85. ఎనుబది అయిదవ అధ్యాయము
గంగాసాగర, చిత్రకూట, ప్రయాగ, గంగాది తీర్థప్రభావ వర్ణనము.
పులస్త్య ఉవాచ
అథ సంధ్యాం సమాసాద్య సంవేద్యం తీర్థముత్తమమ్ ।
ఉపస్పృశ్య నరో విద్యాం లభతే నాత్ర సంశయః ॥ 1
పులస్త్యుడు చెపుతున్నాడు.
ప్రాతఃసంధ్యాకాలంలో సంవేద్యతీర్థంలో స్నానమాచరిస్తే విద్యాలాభం నిస్సందేహంగా కల్గుతుంది. (1)
రామస్య చ ప్రభావేణ తీర్థం రాజన్ కృతం పురా ।
తల్లౌహిత్యం సమాసాద్య వింద్యాద్ బహు సువర్ణకమ్ ॥ 2
పూర్వకాలంలో రాముని ప్రభావంతో ఏర్పడింది లౌహిత్యతీర్థం. అందులో స్నానం చేస్తే చాలా సువర్ణాన్ని పొందుతాడు. (2)
కరతోయాం సమాసాద్య త్రిరాత్రోపోషితో నరః ।
అశ్వమేధమవాప్నోతి ప్రజాపతికృతో విధిః ॥ 3
కరతోయ తీర్థంలో మునిగిన మానవుడు మూడు రాత్రులు ఉపవాసం చేస్తే అశ్వమేధ యాగఫలాన్ని గ్రహిస్తాడు. ఇది బ్రహ్మచేసిన నియమం. (3)
గంగాయాస్తత్ర రాజేంద్ర సాగరస్య చ సంగమే ।
అశ్వమేధం దశగుణం ప్రవదంతి మనీషిణః ॥ 4
అక్కడే ఉన్న గంగాసాగర సంగమంలో స్నానం చేసినవాడు పది అశ్వమేధయాగాల ఫలాన్ని పొందుతాడు అని విద్వాంసుల అభిప్రాయం. (4)
గంగాయాస్త్వపరం పారం ప్రాప్య యః స్నాతి మానవః ।
త్రిరాత్రముషితో రాజన్ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 5
రాజా! మానవుడు గంగాసాగరసంగమాన గంగ ఆవలి ఒడ్డును చేరి స్నానం చెయ్యాలి. ఆ ప్రదేశాన మూడు రాత్రులు ఉపవాసం చేస్తే అన్నిపాపాలు తొలగిపోతాయి. (5)
తతో వైతరణీం గచ్ఛేత్ సర్వపాపప్రమోచనీమ్ ।
విరజం తీర్థమాసాద్య విరాజతి యథా శశీ ॥ 6
అక్కడి నుంచి పాపాలన్నింటినీ పోగొట్టగల వైతరిణీ తీర్థయాత్ర కొనసాగించాలి. విరజతీర్థానికి పోయి స్నానం చేసి చంద్రుని వలె ప్రకాశిస్తాడు. (6)
ప్రతరేచ్చ కులం పుణ్యం సర్వపాపం వ్యపోహతి ।
గోసహస్రఫలం లబ్ధ్వా పునాతి స్వకులం నరః ॥ 7
అతని కులం పవిత్రం అయి సంసార సాగరాన్ని దాటుతాడు. అతని పాపాలన్నీ నశిస్తాయి. వేయిగోవుల దానఫలాన్నీ గ్రహించి, కులాన్ని పవిత్రం చేస్తాడు. (7)
శోణస్య జ్యోతిరథ్యాయాః సంగమే నియతః శుచిః ।
తర్పయిత్వా ప్పితౄన్ దేవాన్ అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 8
శోణ జ్యోతిరథ్యల సంగమాన స్నానం ఆచరించి జితేంద్రియుడై, పవిత్రుడై పితరులను, దేవతలను పూజిస్తే అగ్నిష్టోమయాగఫలాన్ని పొందుతాడు. (8)
శోణస్య నర్మదాయాశ్చ ప్రభవే కురునందన ।
వంశగుల్మ ఉపస్పృశ్య వాజిమేధఫలం లభేత్ ॥ 9
శోణ, నర్మదల ఉత్పత్తి స్థానం వంశగుల్మంలో మునిగిన యాత్రికుడు అశ్వమేధ ఫలాన్ని అందుకొంటాడు. (9)
ఋషభం తీర్థమసాద్య కోసలాయాం నరాధిప ।
వాజపేయమవాప్నోతి త్రిరాత్రోపోషితో నరః ॥ 10
గోసహస్రఫలం వింద్యాత్ కులం చైవ సముద్ధరేత్ ।
రాజా! అయోధ్యలోని కోసమతీర్థానికి వెళ్ళి స్నానం చేసి మూడు రాత్రులు ఉపవాసం చేస్తే వాజపేయయాగఫలాన్ని, సహస్రగోదానఫలాన్ని, వంశోద్ధరణాన్ని క్రమంగా పొందుతాడు. (10 1/2)
కోసలాం తు సమాసాద్య కాలతీర్థముపస్పృశేత్ ॥ 11
వృషభైకాదశఫలం లభతే నాత్ర సంశయః ।
పుష్పవత్యాముపస్పృశ్య త్రిరాత్రోపోషితో నరః ॥ 12
గోసహస్రఫలం లభ్ధ్వా పునాతి స్వకులం నృప ।
రాజా! కోసలనగరంలోని కాలతీర్థాన్ని సేవిస్తే పదకొండు వృషభాలను దానం చేసిన ఫలాన్ని పొందగలడు. పుణ్యవతీతీర్థంలో స్నానం చేసి, మూడు రాత్రులు నిరాహారియై ఉంటే, వేయిగోవుల దానఫలాన్ని, వంశోద్ధరణాన్ని దక్కించుకొంటాడు. (11,12 1/2)
తత్ బదరికాతీర్థం స్నాత్వా భరతసత్తమ ॥ 13
దీర్ఘమాయురవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ।
భరతసత్తమా! పిమ్మట బదరీతీర్థంలో స్నానమాచరించి, దీర్ఘాయుర్దాయాన్ని పొంది స్వర్గాన్ని చేరుతాడు. (13 1/2)
అథ చంపాం సమాసాద్య భాగీరథ్యాం కృతోదకః ॥ 14
దండాఖ్యమభిగమ్యైవ గోసహస్రఫలం లభేత్ ।
చంపాప్రదేశంలో భాగీరథిలో తర్పణాలు చేసి, దండతీర్థాన్ని సేవిస్తే వేయుగీవులను దానం చేసినఫలం వస్తుంది. (14 1/2)
లపేటికాం తతో గచ్ఛేత్ పుణ్యాం పుణ్యోపశోభితామ్ ॥ 15
వాజపేయమవాప్నోతి దేవైః సర్వైశ్చ పూజ్యతే ।
ఆపై పుణ్యమయమై ఫుణ్యంతో ప్రకాశించే లపేటికా తీర్థానికి యాత్ర సాగించాలి. ఇలా చేస్తే తీర్థయాత్రికుడు ముందుగా వాజపేయయాగఫలాన్ని, తరువాత దేవతల్ పూజలను గైకొంటాడు. ( 15 1/2)
