91. తొంబది ఒకటవ అధ్యాయము
లోమశుడు వచ్చి ధర్మరాజుకు ఇంద్రసందేశము, అర్జునుని అస్త్రప్రాప్తి చెప్పుట.
వైశంపాయన ఉవాచ
ఏవం సంభాషమాణే తు ధౌమ్యే కౌరవనందన ।
లోమశః స మహాతేజాః ఋషిస్తత్రాజగామ హ ॥ 1
తం పాండవాగ్రజో రాజా సగణో బ్రాహ్మణాశ్చ తే ।
ఉపాతిష్ఠన్మహాభాగం దివి శక్రమివామరాః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. ధౌమ్యుడు ఇలా అంటూ ఉండగా తేజోవంతుడైన లోమశుడు అక్కడికి చేరాడు. ధర్మరాజు బ్రాహ్మణులతో, సోదరులతో కలిసి ఇంద్రునికి దేవతలు ఎదురువెళ్ళినట్లు ఎదురేగి స్వాగతం పలికాడు. (1,2)
సమభ్యర్చ యథాన్యాయం ధర్మపుత్రో యుధిష్ఠిరః ।
పప్రచ్ఛాగమనే హేతుమ్ అటనే చ ప్రయోజనమ్ ॥ 3
ధర్మనందనుడైన యుధిష్ఠిరుడు యథార్హంగా పూజించి ఆసనంపై కూర్చుండబెట్టి ఆ తపోవనాలు తిరగటంలోని ప్రయోజనం అడిగాడు. (3)
స పృష్టః పాండుపుత్రేణ ప్రీయమాణో మహామనాః ।
ఉవాచ శ్లక్ ష్ణయా వాచా హర్షయన్నివ పాండవాన్ ॥ 4
పాండుపుత్రునిచే ప్రశ్నింపబడిన లోమశ మహర్షి ప్రసన్నుడై సుమధురంగా పాండవుల హర్షాన్ని పెంచుతూ ఇలా అన్నాడు. (4)
సంచరన్నస్మి కౌంతేయ సర్వాన్ లోకాన్ యదృచ్ఛయా ।
గతః శక్రస్య భవనం తత్రాపశ్యం సురేశ్వరమ్ ॥ 5
కౌంతేయా! నా కోరికను అనుసరించి సంపూర్ణ విశ్వయాత్ర చేస్తున్నాను. ఒక రోజున ఇంద్రుని భవనానికి పోయి దేవరాజును కలిశాను. (5)
తవ చ భ్రాతరం వీరమ్ అపశ్యం సవ్యసాచినమ్ ।
శక్రస్యార్ధాసనగతం తత్ర మే విస్మయో మహాన్ ॥ 6
అక్కడ నీ సోదరుడు, సవ్యసాచి అయిన అర్జునుని చూశాను. అతడు ఆ సమయాన ఇంద్రసింహాసనంపై కూర్చున్నాడు. ఆ దశలో అర్జునుని చూచి ఆశ్చర్యం పొందాను. (6)
ఆసీత్ పురుషశార్దూల దృష్ట్వా పార్థం తథాగతమ్ ।
ఆహ మాం తత్ర దేవేశః గచ్ఛ పాండుసుతాన్ ప్రతి ॥ 7
నీ సోదరుడు ఇంద్రసింహాసనంపై కూర్చుండగా చూచి మిక్కిలి విస్మయం పొందాను. ఆ సమయాన "నీవు పాండవుల వద్దకు పొమ్ము" అని ఇంద్రుడు నాతో అన్నాడు. (7)
సోఽహమభ్యాగతః క్షిప్రం దిదృక్షుస్త్వాం సహానుజమ్ ।
వచనాత్ పురుహూతస్య పార్థస్య చ మహాత్మనః ॥ 8
ఇంద్రార్జునుల ఆదేశానుసారం నిన్ను చూడటానికి శీఘ్రంగా ఇక్కడకు వచ్చాను. ఈ విషయంలో ఇంద్రార్జునులిద్దరూ నన్ను ప్రోత్సహించారు. (8)
ఆఖ్యాస్యే తే ప్రియం తాత మహత్ పాండవనందన ।
ఋషిభిః సహితో రాజన్ కృష్ణయా చైవ తచ్ఛృణు ॥ 9
యత్ త్వయోక్తో మహాబాహుః అస్త్రార్థం భరతర్షభ ।
