86. ఎనుబది ఆరవ అధ్యాయము
యుధిష్ఠిరుడు పుణ్యతపోవనాశ్రమాల గురించి దౌమ్యుని ప్రశ్నించుట.
వైశంపాయన ఉవాచ
భ్రాతౄణాం మతమాజ్ఞయా నారదస్య చ ధీమతః ।
పితామహసమం ధౌమ్యం ప్రాహ రాజా యుధిష్ఠిరః ॥ 1
సోదరుల అభిప్రాయాన్ని, బుద్ధిశాలి అయిన నారదుని అభిప్రాయాలను గమనించి యుధిష్ఠిరుడు బ్రహ్మతో సమానం అయిన తెలివితేటలు గల ధౌమ్యుని అడిగాడు. (1)
మయా స పురుషవ్యాఘ్రః జిష్ణుః సత్యపరాక్రమః ।
అస్త్రహేతోర్మహాబాహుః అమితాత్మా వివాసితః ॥ 2
నాచే అస్త్రప్రాప్తికై జయశీలి, సత్యపరాక్రమవంతుడు, మనస్వి, పురుషశ్రేష్ఠుడు, బాహుసంపన్నుడు అయిన అర్జునుడు తీర్థయాత్ర నెపంతో దూరం చేయబడ్డాడు. (2)
స హి వీరోఽనురక్తశ్చ సమర్థశ్చ తపోధనః ।
కృతీ చ భృశమప్యస్త్రే వాసుదేవ ఇవ ప్రభుః ॥ 3
ఆ వీరుడు నాపై ప్రేమకలవాడు, సమర్థుడు, తపోధనుడు, ధన్యుడు, అస్త్రవేది, శ్రీకృష్ణునివలె ప్రతిభావంతుడును. (3)
అహం హ్యేతావుభౌ బ్రహ్మన్ కృష్ణావరివిఘాతినౌ ।
అభిజానామి విక్రాంతౌ తథా వ్యాసః ప్రతాపవాన్ ॥ 4
కృష్ణనామ ధారులైన, వీరిరువురినీ శత్రుపీడకులు అని భావిస్తున్నాను. ప్రతిభాశాలి అయిన వేదవ్యాసునిదీ ఇదే అభిప్రాయం. (4)
త్రియుగౌ పుండరీకాక్షౌ వాసుదేవధనంజయౌ ।
నారదోఽపి తథా వేద యోఽప్యశంసత్ సదా మమ ॥ 5
పుండరీకదళనేత్రులైన వీరిరువురు మూడుయుగాల నుంచి కలిసిపుడుతున్నారు. నారదమహర్షి ఈ విషయాలను తెలిసి ఎల్లప్పుడు నాతో చర్చిస్తూనే ఉన్నారు. 95)
తథాహమపి జానామి నరనారాయణావృషీ ।
శక్తోఽయమిత్యతో మత్వా మయా స ప్రేషితోఽర్జునః ॥ 6
ఇంద్రాదనవరః శక్రం సురసూనుః సురాధిపమ్ ।
ద్రష్టుమస్త్రాణి చాదాతుమ్ ఇంద్రాదితి వివాసితః ॥ 7
భీష్మద్రోణావతిరథౌ కృపో ద్రౌణిస్చ దుర్జయః ।
ధృతరాష్ట్రస్య పుత్రేణ వృతా యుధి మహారథాః ॥ 8
సుప్రసిద్ధులైన నరనారాయణులే అర్జున శ్రీకృష్ణులని నాకు తెలుసు. అర్జునుని బలాన్ని గుర్తించియే అస్త్రసాధనకై అతడిని పంపాను. దేవతాపుత్రుడైన అర్జునుడు ఇంద్రునితో సమానుడు. ఇది తెలిసి నేను ఇంద్రుని చూడటానికి, అస్త్రాలను సంపాదించటానికి అర్జునుని పంపాను. భీష్మద్రోణులు అతిరథులు. కృపాచార్య, అశ్వత్థామలను గెలవటం కష్టం. ధృతరాష్ట్రుని ప్రియపుత్రుడైన దుర్యోధనుడు వీరినందరినీ యుద్ధం కోసం, జయం కోసం ప్రార్థించాడు. (6-8)
సర్వే వేదవిదః శూరాః సర్వాస్త్రవిదుషస్తథా ।
యోద్ధుకామాశ్చ పార్థేన సతతం యే మహాబలాః ।
స చ దివ్యాస్త్రవిత్ కర్ణః సూతపుత్రో మహారథః ॥ 9
వారు అందరు వేదజ్ఞులు, శూరులు, వీరులు, అస్త్రకోవిదులు. మహాబలవంతుడైన అర్జునునితో యుద్ధాన్ని కోరుతున్నారు. వారిఇలో సూతపుత్రుడైన కర్ణుడు కూడ వివిధాలైన శస్త్రాస్త్రాలను తెలిసినవాడు. (9)
యోఽస్త్రవేగానిలబలః శరార్చిస్తలనిఃస్వనః ।
రజోధూమోఽస్త్రసంపాతః ధార్తరాష్ట్రానిలోద్ధతః ॥ 10
నిసృష్ట ఇవ కాలేన యుగాంతే జ్వలనో మహాన్ ।
మమ సైన్యమయం కక్షం ప్రధక్ష్యతి న సంశయః ॥ 11
కాలంచే అతడు ప్రళయకాలం నాటి సమావర్తం అనే పేరుగల అగ్నితో సమానుడుగా సృష్టింపబడ్డాడు. అతనిది గాలితో సమానమైన బలం. బాణాలు జ్వాలలు. వింటి నారి నుంచి వచ్చే శబ్దమే దాహకుడైన అగ్నిధ్వని. యుద్ధంలో పైకి ఎగసిన ధూళియే పొగ, అస్ట్రవర్షమే ఆవరించే ధారలు. ధార్తరాష్ట్రులనే వాయువు సహకారం పొంది ఉద్ధతుడై ప్రజ్వలిస్తున్నాడు. గడ్డిరాశులవలె నా సేనాసమూహాన్ని భస్మం చేయటంలో సందేహం లేదు. (10,11)
