104. నూట నాలుగవ అధ్యాయము

అగస్త్యుడు వింధ్యవృద్ధిని నివారించుట, దేవతలతో సముద్రతీరము చేరుట.

యుధిష్ఠిర ఉవాచ
కిమర్థం సహసా వింధ్యః ప్రవృద్ధః క్రోధమూర్ఛితః ।
ఏతదిచ్చామ్యహం శ్రోతుం విస్తరేణ మహామునే ॥ 1
యుధిష్ఠిరుడు అడిగాడు - ఏ కారణంచే వింధ్యపర్వతం కోపాన్ని పొందిందో విస్తరంగా తెలియచెయ్యండి. (1)
లోమశ ఉవాచ
అద్రిరాజం మహాశైలం మేరుం కనకపర్వతమ్।
ఉదయాస్తమనే భానుః ప్రదక్షిణమవర్తత ॥ 2
లోమశుడు పలికాడు - సూర్యభగవానుడు ఉదయాస్తమయవేళల్లో బంగారు రంగు గలిగిన మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నాడు. (2)
తం తు దృష్ట్వా తథా వింధ్యః శైలః సూర్యమథాబ్రవీత్ ।
తథా హి మేరుర్భవతా నిత్యశః పరిగమ్యతే ॥ 3
ప్రదక్షిణశ్చ క్రియతే మామేవం కురు భాస్కర ।
ఏవముక్తస్తతః సూర్యః శైలేంద్రం ప్రత్యభాషత ॥ 4
నాహమాత్మేచ్ఛయా శైలం కరోమ్యేనం ప్రదక్షిణమ్ ।
ఏష మార్గః ప్రదిష్టో మే యైరిదం నిర్మితం జగత్ ॥ 5
అది చూచి వింధ్యపర్వతం సూర్యునితో ఇలా అంది. 'మీరు ప్రతిదినం మేరువుకు ప్రదక్షిణం చేస్తున్నట్లే నాకు ప్రదక్షిణం చెయ్యండి.' వింధ్యపర్వతం మాటలు విన్న సూర్యుడు ఇలా బదులు పలికాడు. 'నేను నా ఇష్టానుసారం ఈ పర్వతానికి ప్రదక్షిణం చేయటం లేదు. లోకాన్ని సృష్టించిన బ్రహ్మ నాకీ మార్గాన్ని ఉపదేశించాడు.' (3-5)
ఏవముక్తస్తతః క్రోధాత్ ప్రవృద్ధః సహసాచలః ।
సూర్యాచంద్రమసోర్మార్గం రోద్ధుమిచ్ఛన్ పరంతప ॥ 6
సూర్యభగవానుని మాటలు విని, మిక్కిలి కోపించి వింధ్యపర్వతం సూర్యచంద్రుల మార్గానికి అవరోధంగా, పెరుగసాగింది. (6)
తతో దేవాః సహితాః సర్వ ఏవ
వింధ్యం సమాగమ్య మహాద్రిరాజమ్ ।
నివారయామాసురుపాయతస్తం
న చ స్మ తేషాం వచనం చకార ॥ 7
దేవతలందరు కలసి శ్రేష్ఠుడైన వింధ్యుని సమీపించి ఉపాయాల ద్వారా అతని కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. వారు మాటలు వింధ్యపర్వతం వినలేదు. (7)
అథాభిజగ్ముర్మునిమాశ్రమస్థం
తపస్వినం ధర్మభృతాం వరిష్ఠమ్ ।
అగస్త్యమత్యద్భుతవీర్యవంతం
తం చార్థమూచుః సహితాః సురాస్తే ॥ 8
అప్పుడు అందరూ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడు, తాపసి, ఆశ్రమవాసి అయిన అగస్త్యుని వద్దకు వేగంగా చేరి తమకు కావలసిన ప్రయోజనాన్ని వివరించారు. (8)
దేవా ఊచుః
సూర్యాచంద్రమసోర్మార్గం నక్షత్రాణాం గతిం తథా ।
శైలరాజో వృణోత్యేషః వింధ్యః క్రోధవశానుగః ॥ 9
తం నివారయితుం శక్తః నాన్యః కశ్చిద్ ద్విజోత్తమ ।
ఋతే త్వాం హి మహాభాగ తస్మాదేనం నివారయ ॥ 10
ఈ వింధ్య పర్వతం క్రోధవశుడై సూర్యచంద్రుల మార్గాన్ని, నక్షత్రాల గతిని అడ్డుకొన్నాడు. మీకంటె వేరొకరు అతనిని నివారించలేరు. మీరు వెళ్ళి అతని కోపాన్ని అణచి అదుపులో పెట్టండి. (9,10)
తచ్ర్ఛుత్వా వచనం విప్రః సురాణాం శైలమభ్యగాత్ ।
సోఽభిగమ్యాబ్రవీత్ వింధ్యం సదారః సముపస్థితః ॥ 11
దేవతల వచనాలు విని అగస్త్యుడు వింధ్యపర్వతసమీపానికి భార్యతో సహా వెళ్ళి ఇలా అన్నాడు. (11)
మార్గమిచ్ఛామ్యహం దత్తం భవతా పర్వతోత్తమ ।
దక్షిణామభిగంతాస్మి దిశం కార్యేణ కేనచిత్ ॥ 12
పర్వతశ్రేష్ఠా! నేను ఒక పనిమీద దక్షిణదిక్కుకు వెళ్ళాలి. నా కోరిక ప్రకారం నీవు మార్గాన్ని ఇవ్వాలి. (12)
యావదాగమనం మహ్యం తావత్ త్వం ప్రతిపాలయ ।
వివృత్తే మయి శైలేంద్ర తతో వర్ధస్య కామతః ॥ 13
నేను తిరిగివచ్చేవరకు నా ఆజ్ఞను పాలించు. నేను తిరిగి వెళ్ళిన పిదప స్వేచ్ఛానుసారం వృద్ధిని పొందు. (13)
