103. నూట మూడవ అధ్యాయము
విష్ణువు ఆజ్ఞపై దేవతలు అగస్త్యాశ్రమమునకు చేరుట. సముద్రమును ఇంకింపజేయుమని ప్రార్థించుట.
దేవా ఊచుః
తవ ప్రసాదాద్ వర్ధంతే ప్రజాః సర్వాశ్చతుర్విధాః ।
తా భావితా భావయంతి హవ్యకవ్యైర్దివౌకసః ॥ 1
దేవతలు పలికారు. నీ అనుగ్రహం వలన జరాయుజాలు, స్వేదజాలు, అండజాలు, ఉద్భిజాలు వృద్ధిపొందుతున్నాయి. అభ్యుదయశీలం కల మానవులు, హవ్య కవ్యాలతో దేవతలను ఆనందపెట్టుతున్నారు. (1)
లోకా హ్యేవం వివర్ధంతే హ్యన్యోన్యం సముపాశ్రితాః ।
త్వత్ర్పసాదాన్నిరుద్విగ్నాః త్వయైవ పర్రిరక్షితాః ॥ 2
ఇదం చ సమనుప్రాప్తం లోకానాం భయముత్తమమ్ ।
న చ జానీమ కేనేమే రాత్రౌ వధ్యంతి బ్రాహ్మణాః ॥ 3
పరస్పరం ఆధారపడి లోకాలు ఈ విధంగా వృద్ధిని పొందుతున్నాయి. నీ కరుణచే ఉద్వేగంలేనివై రక్షింపబడుతున్నాయి. ఇపుడు మనుష్యులకు గొప్ప భయం సంప్రాప్తించింది. రాత్రివేళలో ఎవరు ఈ బ్రాహ్మణులను వధిస్తున్నారో తెలియటం లేదు. (2,3)
క్షీణేషు చ బ్రాహ్మణేషు పృథివీ క్షయమేష్యతి ।
తతః పృథివ్యాం క్షీణాయాం త్రిదివం క్షయమేష్యతి ॥ 4
బ్రాహ్మణులు నశిస్తే భూమి నశిస్తుంది. భూమి క్షీణిస్తే స్వర్గవైభవం కూడ క్షీణిస్తుంది. (4)
త్వత్ర్పసాదాన్మహాబాహో లోకాః సర్వే జగత్పతే ।
వినాశం నాధిగచ్ఛేయుః త్వయా వై పరిరక్షితాః ॥ 5
మీ అనుగ్రహం వల్ల లోకాలు అన్నీ నాశనాన్ని పొందవు. పైగా నీచే రక్షింపబడతాయి. (5)
విష్ణురువాచ
విదితం మే సురాః సర్వం ప్రజానాం క్షయకారణమ్ ।
భవతాం చాపి వక్ష్యామి శృణుధ్వం విగతజ్వరాః ॥ 6
విష్ణువు పలికాడు - ప్రజల వినాశానికి ఏర్పడిన కారణాన్ని నేను తెలుసుకొన్నాను. మీకు ఒక మాట చెబుతున్నాను. అందరూ చింతలేక వినండి. (6)
కాలేయ ఇతి విఖ్యాతః గణః పరమదారుణః ।
తైశ్చ వృత్రం సమాశ్రిత్య జగత్ సర్వం ప్రమాథితమ్ ॥ 7
దైత్యులలో కాలేయులను పేరుగల రాక్షసులదండు భయంకరమై ఉన్నది. వారు వృత్రాసురుని ఆశ్రయించి లోకాలను బయపెట్టి నాశనం చేస్తున్నారు. (7)
తే వృత్రం నిహతం దృష్ట్వా సహస్రాక్షేణ ధీమతా ।
జీవితం పరిరక్షంతః ప్రవిష్టా వరుణాలయమ్ ॥ 8
ఇంద్రుని చేత వృత్రుడు చనిపోయినట్లు వారు తెలిసికొని సముద్రంలో ప్రవేశించి ప్రాణాలు రక్షించుకొన్నారు. (8)
తే ప్రవిశ్యోదధిం ఘోరం నక్రగ్రాహసమాకులమ్ ।
ఉత్సాదనార్థం లోకానాం రాత్రౌ ఘ్నంతి ఋషీనిహ ॥ 9
మొసళ్ళతో, పెద్దచేపలతో వ్యాప్తమైన సముద్రంలో వారు ప్రవేశించి, లోకసంహారం కోసం రాత్రులందు ఋషులను చంపుతున్నారు. (9)
న తు శక్యాః క్షయం నేతుం సముద్రాశ్రయగా హి తే ।
సముద్రస్య క్షయే బుద్ధిః భవద్భిః సంప్రధార్యతామ్ ॥ 10
