95. తొంబది ఐదవ అధ్యాయము
పాండవులు నైమిశారణ్యాది తీర్థాలు తిరుగుచు గయుని యజ్ఞాల మహిమ వినుట.
వైశంపాయన ఉవాచ
తే తథా సహితా వీరాః వసంతస్తత్ర తత్ర హ ।
క్రమేణ పృథివీపాల నమిషారణ్యమాగతాః ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు.
రాజా! ఈ విధంగా ఆ పాండవవీరులు వేర్వేరు స్థానాల్లో నివసిస్తూ క్రమంగా నమిశారణ్య తీర్థం చేరారు. (1)
తతస్తీర్థేషు పుణ్యేషు గోమత్యాః పాండవా నృప ।
కృతాబిషేకాః ప్రదదుః గాశ్చ విత్తం చ భారత ॥ 2
భారతా! తరువాథ గోమతీనదీ తీర్థంలో స్నానం చేసి పాండవులు గోదానాలు, ధనదానాలు ఆచరించారు. (2)
తత్ర దేవాన్ పితౄన్ విప్రాన్ తర్పయిత్వా పునః పునః ।
కన్యాతీర్థేఽశ్వతీర్థే చ గవాం తీర్థం చ భారత ।
కాలకోట్యాం వృషప్రస్థే గిరావుష్య చ పాండవాః ॥ 3
బాహుదాయాం మహీపాల చక్రుః సర్వేఽభిషేచనమ్ ।
ప్రయాగే దేవయజనే దేవానాం పృథివీపతే ॥ 4
ఊషురాప్లుత్య గాత్రాణి తపశ్చాతస్థురుత్తమమ్ ।
గంగాయమునయోశ్చైవ సంగమే సత్యసంగరాః ॥ 5
అక్కడ దేవతలను, పితరులను, చాలాసార్లు తృప్తిపరచి కన్యాతీర్థం, అశ్వతీర్థం, కాలకోటి, గోతీర్థం, వృషప్రస్థగిరి తీర్థాల్లో నివసించి వారందరు బాహుదానదిలో స్నానం చేశారు. తరువాత దేవతల యజ్ఞభూమి అయిన ప్రయాగను చేరి గంగా యమునల సంగమాన మునిగారు. ధర్మజుడు అక్కడ స్నానం చేసి కొన్నిరోజులు గొప్పతపస్సు చేశాడు. (3-5)
విపాస్మానో మహాత్మానః విప్రేభ్యః ప్రదదుర్వసు ।
తపస్విజనజుష్టాం చ తతో వేదీం ప్రజాపతేః ॥ 6
జగ్ముః పాండుసుతా రాజన్ బ్రాహ్మణైః సహ భారత ।
తత్ర తే న్యవసన్ వీరాః తపశ్చాతస్థురుత్తమమ్ ॥ 7
సంతర్పయంతః సతతం వన్యేన హవిషా ద్విజాన్ ।
పాపవిముక్తులై వారు బ్రాహ్మణులకు త్రివేణీ సంగమాన ధనాన్ని ఇచ్చారు. పాండవులు బ్రాహ్మణులతో కలిసి తాపససేవితమయిన బ్రహ్మవేదిని చేరాడు. గొప్ప తపస్సులను ఆచరిస్తూ ఆ వీరులక్కడ కొంతకాలం ఉన్నారు. వారు కందమూలఫలాలు తింటూ, వనంలో లభించే హవిస్సుల ద్వారా బ్రాహ్మణులకు తృప్తిని కల్పించారు. (6, 7 1/2)
తతో మహీధరం జగ్ముః ధర్మజ్ఞేనాభిసంస్కృతమ్ .. 8
రాజర్షిణా పుణ్యకృతా గయేనానుపమద్యుతే ।
అసమానతేజా! ప్రయాగనుంచి ధర్మరాజు రాజర్షి అయిన గయుని యజ్ఞాలచే పరిశుద్ధమయిన ఉత్తమపర్వత ప్రాంతం గయా తీర్థం చేరారు. (8 1/2)
నగో గయశిరో యత్ర పుణ్యా చైవ మహానదీ ॥ 9
వానీరమాలినీ రమ్యా నదీ పులినశోభితా ।
అక్కడ గయశిరమనే పర్వతం, నీటి ప్రబ్బలిచెట్లుతో శోభిస్తూ పవిత్రం, రమణీయం అయిన మహానది ఉన్నది. దాని తటాలు ఇసుక తిన్నెలతో అందగించి ఉంటాయి. (9 1/2)
దివ్యం పవిత్రకూటం చ పవిత్రం ధరణీధరమ్ ॥ 10
ఋషిజుష్టం సుపుణ్యం తత్ తీర్థం బ్రహ్మసరోత్తమమ్ ।
అగస్త్యో భగవాన్ యత్ర గతో వైపస్వతం ప్రతి ॥ 11
