92. తొంబది రెండవ అధ్యాయము

లోమశుని ద్వారా ఇంద్రసందేశము విని ధర్మరాజు తనవారితో తీర్థయాత్రకు పోవుట.

లోమశ ఉవాచ
ధనంజయేన చాప్యుక్తం యత్తచ్ఛృణు యుధిష్ఠిర ।
యుధిష్ఠిరం భ్రాతరం మే యోజయేర్ధర్మ్యయా శ్రియా ॥ 1
త్వం హి ధర్మాన్ పరాన్ వేత్థ తపాంసి చ తపోధన ।
శ్రీమతాం చాపి జానాసి ధర్మం రాజ్ఞాం సనాతనమ్ ॥ 2
లోమశుడు చెప్పాడు.
నేను వచ్చేటప్పుడు అర్జునుడు పలికిన మాటలు విను. ధర్మబద్ధమయిన రాజ్యలక్ష్మిని గూర్చి ఆలోచించమని ధర్మరాజుతో చెప్పండి. మీరు గొప్ప గొప్ప తపస్సులు, ధర్మాలను గూర్చి తెలిసినవారు. శ్రీసంపన్నులు రాజుల ధర్మాలను పరిపూర్ణంగా తెలుసుకొన్నవారు. (1,2)
స భవాన్ పరమం వేద పావనం పురుషం ప్రతి ।
తేన సంయోజయేథాస్త్వం తీర్థపుణ్యేన పాండవాన్ ॥ 3
పురుషులను పవిత్రం చేయగల సాధనాలు మీరు తెలిసి ఆచరించినారు. పాండవులకు తీర్థయాత్ర ద్వారా కలిగే పుణ్యఫలాన్ని అందించటానికి ప్రయత్నం చేయండి. (3)
యథా తీర్థాని గచ్ఛేత గాశ్చ దద్యాత్ స పార్థివః ।
తథా సర్వాత్మనా కార్యమ్ ఇతి మామర్జునోఽబ్రవీత్ ॥ 4
యుధిష్ఠిరుడు తీర్థాలకు వెళ్లేటట్లు, గోవులను దానం చేసేటట్లు అన్ని విధాలా మీరు ప్రయత్నించండి అని అర్జునుడు నాతో పలికాడు. (4)
భవతా చానుగుప్తోఽసౌ చరేత్ తీర్థాని సర్వశః ।
రక్షోభ్యో రక్షితవ్యశ్చ దుర్గేషు విషమేషు చ ॥ 5
మీరు సురక్షితులై తీర్థయాత్రలు చేయండి. దుర్గస్థానాల్లో, కఠిన సమయాల్లో మీరు రాక్షసుల నుంచి ధర్మజుని రక్షించండి. (5)
దధీచ ఇవ దేవేంద్రం యథా చాప్యంగిరా రవిమ్ ।
తథా రక్షస్వ కౌంతేయాన్ రాక్షసేభ్యో ద్విజోత్తమ ॥ 6
దధీచి మహర్షి ఇంద్రుని కాపాడినవిధంగా, అంగిరసుడు సూర్యుని రక్షించిన ప్రకారం మీరు రాక్షసులబారి నుంచి మాసోదరులను కాపాడండి. (6)
యాతుధానా హి బహవః రాక్షసా పర్వతోపమాః ।
త్వయాభిగుప్తం కౌంతేయం న వివర్తేయురంతికమ్ ॥ 7
పర్వతాకారులైన రాక్షసపిశాచాలు అయినా మీరక్షణలో ఉండగా ధర్మజుని సమీపించలేరు. (7)
సోఽహమింద్రస్య వచనాత్ నియోగాదర్జునస్య చ ।
రక్షమాణో భయేభ్యస్త్వాం చరిష్యామి త్వయా సహ ॥ 8
ఇంద్రార్జునుల అభ్యర్థన కారణంగా నేను అన్నివిధాల భయాలనుండి నిన్ను కాపాడుతూ నీతో తిరుగుతాను. (8)
ద్విస్తీర్థాని మయా పూర్వం దృష్టాని కురునందన ।
ఇదం తృతీయం ద్రక్ష్యామి తాన్యేవ భవతా సహ ॥ 9