తతో మహేంద్రమాసాద్య జామదగ్న్యనిషేవితమ్ ॥ 16
రామతీర్థే నరః స్నాత్వా అశ్వమేధఫలం లభేత్ ।
అనంతరం పరశురాముడు నివసించిన మహేంద్రపర్వతానికి పోయి రామతీర్థంలో స్నానం ఆచరిస్తే అశ్వమేధయాగఫలం వస్తుంది. (16 1/2)
మతంగస్య తు కేదారః తత్రైవ కురునందన ॥ 17
తత్ర స్నాత్వా కురుశ్రేష్ఠ గోసహస్రఫలం లభేత్ ।
కురుశ్రేష్ఠా! అక్కడే మతంగమహర్షి కేదార తీర్థం ఉంది. అందు మునిగితే గోసహస్రదాన ఫలం పొందుతాడు. (17 1/2)
శ్రీపర్వతం సమాసాద్య నదీతీరముపస్పృశేత్ ॥ 18
అశ్వమేధమవాప్నోతి పూజయిత్వా వృషధ్వజమ్ ।
శ్రీపర్వతాన్ని చేరి, నదీతీరంలో స్నానం చేసి, శంకరుణ్ణి అర్చిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలాన్ని పొందుతాడు. (18 1/2)
శ్రీపర్వతే మహాదేవః దేవ్యా సహ మహాద్యుతిః ॥ 19
న్యవసత్ పరమప్రీతః బ్రహ్మా చ త్రిదశైః సహ ।
తత్ర దేవహ్రదే స్నాత్వా శుచిః ప్రయతమానసః ॥ 20
ఋషభం పర్వతం గత్వా పాండ్యే దైవతపూజితమ్ ।
వాజపేయమవాప్నోతి నాకపృష్ఠే చ మాదతే ॥ 21
శ్రీపర్వతంపై పార్వతితో కలిసి మహాదేవుడు ప్రసనుడై నివసిస్తాడు. దేవతలతో కలిసి బ్రహ్మ అక్కడే ఉంటాడు. అక్కడి దేవకుండతీర్థంలో స్నానం చేసి పవిత్రుడు, జితేంద్రియుడు అయి అశ్వమేధ యాగఫలాన్ని, ఆపైన సిద్ధులను గ్రహిస్తాడు. పాండ్యదేశంలో దేవతలచే అర్చింపబడే ఋషభపర్వతానికి యాత్ర సాగించి వాజపేయయాగఫలాన్ని పొంది స్వర్గంలో చిరకాలం ఆనందిస్తూ ఉంటాడు. (19-21)
తతో గచ్ఛేత కావేరీం వృతామప్సరసాం గణైః ।
తత్ర స్నాత్వా నరో రాజన్ గోసహస్రఫలం లభేత్ ॥ 22
రాజా! తరువాత అప్సరసలతో నిండిన కావేరినదికి యాత్ర చెయ్యాలి. అక్కడ మునిగిన మానవుడు వేయిగోవులు దానం చేసిన ఫలాన్ని పొందినవాడు అవుతాడు. (22)
తతస్తీరే సముద్రస్య కన్యాతీర్థముపస్పృశేత్ ।
తత్రోపస్పృశ్య రాజేంద్ర సర్వపాపైః ప్రముచ్యతే ॥ 23
రాజేంద్రా! అక్కడ ఉన్న సముద్రతీరమందలి కన్యాతీర్థానికి పోయిస్నానం ఆచరిస్తే అన్ని పాపాలను పోగొట్టుకొంటాడు. (23)
అథ గోకర్ణమాసాద్య త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
సముద్రమధ్యే రాజేంద్ర సర్వలోకనమస్కృతమ్ ॥ 24
యత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయశ్చ తపోధనాః ।
భూతాయక్షపిశాచాశ్చ కిన్నరాః సమహోరగాః ॥ 25
సిద్ధచారణగంధర్వమానుషాః పన్నగాస్తథా ।
సరితః సాగరాః శైలాః ఉపాసంత ఉమాపతిమ్ ॥ 26
రాజేంద్రా! త్రిభువన ప్రఖ్యాతమూ, ప్రశస్యమానమూ అయి సముద్ర మధ్యంలో ప్రకాశించే గోకర్ణ తీర్థంలో స్నానం చెయ్యాలి. అక్కడ బ్రహ్మాది దేవతలు, తాపసులు, ఋషులు, భూతాలు, యక్షులు, పిశాచాలు, మహానాగులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్పాలు, మనుజులు, సముద్రం, నదులు శంకరుణ్ణి సేవిస్తాయి. (24-26)
తత్రేశానం సమభ్యర్చ్య త్రిరాత్రోపోషితో నరః ।
అశ్వమేధమవాప్నోతి గాణపత్యం చ విందతి ॥ 27
అక్కడ శివుని పూజించిఇ మూడురాత్రులు ఉపవాసం చేసిన మానవుడు అశ్వమేధయాగఫలాన్ని, గణపతి పదాన్ని పొందుతాడు. (27)
ఉష్య ద్వాదశారాత్రం తు పూతాత్మా చ భవేన్నరః ।
తత ఏవ చ గాయత్ర్యాః స్థానం త్రైలోక్యపూజితమ్ ॥ 28
అక్కడే పన్నెండు రాత్రులు నివసిస్తే మనుజుని అంతఃకరణం పవిత్రం అవుతుంది. అక్కడే ఉన్న గాయత్రీదేవి స్థానాన్ని స్థిరంగా పొందుతాడు. (28)
త్రిరాత్రముషితస్తత్ర గోసహస్రఫలం లభేత్ ।
నిదర్శనం చ ప్రత్యక్షం బ్రాహ్మణానాం నరాధిప ॥ 29
మూడురాత్రులు అక్కడ ఉపవాసం చేస్తే గోసహస్రదాన ఫలాన్ని గ్రహిస్తాడు. బ్రాహ్మణులను గుర్తించటానికి అదే ప్రమాణం. (29)
గాయత్రీం పఠతే యస్తు యోనిసంకరజస్తథా ।
గాథా చ గాథికా చాపి తస్య సంపద్యతే నృప ॥ 30
వర్ణసంకరకారణంగా పుట్టినవాడు గాయత్రిని పఠిస్తే అతని ముఖం నుంచి గాయత్రి స్వర, వర్ణరహితం అయి వెలువడుతుంది. అనగా వాడు గాయత్రిని స్పష్టంగా ఉచ్చరించలేడు. (30)
అబ్రాహ్మణస్య సావిత్రీం పఠతస్తు ప్రణశ్యతి ।
అబ్రాహ్మణుడు అక్కడ గాయత్రిని చదివితే అది నశించిపోతుంది. అనగా దానిని మరచిపోతాడు. (30 1/2)
సంవర్తస్య తు విప్రర్షేః వాపీమాసాద్య దుర్లభామ్ ॥ 31