దివ్యం, పవిత్రశిఖరసహితం, మహర్షిసేవితం ఐన వేరొకపర్వతం అక్కడనే ఉంది. అది పుణ్యదాయకం అయిన తీర్థం. అక్కడే బ్రహ్మసరోవరం ఒకటి ఉంది. అక్కడే అగస్త్యమహర్షి యముని కలియుటకు అక్కడికే వెళ్లాడు. (10,11)
ఉవాస చ స్వయం తత్ర ధర్మరాజః సనాతనః ।
సర్వాసాం సరితాం చైవ సముద్భేదో విశాంపతే ॥ 12
రాజా! ప్రాచీనుడైన యమధర్మరాజు ఆ ప్రదేశాన నివసించాడు. నదులన్నింటిని ఆవిర్భావం అక్కడే. (12)
యత్ర సన్నిహితో నిత్యం మహాదేవః పినాకధృక్ ।
తత్ర తే పాండవా వీరాః చాతుర్మాస్యైస్తదేజిరే ॥ 13
ఋషియజ్ఞేన మహతా యత్రాక్షయవటో మహాన్ ।
పినాకపాణి శంకరుడు నిత్యం ఆ తీర్థాన సన్నిహితుడై ఉంటాడు. చాతుర్మాస్యవ్రతాలు గ్రహించిన పాండవులు ఋషియజ్ఞ, వేదశాస్త్ర, స్వాధ్యాయాలతో ఆయన్ని పూజించారు. అది అక్షయవటం అనే గొప్పతీర్థం. (13 1/2)
అక్షయే దేవయజనే అక్షయం యత్ర వై ఫలమ్ ॥ 14
దేవతల యజ్ఞభూమి అక్షయవటంలో ఆచరించిన సత్కర్మలు అక్షయఫలాన్ని ఇస్తాయి. (14)
తే తు తత్రోపవాసాంస్తు చక్రుర్నిశ్చితమానసాః ।
బ్రాహ్మణాస్తత్ర శతశః సమాజగ్ముస్తపోధనాః ॥ 15
చలనం లేని చిత్తంతో వారందరు అక్కడ ఉపవాసాది దీక్షలను చేపట్టారు. అదే సమయాన వందల కొద్దీ బ్రాహ్మణులు ఆ తీర్థానికి ఏతెంచారు. (15)
చాతుర్మాస్యేనాయజంత ఆర్షేణ విధినా తదా ।
తత్ర విద్యాతపోవృద్ధాః బ్రాహ్మణా వేదపారగాః ।
కథాం ప్రచక్రిరే పుణ్యాం సదసిస్థా మహాత్మనామ్ ॥ 16
శస్త్రోక్త విధివిధానంతో వారు చాతుర్మాస్యాన్ని ఆచరించారు. అక్కడకు వచ్చిన వారందరు విద్య, తపస్సుల్లో ఆరితేరినవారు. వేదాల్లో పారంగతులు. వారందరు సభలో కూర్చుండి మహాత్ముల కథలను వినిపింపసాగారు. (16)
తత్ర విద్యావ్రతస్నాతః కౌమారం వ్రతమాస్థితః ।
శమఠోఽకథయద్ రాజన్ ఆమూర్తరయసం గయమ్ ॥ 17
వారిలో శమఠుడు అనే విద్వాంసుడు ఉన్నాడు. అప్పుడే విద్యను పూర్తిచేసి స్నాతకుడు అయ్యాడు. అతడు జీవితకాల పర్యంతం బ్రహ్మచర్యాన్ని నియమంగా స్వీకరించాడు. శమఠుడు అమూర్తరయసుని పుత్రుడైన గయుని కథను ఇలా వినిపించాడు. (17)
శమఠ ఉవాచ
అమూర్తరయసః పుత్రః గయో రాజర్షిసత్తమః ।
పుణ్యాని యస్య కర్మాణి తాని మే శృణు భారత ॥ 18
రాజశ్రేష్ఠుడు, అమూర్తరయసునిపుత్రుడు గయుడు. అతడు చేసిన పుణ్యకర్మలను వివరిస్తాను. ఓపికతో విను. (18)
యస్య యజ్ఞో బభూవేహ బహ్వన్నో బహుదక్షిణః ।
యత్రాన్నపర్వతా రాజన్ శతశోఽథ సహస్రశః ॥ 19
ఘృతకుల్యాశ్చ దధ్నశ్చ నద్యో బహుశతాస్తథా ।
వ్యంజానానాం ప్రవాహాశ్చ మహార్హాణాం సహస్రశః ॥ 20
రాజా! గయుడు గొప్ప ప్రసిద్ధి గల యజ్ఞాన్ని ఆచరించాడు. ఆ యజ్ఞంలో చాల అన్నం, ధనం వచ్చినవారికి సమకూర్చాడు. అసంఖ్యాక దక్షిణలు ఇచ్చాడు. అన్న పర్వతాలు వందల కొద్దీ, వేలకొద్దీ తరిగిపోయాయి. నెయ్యి, పెరుగుల కుండాలు, నదులు ప్రవహిస్తాయి. వేలకొద్దీ శాకపాకాల ప్రవాహాలు కూడ కనిపించాయి. (19,20)