కురునందనా! నేను పూర్వం రెండుసార్లు తీర్థాలు అన్నింటిని చూచాను. నీతో కలిసి మూడవపర్యాయం వాటిని దర్శిస్తాను. (9)
ఇయం రాజర్షిభిర్యాతా పుణ్యకృద్భిర్యుధిష్ఠిర ।
మవాదిభిర్మహారాజ తీర్థయాత్రా భయాపహా ॥ 10
మహారాజా! ఈ తీర్థయాత్ర అన్నిభయాలను పోగొట్టేది. రాజర్షులైన మన్వాదులు దీన్ని సంపూర్ణంగా ఆచరించి ధర్మపాలనం చేశారు. (10)
నానృజుర్నాకృతాత్మా చ నావిద్యో న చ పాపకృత్ ।
స్నాతి తీర్థేషు కౌరవ్య న చ వక్రమతిర్నరః ॥ 11
ఋజుప్రవర్తలేనివాడు, మనస్సు ఇంద్రియాలు అదుపులో ఉండనివాడు, విద్యాహీనుడు, పాపాత్ముడు, కుటిలుడు తీర్థయాత్రలు చేయలేరు. (11)
త్వం తు ధర్మమతిర్నిత్యం ధర్మజ్ఞః సత్యసంగరః ।
విముక్తః సర్వసంగేభ్యః భూయ ఏవ భవిష్యసి ॥ 12
నీ మనస్సు సదా ధర్మంపై లగ్నమై, ధర్మజ్ఞుడవై, ప్రతిజ్ఞా పాలనచేస్తూ ఐహికసుఖాలపట్ల ఆసక్తిలేనివాడవై ఉన్నావు కనుక ముందుముందు నీలో ఈ గుణాలు పూర్తిగా వికసిస్తాయు. (12)
యథా భగీరథో రాజా రాజానశ్చ గయాదయః ।
యథా యయాతిః కౌంతేయ తథా త్వమపి పాండవ ॥ 13
భగీరథమహారాజు, గయాదులు, యయాతి ఎంతమహనీయులో నీవూ అలాంటివాడవే. (13)
యుధిష్ఠిర ఉవాచ
న హర్షత్ సంప్రపశ్యామి వాక్యస్యాస్యోత్తరం క్వచిత్ ।
స్మరేద్ధి దేవరాజోఽయం కో నామాభ్యధికస్తతః ॥ 14
అపుడు ధర్మజుడు ఇలా అన్నాడు. 'మీ దర్శనం, మీ మాటలు విని నేనెంతో ఆనందాన్ని పొందాను. మీకు ఈ వచనాలకి బదులు ఇవ్వలేను. దేవరాజు ఇంద్రుడు ఎవరిని తలంచునో వానికన్న ఈ లోకంలో ధన్యుడు లేడు. (14)
భవతా సంగమో యస్య భ్రాతా చైవ ధనంజయః ।
వాసవః స్మరతే యస్య కో నామాభ్యధికస్తతః ॥ 15
మీ అనుగ్రహాన్ని, అర్జునుని వంటి సోదరుని పొంది, ఇంద్రునిజ్ఞాపకాలలో ఉన్నవానికంటె సౌభాగ్యవంతుడు లోకాన లేడుకదా! (15)
యచ్చ మాం భగవానాహ తీర్థానాం దర్శనం ప్రతి ।
ధౌమ్యస్య వచనాదేషా బుద్ధిః పూర్వం కృతైవ మే ॥ 16
మీరు తీర్థయాత్రని సాగించమని పలికారు. మా పురోహితులు ధౌమ్యుల కారణంగా ఇంతకు పూర్వమే నేను దానిని ఆలోచించాడు. (16)
తద్ యదా మన్యసే బ్రహ్మన్ గమనం తీర్థదర్శినే ।
తదైవ గంతాస్మి తీర్థాన్ ఏష మే నిశ్చయః పరః ॥ 17
మీరు ఏ సమయాన ఆదేశిస్తారో ఆసమయంలో తీర్థయాత్రను సాగిస్తాను. ఇదే నానిశ్చయం. (17)
వైశంపాయన ఉవాచ
గమనే కృతబుద్ధిం తు పాండవం లోమశోఽబ్రవీత్ ।
లఘుర్భవ మహారాజ లఘుః స్వైరం గమిష్యసి ॥ 18
వైశంపాయనుడన్నాడు.