రూపస్య భాగీ భవతి సుభగశ్చ ప్రజాపతే ।
అక్కడే బ్రహ్మర్షియైన సంవర్తుని బావి ఉంది. అందులో స్నానం చేసినవాడు రూపసి, సంపన్నుడూ అవుతాడు. (31 1/2)
తతో వేణాం సమాసాద్య త్రిరాత్రోపోషితో నరః ॥ 32
మయూరహంససంయుక్తం విమానం లభతే నరః ।
వేణానదీ తీరాన్ని చేరి మూడురాత్రులు నిరాహారంగా ఉంటే (చనిపోయిన పిదప) నెమళ్ళు, హంసలతో కూడిన విమానాన్ని పొందుతాడు. (32 1/2)
తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధనిషేవితామ్ ॥ 33
గవాం మేధమవాప్నోతి వాసుకేర్లోకముత్తమమ్ ।
వేణాయాః సంగమే స్నాత్వా వాజిమేధఫలం లభేత్ ॥ 34
పిమ్మట సిద్ధులు సేవించే గోదావరిని చేరి స్నానం చేసి గోమేధయాగఫలాన్ని, వాసుకిలోకాన్ని చేరుతాడు. వేణాసంగమంలో మునిగి అశ్వమేధయాగఫలాన్ని గ్రహిస్తాడు. (33,34)
వరదాసంగమే స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ।
బ్రహ్మస్థానం సమాసాద్య త్రిరాత్రోపోషితో నరః ॥ 35
గోసహస్రఫలం వింద్యాత్ స్వర్గలోకం చ గచ్ఛతి ।
వరదాసంగమతీర్థంలో స్నానం చేస్తే వేయుగోవుల దానఫలం లభిస్తుంది. అటుపైన బ్రహ్మస్థానానికి పోయి మూడు రాత్రులు ఉపవాసం చేస్తే వేయిగోవుల దానఫలాన్ని ముందుగా పొంది, తరువాత స్వర్గలోకాన్ని చేరుకొంటాడు. (35 1/2)
కుశప్లవనమాసాద్య బ్రహ్మచారీ సమాహితః ॥ 36
త్రిరాత్రముషితః స్నాత్వా అశ్వమేధఫలం లభేత్ ।
కుశప్లవన తీర్థాన్ని సేవిస్తే, బ్రహ్మచర్యం, ఏకాగ్రచిత్తంతో మూడురాత్రులు నిరాహారియై ఉంటే అశ్వమేధయాగఫలం వస్తుంది. (36 1/2)
తతో దేవహ్రదేఽరణ్యే కృష్ణవేణాజలోద్భవే ॥ 37
జాతిస్మరహ్రదే స్నాత్వా భవేజ్జాతిస్మరో నరః ।
కృష్ణవేణాజలం వల్ల ఏర్పడిన అందమైన దేవకుండంలోని జాతిస్మరహ్రదంలో మునిగితే పూర్వజన్మస్పృతి పొందుతాడు. (37 1/2)
యత్ర క్రతుశతైరిష్ట్వా దేవరాజో దివం గతః ॥ 38
అగ్నిష్టోమఫలం వింద్యాద్ గమనాదేవ భారత ।
సర్వదేవహ్రదే స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 39
భారతా! అక్కడ వందయాగాలు ఆచరించిన ఇంద్రుడు స్వర్గసింహాసనంపై ఆసీనుడు అయి ఉన్నాడు. ఆ ప్రదేశానికి చేరడంతోనే అగ్నిష్టోమయాగఫలం లభిస్తుంది. అటుపైన సర్వదేవహ్రదంలో మునిగితే వేయిగోవుల దానఫలం వస్తుంది. (38,39)
తతో వాపీం మహాపుణ్యాం పయోష్టీం సరితాం వరామ్ ।
పితృదేవార్చనరతః గోసహస్రఫలం లభేత్ ॥ 40
అనంతరం మహాపుణ్యప్రదాలయిన దిగుడు బావులలో, నదులలో ఉత్తమం అయిన పయోష్టిని చేరి స్నానం చేస్తే, దేవపితరులను అర్చిస్తే యాత్రికునికి వేయిగోవుల దానఫలం చిక్కుతుంది. (40)
దంసకారణ్యమాసాద్య పుణ్యం రాజన్నుపస్పృశేత్ ।
గోసహస్రఫలం తస్య స్నాతమాత్రస్య భారత ॥ 41
దంసకారణ్యతీర్థానికి చేరి స్నానం చేయడంతోనే వేయిగోవుల దానఫలం సిద్ధిస్తుంది. (41)
శరభంగాశ్రమం గత్వా శుకస్య చ మహాత్మనః ।
న దుర్గతిమవాప్నోతి పునాతి చ కులం నరః ॥ 42
శరభంగ, శుకుల ఆశ్రమాలకు పోవడంతోనే దుర్గతులు నశిమ్చి, వంశం పవిత్ర మవుతుంది. (42)
తతః శూర్పారకం గచ్ఛేద్ జామదగ్న్యనిషేవితమ్ ।
రామతీర్థే నరః స్నాత్వా వింద్యాద్ బహుసువర్ణకమ్ ॥ 43
పిమ్మట పరశురామసేవితం అయిన శూర్పారకతీర్థానికి యాత్ర సాగించాలి. అక్కడ రామతీర్థంలో మునిగితే సువర్ణరాశిని పొందుతాడు. (43)
సప్తగోదావరీ స్నాత్వా నియతో నియతాశనః ।
మహత్ పుణ్యమవాప్నోతి దేవలోకం చ గచ్ఛతి ॥ 44
సప్తగోదావరీ తీర్థంలో స్నానం చేసి నియమబద్ధుడై, మితాహారియై ఉంటే గొప్పపుణ్యాన్ని పొంది, తరువాత దేవలోకం చేరుతాడు. (44)
తతో దేవపథం గత్వా నియతో నియతాశనః ।
దేవసత్రస్య యత్ పుణ్యం తదేవాప్నోతి మానవః ॥ 45
పిమ్మట నియమపాలనం చేస్తూ, మితాహారం పాటిస్తే దేవపథానికి పోయి దేవసత్రఫలాన్ని సిద్ధింపచేసుకొంటాడు. (45)
తుంగకారణ్యమాసాద్య బ్రహ్మచారీ జితేంద్రియః ।
వేదానధ్యాపయత్ తత్ర ఋషిః సారస్వతః పురా ॥ 46
తుంగకారణ్యతీర్థాన్ని చేరి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇంద్రియాలను అధీనంలో ఉంచుకోవాలి. పూర్వం ఆ ప్రదేశంలో సారస్వతుడనే ఋషి తన శిష్యులకు వేదం నేర్పాడు. (46)
తత్ర వేదేషు నష్టేషు మునేరంగిరసః సుతః ।
ఋషీణాముత్తరీయేషు సూపవిష్టో యథాసుఖమ్ ॥ 47