తం స కృష్ణానిలోద్ధూతః దివ్యాస్త్రజ్వలనో మహాన్ ।
శ్వేతవాజిబలాకాభృద్ గాండీవేంద్రాయుధోల్బణః ॥ 12
సంరబ్ధః శరధారాభిః సుదీప్తం కర్ణపావకమ్ ।
అర్జునోదీరితో మేఘః శమయిష్యతి సంయుగే ॥ 13
స సాక్షాదేవ సర్వాణి శక్రాత్ ప్రపురంజయః ।
దివ్యాన్యస్త్రాణి బీభత్సుః తతశ్చ ప్రతిపత్స్యతే ॥ 14
ఆ కర్ణాగ్నిని అర్జునమేఘం మాత్రమే ఆర్పివేయగలదు. కృష్ణవాయుసహాయం స్వీకరించి ఆ మేఘం సంచరిస్తుంది. దివ్యాస్త్రాల కామ్తులే ఆ మేఘపు మెరుపుతీగలు. రథానికి పూన్చిన తెల్లటి గుఱ్ఱాలే ఆ మేఘసమీపాన సంచరించే
కొంగలబారులు. గాండీవం ఇంద్రధనుస్సుతో సమానంగా ప్రకాశిస్తోంది. క్రోధపూరితాలయిన అర్జునబాణాలు జలధారలై కర్ణాగ్నిని శమింపచేస్తాయి. శత్రువుల రాజధానిపై విజయాన్ని సాధించగల శస్త్రాస్త్రాలను అర్జునుడు ఇంద్రుని నుంచి తప్పక పొంది తీరుతాడు. (12-14)
అలం స తేషాం సర్వేషామ్ ఇతి మే ధీయతే మతిః ।
నాస్తి త్వతికృతార్థానాం రణేఽరీణాం ప్రతిక్రియా ॥ 15
ధృతరాష్ట్రుని పక్షాన్ని జయించటానికి అతడొక్కడే చాలు. ఇది నా ప్రగాఢ విశ్వాసం. అతికృతార్థులు అయిన శత్రువులను ఎదుర్కొనటానికి వేరొక ఉపాయం లేదు. (15)
తే వయం పాండవం సర్వే గృహీతాస్త్రమరిందమమ్ ।
ద్రష్టారో న హి బీభత్సుః భారముద్యమ్య సీదతి ॥ 16
శత్రుపీడకుడైన అర్జునుడు అస్త్రాలను సాధించటం మనమంతా తప్పక చూస్తాం. ఆ వీరుడు కార్యభారాన్ని వహించాక పూర్తిచేస్తే గాని ఎన్నడు శాంతింపడు. (16)
వయం తు తమృతే వీరం వనేఽస్మిన్ ద్విపదాం వర ।
అవధానం న గచ్ఛామః కామ్యకే సహ కృష్ణయా ॥ 17
ఈ కామ్యకవనాన ద్రౌపదీసహితులం అయిన మేము అర్జునుడు లేక పోవటంతో సావధానంగా ఉండలేకపోతున్నాం. (17)
భవానన్యద్ వనం సాధు బహ్వన్నం ఫలవచ్ఛుచి ।
ఆఖ్యాతుం రమణీయం చ సేవితం పుణ్యకర్మభిః ॥ 18
కావున పుణ్యపురుషులు సేవిమ్చే వేరొక వనాన్ని గూర్చి తెలపండి. అది సుందరమూ, అన్నపాన సమృద్ధమూ, ఫలసహితమూ, పవిత్రమూ అయి ఉండాలి. (18)
యత్ర కంచిద్ వయం కాలం వసంతః సత్యవిక్రమమ్ ।
ప్రతీక్షామోఽర్జునం వీరం వృష్ణికామా ఇవాంబుదమ్ ॥ 19
వర్షాన్ని కోరేవాడు మేఘం కొరకు ఎదురుచూసినట్లు మేము వీరుడైన ఆ అర్జునుని రాకవరకు ఎదురుచూస్తూ కొంతకాలం గడుపుతాం. (19)
వివిధానాశ్రమాన్ కాంశ్చిద్ ద్విజాతిభ్యః ప్రతిశ్రుతాన్ ।
సరాంసి సరితశ్చైవ రమణీయాంశ్చ పర్వతాన్ ॥ 20
ఆచక్ష్వ న హి మే బ్రహ్మన్ రోచతే తమృతేఽర్జునమ్ ।
వనేఽస్మిన్ కామ్యకే వాసః గచ్ఛామోఽన్యాం దిశం ప్రతి ॥ 21
మీరు ఇతర బ్రాహ్మణుల ద్వారా విన్న ఆశ్రమాలు, సరస్సులు, నదులు, సుందర పర్వతాలు కల ప్రదేశాన్ని గూర్చి తెల్పండి. అర్జునుడు లేక ఈ కామ్యకవనాన నివసింపలేము. వేరొక ప్రదేశానికి వెళ్ళి దుఃఖాన్ని తగ్గించుకొంటాము. (20-21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి పులస్త్యతీర్థయాత్రాయాం షడశీతితమోఽధ్యాయః ॥ 86 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున ధౌమ్యతీర్థయాత్ర అను ఎనుబది ఆరవ అధ్యాయము. (86)