ఏవం స సమయం కృత్వా వింధ్యేనామిత్రకర్శన ।
అద్యాపి దక్షిణాద్ దేశాద్ వారుణిర్న నివర్తతే ॥ 14
ఇట్లు వింధ్యపర్వతం నుంచి మాట తీసుకొని, మిత్రావరుణనందనుడైన అగస్త్యుడు దక్షిణదేశం నుంచి ఇక వెనుకకు రాలేదు. (14)
ఏతత్ తే సర్వమాఖ్యాతం యథా వింధ్యో న వర్ధతే ।
అగస్త్యస్య ప్రభావేణ యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 15
వింధ్యుని పెంపుదల ఆగిపోవుటకు తగిన వృత్తాంతాన్ని నీకు వివరిమ్చాను. అగస్త్యుని ప్రభావంచే వింధ్యుని పెంపుదల ఆగిపోయింది. (15)
కాలేయాస్తు యథా రాజన్ సురైః సర్వైర్నిఘాదితాః ।
అగస్త్యాద్ వరమాసాద్య తన్మే నిగదతః శృణు ॥ 16
దేవతలు అగస్త్యుని అనుగ్రహం పొంది కాలేయులను సంహరించిన విధానం వివరిస్తాను. వినండి. (16)
త్రిదశానాం వచః శ్రుత్వా మైత్రావరుణిరబ్రవీత్ ।
కిమర్థమభియాతాః స్థ వరం మత్తః కమిచ్ఛథ ।
ఏవౌక్తాస్తతస్తేన దేవతా మునిమబ్రువన్ ॥ 17
(సర్వే ప్రాంజలయో భూత్వా పురంధరపురోగమాః ।)
దేవత మాటలు విని అగస్త్యుడు వారిని ఇలా అడిగాడు - మీరు నా నుమ్చి ఏ పని ఆశించి ఇక్కడకు వచ్చారు?, అగస్త్యుని మాటలను విన్న దేవతలు అగస్త్యునితో పలికారు. ఇంద్రుని ముందు ఉంచుకొని అంజలిఘటించి అన్నారు. (17)
ఏవం త్వయేచ్ఛామ కృతం హి కార్యం
మహార్ణవం పీయమానం మహాత్మన్ ।
తతో వధిష్యామ సహానుబంధాన్
కాలేయసంజ్ఞాన్ సురవిద్విషస్తాన్ ॥ 18
మేము మీ ద్వారా ఈ పనిని సాధింప దలచాము. సముద్రంలో నీటిని మీరు పూర్తిగా త్రాగివేయండి. అటుపైన దేవద్రోహులైన కాలేయులను మేము పూర్తిగా సంహరిస్తాం. (18)
త్రిదశానాం వచః శ్రుత్వా తథేతి మునిరబ్రవీత్ ।
కరిష్యే భవతాం కామం లోకానాం చ మహత్ సుఖమ్ ॥ 19
సురల మాటలను విని అగస్త్యుడు 'అలాగే' అని అంగీకరించి, 'మీ కోరికను తీర్చి లోకాలకు మేలు కలిగిస్తాను' అన్నాడు. (19)
ఏవముక్త్వా తతోఽగచ్ఛత్ సముద్రం సరితాం పతిమ్ ।
ఋషిభిశ్చ తపఃసిద్ధైః సార్ధం దేవైశ్చ సువ్రత ॥ 20
ఇలా బదులు పలికి అగస్త్యుడు దేవతలు, ఋషులతో కలిసి సముద్రతీరానికి చేరాడు. (20)
మనుష్యోరగగంధర్వయక్షకింపురుషాస్తథా ।
అనుజగ్ముర్మహాత్మానం ద్రష్టుకామాస్తదద్భుతమ్ ॥ 21
ఆ సమయాన మనుష్యులు, నాగులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు అందరు ఆ అద్భుతాన్ని చూసేందుకు అగస్త్యుని వెనుక బయలుదేరారు. (21)
తతోఽభ్యగచ్ఛన్ సహితాః సముద్రం భీమనిఃస్వనమ్ ।
నృత్యంతమివ చోర్మీభిః వల్గంతమివ వాయునా ॥ 22
వారందరు భయంకరంగా గర్జిస్తూ పైకి ఎగిరే తరంగాలతో నృత్యం చేస్తున్నట్లున్న సముద్రసమీపానికి చేరారు. (22)
హసంతమివ ఫేనౌఘైః స్ఖలంతం కందరేషు చ ।
నానాగ్రాహసమాకీర్ణం నానాద్విజగణాన్వితమ్ ॥ 23
తరంగాలనురుగుచే నవ్వుతున్నట్లుంది సముద్రం. గుహల్లోకి ధ్వనులతో ప్రవేశిస్తున్నట్లు ఉంది. మొసళ్ళు మొదలైన జలజంతువులతో, పక్షిగణాలతో వ్యాప్తమై ఉంది. (23)
అగస్త్యసహితా దేవాః సగంధర్వమహోరగాః ।
ఋషయశ్చ మహాభాగాః సమాసేదుర్మహోదధిమ్ ॥ 24
అగస్త్యునితో కూడి గంధర్వులు, నాగులు, ఋషులు అందరూ సముద్రతీరానికి చేరుకున్నారు. (24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యోదధిగమనే చతురధికశతతమోఽధ్యాయః ॥ 104 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో అగస్త్యోదధిగమనమను నూట నాలుగవ అధ్యాయము. (104)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకముల్తో కలిపి 24 1/2 శ్లోకాలు)