ఒకానొకసమయంలో ఋషులందరు వేదాలను మరచిపోయారు. ఈ ప్రకారంగా వేదాలు నశిస్తే అంగిరసుని పుత్రుడు మునుల ఉత్తరీయాల్లో దాగి సుఖంగా కూర్చుండి ఓంకారం చేయనారంభించాడు. (47)
ఓంకారేణ యథాన్యాయం సమ్యగుచ్చారితేన హ ।
యేన యత్ పూర్వమభ్యస్తం తత్ సర్వం సముపస్థితమ్ ॥ 48
నియమపాలనం చేస్తూ ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించడం వల్ల ఎవరు పూర్వం ఏ వేదం నేర్చారో అది అంతా తిరిగి వారికి వచ్చింది. (48)
ఋషయస్తత్ర దేవాశ్చ వరుణోఽగ్నిః ప్రజాపతిః ।
హరిర్నారాయణస్తత్ర మహాదేవస్తథైవ చ ॥ 49
ఆ సమయాన అక్కడ చాల మంది ఋషులు, దేవతలు, వరుణుడు, అగ్ని, ప్రజాపతి, నారాయణుడు, మహాదేవుడు మొదలైనవారు సన్నిహితులై ఉన్నారు. (49)
పితామహశ్చ భగవాన్ దేవైః సహ మహాద్యుతిః ।
భృగుం నియోజయామాస యాజనార్థే మహాద్యుతిమ్ ॥ 50
మహాతేజస్వి అయిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వెళ్ళి కాంతిమంతుడైన భృగువును యజ్ఞం చేయించటానికి నియమించాడు. (50)
తతః స చక్రే భగవాన్ ఋషీణాం విధివత్ తదా ।
సర్వేషాం పునరాధానం విధిదృష్టేన కర్మాణా ॥ 51
ఆజ్యభాగేన తత్రాగ్నిం తర్పయిత్వా యథావిధి ।
దేవాః స్వభవనం యాతాః ఋషయశ్చ యథాక్రమమ్ ॥ 52
పిమ్మట భృగుమహర్షి ఆ ఋషులందరితో యతావిధిగా, అగ్నిస్థాపనం చేయించాడు. ఆజ్యభాగంతో అగ్నిని తృప్తిపరచాడు. దేవతలు, ఋషులు క్రమంగా వారివారి స్థానాలకు వెళ్లారు. (51,52)
తదరణ్యం ప్రవిష్టస్య తుంగకం రాజసత్తమ ।
పాపం ప్రణాశ్యత్యఖిలం స్త్రియో వా పురుషస్య వా ॥ 53
రాజోత్తమా! తుంగకారణ్యాన్ని ప్రవేశించిన స్త్రీపురుషుల పాపాలన్నీ నశిస్తాయి. (53)
తత్ర మాసం వసేద్ ధీరః నియతో నియతాశనః ।
బ్రహ్మలోకం వ్రజేద్ రాజన్ కుల చైవ సముద్ధరేత్ ॥ 54
నియమశీలి అయి ధీరుడు, మితాహారి, జితేంద్రియుడు అయి నెలరోజులపాటు అక్కడ ఉండాలి. ఇలా చేసే యాత్రికుడు బ్రహ్మలోకాన్ని చేరడమే కాక వంశాన్ని ఉద్ధరిస్తాడు. (54)
మేధావికం సమాసాద్య పితౄన్ దేవాంశ్చ తర్పయేత్ ।
అగ్నిష్టోమమవాప్నోతి స్పృతిం మేధాం చ విందతి ॥ 55
మేధావిక తీర్థానికి చేరి దేవతలకు పితరులకు తర్పణాలు చేస్తే అగ్నిష్టోమయాగ ఫలం, జ్ఞాపకశక్తి, పూర్వజన్మ స్మృతిని పొందుతాడు. (55)
అత్ర కాలంజరం నామ పర్వతం లోకవిశ్రుతమ్ ।
తత్ర దేవహ్రదే స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 56
ఆ తీర్థంలో కాలంజరం అనే ప్రసిద్ధ పర్వతం ఉంది. అక్కడ దేవహ్రదంలో స్నానం చేస్తే వేయిగోవుల దానఫలం సిద్ధిస్తుంది. (56)
యో స్నాతః సాధయేత్ తత్ర గిరౌ కాలంజరే నృప ।
స్వర్గలోకే మహీయేత నరో నాస్త్యత్ర సంశయః ॥ 57
రాజా! శుచియై, స్నాతుడై కాలంజరపర్వతం మీద సాధన కొనసాగించి వాడికి స్వర్గంలో స్థిరనివాసం కలుగుతుంది. ఇది సత్యం. (57)
తతో గిరివరశ్రేష్ఠే చిత్రకూటే విశాంపతే ।
మందాకినీం సమాసాద్య సర్వపాపప్రణాశినీమ్ ॥ 58
తత్రాభిషేకం కుర్వాణః పితృదేవార్చనే రతః ।
అశ్వమేధమవాప్నోతి గతిం చ పరమాం వ్రజేత్ ॥ 59
పరమశ్రేష్ఠమైన చిత్రకూట పర్వతానికి పోయి పాపనాశిని అయిన మందాకినీ తీర్థంలో మునిగి దేవపితరులను అర్చిస్తే అశ్వమేధ ఫలాన్ని పొంది పిమ్మట ఉత్తమగతులను సాధిస్తాడు. (58,59)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ భర్తృస్థానమనుత్తమమ్ ।
యత్ర నిత్యం మహాసేనః గుహః సన్నిహితో నృప ॥ 60
తత్ర గత్వా నృపశ్రేష్ఠ గమనాదేవ సిధ్యతి ।
రాజా! తీర్థయాత్రికుడు పరమోత్తమమయిన భర్తృస్థానానికి యాత్ర సాగించాలి. మహాసేనుడు కార్తికేయుడు అక్కడే కొలువుతీరాడు. అక్కడకు చేరడంతోనే సిద్ధులను పొందుతాడు. (60 1/2)
కోటితీర్థే నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 61
ప్రదక్షిణముపావృత్య జ్యేష్ఠస్థానం వ్రజేన్నరః ।
అభిగమ్య మహాదేవం విరాజతి యథా శశీ ॥ 62
కోటితీర్థంలో నరుడు స్నానం చేస్తే సహస్ర గోదానఫలం దక్కుతుంది. అక్కడ ప్రదక్షిణం చేస్తూ జ్యేష్ఠస్థానానికి చేరాలి. అక్కడ కొలువున్న మహాదేవుని దర్శనం, పూజనం చేస్తే చంద్రుని వలె ప్రకాశిస్తాడు. (61,62)
తత్ర కూపే మహారాజ విశ్రుతా భరతర్షభ ।
సముద్రాస్తత్ర చత్వారః నివసంతి యుధిష్ఠిర ॥ 63