సముద్రాన్ని ఆశ్రయించటం చేత వారిని శిక్షింప వీలుకాలేదు. కావున మీరు సముద్ర శోషణానికై ప్రయత్నించండి. (10)
అగస్త్యేన వినా కో హి శక్తోఽన్యోఽర్ణవశోషణే ।
అన్యథా హి న శక్యాస్తే వినా సాగరశోషణమ్ ॥ 11
అగస్త్యుడు కాక వేరెవరు సముద్రాన్ని ఇంకింపచేయగలరు? సముద్రాన్ని ఎండింపక వారిని నాశన చేయలేము. (11)
ఏతచ్ర్ఛుత్వృ తదా దేవాః విష్ణునా సముదాహృతమ్ ।
పరమేష్ఠినమాజ్ఞాప్య అగస్త్యస్యాశ్రమం యయుః ॥ 12
విష్ణువు పలికిన పలుకులు విని పరమేష్ఠిని అనుమతింపచేసి దేవతలు అగస్త్యాశ్రమాన్ని చేరారు. (12)
తత్రాపశ్యన్ మహాత్మానం వారుణిం దీప్తతేజసమ్ ।
ఉపాస్యమానమృషిభిః దేవైరివ పితామహమ్ ॥ 13
అక్కడ మిత్రావరుణుల పుత్రుడు కాంతిమంతుడు అయిన అగస్త్యమునిని చూశారు. దేవతలు బ్రహ్మను సేవించినట్లు ఋషులందరు అగస్త్యుని సేవింపసాగారు. (13)
తేఽభిగమ్య మహాత్మానం మైత్రావరుణిమచ్యుతమ్ ।
ఆశ్రమస్థం తపోరాశిం కర్మభిః స్వైరభిష్టువన్ ॥ 14
వారు ఆశ్రమంలో మిత్రావరుణుల కుమారుడై, ఇంద్రియనిగ్రహం కల అగస్త్యుని చూచి అతని అద్భుతకృత్యాలను కొనియాడసాగారు. (14)
దేవా ఊచుః
నహుషేణాభితప్తానాం త్వం లోకానాం గతిః పురా ।
భ్రంశితశ్చ సురైశ్వర్యాత్ స్వర్లోకాల్లోకకంటకః ॥ 15
దేవతలు పలికారు - పూర్వకాలంలో నహుషుడు జనులను పీడించినప్పుడు నీవు వారిని రక్షించి లోకకంటకుడు అయిన నహుషుని స్వర్లోకాధిపత్యానికి దూరం చేశావు. (15)
క్రోధాత్ ప్రవృద్ధః సహసా భాస్కరస్య నగోత్తమః ।
వచస్తవానతిక్రామన్ వింధ్యః శైలో న వర్ధతే ॥ 16
పర్వతశ్రేష్ఠుడైన వింధ్యుడు సూర్యుని మీది కోపంతో పెరిగి సూర్యగమనానికి అవరోధం అయిన సమయంలో మీ ఆజ్ఞానుసారం ప్రవర్తించే వింధ్యపర్వతం వృద్ధిపొందక అట్లే ఉన్నది. (16)
తమసా చావృతే లోకే మృత్యునాభ్యర్దితాః ప్రజాః ।
త్వామేవ నాథమాసాద్య నిర్వృత్తిం పరమాం గతాః ॥ 17
వింధ్యపర్వతం పెరిగి లోకాలు అంధకారం అయినప్పుడు జనులు మృత్యుభీతిని పొందారు. మిమ్ములనే శరణుకోరి అందరు ఆనందాన్ని పొందారు. (17)
అస్మాకం భయభీతానాం నిత్యశో భగవాన్ గతిః ।
తతస్త్వార్తాః ప్రయాచామః వరం త్వాం వరదో హ్యసి ॥ 18
అప్పుడు భయభీతులైన దేవతలను మీరే రక్షించారు. అందువలన ఈ ఆపద నుమ్చి కూడ మీరే రక్షించండి అని వరం కోరుతున్నాము. (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యమాహాత్మ్యకథనే త్ర్యధికశతతమోఽధ్యాయః ॥ 103 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున అగస్త్యుని మాహాత్మ్యము అను నూట మూడవ అధ్యాయము. (103)