అహన్యహని చాప్యేవం యాచతాం సంప్రదీయతే ।
అన్యే చ బ్రాహ్మణా రాజన్ భుంజతేఽన్నం సుసంస్కృతమ్ ॥ 21
రాజా! ప్రతిదినం యాచకులకు ఈ ప్రకారంగా అన్నదానం, ధనదానం చేయబడింది. చాలమంది బ్రాహ్మణులు రుచిగా తయారైన అక్కడి అన్నాన్ని తృప్తిగా తిన్నారు. (21)
తత్ర వై దక్షిణాకాలే బ్రహ్మఘోషో దివం గతః ।
న చ ప్రజ్ఞాయతే కించిద్ బ్రహ్మశబ్దేన భారత ॥ 22
భారతా! ఆ యజ్ఞంలో దక్షిణాప్రదాన సమయంలో బ్రహ్మఘోష (వేద ధ్వని) స్వర్గం దాకా వినపడింది. ఆ వేదధ్వనులలో వేరొక ధ్వని వినపడలేదు. (22)
పుణ్యేన చరతా రాజన్ భూర్దిశః ఖం నభస్తథా ।
ఆపూర్ణమాసీచ్ఛబ్దేన తదప్యాసీన్మహాద్భుతమ్ ॥ 23
యత్రస్మ గాథా గాయంతి మనుష్యా భరతర్షభ ।
అన్నపానైః శుభైస్తృప్తాః దేశే దేశే సువర్చసః ॥ 24
అక్కడ అన్నివైపుల వ్యాపించిన పవిత్రశబ్దాలతో భూమి, దిక్కులు, ఆకాశం, స్వర్గం కూడ మారుమ్రోగాయి. ఇది చాల ఆశ్చర్యకరమైన విషయం. ఆ యజ్ఞాన్ని గురించి అందరు ఇలా చెప్పుకొన్నారు. ఈ యజ్ఞంలో దేశదేశాలలోని తేజోవంతులు అన్నపానాదులతో తృప్తిని చెందారు. (23,24)
గయస్య యజ్ఞే కే త్వద్య ప్రాణినో భోక్తుమీప్సవః ।
తత్ర భోజనశిష్టస్య పర్వతాః పంచవింశతిః ॥ 25
గయుని యజ్ఞంలో ఎవరైనా సరే భోజనం చేయాలి అని భావించారు. తినగా మిగిలిన అన్న పర్వతాలు ఆ యజ్ఞంలో ఇరువది అయిదు. (25)
న తత్ పూర్వే జనాశ్చక్రుః న కరిష్యంతి చాపరే ।
గయో యదకరోద్ యజ్ఞే రాజర్షిరమితద్యుతిః ॥ 26
తేజస్సంపన్నుడైన గయుడు ఆ యజ్ఞంలో ఉపయోగించిన ద్రవ్యరాశి ఇంతవరకు ఎవ్వరు వాడలేదు. భవిష్యత్తులో ఉపయోగించలేరు. ఇది అసంభవం. (26)
కథం తు దేవా హవిషా గయేన పరితర్పితాః ।
పునః శక్ష్యంత్యుపాదాతుమ్ అన్యైర్దత్తాని కానిచిత్ ॥ 27
గయుడు దేవతలను అందరినీ హవిస్సులతో గొప్పగా తృప్తి పరచాడు. దాని కారణంగా వారు ఇతరులు ఇచ్చిన హవిస్సులను గ్రహించలేకపోయారు. (27)
సికతా వా యథా లోకే యథా వా దివి తారకాః ।
యథా వా వర్షతో ధారాః అసంఖ్యేయాః స్మ కేనచిత్ ।
తథా గణయితుం శక్యాః గయయజ్ఞే న దక్షిణాః ॥ 28
లోకంలో ఇసుకరేణువులను లెక్కించలేనట్లు, తారకలను గణించలేనట్లు, వర్షధారలను గమనించలేని రీతిగా గయుని యజ్ఞంలో ఇవ్వబడిన దక్షిణలు లెక్కించటం అసాధ్యం. (28)
ఏవంవిధాః సుబహవః తస్య యజ్ఞా మహీపతేః ।
బభూవురస్య సరసః సమీపే కురునందన ॥ 29
కురునందన! బ్రహ్మసరోవరతీరంలో గయుని ఎన్నో యజ్ఞాలు ఈ విధంగా సుసంపన్నం అయ్యాయి. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గయయజ్ఞకథనే పంచనవతితమోఽధ్యాయః ॥ 95 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గయయజ్ఞకథనమను అను తొంబది అయిదవ అధ్యాయము. (95)