మహారాజా! అక్కడ ఒక గొప్ప నుయ్యి ఉంది. అందులో నాల్గు సముద్రాలు నివసిస్తాయి. (63)
తత్రోపస్పృశ్య రాజేంద్ర పితృదేవార్చనే రతః ।
నియతాత్మా నరః పూతః గచ్ఛేత పరమాం గతిమ్ ॥ 64
రాజేంద్రా! ఆ ప్రదేశాన స్నానం చేసి దేవతలను, పితరులను పూజిస్తే, జితేంద్రియుడు అయి ఉంటే పవిత్రుడు అవుతాడు. సిద్ధులను పొందుతాడు. (64)
తతో గచ్ఛేత రాజేంద్ర శృంగవేరపురం మహత్ ।
యత్ర తీర్ణో మహారాజ రామో దాశరథిః పురా ॥ 65
రాజేంద్రా! అక్కడ నుంచి శృంగబేరపురానికి తీర్థయాత్ర చెయ్యాలి. పూర్వకాలంలో దశరథనందనుడు శ్రీరాముడు ఆ చోటనే గంగానదిని దాటాడు. (65)
తస్మింస్తీర్థే మహాబాహో స్నాత్వా పాపైః ప్రముచ్యతే ।
గంగాయాం తు నరః స్నాత్వా బ్రహ్మచారీ సమాహితః ॥ 66
విధూతపాప్మా భవతి వాజపేయం చ విందతి ।
ఆ తీర్థంలో మునిగిన మానవుని పాపాలు తొలగిపోతాయి. బ్రహ్మచర్యాన్ని, ఏకాగ్రతను పాటిస్తూ గంగలో స్నానమాచరిస్తే పాపరహితుడై వాజపేయయాగఫలాన్ని గ్రహిస్తాడు. (66 1/2)
తతో ముంజవటం గచ్ఛేత్ స్థానం దేవస్య ధీమతః ॥ 67
అభిగమ్య మహాదేవమ్ అభివాద్య చ భారత ।
ప్రదక్షిణముపావృత్య గాణపత్యమవాప్నుయాత్ ॥ 68
తస్మింస్తీర్థే తు జాహ్నవ్యాం స్నాత్వా పాపైః ప్రముచ్యతే ।
భారతా! ఆ ప్రదేశం నుంచి ముంజవటానికి చేరాలి. అక్కడ శంకరుడు సుప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆ తీర్థానికి పోయి, మహాదేవునికి నమస్కరించి, ప్రదక్షిణం చేస్తే గణపతి పదాన్ని పొందుతాడు. ఆ తీర్థాన ఉన్న గంగలో మునిగితే పాపాలన్నీ పోయి పవిత్రుడు అవుతాడు. (67,68 1/2)
తతో గచ్ఛేత రాజేంద్ర ప్రయాగమృషిసంస్తుతమ్ ॥ 69
తత్ర బ్రహ్మాదయో దేవాః దిశశ్చ సదిగీశ్వరాః ।
లోకపాలాశ్చ సాధ్యాశ్చ పితరో లోకసమ్మతాః ॥ 70
సనత్కుమారప్రముఖాః తథైవ పరమర్షయః ।
అంగిరఃప్రముఖాశ్చైవ తథా బ్రహ్మర్షయోఽమలాః ॥ 71
తథా నాగాః సుపర్ణాశ్చ సిద్ధాశ్చక్రచరాస్తథా ।
సరితః సాగరాశ్చైవ గంధర్వాప్సరసోఽపి చ ॥ 72
హరిశ్చ భగవానాస్తే ప్రజాపతిపురస్కృతః ।
తత్ర త్రీణ్యగ్నికుండాని యేషాం మధ్యేన జాహ్నవీ । 73
వేగేన సమతిక్రాంతా సర్వతీర్థపురస్కృతా ।
తపనస్య సుతా దేవీ త్రిషు లోకేషు విశ్రుతా ॥ 74
యమునా గంగయా సార్ధం సంగతా లోకపావనీ ।
గంగాయమునయోర్మధ్యం పృథివ్యా జఘనం స్మృతమ్ ॥ 75
అటుపైన మహర్షులచే కీర్తింపబడే ప్రయాగతీర్థానికి చేరుకోవాలి. అక్కడే బ్రహ్మాదిదేవతలు, దిగ్దేవతలు, దిక్పాలకులు, లోకపాలురు, సాధ్యులు, పితరులు, సనత్కుమారాదులు, ఋషులు, అంగిరసుడు మొదలైన బ్రహ్మర్షులు, నాగులు, గరుడుడు, సిద్ధులు, సూర్యుడు, నదులు, సముద్రాలు, గంధర్వులు, అప్సరసలు, నారాయణుడు కొలువు తీరారు. అక్కడ మూడు అగ్నికుండాలు ఉన్నాయి. వాటి మధ్య నుంచి గంగ వేగంగా ప్రవహిస్తుంది. సూర్యపుత్రి, త్రిలోకప్రసిద్ధ అయిన యమునానది అక్కడే గంగతో కలిసి ఉంది. గంగాయమునల మధ్యభాగం భూమికి జఘనభాగం అని కీర్తింపబడింది. (71-75)
ప్రయాగం జఘనస్థానం ఉపస్థమృషయో విదుః ।
ప్రయాగం సప్రతిష్ఠానం కంబలాశ్వతరౌ తథా ॥ 76
తీర్థం భోగవతీ చైవ వేదిరేషా ప్రజాపతేః ।
తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూర్తిమంతో యుధిష్ఠిర ॥ 77
ప్రజాపతిముపాసంతే ఋషయశ్చ తపోధనాః ।
యజంతే క్రతుభిర్దేవాః తథా చక్రధరా నృపాః ॥ 78
తతః పుణ్యతమం నామ త్రిషు లోకేషు భారత ।
ప్రయాగం సర్వతీర్థేభ్యః ప్రవదంత్యధికం విభో ॥ 79
గమనాత్ తస్య తీర్థస్య నామసంకీర్తనాదపి ।
మృత్యుకాలభయాచ్చాపి నరః పాపాత్ ప్రముచ్యత్ ॥ 80
యుధిష్ఠిరా! ఋషులందరు ప్రయాగను జఘనస్థానమైన ఉవస్థ (యోనిభాగం) అన్నారు. ప్రతిష్ఠానపురంతో కూడిన ప్రయాగ, కంబలాశ్వతరులనే నాగులు, భోగవతీతీర్థం బ్రహ్మ వేదిస్థానాలు. ఆ తీర్థాన వేదాలు, యజ్ఞాలు మూర్తిమంతాలై ప్రజాపతిని ఉపాసిస్తాయి. తపోధనులైన ఋషులు, దేవతలు, చక్రధరులైన రాజులు, యజ్ఞాలతో చక్రధరుని ఆరాధిస్తారు. ముల్లోకాలలో ప్రయాగమే ఉత్తమం, పుణ్యతమం కూడ ఆ తీర్థానికి పోవడంతోనే, నామోచ్చరణం చేతనే మృత్యుభయం తొలగి పాపదూరుడు అవుతాడు. (76,80)
తత్రాభిషేకం యః కుర్యాత్ సంగమే లోకవిశ్రుతే ।
పుణ్యం స ఫలమాప్నోతి రాజసూయాశ్వమేధయోః ॥ 81
