102. నూట రెండవ అధ్యాయము

సముద్రములోని ఋషులను దైత్యులు నాశనము చేయుట. దేవతలు నారాయణుని శరణుకోరుట.

లోమశ ఉవాచ
సముద్రం తే సమాశ్రిత్య వారుణం నిధిమంభసః ।
కాలేయాః సంప్రవర్తంత త్రైలోక్యస్య వినాశనే ॥ 1
లోమశుడు చెపుతున్నాడు - వరుణుని నివాసమైన సముద్రాన్ని ఆశ్రయించి, కాలేయులు త్రైలోక్యవినాశనానికి పాల్పడ్డారు. (1)
తే రాత్రౌ సమభిక్రుద్ధాః భక్షయంతి సదా మునీన్ ।
ఆశ్రమేషు చ యే సంతి పుణ్యేష్వాయతనేషు చ ॥ 2
వసిష్ఠస్యాశ్రమే విప్రాః భక్షితాస్తైర్దురాత్మభిః ।
అశీతిః శతమష్టౌ చ నవ చాన్యే తపస్వినః ॥ 3
వారు కోపించి రాత్రివేళలలో ఆశ్రమాల్లోని, పవిత్ర ప్రదేశాల్లోని మునులను తినివేయసాగారు. దురాత్ములైన రాక్షసులు వసిష్ఠుని ఆశ్రమంలోని నూట ఎనభై ఎనిమిది మందిని, ఇతరులైన తొమ్మిది మంధి ఋషులను భక్షించారు. (2,3)
చ్యవనస్యాశ్రమం గత్వా పుణ్యం ద్విజనిషేవితమ్ ।
ఫలమూలాశనానాం హి మునీనాం భక్షితం శతమ్ ॥ 4
చ్యవనముని పవిత్రాశ్రమాన్ని చేరి అక్కడ కందమూలఫలాలు తింటూ నివసించే వందమంది మునులను తినివేశారు. (4)
ఏవం రాత్రౌ స్మ కుర్వంతి వివిశుశ్చార్ణవం దివా ।
భరద్వాజాశ్రమే చైవ నియతా బ్రహ్మచారిణః ॥ 5
వాయ్వాహారాంబుభక్షాశ్చ వింశతిః సంనిఘాదితాః ।
ఏవం క్రమేణ సర్వాంస్తాన్ ఆశ్రమాన్ దానవాస్తదా ॥ 6
నిశాయాం పరిబాధంతే మత్తా భుజబలాశ్రయాత్ ।
కాలోపసృష్టాః కాలేయాః ఘ్నంతో ద్విజగణాన్ బహూన్ ॥ 7
న చైనానన్వబుధ్యంత మనుజా మనుజోత్తమ ।
ఏవం ప్రవృత్తాన్ దైత్యాంస్తాన్ తాపసేషు తపస్విషు ॥ 8
ఈ విధంగా రాత్రులలో తాపసులను సంహరించి పగలు జలంలో ప్రవేశించే వారు. వాయు, జలభక్షణం చేసే ఇరవైమంది బ్రహ్మచారులను భరద్వాజాశ్రమంలో ఆ రాక్షసులు క్రమంగా చంపారు. ఇదే తీరుగా రాత్రులందరు బాహుబల గర్వితులై కాలునిచే సృజింపబడిన కాలేయులు చాలమంది బ్రాహ్మణులను నాశనం చేశారు. దీనులను, తాపసులను పీడించే ఆ రాక్షసులను మనుజులెవ్వరూ గుర్తింపలేకపోయారు. (5-8)
వి॥సం॥ తాపసులపై ఎత్తివచ్చిన దైత్యులను తపస్సుతోనే నివారించవచ్చును కానీ తాపసులు దేహనాశమయినా సరే తపోనాశం కాకూడదని ఆ పని చేయరు. (నీల)
ప్రభాతే సమదృశ్యంత నియతాహారకర్శితాః ।
మహీతలస్థా మునయః శరీరైర్గతజీవితైః ॥ 9
ప్రభాతవేల నియతాహారపీడితులై వారు ప్రాణాలు పోయి శరీర మాత్రం భూమిపై అప్డి ఉండేవారు. (9)
క్షీణమాంసైర్విరుధిరైః వినజ్జాంత్రైర్విసంధిభిః ।
ఆకీర్ణైరాబభౌ భూమిః శంకానామివ రాశిభిః ॥ 10
రాక్షసులచే భక్షింపబడి రక్తం, మాంసం, మజ్జ, సంధిబంధాలు తొలగి శంఖరాశుల వలె మనులు భూమిపై పడి ఉండేవారు. (10)
కలశైర్విప్రవిద్ధైశ్చ స్రువైర్భగ్నైస్తథైవ చ ।
వికీర్ణైరగ్నిహోత్రైశ్చ భూర్బభూవ సమావృతా ॥ 11
అటు ఇటు చెదరగొట్టబడిన కలశాలతో, విరిగిన స్రువాలతో, విసిరివేయబడిన అగ్నిహోత్రాలతో భూమి వ్యాప్తమై ఉంది. (11)
నిఃస్వాధ్యాయవషట్ కారం నష్టయజ్ఞోత్సవక్రియమ్ ।
జగదాసీన్నిరుత్సాహం కాలేయభయపీడితమ్ ॥ 12
స్వాధ్యాయవషట్కారాలు లేక యజ్ఞోత్సవాలు లేక కాలేయభయంతో, నిరుత్సాహంతో, లోకమంతావ్యాకులమై ఉంది. (12)
ఏవం సంక్షీయమాణాశ్చ మానవా మనుజేశ్వర ।
ఆత్మత్రాణపరా భీతాః ప్రాద్రవంత దిశో భయాత్ ॥ 13
ఈ విధంగా ఆత్మరక్షణా పరాయణులై మిగిలిన మానవులు భయంతో నలువైపులకు పరుగులు తీశారు. (13)
