93. తొంబది మూడవ అధ్యాయము
ఋషులకు నమస్కరించి పాండవులు తీర్థయాత్రకు వెడలుట.
వైశంపాయన ఉవాచ
తతః ప్రయాంతం కౌంతేయం బ్రాహ్మణా వనవాసినః ।
అభిగమ్య తదా రాజన్ ఇదం వచనమబ్రువన్ ॥ 1
వైశంపాయనుడు పలికాడు.
తీర్థయాత్రలకు బయలుదేరిన ధర్మజుని కామ్యకవనవాసులైన బ్రాహ్మణులు అందరు సమీపించి ఈ విధంగా పలికారు. (1)
రాజంస్తీర్థాని గంతాసి పుణ్యాని భ్రాతృభిః సహ ।
ఋషిణా చైవ సహితః లోమశేన మహాత్మనా ॥ 2
రాజా! సోదరులతో లోమశమహర్షితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళ నిశ్చయించావు. (2)
అస్మానపి మహారాజ నేతుమర్హసి పాండవ ।
అస్మాభిర్హి న శక్యాని త్వదృతే తాని కౌరవ ॥ 3
మహారాజా! మమ్ములను కూడ నీతో తీసికొని పొమ్ము. నీవు లేకుండా ఆ తీర్థాలకు మేము వెళ్ళలేము. (3)
శ్వాపదైరుపసృష్టాని దుర్గాణి విషమాని చ ।
అగమ్యాని నరైరల్పైః తీర్థాని మనుజేశ్వర ॥ 4
రాజా! ఆ తీర్థాలన్నీ క్రూరమృగాలతో నిండి ఉన్నాయి. దుర్గమాలు, కఠినాలు అయిన ఆ తీర్థాలు సామాన్యులు ప్రవేశీంప వీలులేనివి. (4)
భవతో భ్రాతరః శూరాః ధనుర్ధరవరాః సదా ।
భవద్భిః పాలితాః శూరైః గచ్ఛామో వయమప్యుత ॥ 5
నీ సోదరులు పరాక్రమవంతులుఉ, ధనుర్ధారులు. వారిచే రక్షింపబడే మేము మీతో యాత్ర చేయదలచాము. (5)
భవత్ర్పసాదాద్ధి వయం ప్రాప్నుయామ సుఖం ఫలమ్ ।
తీర్థానాం పృథివీపాల వనానాం చ విశాంపతే ॥ 6
రాజా! నీ అనుగ్రహంతో మేము తీర్థయాత్రల, వనవాసాల ఫలితాన్ని సులభంగా పొందుతాము. (6)
తవ వీర్యపరిత్రాతాః శుద్ధాస్తీర్థపరిప్లుతాః ।
భవేమ ధూతపాప్మానః తీర్థసందర్శనాన్నృప ॥ 7
రాజా! మీబలపరాక్రమాలచే రక్షింపబడే ఆ తీర్థాల్లో స్నానం చేసి, పరిశుద్ధులమై ఆ తీర్థ సందర్శనాదులచే పాపం పోగొట్టుకొంటాము. (7)
భవానపి నరేంద్రస్య కార్తవీర్యస్య భారత ।
అష్టకస్య చ రాజర్షేః లోమపాదస్య చైవ హ ॥ 8
భరతస్య చ వీరస్య సార్వభౌమస్య పార్థివ ।
ధ్రువం ప్రాప్స్యసి దుష్ర్పాపాన్ లోకాంస్తీర్థపరిప్లుతః ॥ 9
భారతా! నీవు ఆ తీర్థాల్లో స్నానం ఆచరించి కార్తవీర్యార్జునుడు, భరతచక్రవర్తి, అష్టకుడు, లోమపాదుడు చేరిన లోకాలకు వెళ్ళగలవు. (8,9)
ప్రబాసాదీని తీర్థాని మహేంద్రాదీంశ్చ పర్వతాన్ ।
గంగాద్యాః సరితశ్చైవ ప్లక్షాదీంశ్చ వనస్పతీన్ ॥ 10
త్వయా సహ మహీపాల ద్రష్టుమిచ్ఛామహే వయమ్ ।