ప్రపంచప్రఖ్యాతం అయిన ప్రయాగలో స్నానం ఆచరిస్తే రాజసూయ, అశ్వమేధయాగాల ఫలాన్ని దక్కించుకొంటాడు. (81)
ఏషా యజనభూమిర్హి దేవానామభిసంస్కృతా ।
తత్ర దత్తం సూక్ష్మమపి మహద్ భవతి భారత ॥ 82
భారతా! ఇదియే సంస్కారం చేయబడిన దేవతల యజ్ఞభూమి. ఇక్కడ చేయబడిన చిన్నదానం కూడ గొప్ప ఫలాన్ని ఇస్తుంది. (82)
న వేదవచనాత్ తాత న లోకవచనాదపి ।
మతిరుత్ర్కమణీయా తే ప్రయాగమరణం ప్రతి ॥ 83
వేదవచనానుసారం, లోకవచనానుసారం ప్రయాగయే మరణించుటకు శ్రేయోదాయకం అయినది. (83)
దశ తీర్థసహస్రాణి షష్టిః కోట్యస్తథాపరాః ।
యేషాం సాన్నిధ్యమత్రైవ కీర్తితం కురునందన ॥ 84
చతుర్విద్యే చ యత్ పుణ్యం సత్యవాదిషు చైవ యత్ ।
స్నాత ఏవ తదాప్నోతి గంగాయమునసంగమే ॥ 85
కురుకుమారా! ప్రయాగలో ఆరుకోట్ల పదివేల తీర్థాల సాన్నిధ్యం ఉంది. నాల్గువిద్యల వలన ఏ ఫల వస్తుందో, నిరంతర సత్యవాక్యంచే ఏ ఫలం వస్తుందో అది కేవలం ప్రయాగ తీర్థాల స్నానం వలన లభిస్తుంది. (84,85)
తత్ర భోగవతీ నామ వాసుకేస్తీర్థముత్తమమ్ ।
తత్రాభిషేకం యః కుర్యాత్ సోఽశ్వమేధఫలం లభేత్ ॥ 86
ఇక్కడే భోగవతి అనే పేరుగల వాసుకి తీర్థం ఉంది. ఇందు మునిగితే అశ్వమేధయాగఫలం అందుకొని సుఖిస్తాడు. (86)
తత్ర హంసప్రపతనం తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ।
దశాశ్వమేధికం చైవ గంగాయాం కురునందన ॥ 87
కురునందనా! ఆ ప్రదేశంలో విఖ్యాతం అయిన హంసప్రపతన తీర్థం, గంగా తీరాన దశాశ్వమేధిక తీర్థాలు ఉన్నాయి. (87)
కురుక్షేత్రసమా గంగా యత్ర తత్రావగాహితా ।
విశేషో వై కనఖలే ప్రయాగే పరమం మహత్ ॥ 88
గంగలో ఎక్కడ స్నానం చేసినా అది కురుక్షేత్ర తీర్థ సమానం అయి పుణ్యఫలం ఇస్తుంది. కనఖలాన గంగా స్నానం విశేషమాహాత్మ్యం కలిగి ఉంది. ప్రయాగ తీర్థంలో గంగాస్నానం అన్నిటికంటె విశేషఫలాన్ని ఇస్తుంది. (88)
యద్యకార్యశతం కృత్వా కృతం గంగాభిషేచనమ్ ।
సర్వం తత్ తస్య గంగాంభః దహత్యగ్నిరివేంధనమ్ ॥ 89
సర్వం కృతయుగే పుణ్యం త్రేతాయాం పుష్కరం స్మృతమ్ ।
ద్వాపరేఽపి కురుక్షేత్రం గంగా కలియుగే స్మృతా ॥ 90
పుష్కరే తు తపస్తప్యేద్ దానం దద్యాన్మహాలయే ।
మలయే త్వగ్నిమారోహేద్ భృగుతుంగే త్వనాశనమ్ ॥ 91
నిషిద్ధకర్మలను, వందల కొలది ఆచరించినా గంగాస్నానం చేస్తే ఆ స్నానం అగ్ని ఇంధనాన్ని దహించినట్లు వాటిని దహిస్తుంది. కృతయుగాన అన్ని తీర్థాలు పుణ్యదాయకాలు. త్రేతాయుగాన పుష్కరం గొప్పది. ద్వాపరయుగాన కురుక్షేత్రం శ్రేష్ఠం. కలియుగాన గంగా తీర్థం ఉత్తమం. పుష్కర తీర్థంలో తపస్సు చెయ్యాలి. మహాలయంలో దానం చెయ్యాలి. మలయపర్వతాన అగ్న్యాధానం చెయ్యాలి. భృగుతుంగ తీర్థంలో ఉపవాసం చెయ్యాలి. (89-91)
పుష్కరే తు కురుక్షేత్రే గంగాయాం మధ్యమేషు చ ।
స్నాత్వా తారయతే జంతుః సప్తసప్తావరాంస్తథా ॥ 92
పుష్కరతీర్థాన, కురుక్షేత్ర తీర్థాన, గంగాతీర్థాన, మధ్యనున్న ప్రయాగాది తీర్థాలలో మునిగి తీర్థయాత్రికుడు ముందు, వెనుక ఏడు తరాలను ఉద్ధరిస్తాడు. (92)
పువాతి కీర్తితా పాపం దృష్టా భద్రం ప్రయచ్ఛతి ।
అవగాఢా చ పీతా చ పునాత్యాసప్తమం కులమ్ ॥ 93
గంగానామస్మరణంతోనే పాపాలన్నీ పటాపంచలవుతాయి. దర్శనంతో శుభాలు చేకూరుతాయి. స్నాన జలపానాలతో ఏడుతరాలను పవిత్రం చేస్తుంది. (93)
యావదస్థి మనుష్యస్య గంగాయాః స్పృశతే జలమ్ ।
తావత్ స పురుషో రాజన్ స్వర్గలోకే మహీయతే ॥ 94
మానవుని ఎముకలు ఎంతవరకు గంగా స్పర్శనం కలిగి ఉంటాయో అంతవరకు అతడు స్వర్గంలో పూజలు అందుకొంటాడు. (94)
యథా పుణ్యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ ।
ఉపాస్య పుణ్యం లబ్ధ్వా చ భవత్యమరలోకభాక్ ॥ 95
పుణ్యతీర్థాలు, పవిత్రమందిరాలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని సేవించినవాడు పుణ్యాలను పొంది స్వర్గం చేరుకొంటాడు. (95)
న గంగాసదృశం తీర్థం న దేవః కేశవాత్ పరః ।
బ్రాహ్మణేభ్యః పరం నాస్తి ఏవమాహ పితామహః ॥ 96
గంగతోసమం అయిన తీర్థం లేదు. కేశవుని కంటే దేవుడు లేడు. బ్రాహ్మణుల కంటే వేరు వర్ణం లేదు. ఇది బ్రహ్మదేవుని మాటలు. (96)
యత్ర గంగా మహారాజ స దేశస్తత్ తపోవనమ్ ।
సిద్ధిక్షేత్రం చ తజ్ జ్ఞేయం గంగాతీరసమాశ్రితమ్ ॥ 97