తదస్త్రమాప్తం పార్థేన రుద్రాదప్రతిమం విభో ॥ 10
పాండుపుత్రా! నీకు ప్రియమైన విషయాన్ని చెప్తాను. మహర్షులు, ద్రౌపది, సోదరులతో కలిసి ఈ మాటలు విను. నీవు మహాబాహువైన అర్జునుని ఏ దివ్యాస్త్రాలసంపాదనకు పంపావో ఆ దివ్యాస్త్రాలను, రుద్రుని నుంచి పాశుపతాన్ని కూడ అర్జునుడు గ్రహించాడు. (9,10)
యత్ తద్ బ్రహ్మశిరో నామ తపసా రుద్రమాగమత్ ।
అమృతాదుత్థితం రౌద్రం తల్లబ్ధం సవ్యసాచినా ॥ 11
బ్రహ్మశిరోనామకాస్త్రం అమృతంతో కలిసి తపశ్శక్తి ప్రభావంతో శంకరుని చేరింది. ఆ పాశుపతాన్ని సవ్యసాచి అయిన అర్జునుడు శంకరుని నుంచి సాధించాడు. (11)
తత్ సమంత్రం ససంహారం సప్రాయశ్చిత్తమంగలమ్ ।
వజ్రమస్త్రాణి చాన్యాని దండాదీని యుధిష్ఠిర ॥ 12
వజ్రసమాన మయిన రుద్రుని పాశుపతం మంత్ర, ప్రయోగ, ఉపసంహార, మంగళాలతో రుద్రుని నుంచి వశం అయ్యింది. దానితో బాటు దండాది - ఆయుధాలు కూడ హస్తగతం అయ్యాయి. (12)
యమాత్ కుబేరాద్ వరుణాద్ ఇంద్రాచ్చ కురునందన ।
అస్త్రాణ్యధీతవాన్ పార్థః దివ్యాన్యమితవిక్రమః ॥ 13
మిక్కిలి పరాక్రమవంతుడైన అర్జునుడు యమ, కుబేర, వరుణ, ఇంద్రాదుల నుండి ఎన్నో దివ్యాస్త్రాలను పొందాడు. (13)
విశ్వావసోస్తు తనయాద్ గీతం నృత్యం చ సామ చ ।
వాదిత్రం చ యథాన్యాయం ప్రత్యవిందద్ యథావిధి ॥ 14
ఇంతేకాక విశ్వావసువను గంధర్వుని పుత్రుని వద్ద సామగానం, నృత్యం, గీతం, వాద్యకళ కూడ నియమపూర్వకంగా అభ్యసించి, కృతకృత్యుడు అయినాడు. (14)
ఏవం కృతాస్త్రః కౌంతేయః గాంధర్వం వేదమాప్తవాన్ ।
సుఖం వసతి బీభత్సుః అనుజస్యానుజస్తవ ॥ 15
ఈ విధంగా అస్త్రవిద్యలో నిపుణుడై, గాంధర్వవేదాన్ని నేర్చుకొన్నాడు. భీమసేనునికి తరువాతి తమ్ముడు అర్జునుడు అక్కడ సుఖంగా ఉన్నాడు. (15)
యదర్థం మాం సురశ్రేష్ఠః ఇదం వచనమబ్రవీత్ ।
తచ్చ తే కథయిష్యామి యుధిష్ఠిర నిబోధ మే ॥ 16
దేవరాజైన ఇంద్రుడు నాతో నీకొరకు పంపిన సందేశాన్ని ఇప్పుడు నీకు వివరంగా చెబుతాడు. విను. (16)
భవాన్ మనుష్యలోకేఽపి గమిష్యతి న సంశయః ।
బ్రూయాద్ యుధిష్ఠిరం తత్ర వచనాన్మే ద్విజోత్తమ ॥ 17
ఆగమిష్యతి తే భ్రాతా కృతాస్త్రః క్షిప్రమర్జునః ।
సురకార్యం మహత్ కృత్వా యదశక్యం దివౌకసామ్ ॥ 18
తపసాపి త్వమాత్మానం యోజయ భ్రాతృభిః సహ ।
తపసో హి పరం నాస్తి తపసా విందతే మహత్ ॥ 19
