87. ఎనుబది ఏడవ అధ్యాయము
ధౌమ్యుడు తూర్పుదిక్కున ఉన్న తీర్థాలను వర్ణించుట.
తాన్ సర్వామత్సుకాన్ దృష్ట్వా పాండవాన్ దీనచేతసః ।
ఆశ్వాసయంస్తథా ధౌమ్యః బృహస్పతిసమోఽబ్రవీత్ ॥ 1
బ్రాహ్మణానుమతాన్ పుణ్యాన్ ఆశ్రమాన్ భరతర్షభ ।
దిశస్తీర్థాని శైలాంశ్చ శృణు మే వదతోఽనఘ ॥ 2
వైశంపాయమనుడు ఇలా చెప్పాడు.
పాండవుల మనస్సులు అర్జునుని విషయంలో దీనమయ్యాయి. వారందరు అర్జునుని కలుసుకొనాలనే కుతూహలంతో ఉన్నారు. వీరి అవస్థ గమనించి బృహస్పతిసముడైన ధౌమ్యుడు ఊరడిస్తూ వారితో ఇలా పలికాడు - బ్రాహ్మణులు ఇష్టపడే తీర్థ, ఆశ్రమ, పర్వత, దిక్కుల వర్ణనను వినిపిస్తాను. విను. (1,2)
యాన్ శ్రుత్వా గదతో రాజన్ విశోకో భవితాసి హ ।
ద్రౌపద్యా చానయా సార్ధం భ్రాతృభిశ్చ నరేశ్వర ॥ 3
నా ద్వారా వాటిని గురించి విను నీవు, ద్రౌపది, సోదరులు శోకం లేనివారు అవుతారు. (3)
శ్రవణాచ్చైవ తేషాం త్వం పుణ్యమాప్స్యసి పాండవ ।
గత్వా శతగుణం చైవ తేభ్య ఏవ నరోత్తమ ॥ 4
వాటిని గురించి వింటేనే సేవించిన పుణ్యం లభిస్తుంది. అక్కడికి చేరితే ఆయా ప్రదేశాల నుంచి వందరెట్లు ఫలాన్ని పొందుతావు. (4)
పూర్వం ప్రాచీం దిశం రాజన్ రాజర్షిగణసేవితామ్ ।
రమ్యాం తే కథయిష్యామి యుధిష్ఠిర యతాస్మృతి ॥ 5
రాజా! నాకు గుర్తున్నంత వరకు పూర్వం రాజర్షులచే సేవింపబడిన తూర్పు దిక్కునందలి సుందరప్రదేశాలను వర్ణిస్తాను. (5)
తస్యాం దేవర్షిజుష్టాయాం నైమిషం నామ భారత ।
యత్ర తీర్థాని దేవానాం పుణ్యాని చ పృథక్ పృథక్ ॥ 6
తూర్పు దిక్కున దేవర్షులచే పూజింపబడే నమిశతీర్థం ఉంది. అక్కడే ప్రతీ దేవతకు వేర్వేరు తీర్థాలు ఉన్నాయి. (6)
యత్ర సా గోమతీ పున్యా రమ్యా దేవర్షిసేవితా ।
యజ్ఞభూమిశ్చ దేవానాం శామిత్రం చ వివస్వతః ॥ 7
ఆ ప్రదేశంలో దేవర్షిసేవితమై అందమూ, పవిత్రత గల గోమతీనది ఉంది. అది దేవతల యజ్ఞభూమి. యముని పశుమారణ ప్రదేశం ఇది. (7)
తస్యాం గిరివరః పుణ్యః గయో రాజర్షిసత్కృతః ।
శివం బ్రహ్మసరో యత్ర సేవితం త్రిదశర్షిభిః ॥ 8
తూర్పున పుణ్యం, పవిత్రం అయిన గయ పర్వతం ప్రకాశిస్తోంది. అది గయనిర్మితం. అక్కడే మంగళకరమైన బ్రహ్మసరోవరం ఉంది. అది దేవర్షులకు పూజనీయస్థానం. (8)
యదర్షే పురుషవ్యాఘ్ర కీర్తయంతి పురాతనాః ।
ఏష్టవ్యా బహవః పుత్రాః యద్యేకోఽపి గయాం వ్రజేత్ ॥ 9
యజేత వాశ్వమేధేన నీలం వా వృషముత్సృజేత్ ।
ఉత్తారయతి సంతత్యా దశపూర్వాన్ దశావరాన్ ॥ 10
గయాతీర్థవిషయంలో పెద్దలు ఇలా చెప్పారు. 'చాలామంది పుత్రులను కనాలి. అందులో ఒక్కడైనా గయకు పోయి తల్లిదండ్రులకు శ్రాద్ధాలను ఆచరిస్తాడు. అశ్వమేధయాగాన్నైనా చేస్తాడు. నీలవృషభాన్ని వనంలో విడుస్తాడు. వీటివలన పది తరాలను ఇటు అటు ఉద్ధరిస్తాడు'. (9,10)