కేచిద్ గుహాః ప్రవివిశుః నిర్ఘరాంశ్చాపరే తథా ।
అపరే మరణోద్విగ్నాః భయాత్ ప్రాణాన్ సముత్సృజన్ ॥ 14
కొంతమంది గుహల్లో, కొంతమంది ప్రవాహాల్లో కొంతమంది మరణభయంతో ప్రాణాలు విడచారు. (14)
కేచిదత్ర మహేష్వాసాః శూరాః పరమహర్షితాః ।
మార్గమాణాః పరం యత్నం దానవానాం ప్రచక్రిరే ॥ 15
కొందరు అక్కడ ధనుర్విద్యాధికులు, శూరులు, మిక్కిలి హర్షాన్ని పొందినవారు. వారు దానవుల స్థానాన్ని వెదకుతూ యత్నాలు చేశారు. (15)
న చైతానధిజగ్ముస్తే సముద్రం సముపాశ్రితాన్ ।
శ్రమం జగ్ముశ్చ పరమమ్ ఆజగ్ముః క్షయమేవ చ ॥ 16
మానవులు సముద్రమందు దాగినవారిని గుర్తించలేక శ్రమను పొంది నశించారు. (16)
జగత్యుపశమం యాతే నష్టయజ్ఞోత్సవక్రియే ।
ఆజగ్ముః పరమామార్తిం త్రిదశా మనుజేశ్వర ॥ 17
రాజా! యజ్ఞోత్సవక్రియలు లేక జగత్తుకు వినాశం ప్రాప్తించి, దేవతలకు ఎక్కువ పీడ కలిగింది. (17)
సమేత్య సమహేంద్రాశ్చ భయాన్మంత్రం ప్రచక్రిరే ।
శరణ్యం శరణం దేవం నారాయణమజం విభుమ్ ॥ 18
తేఽభిగమ్య నమస్కృత్య వైకుంఠమపరాజితమ్ ।
తతో దేవాః సమస్తాస్తే తదోచుర్మధుసూదనమ్ ॥ 19
ఇంద్రాది దేవతలు కూడా భయంతో ఆలోచించారు. వారు దేవతలందరకు దిక్కై, జన్మరహితుడైన నారాయణుని ప్రార్థించారు. వారు పరాజయంలేని, వైకుంఠవాసుని మధుసూదనుని చేరి నమస్కరించి ఆయనతో ఇట్లా విన్నవించారు. (18,19)
త్వం నః స్రష్టా చ భర్తా చ హర్తా చ జగతః ప్రభో ।
త్వయా సృష్టమిదం విశ్వం యచ్చేంగం యచ్చ నేంగతి ॥ 20
నీవే మమ్ములను సృష్టించావు. నీవే మాకు భర్తవు. నీవే లోకానికంతకు నాశకుడవు. స్థావరజంగమాత్మకం అయిన ఈ సృష్టి అంతా నీవే చేశావు. (20)
త్వయా భూమిః పురా నష్టా సముద్రాత్ పుష్కరేక్షణ ।
వారాహం వపురాశ్రిత్య జగదర్థే సముద్ధృతా ॥ 21
పూర్వకాలాన నీవే సముద్రంలో మునిగిన భూమిని వరాహరూపం స్వీకరించి వెలికితీసి రక్షించావు. (21)
ఆదిదైత్యో మహావీర్యః హిరణ్యకశిపుః పురా ।
నారసింహం వపుః కృత్వా సూదితః పురుషోత్తమ ॥ 22
నీవే నారసింహుని రూపాన్ని దాల్చి ఆదిరాక్షసుడు, మహావీరుడు అయిన హిరణ్యకశిపుని నశింపచేశావు. (22)
అవధ్యః సర్వభూతానాం బలిశ్చాపి మహాసురః ।
వామనం వపురాశ్రిత్య త్రైలోక్యాద్ భ్రంశితస్త్వయా ॥ 23
సర్వప్రాణులకు చంపవీలుకాని రాక్షసుడైన బలిచక్రవర్తిని వామనావతారం ఎత్తి త్రిలోక రాజ్యం నుంచి తొలగించావు. (23)
అసురశ్చ మహేష్వాసః జంభ ఇత్యభివిశ్రుతః ।
యజ్ఞక్షోభకరః క్రూరః త్వయైవ వినిపాతితః ॥ 24
క్రూరుడై, ధానుష్కుడై యజ్ఞనాశం చేసే జంభాసురుని నీవే పడగొట్టావు. (24)
ఏవమాదీని కర్మాణి యేషాం సంఖ్యా న విద్యతే ।
అస్మాకం భయభీతానాం త్వం గతిర్మధుసూదన ॥ 25
అసంఖ్యాకమయినవి ఈ నీ కృత్యాలు. భయపడే మాబోటివారికి నీవే దిక్కు. (25)
తస్మాత్ త్వాం దేవదేవేశ లోకార్థం జ్ఞాపయామహే ।
రక్ష లోకాంశ్చ దేవాంశ్చ శక్రం చ మహతో భయాత్ ॥ 26
కావున నీకు లోకహితం కోసం నివేదిస్తున్నాము. లోకాలను, దేవతలను, ఇంద్రునీ ఈ మహాభయం నుండి రక్షించు. (26)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం విష్ణుస్తవే ద్వ్యధికశతతమోఽధ్యాయః ॥ 102 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో విష్ణుస్తవమను నూట రెండవ అధ్యాయము. (102)