94. తొంబది నాల్గవ అధ్యాయము

రాజులదృష్టాంతాలలో లోమశుడు యుధిష్ఠిరునికి తీర్థయాత్ర, అధర్మహానులను వివరించుట.

యుధిష్ఠిర ఉవాచ
న వై నిగుణమాత్మానం మన్యే దేవర్షిసత్తమ ।
తథాస్మి దుఃఖసంతప్తః యథా నాన్యో మహీపతిః ॥ 1
యుధిష్ఠిరుడు పలికాడు.
లోమశమహర్షీ! నాకు తెలిసినంతవరకు నేను సాత్త్వికగుణహీనుణ్ణి కాను. అయినా దుఃఖపరంపరను పొందాను. నావలె ఇలాంటి దుఃఖాలు పొందినవారు ఇతరులు రాజులెవరూ ఉండరేమో? (1)
పరాంశ్చ నిర్గుణాన్ మన్యే న చ ధర్మగతానపి ।
తే చ లోమశ లోకేఽస్మిన్ ఋధ్యంతే కేన హేతునా ॥ 2
లోమశా! శత్రువులైన దుర్యోధనాదులు సాత్త్వికగుణహీనులని ఎఱుగుదును. ధర్మపరాయణులు కూడ కారు. అలాంటప్పుడు ఉత్తరోత్తరాభివృద్ధిని వారెలా పొందారు. (2)
లోమశ ఉవాచ
నాత్ర దుఃఖం త్వయా రాజన్ కార్యం పార్థ కథంచన ।
యదధర్మేణ వర్ధేయుః అధర్మరుచయో జనాః ॥ 3
లోమశుడిలా అన్నాడు.
అధర్మమందు ఆసక్తి కల్గి ఆ అధర్మకారణంగా నీ శత్రువులు వృద్ధిని పొందితే వారిని గురించి దుఃఖించవలసిన అవసరం నీకు లేదు. (3)
వర్ధత్యధర్మేణ నరః తతో భద్రాణి పశ్యతి ।
తతః సపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి ॥ 4
నరుడు ముందుగా అధర్మం చేత వృద్ధిని పొంది, శుభాలను పొంది, శత్రువిజయం సాధించిన తరువాత సమూలంగా నశిస్తాడు. (4)
మయా హి దృష్టా దైతేయాః దానవాశ్చ మహీపతే ।
వర్ధమానా హ్యధర్మేణ క్షయం చోపగతాః పునః ॥ 5
రాజా! "దైత్యదానవులు అధర్మంగా నడచుకొని వృద్ధిని పొంది చివరకు నశించారు." నేను ప్రత్యక్షంగా చూశాను. (5)
పురా దేవయుగే చైవ దృష్టం సర్వం మయా విభో ।
అరోచయన్ సురా ధర్మం ధర్మం తత్యజిరేఽసురాః ॥ 6
రాజా! పూర్వం దేవయుగంలో నాకళ్ళతో చూసిన విషయాలను వివరిస్తాను. దేవతలు ధర్మంపట్ల ఆసక్తి కలిగి, దానవులు అధర్మం పట్ల ఆసక్తి కలిగి మెలిగారు. (6)
తీర్థాని దేవా వివిశుః నావిశన్ భారతాసురాః ।
తానధర్మకృతో దర్పః పూర్వమేవ సమావిశత్ ॥ 7
దేవతలు స్నానార్థం తీర్థాల నాశ్రయించారు. రాక్షసులు తీర్థాల వైపు చూడనుకూడ చూడలేదు. అధర్మం కారణంగా దేవతలలో గర్వం వృద్ధి చెందింది. (7)
దర్పాన్మానః సమభవత్ మానాత్ క్రోధో వ్యజాయత ।
క్రోధాదహ్రీస్తతోఽలజ్జా వృత్తం తేషాం తతోఽనశత్ ॥ 8
గర్వం వలన అహంకారం, అహంకారం వలన క్రోధం ఏర్పడి, క్రోధం వలన నిర్లజ్జ, నిర్లజ్జ వలన సదాచారహీనత వారిలో కలిగాయి. (8)
తానలజ్జాన్ గతహ్రీకాన్ హీనవృత్తాన్ వృథావ్రతాన్ ।
క్షమా లక్ష్మీః స్వధర్మశ్చ న చిరాత్ ప్రజహుస్తతః ॥ 9
లక్ష్మీస్తు దేవానగమద్ అలక్ష్మీరసురాన్ నృప ।
తానలక్ష్మీసమావిష్టాన్ దర్పోపహతచేతసః ॥ 10
దైతేయాన్ దానవాంశ్చైవ కలిరప్యావిశత్ తతః ।
తానలక్ష్మీసమావిష్టాన్ దానవాన్ కలినా హతాన్ ॥ 11
దర్పాభిభూతాన్ కౌంతేయ క్రియాహీనానచేతసః ।
మానాభిభూతానచిరాద్ వినాశః సమపద్యత ॥ 12
కౌంతేయా! సిగ్గు, సంకోచం, సదాచారం, మంచి నడవడిక లేని రాక్షసులను ఓర్పు, లక్ష్మి, స్వధర్మం విడచిపోయాయి. లక్ష్మి దేవతలను చేరింది. అలక్ష్మి (జ్యేష్ఠాదేవి) రాక్షసులను చేరించి. అలక్ష్మి, ప్రవేశించే వారిలో గర్వం, దురహంకారాం పెరిగిపోయాయి. అదే సమయాన దైత్యదానవుల్లో కలి ప్రవేశించాడు. దానవులు అలక్ష్మి చేరటంతో, కలి ప్రభావంచే, దురహంకారంతో సత్కర్మలను చేయలేక వివేకరహితులై ఉన్మత్తులు అయ్యారు. అప్పుడే వారి వినాశం జరిగింది. (9-12)