యది తే బ్రాహ్మణేష్వస్తి కాచిత్ ప్రీతిర్జనాధిప ॥ 11
కురు క్షిప్రం వచోఽస్మాకం తతః శ్రేయోఽభిపత్స్యసే ।
ప్రభాసాది తీర్థాలు, మహేంద్రాది పర్వతాలు, గంగాదినదులు, జువ్వి మొదలయిన చెట్లు ఉన్న ప్రదేశాలను నీతో తిరిగి మేము కూడ చూస్తాం. బ్రాహ్మణులపై మీకు ప్రేమ ఉంటే మామాటలను తిరస్కరించవద్దు. దీనివలన మాకు శుభం కలుగుతుంది. (10, 11 1/2)
తీర్థాని హి మహాబాహో తపోవిఘ్నకరైః సదా ॥ 12
అనుకీర్ణాని రక్షోభిః తేభ్యో నస్త్రాతుమర్హసి ।
తపస్సులకు విఘ్నం కల్గించే రాక్షసులు అనేకులు తీర్థాలు ఆశ్రయించి ఉన్నారు. వారి నుంచి నీవు మమ్ములను రక్షింపగలవు. (12 1/2)
తీర్థాన్యుక్తాని ధౌమ్యేన నారదేన చ ధీమతా ॥ 13
యాన్యువాచ చ దేవర్షిః లోమశః సుమహాతపాః ।
విధివత్ తాని సర్వాణి పర్యటస్వ నరాధిప ॥ 14
ధూతపాప్మా సహాస్మాభిః లోమశేనాభిపాలితః ।
నీవు పాపరహితుడవై ధౌమ్యముని, బుద్ధిశాలి నారదుడు, లోమశుడు చెప్పిన తీర్థాలను సేవించి లోమశుని కారణంగా ఆ తీర్థాల్లో పవిత్రుడవై మాతో కలిసి ఆ తీర్థాల్లో సంచరించు. (13 14 1/2)
స రాజా పూజ్యమానస్తైః హర్షాదశ్రుపరిప్లుతః ॥ 15
భీమసేనాదిభిర్వీరైః భ్రాతౄభిః పరివారితః ।
బాఢమిత్యబ్రవీత్ సర్వాన్ తానృషీన్ పాండవర్షభః ॥ 16
లోమశం సమనుజ్ఞాప్య ధౌమ్యం చైవ పురోహితమ్ ।
యుధిష్ఠిరుడు సోదరులతో పరివేష్టితుడై వారి మాటలు విన్నవెంటనే ఆనందాశ్రువులను చిందించాడు. లోమశ, ధౌమ్యుల ఆజ్ఞను గైకొని 'బాగుంది' అని వారి మాటలను ప్రశంసించి వారిని తనతో కొనిపోవుటకు అంగీకరించాడు. (15, 16 1/2)
తతః స పాండవశ్రేష్ఠః భ్రాతృభిః సహితో వశీ ॥ 17
ద్రౌపద్యా చానవద్యాంగ్యా గమనాయ మనో దధే ।
తరువాత సోదరులతో, భార్యతో కలిసి వెళ్ళుటకు పాండవశ్రేష్ఠుడైన ధర్మరాజు నిశ్చయించాడు. (17 1/2)
అథ వ్యాసో మహాభాగః తథా పర్వతనారదౌ ॥ 18
కామ్యకే పాండవం ద్రష్టుం సమాజగ్ముర్మనీషిణః ।
తేషాం యుధిష్ఠిరో రాజా పూజాం చక్రే యథావిధి ।
సత్కృతాస్తే మాహాభాగాః యుధిష్ఠిరమథాబ్రువన్ ॥ 19
ఇంతలో వేదవ్యాసుడు, పర్వతనారదులు కామ్యకంలో ఉన్న ధర్మజుని చూడాలని వచ్చారు. వారికి యథావిధిగా ధర్మరాజు పూజ చేశాడు. సత్కరాన్ని పొంది వారు ధర్మజునితో ఇలా పలికారు. (18,19)
ఋషయ ఊచుః
యుధిష్ఠిర యమౌ భీమ మనసా కురుతార్జవమ్ ।
మనసా కృతశౌచా వై శుద్ధాస్తీర్థాని యాస్యథ ॥ 20
ఋషులు పలికారు.