ఎక్కడ గంగ ప్రవహిస్తుందో అదే ఉత్తమప్రదేశం. ఎక్కడ గంగ ప్రవహిస్తుందో అదే ఉత్తమతపోవనం. గంగాతీరాన ఉన్న ప్రదేశమే సిద్ధిక్షేత్రం. (97)
ఇదం సత్యం ద్విజాతీనాం సాధూనామాత్మజస్య చ ।
సుహృదం చ జపేత్ కర్ణే శిష్యస్యానుగతస్య చ ॥ 98
ఈ సత్యవాక్యాలను బ్రాహ్మణాది ద్విజులకు, సాధుపురుషులకు, పుత్ర, స్నేహిత, శిష్య, అనుయాయివర్గానికి తెలియజేయాలి. (98)
ఇదం ధన్యమిదం మేధ్యమ్ ఇదం స్వర్గ్యమనుత్తమమ్ ।
ఇదం పుణ్యమిదం రమ్యం పావనం ధర్మ్యముత్తమమ్ ॥ 99
ఈ గంగామాహత్మ్యం ధన్యం, పవిత్రం, స్వర్గప్రాపకం, పరమోత్తమం, ఇది పుణ్యజనకం , ధర్మసహితం, పావనం , శ్రేష్ఠం. (99)
మహర్షీణామిదం గుహ్యం సర్వపాపప్రమోచనమ్ ।
అధీత్య ద్విజమధ్యే చ నిర్మలః స్వర్గమాప్నుయాత్ ॥ 100
ఇది మహర్షులకు కూడ తెలియని రహస్యం. అన్ని పాపాలను తొలగిస్తుంది. ద్విజమండలిలో ఈ గంగా మాహాత్మ్యాన్ని వినిపిస్తే స్వర్గాన్ని పొందుతాడు. (100)
శ్రీమత్ స్వర్గ్యం తథా పుణ్యం సపత్నశమనం శివమ్ ।
మేధాజననమగ్ర్యం వై తీర్థవంశానుకీర్తనమ్ ॥ 101
ఈ తీర్థసమూహవర్ణనం, దాని మాహాత్మ్యం సంపత్ర్పదం, స్వర్గప్రదం, పుణ్యజనకం, శత్రునివారకం, శుభప్రదాయకం, మేధాశక్తి జనకం. (101)
అపుత్రో లభతే పుత్రమ్ అధనో ధనమాప్నుయాత్ ।
మహీం విజయతే రాజా వశ్యో ధనమావాప్నుయాత్ ॥ 102
దీనిని చదివితే పుత్రులు లేనివాడు పుత్రులను పొందుతాడు. అధనుడు ధనాన్ని పొందుతాడు. రాజు భూమిని జయిస్తాడు. వైశ్యుడు ధనరాశులను వశం చేసుకొంటాడు. (102)
శూద్రో యథేప్సితాన్ కామాన్ బ్రాహ్మణః పారగః పఠన్ ।
యశ్చేదం శృణుయాన్నిత్యం తీర్థపుణ్యం నరః శుచిః ॥ 103
జాతీః స స్మరతే బహ్వీః నాకపృష్ఠే చ మోదతే ।
గమ్యాన్యపి చ తీర్థాని కీర్తితాన్యగమాని చ ॥ 104
శూద్రుడు కోరికలను తీర్చుకొంటాడు. బ్రాహ్మణుడు పఠిస్తే సమస్త శాస్త్రాలు తెలిసినవాడు అవుతాడు. ఎవడు శుచియై, స్నాతుడై ఈ మాహాత్మ్యాన్ని ప్రతిదినం వింటాడో అతడు అనేక జన్మలను గుర్తించి, స్వర్గంలో సుఖిస్తాడు. నేనీవిధంగా గమ్యాలు, అగమ్యాలు అయిన తీర్థాలను వర్ణించాను. (103,104)
మనసా తాని గచ్చేత సర్వతీర్థసమీక్షయా ।
ఏతాని వసుభిః సాధ్యైః ఆదిత్యైర్మరుదశ్విభిః ॥ 105
ఋషిభిర్దేవకల్పైశ్చ స్నాతాని సుకృతైషిభిః ।
ఏవం త్వమపి కౌరవ్య విధినానేన సువ్రత ॥ 106
వ్రజ తీర్థాని నియతః పుణ్యం పుణ్యేన వర్ధయన్ ।
భావితైః కరణైః పూర్వమ్ ఆస్తిక్యాచ్ర్ఛుతిదర్శనాత్ ॥ 107
ప్రాప్యంతే తాని తీర్థాని సద్భిః శాస్త్రానుదర్శిభిః ।
నావ్రతీ నాకృతాత్మా చ నాశుచిర్న చ తస్కరః ॥ 108
స్నాతి తీర్థేషు కౌరవ్య న చ వక్రమతిర్నరః ।
త్వయా తు సమ్యగ్వృత్తేన నిత్యం ధర్మార్థదర్శినా ॥ 109
పితామహపురోగాశ్చ దేవాః సర్షిగణా నృప ॥ 110
తవ ధర్మేణ ధర్మజ్ఞ నిత్యమేవాభితోషితాః ।
అవాప్స్యసి త్వం లోకాన్ వై వసూనాం వాసవోపమ ।
కీర్తిం చ మహతీం భీష్మ ప్రాప్స్యసే భువి శాశ్వతీమ్ ॥ 111
సంపూర్ణ తీర్థ దర్శనాభిలాష కల మానవుడు ఏతీర్థాలను చేరలేడో వాటిని మనస్సుతో సంభావించి యాత్ర చెయ్యాలి. వసుగణం, ఆదిత్యులు, సాధ్యగణం, మరుద్గణం, అశ్వినీదేవతలు, మహర్షులు అందరూ పుణ్యలాభప్రాప్తికై కోరి ఈ తీర్థాల్లో స్నానం చేశారు. ధర్మనందనా! నీవు కూడ ఉత్తమవ్రత నియమాలను పాటిస్తూ విధిప్రకారంగా పుణ్యంతో, పుణ్యాన్ని పెంచుకొంటూ ఈ తీర్థయాత్ర సాగించాలి. ఆస్తికతతో, వేదానుశీలనంతో ముందుగా జితేంద్రియుడవు అయి ఉండాలి. సాధుపురుషులే ఈ తీర్థసేవనం చేయగలరు. బ్రహ్మచర్యాన్ని ఆచరించనివారు, చిత్తాన్ని అదుపులో పెట్టుకోలేనివారు, అపవిత్రతకలవారు, ఆచారాలు లేనివారు, కపటులు, చోరులు, వక్రబుద్ధికలవారు శ్రద్ధలేని కారణాంగా ఈ తీర్థాల్లో స్నానాన్ని చేయలేరు. నీవు ధర్మాచారాలను తెలిసి మసలుతున్నావు. నీవు తండ్రి, తాత, ముత్తాత, బ్రహ్మాదిదేవతలు, మహర్షులను సంతుష్టిపరచావు. ఇంద్రసమాన తేజం కలవాడివి అయ్యావు. నీవు వసువుల లోకాలను చేరుకొంటావు. నీవు ఈ భూమిపై సాటిలేని కీర్తిని గడిస్తావు. (105-111)
నారద ఉవాచ
ఏవముక్త్వాభ్యనుజ్ఞాయ పులస్త్యో భగవానృషిః ।
ప్రీతః ప్రీతేన మనసా తత్రైవాంతరధీయత ॥ 112
నారదుడు అన్నాడు.