మహానదీ చ తత్రైవ తథా గయశిరో నృప ।
యత్రాసౌ కీర్త్యతే విప్రైః అక్షయ్యకరణో వటః ॥ 11
దానికి సమీపాన మహానది, గయా శిరమను తీర్థం కనిపిస్తాయి. అది అక్షయ్యవటమని బ్రాహ్మణులచే కీర్తింపబడింది. దానికాండం, కొమ్మలు, ఎన్నటికీ నశించవు. (11)
యత్ర దత్తం పితృభ్యోఽన్నమ్ అక్షయ్యం భవతి ప్రభో ।
సా చ పుణ్యజలా తత్ర ఫల్గుర్నామ మహానదీ ॥1 2
బహుమూలాఫలా చాపి కౌశికీ భరతర్షభ ।
విశ్వామిత్రోఽధ్యగాద్ యత్ర బ్రాహ్మణత్వం తపోధనః ॥ 13
ఆ చెట్టుకింద పితరులకు ఇచ్చిన అన్నం అక్షయం అవుతుంది. అక్కడే పవిత్రజలాలు కల ఫల్గువనే పేరు గల మహానది ఉంది. అదేచోట ఫలమూలాలను అధికంగా ప్రసాదిమ్చే కౌశికీనది కూడ ఉంది. అది విశ్వామిత్రునికి బ్రాహ్మణత్వం సిద్ధింపచేసింది. (12,13)
గంగా యత్ర నదీ పుణ్యా యస్యాస్తీరే భగీరథః ।
అయజత్ తత్ర బహుభిః క్రతుభిర్భూరిదక్షిణైః ॥ 14
తూర్పుదిక్కునే పవిత్ర గంగానది ప్రవహిస్తోంది. దాని ఒడ్డున భగీరథుడు గొప్పగొప్ప దక్షిణలు ఇచ్చి, అనేక యాగాలు ఆచరించాడు. (14)
పంచాలేషు చ కౌరవ్య కథయంత్యుత్పలావనమ్ ।
విశ్వామిత్రోఽయజద్ యత్ర పుత్రేణ సహ కౌశికః ॥ 15
పాంచాలదేశంలో ఉత్పలావనం ఉందని ఋషులు చెప్పారు. అక్కడ కుశికుని కుమారుడైన విశ్వామిత్రుడు తన పుత్రునితో కలిసి యజ్ఞం విధివిధానంగా చేశాడు. (15)
యత్రానువంశం భగవాన్ జామదగ్న్యస్తథా జగౌ ।
విశ్వామిత్రస్య తాం దృష్ట్వా విభూతిమతిమానుషీమ్ ॥ 16
ఆ యజ్ఞంలో విశ్వామిత్రుని అలౌకికవైభవం చూచి జమదగ్ని కుమారుడు పరశురాముడు అతని వంశానికి తగిన యజ్ఞాన్ని గురించి వర్ణించాడు. (16)
కాన్యకుబ్జేఽపిబత్ సోమమ్ ఇంద్రేణ సహ కౌశికః ।
తతః క్షత్రాదపాక్రామద్ బ్రాహ్మణోఽస్మీతి చాబ్రవీత్ ॥ 17
విశ్వామిత్రుడు కాన్యకుబ్జదేశాన ఇంద్రునితో సమానంగా సోమపానం చేసి అక్కడే క్షత్రియత్వాన్ని విడచిపెట్టి బ్రాహ్మణుడను అయ్యాను అని ఉద్ఘోషించాడు. (17)
పవిత్రమృషిభిర్జుష్టం పుణ్యం పావనముత్తమమ్ ।
గంగాయమునయోర్వీర సంగమం లోకవిశ్రుతమ్ ॥ 18
గంగాయమునల ఉత్తమసంగమం ప్రపంచంలో ప్రసిద్ధి పొందినది. విఖ్యాతిని పొందిన మహర్షులు ఇక్కడే స్నానాదులను ఆచరించారు. (18)
యత్రాయజత భూతాత్మా పూర్వమేవ పితామహః ।
ప్రయాగమితి విఖ్యాతం తస్మాద్ భరతసత్తమ ॥ 19
భరతసత్తమా! సమస్త భూతకోటికి ఆత్మస్వరూపుడైన బ్రహ్మ ముందుగా ఇక్కడే యజ్ఞం చేశాడు. ఆ ప్రకృష్ణయాగాచరణం చేత ఇది ప్రయాగతీర్థంగా వెలసింది. (19)