నిర్యశస్కాస్తథా దైత్యాః కృత్స్నశో విలయం గతాః ।
దేవాస్తు సాగరాంశ్చైవ సరితశ్చ సరాంసి చ ॥ 13
అభ్యాగచ్ఛన్ ధర్మశీలాః పుణ్యాన్యాయతనాని చ ।
తపోభిః క్రతుభిర్దానైః ఆశీర్వాదైశ్చ పాండవ ॥ 14
ప్రజహుః సర్వపాపాని శ్రేయశ్చ ప్రతిపేదిరే ।
ఏవమాదానవంతశ్చ నిరాదానాశ్చ సర్వశః ॥ 15
తీర్థాన్యగచ్ఛన్ విబుధాః తేనాపుర్భూతిముత్తమమ్ ।
(యత్ర ధర్మేణ వర్తంతే రాజానో రాజసత్తమ ।
సర్వాన్ సపత్నాన్ బాధంతే రాజ్యం చైషాం వివర్ధతే ॥)
తథా త్వమపి రాజేంద్ర స్నాత్వా తీర్థేషు సానుజః ॥ 16
పునర్వేత్స్యసి తాం లక్ష్మీమ్ ఏష పన్థాః సనాతనః ।
యశీహీనులై దైత్యులు నశించారు. ధర్మశీలురై దేవతలు సముద్ర, ఆశ్రమ, నదీ, సరోవరతీర్థయాత్రలను సేవించారు. ఆ ప్రదేశాల్లో వారు తపస్సు, యజ్ఞాలు, దానాలు చేయటం చేత మహాత్ముల ఆశీర్వాదంతో పాపాల నుంచి విముక్తులు అయి శుభాల్లో భాగస్వాములు అయ్యారు. ఉత్తమనియమాలతీ దేవతలు తీర్థయాత్రలు సాగించి ప్రతిగ్రహణ లేకుండా తీర్థసంచారం చేశారు. ఉత్తమైశ్వర్యాదులను పొందారు. ధర్మాన్ని అనుసరించి రాజులు పరిపాలన సాగిస్తే వారి రాజ్యం అభివృద్ధి చెంది శత్రువులు నశిస్తారు. కావున ఈవిధంగా సోదరులతో తీర్థయాత్రల్లో స్నానాలు ఆచరించి నీవు పోయిన రాజ్యలక్ష్మిని తిరిగి పొందుతావు. రాజేంద్రా! ఇదియే అత్యుత్తమం అయిన సనాతన మార్గం. (13-16 1/2)
యథైవ హి నృగో రాజా శిబిరౌశీనరో యథా ॥ 17
భగీరథో వసుమనా గయః పూరుః పురూరవాః ।
చరమాణాస్తపో నిత్యం స్పర్శనాదంభసశ్చ తే ॥ 18
తీర్థాభిగమనాత్ పూతాః దర్శనాచ్చ మహాత్మనామ్ ।
అలభంత యశః పుణ్యం ధనాని చ విశాంపతే ॥ 19
తథా త్వమపి రాజేంద్ర లబ్ధాసి విపులాం శ్రియమ్ ।
నృగమహారాజు, ఉశీనరపుత్రుడు శిబి, భగీరథుడు, గయుడు, పూరుడు, పూరూరవుడు, వసుమనుడు తపస్సును ఆచరిస్తూ తీర్థయాత్రలను సాగించి మహాత్ముల దర్శనం చేసి పవిత్రులు అయి కీర్తి, గొప్పధనం సంపాదించారు. రాజేంద్రా! అలాగే నీవు కూడ తీర్థయాత్రలచే పొందిన పుణ్యం కారణంగా అధికసంపదలు పొందుతావు. (17-19 1/2)
యథా చేక్ష్వాకురభవత్ సపుత్రజనబాంధవః ॥ 20
ముచుకుందోఽథ మాంధాతా మరుత్తశ్చ మహీపతిః ।
కీర్తిం పుణ్యామవిందంత యథా దేవాస్తపోబలాత్ ॥ 21
దేవర్షయశ్చ కార్ త్స్న్యేన తథా త్వమసి వేత్స్యసి ।
ధార్తరాష్ట్రాస్త్వధర్మేణ మోహేన చ వశీకృతాః ।
న చిరాద్ వై వినంక్ష్యంతి దైత్యా ఇవ న సంశయః ॥ 22
పుత్రబంధుసేవకసహితుడైన ఇక్ష్వాకుమహారాజు, ముచుకుందుడు, మాంధాత, మరుత్తుడు పుణ్యకీర్తులను ఆర్జించి దేవతల, దేవర్షుల అనుగ్రహంతో కీర్తి, ఐశ్వర్యం సంపాదించారు. అదేవిధంగా నీవు కూడ కీర్తిప్రతిష్ఠలను, ధనాన్ని సాధిస్తావు. ధృతరాష్ట్రుని పుత్రులు దుర్యోధనాదులు పాపమోహవశులై దైత్యుల వలె నశిస్తారు. ఇందులో ఏవిధమైన సందేహం లేదు. (20-22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం చతుర్నవతితమోఽధ్యాయః ॥ 94 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్ర అను తొంబది నాల్గవ అధ్యాయము. (94)
(దాక్షిణాత్యా అధికపాఠము 1 శ్లోకముతో కలిపి మొత్తము 23 శ్లోకాలు)