞా మహాత్మనా ।
కథయామాస మహాత్మ్యం సగరస్య మహాత్మనః ॥ 6
వైశంపాయనుడు చెపుతున్నాడు - ధర్మరాజు ప్రశ్నించగా లోమశుడు మహాత్ముడైన సగరుని మాహాత్మ్యం వినిపించాడు. (6)
లోమశ ఉవాచ
ఇక్ష్వాకూణాం కులే జాతః సగరో నామ పార్థివః ।
రూపసత్త్వబలోపేతః స చాపుత్రః ప్రతాపవాన్ ॥ 7
లోమశుడు చెప్పాడు - ఇక్ష్వాకువంశంలో పుట్టిన సగరుడు అనే రాజు రూపసత్త్వబలసంపన్నుడు, ప్రతాపవంతుడు. అతనికి పుత్రసంతానం లేదు. (7)
స హైహయాన్ సముత్సాద్య తాలజంఘాంశ్చ భారత ।
వశే చ కృత్వా రాజన్యాన్ స్వరాజ్యమన్వశాసత ॥ 8
అతడు హైహయవంశజులను, తాలజంఘులనే క్షత్రియులను జయించి తన రాజ్యాన్ని పరిపాలించసాగాడు. (8)
తస్య భార్యే త్వభవతాం రూపయౌవనదర్పితే ।
వైదర్భీ భరతశ్రేష్ఠ శైబ్యా చ భరతర్షభ ॥ 9
ఆయనకు రూపయౌనవదర్పితలు అయిన ఇద్దరు భార్యలు కలరు. మొదటి భార్య వైదర్భి, రెండవ భార్య శైబ్య. (9)
స పుత్రకామో నృపతిః తప్యతే స్మ మహత్తపః ।
పత్నీభ్యాం సహ రాజేంద్ర కైలాసం గిరిమాశ్రితః ॥ 10
స తప్యమానః సుమహత్ తపోయోగసమన్వితః ।
ఆససాద మహాత్మానం త్ర్యక్షం త్రిపురమర్దనమ్ ॥ 11
శంకరం భవమీశానం శూలపాణిం పినాకినమ్ ।
త్ర్యంబకం శివముగ్రేశం బహురూపముమాపతిమ్ ॥ 12
పుత్రకాంక్షతో సగరుడు భార్యలతో కలిసి కైలాసపర్వతాన్ని ఆశ్రయించి, తపస్సు చేశాడు. యోగశాస్త్రానుసారం తపస్సు గొప్పగా చేసి త్రిపురాసురసంహారి, మహాత్ముడు అయిన ముక్కంటిని శంకరుని, భవుని, పినాకపాణిని, శూలపాణిని, ఉగ్రేశుని, ఉమాపతిని చూశాడు. (10-12)
స తం దృష్ట్వైవ వరదం పత్నీభ్యాం సహితో నృపః ।
ప్రణిపత్య మహాబాహుః పుత్రార్థే సమయాచత ॥ 13
తం ప్రీతిమాన్ హరః ప్రాహ సభార్యం నృపసత్తమమ్ ।
యస్మిన్ వృతో ముహూర్తేఽహం త్వమేహ నృపతే వరమ్ ॥ 14
ఆ సగరుడు శివుని చూసి భార్యలతో సహా నమస్కరించాడు. పుత్రుల నిమ్మని వరం అడిగాడు. భార్యలతో కూడిన సగరుని పట్ల ప్రసన్నుడై శివుడు పలికాడు - నీవు ఏ ముహూర్తంలో అడిగావో దాని ఫలం ఇలా ఉంటుంది. (13,14)
షష్టిః పుత్రసహస్రాణి శూరాః పరమదర్పితాః ।
ఏకస్యాం సంభవిష్యంతి పత్న్యాం నరవరోత్తమ ॥ 15
తే చైవ సర్వే సహితాః క్షయం యాస్యంతి పార్థివ ।
ఏకో వంశధరః శూరః ఏకస్యాం సంభవిష్యతి ॥ 16
అత్యంత అభిమానం గల అరవైవేల మంది శూరులైన కుమారులు ఒక భార్యకే పుడతారు. కాని వారందరు కలిసి ఒకేసారి నాశనం చెందుతారు. నీ రెండవభార్య గర్భం నుంచి ఒకే ఒక వంశోద్ధారకుడు పుడతాడు. (15,16)
ఏవముక్త్వా తు తం రుద్రః తత్రైవాంతరధీయత ।
స చాపి సగరో రాజా జగామ స్వం నివేశనమ్ ॥ 17
పత్నీభ్యాం సహితస్తత్ర సోఽతిహృష్టమనాస్తదా ।
తస్య తే మనుజశ్రేష్ఠ భార్యే కమలలోచనే ॥ 18
వైదర్భీ చైవ శైబ్యా చ గర్భిణ్యౌ సంబభూవతుః ।
తతః కాలేన వైదర్భీ గర్భాలాబుం వ్యజాయత ॥ 19
శైబ్యా చ సుషువే పుత్రం కుమారం దేవరూపిణమ్ ।
తదాలాబుం సముత్ర్సష్టుం మనశ్చక్రే స పార్థివః ॥ 20
ఇలా చెప్పి రుద్రుడు అక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ సగరుడు ప్రసన్నుడై తన రాజ్యానికి భార్యలతో కలిసి చేరాడు. కమలదళాలవంటి కన్నులు గల ఆ భార్యలతో మిక్కిలి సంతుష్టుడై ఉన్నాడు. వైదర్భి, శైబ్య గర్భవతులు అయ్యారు. కొంతకాలానికి వైదర్భి ఒక సొరకాయవంటి దాన్ని ప్రసవించింది. శైబ్య దేవసమానుడైన కుమారుని ప్రసవించింది. సగరుడు ఆ ఫలాన్ని విసరివేయటానికి ప్రయత్నించాడు. (17-20)
అథాంతరిక్షాచ్ఛుశ్రావ వాచం గంభీరనిఃస్వనామ్ ।
రాజన్ మా సాహసం కార్షీః పుత్రాన్ న త్యక్తుమర్హసి ॥ 21
అలాబుమధ్యాన్నిష్కృష్య బీజం యత్నేన గోప్యతామ్ ।
సోపస్వేదేషు పాత్రేషు ఘృతపూర్ణేషు భాగశః ॥ 22
అంతలో ఆకాశం నుండి గంభీరధ్వని వినబడింది. 'రాజా! సాహసం చేయవద్దు. పుత్రులను విడచుట సరైనది కాదు. ఈ సొరకాయ నుంచి గింజలను తీసి వేడి నేతిపాత్రలలో వేరువేరుగా ఉంచి జాగ్రత్తగా సంరక్షించు. (21,22)
తతః పుత్రసహస్రాణి షష్టిం ప్రాప్స్యసి పార్థివ ।
మహాదేవేన దిష్టం తే పుత్రజన్మ నరాధిప ।
అనేన క్రమయోగేన మా తే బుద్ధిరతోఽన్యథా ॥ 23
అటుపైన అరవైవేలమంది పుత్రులను పొందుతావు. శివుని కారణాంగా ఈ పుత్రులు నీకు ఏర్పడ్డారు. కావున మరొక రీతిగా ఆలోచించవద్దు. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సగరసంతతికథనే షడధికశతతమోఽధ్యాయః ॥ 106 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున సగరసంతాన వృత్తాంతము అను నూట ఆరవ అధ్యాయము. (106)