ధర్మజభీమనకులసహదేవులారా! మీరు తీర్థయాత్ర విషయాన మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోండి. మనస్సు పరిశుద్ధం అయినప్పుడే తీర్థయాత్రలు చేయాలి. (20)
శరీరనియమం ప్రాహుః బ్రాహ్మణా మానుషం వ్రతమ్ ।
మనోవిశుద్ధాం బుద్ధిం చ దైవమాహు ర్ర్వతం ద్విజాః ॥ 21
బ్రాహ్మణులు శరీరం పరిశుద్ధం అయితే మానుషవ్రతం అని, మనస్సు పరిశుద్ధం అయితే దైవవ్రతం అని చెప్తారు. (21)
మనో హ్యదుష్టం శౌచాయ పర్యాప్తం వై నరాధిప ।
మైత్రీం బుద్ధిం సమాస్థాయ శుద్ధాస్తీర్థాని ద్రక్ష్యథ ॥ 22
రాజా! మనస్సు రాగద్వేషాలకు దూరమైనప్పుడు అది శుద్ధమవుతుంది. ప్రాణులన్నింటిపట్ల మైత్రీభావంతో శుద్ధంగా ఉండి తీర్థయాత్రలు చేయాలి. (22)
తే యూయం మానసైః శుద్ధాః శరీరనియమవ్రతైః ।
దైవం వ్రతం సమాస్థాయః యథోక్తం ఫలమాప్స్యథ ॥ 23
మీరు ఇంతవరకు శరీరంతో శుద్ధులు అయి మానుషవ్రతం చేశారు. ఇకపై దైవవ్రతాన్ని ఆశ్రయించి మనస్సును పరిశుద్ధం చేసుకొని తీర్థయాత్రలు ఆచరించి తగిన ఫలాన్ని పొందండి. (23)
తే తథేతి ప్రతిజ్ఞాయా కృష్ణయా సహ పాండవాః ।
కృతస్వస్త్యయనాః సర్వే మునిభిర్దివ్యమానుషైః ॥ 24
వారందరు అట్లే అని సమ్మతించి ఆ నియమాలను పాలించుటకు అంగీకరించారు. పిమ్మట దివ్యులు, మానవులు అయిన ఋషులందరు స్వస్తివాక్యాలతో వారిని ఆశీర్వదించారు. (24)
లోమశస్యోపసంగృహ్య పాదౌ ద్వైపాయనస్య చ ।
నారదస్య చ రాజేంద్ర దేవర్షేః పర్వతస్య చ ॥ 25
ధౌమ్యేన సహితా వీరాః తథా తైర్వనవాసిభిః ।
మార్గశీర్ష్యామతీతాయాం పుష్యేణ ప్రయయుస్తతః ॥ 26
వ్యాస, లోమశ, పర్వత, నారదులపాదాలకు నమస్కరించి బ్రాహ్మణులు, లోమశుడు, పురోహితుడు ధౌమ్యుడు వెంటరాగా తీర్థయాత్రలకు బయలుదేరారు. మార్గశీర్షశుద్ధపూర్ణిమ గడచి పుష్యనక్షత్రోదయం అయిన పిదప వారు యాత్రను ప్రారంబించారు. (25,26)
కఠినాని సమాదాయ చీరాజినజటాధరాః ।
అభేద్యైః కవచైర్యుక్తాః తీర్థాన్యన్వచరంస్తతః ॥ 27
పాండవులు నారచీరలనూ, మృగ, చర్మాలను ధరించారు. వారి తలలపై జటలున్నాయి. అభేద్య కవచాలను ధరించి, సూర్యుడిచ్చిన వంటపాత్రను తీసికొని తీర్థయాత్రకు బయలు దేరారు. (27)
ఇంద్రసేనాదిభిర్భృత్యైః రథైః పరిచతుర్దశైః ।
మహానసవ్యాపృతైశ్చ తథాన్యైః పరిచారకైః ॥ 28
ఇంద్రసేనుడు మొదలగు భృత్యులు, పదిహేను రథాలు వెంట రాసాగాయి. వంట ఇంటి బాధ్యతగల సేవకులు కూడ అనుసరించారు. (28)
సాయుధా బద్ధనిస్త్రింశాః తూణవంతః సమార్గణాః ।
ప్రాఙ్ముఖాః ప్రయయుర్వీరాః పాండవా జనమేజయ ॥ 29
జనమేజయా! సాయుధులు, ఖడ్గధారులు, అమ్ములపొదులతో బాణసంపత్తి కలవారు, వీరులు అయిన పాండవులు తూర్పుదిక్కుగా యాత్రను ఆరంభించారు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం త్రినవతితమోఽధ్యాయః ॥ 93 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్ర అను తొంబది మూడవ అధ్యాయము. (93)