మహాత్మా! మీరు తిరుగుతూ తిరుగుతూ భూలోకానికి చేరుతారు కదా! నావిజ్ఞప్తి మేరకు ధర్మజుని వద్దకు పోయి ఇట్లు విన్నవించండి. " నీసోదరుడైన అర్జునుడు అస్త్రవిద్యలో మేటి అయ్యాడు. దేవతల కార్యభారం అతనిపై ఉంచబడింది. దేవతలు కూడ దాన్ని సాధించలేరు. సిద్ధులను పొంది అర్జునుడు వచ్చేవరకూ నీవు కూడ మిగిలిన సోదరులతో తపస్సును ఆచరించు. తపస్సును మించిన వేరొకసాధనం లేదు. తపస్సే ఎన్నో గొప్పదనాలను సమకూరుస్తుంది. (17-19)
అహం చ కర్ణం జానామి యథావద్ భరతర్షభ ।
సత్యసంధం మహోత్సాహం మహావీర్యం మహాబలమ్ ॥ 20
నేను కర్ణుని బాగా తెలిసినవాడను. అతడు సత్యప్రతిజ్ఞ కలవాడు, ఉత్సాహవంతుడు, పరాక్రమవంతుడు మహాబలుడు. (20)
మహాహవేష్వప్రతిమం మహాయుద్ధవిశారదమ్ ।
మహాధనుర్ధరం వీరం మహాస్త్రం వరవర్ణినమ్ ॥ 21
మహేశ్వరసుతప్రఖ్యమ్ ఆదిత్యతనయం ప్రభుమ్ ।
తథార్జునమతిస్కందం సహజోల్బణపౌరుషమ్ ॥ 22
న స పార్థస్య సంగ్రామే కలామర్హతి షోడశీమ్ ।
యచ్చాపి తే భయం కర్ణాత్ మనసిస్థమరిందమ ॥ 23
తచ్చాప్యపహరిష్యామి సవ్యసాచిన్యుపాగతే ।
యచ్చ తే మానసం వీర తీర్థయాత్రామిమాం ప్రతి ।
స మహర్షిర్లోమశస్తే కథయిష్యత్యసంశయమ్ ॥ 24
చాలా సంగ్రామాలలో అతనికి సమానుడు ఎవరూ కనిపించలేదు. అతడు గొప్ప ధనుర్ధరుడు, యుద్ధవిశారదుడు, అస్త్రశస్త్రాలను తెలిసినవాడు, శ్రేష్ఠుడు, సుందరుడు, మహేశ్వరుని పుత్రుడు అయిన కార్తికేయునితో పరాక్రమంలో సమానుడు. సూర్యుని పుత్రుడు. శక్తిశాలి అయిన వీరుడు. ఆ విధంగా అర్జునుని గురించి నేను తెలిసినవాడను. అతడు విక్రమంలో కార్తికేయుని మించినవాడు. యుద్ధాన కర్ణుడు అర్జునునితో పదిహారవవంతు కూడా కాడు. ఏ విషయాన్ని అనుసరించి కర్ణుని విషయంలో నీకు భయం ఉందో అది అంతా అర్జునుని తిరిగి రాకతో సమసిపోతుంది. తీర్థయాత్రవిషయంలో నీకు ఏ మనస్సంకల్పం ఉందో దానిని గూర్చి కూడ ఈ మహాత్ముడు వివరిస్తాడు. (21-24)
యచ్చ కించిత్ తపోయుక్తం ఫలం తీర్థేషు భారత ।
బ్రహ్మర్షిరేష బ్రూయాత్ తే తచ్ర్ఛద్ధేయం న చాన్యథా ॥ 25
తీర్థాల్లో ఏవి తపస్సుకు అనుగుణంగా ఉంటాయో వాటిని అన్నింటినీ లోమశమహర్షి నీకు వివరిస్తాడు. వారిపై విశ్వాసం ఉంచు. సంశయబుద్ధిని నీవు విడిచిపెట్టు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశసంవాదే ఏకనవతితమోఽధ్యాయః ॥ 91 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశసంవాదమను తొంబది ఒకటవ అధ్యాయము. (91)