తీర్థయాత్రలకు సంకల్పించిన పాండుపుత్రునితో లోమశుడు అన్నాడు - మీరు శీఘ్రంగా పరివారాన్ని తగ్గించండి. అప్పుడు తీర్థయాత్రలు సులభం. (18)
యుధిష్ఠిర ఉవాచ
భిక్షాభుజో నివర్తంతాం బ్రాహ్మణా యతయశ్చ యే ।
క్షుత్తృడధ్వశ్రమాయాసశీతార్తిమసహిష్ణవః ॥ 19
యుధిష్ఠిరుడు పలికాడు.
భిక్షాటన ద్వారా జీవించే బ్రాహ్మణులు, యతులు, ఆకలిదప్పులు, అలసట, మార్గాయాసంగలవారు, చలిబాధను తట్టుకోలేని వారు వెనుకకు మరలండి. (19)
తే సర్వే వినివర్తంతాం యే చ మిష్టభుజో ద్విజాః ।
పక్వాన్నలేహ్యపానానాం మాంసానాం చ వికల్పకాః ॥ 20
ఎవరు మృష్టాన్నాన్ని తింటారో, పక్వాన్నాలు ఆశిస్తారో, మాంసభోజనులో వారందరు వెనుకకు తిరగండి. (20)
తేఽపి సర్వే నివర్తంతాం యే చ సూదానుయాయినః ।
మయా యథోచితాజీవ్యైః సంవిభక్తాశ్చ వృత్తిభిః ॥ 21
ఎవరు వంటింటి అవసరం కలవారో, ఎవరెవరికి భోజన వ్యవస్థ ప్రత్యేకంగా నాచే చేయబడిందో వారు కూడ మరలండి. (21)
యే చాప్యనురతాః పౌరాః రాజభక్తిపురః సరాః ।
ధృతరాష్ట్రం మహారాజమ్ అభిగచ్ఛంతు తే చ వై ॥ 22
స దాస్యతి యథాకాలమ్ ఉచితా యస్య యా భృతిః ।
స చేద్ యథోచితాం వృత్తిం న దద్యాన్మనుజేశ్వరః ॥ 23
అమత్ర్పియహితార్థాయ పాంచాల్యో వః ప్రదాస్యతి ॥ 24
రాజభక్తితో ఎవరు నన్ను ఇప్పుడు అనుసరిస్తున్నారో, వారు ధృతరాష్ట్రమహారాజు సమీపానికి చేరండి. ఆ రాజే కాలోచితాలయిన వృత్తులను ఏర్పరుస్తాడు. ధృతరాష్ట్రుడు అట్లు చేయనిచో పాంచాలరాజు ద్రుపదుడు మీకందరకు తగిన జీతభత్యాలు ఏర్పాటు చేస్తాడు. (22-24)
వైశంపాయన ఉవాచ
తతో భూయిష్ఠశః పౌరాః గురుభారప్రపీడితాః ।
విప్రాశ్చ యతయో ముఖ్యాః జగ్ముర్నాగపురం ప్రతి ॥ 25
అప్పటికి అప్పుడు నాగరికులు, బ్రాహ్మణులు, యతులు మానసిక దుఃఖపీడితులౌ హస్తినాపురానికి బయలుదేరారు. (25)
తాన్ సర్వాన్ ధర్మరాజస్య ప్రేమ్ణా రాజాంబికాసుతః ।
ప్రతిజగ్రాహ విధివద్ ధనైశ్చ సమతర్పయత్ ॥ 26
అంబికానందనుడైన ధృతరాష్ట్రుడు ప్రేమతో వారందరిని తనవారిగా చేసికొని, ధనాన్ని కూడ ఇచ్చి తృప్తిపరచాడు. (26)
తతః కుంతీసుతో రాజా లఘుభిర్ర్బాహ్మణైః సహ ।
లోమశేన చ సుప్రీతః త్రిరాత్రం కామ్యకేఽవసత్ ॥ 27
ధర్మరాజు కొంతమంది బ్రాహ్మణులు, లోమశమహర్షి, సోదరులు, భార్యతో కలిసి మూడురాత్రులు ఆనందంతో కామ్యకవనంలోనే నివసించాడు. (27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం ద్వినవతితమోఽధ్యాయః ॥ 92 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్ర అను తొంబది రెండవ అధ్యాయము. (92)