అగస్త్యస్య తు రాజేమ్ద్ర తత్రాశ్రమవరో నృప ।
తత్ తథా తాపసారణ్యం తాపసైరుపశోభితమ్ ॥ 20
అగస్త్యమహర్షికి గొప్ప ఆశ్రమం ఇక్కడే ఉంది. ఈ తాపసారణ్యం తాపసులచే ఇప్పటికీ ప్రకాశిస్తోంది. (20)
హిరన్యబిందుః కథితః గిరౌ కాలంజరే మహాన్ ।
ఆగస్త్యపర్వతో రమ్యః పుణ్యో గిరివరః శివః ॥ 21
హిరణ్యబిందువని చెప్పబడే ఈ ఆశ్రమం కాలంజరమను పర్వతం మీద ఉంది. ఈ అగస్త్యపర్వతం రమణీయం, పవిత్రం, కళ్యాణకరం. (21)
మహేంద్రో నామ కౌరవ్య భార్గవస్య మహాత్మనః ।
అయజత్ తత్ర కౌంతేయ పూర్వమేవ పితామహః ॥ 22
కౌంతేయా! పూజ్యుడైన భార్గవుని నివాసస్థానం మహేంద్రపర్వతం. పూర్వం బ్రహ్మ ఇక్కడ యజ్ఞాన్ని విధివిధానంగా చేశాడు. (22)
యత్ర భాగీరథీ పుణ్యా సరస్యాసీద్ యుధిష్ఠిర ।
యత్ర సా బ్రహ్మశాలేతి పుణ్యా ఖ్యాతా విశాంపతే ॥ 23
ధూతపాప్మాభిరాకీర్ణా పుణ్యం తస్యాశ్చ దర్శనమ్ ।
పవిత్ర జలం కల భాగీరథికి మణికర్ణికాసరోవరం కలిసినచోట బ్రహ్మశాల అనే పవిత్రమయిన ప్రదేశం ఉంది.
అది పాపరహితులు ఆశ్రయించవలసిన చోటు. ఆ ప్రదేశం చూడతగింది. (23 1/2)
పవిత్రో మంగలీయశ్చ ఖ్యాతో లోకే మహాత్మనః ।
కేదారశ్చ మతంగస్య మహానాశ్రమ ఉత్తమః ।
కుండోదః పర్వతో రమ్యః బహుమూలఫలోదకః ॥ 25
నైషధస్తృషితో యత్ర జలం శర్మ చ లబ్ధవాన్ ।
మహాత్ముడైన మతంగుని ఉత్తమ ఆశ్రమప్రదేశం కేదారం. అది పవిత్రం, శ్రేష్ఠ కూడ. చాలవేర్లు, ఫలాలు, ఉదకాలు గల కుండోదకపర్వతం సుందరమైంది అక్కడే ప్రకాశిస్తోంది. నిషధేశుడు నలుడు దప్పికకల్గి ఈ తీర్థంలో జలం సేవించి శాంతిని పొందాడు. (24,25 1/2)
యత్ర దేవవనం పుణ్యం తాపసైరుపశోభితమ్ ॥ 26
బాహుదా చ నదీ యత్ర నందా చ గిరిమూర్ధని ।
తాపసులు ఆశ్రయించిన దేవవనం అనే పవిత్రక్షేత్రం అక్కడే విరాజిల్లుతోంది. ఆ పర్వతశిఖరాన బాహుద, నంద అను రెండు నదులు ప్రవహిస్తాయి. (26 1/2)
తీర్థాని సరితః శైలాః పుణ్యాన్యాయతనాని చ ॥ 27
ప్రాచ్యాం దిశి మహారాజ కీర్తితాని మయా తవ ।
తినృష్వన్యాని పుణ్యాని దిక్షు తీర్థాని మే శృణు ।
సరితః పర్వతాంశ్చైవ పుణ్యాన్యాయతనాని చ ॥ 28
తూర్పు దిక్కున ఉన్న అనేక తీర్థాలు, నదులు, పర్వతాలు, ఆశ్రమాలు, మందిరాలు వర్ణింపబడ్డాయి. వాటిని సంక్షిప్తంగా వర్ణించాను. ఇప్పుడు మిగిలిన దిక్కులను ఆనుకొని ఉన్న తీర్థాలను, నదులను, పర్వతాలను వర్ణిస్తాను. విను. (27,28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం సప్తాశీతితమోఽధ్యాయః ॥ 87 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున ధౌమ్యతీర్థయాత్రా ప్రసంగమను ఎనుబది ఏడవ అధ్యాయము. (87)