ఈవిధంగా పలికి భీష్ముని అనుమతిపై సంతుష్టుడై, పులస్త్యుడు ప్రసన్నచిత్తంతో అంతర్ధానం అయ్యాడు. (112)
భీష్మశ్చ కురుశార్దూల శాస్త్రతత్త్వార్థదర్శివాన్ ।
పులస్త్యవచనాచ్చైవ పృథివీం పరిచక్రమే ॥ 113
కురుశ్రేష్ఠా! శాస్త్రాల యథార్థాన్ని గ్రహించిన భీష్ముడు పులస్త్యుని వచనానుసారం తీర్థయాత్ర నెపంతో భూమినంతా చుట్టివచ్చాడు. (113)
ఏవమేషా మహాభాగ ప్రతిష్ఠానే ప్రతిష్ఠితా ।
తీర్థయాత్రా మహాపుణ్యా సర్వపాపప్రమోచనీ ॥ 114
ఈ ప్రకారంగా పాపాలన్నింటినీ దూరం చేసే మహాపుణ్యప్రదం అయిన ప్రతిష్ఠానపురం (ప్రయాగ) భూమిపై సుప్రతిష్ఠితం అయ్యింది. (114)
అనేన విధినా యస్తు పృథివీం సంచరిష్యతి ।
అశ్వమేధశతస్యాగ్ర్యం ఫలం ప్రేత్య స భోక్ష్యతి ॥ 115
విధ్యనుసారం ఎవడు తీర్థయాత్రను సాగిస్తాడో, భూమి చుట్టూ తిరుగుతాడో వాడు నూరు అశ్వమేధయాగాల ఫలాన్ని పొంది, దేహత్యాగానంతరం ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. (115)
తతశ్చాష్టగుణం పార్థ ప్రాప్స్యసే ధర్మముత్తమమ్ ।
భీష్మః కురూణాం ప్రవరః యథాపూర్వమవాప్తవాన్ ॥ 116
కురుశ్రేష్ఠుడైన భీష్ముడు తీర్థయాత్ర చేసి సంపాదించిన ఫలం కంటె ఎనిమిది రెట్లు ఫలం ఉత్తమధర్మాచరణ ఫలం. అది నీది అవుతుంది. (116)
నేతా చ త్వమృషీన్ యస్మాత్ తేన తేఽష్టగుణం ఫలమ్ ।
రక్షో గణవికీర్ణాని తీర్థాన్యేతాని భారత ।
న గీతాని మనుష్యేంద్రైః త్వామృతే కురునందన ॥ 117
నీవు ఈ ఋషులందరినీ నీతో తీసుకువచ్చి తీర్థయాత్ర చేయించడం ద్వారా నీకు ఎనిమిదిరెట్లు పుణ్యఫలం సంక్రమిస్తుంది. ఈ తీర్థాలన్నింటా రాక్షసగణం వ్యాపించి ఉంది. కురునందనా! నీవు తప్ప వేరొకరు ఈ తీర్థాల్లో యాత్రను చెయ్యలేరు. (117)
ఇదం దేవర్షిచరితం సర్వతీర్థాభిసంవృతమ్ ।
యః పఠేత్ కల్యముత్థాయ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 118
ప్రాతః కాలాన మేల్కొని ఎవడు పులస్త్యప్రబోధితమయిన ఈ చరిత్రను సంపూర్ణంగా శ్రద్ధతో పఠిస్తాడో వాని పాపాలన్నీ తొలగిపోతాయి. (118)
ఋషిముఖ్యాః సదా యత్ర వాల్మీకిస్త్వథ కశ్యపః ।
ఆత్రేయః కుండజఠరః విశ్వామిత్రోఽథ గౌతమః ॥ 119
అసితో దేవలశ్చైవ మార్కండేయోఽథ గాలవః ।
భరద్వాజో వసిష్ఠశ్చ మునిరుద్దాలకస్తథా ॥ 120
శౌనకః సహ పుత్రేణ వ్యాసశ్చ తపతాం వరః ।
దుర్వాసాశ్చ మునిశ్రేష్ఠః జాబాలిశ్చ మహాతపాః ॥ 121
ఏతే ఋషివరాః సర్వే త్వత్ర్పతీక్షాస్తపోధనాః ।
ఏభిః సహ మహారాజ తీర్థాన్యేతాన్యనువ్రజ ॥ 122
మహారాజా! ఋషిప్రవర్తులైన వాల్మీకి, కశ్యపుడు, ఆత్రేయుడు, కుండజఠరుడు, భరద్వాజుడు, వసిష్ఠుడు, ఉద్దాలకముని, శౌనకుడు, పుత్రునితో కూడిన వ్యాసుడు, దుర్వాసుడు, జాబాలి మొదలగు వారందరు నీరాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. వీరందరితో తీర్థయాత్రను కొనసాగించు. (119-122)
ఏష తే లోమశో నామ మహర్షిరమితద్యుతిః ।
సమేష్యతి మహారాజ తేన సార్థమనువ్రజ ॥ 123
మహారాజ! అమితతేజస్సంపన్నుడైన లోమశుడు నీతో వస్తాడు. వానివెంట నీవు యాత్రను ఆచరించు. (123)
మయాపి సహ ధర్మజ్ఞ తీర్థాన్యేతాన్యనుక్రమాత్ ।
ప్రాప్స్యసే మహతీం కీర్తిం యథా రాజా మహాభిషః ॥ 124
ఈ యాత్రలన్నింటిలో నేను కూడ నీవెంట ఉంటాను. ప్రాచీనకాలం నాటి మహాభిషునివలె నీవు గొప్పకీర్తిని పొందుతావు. (124)
యథా యయాతిర్ధర్మాత్మా యథా రాజా పురూరవాః ।
తథా త్వం రాజశార్దూల స్వేన ధర్మేణ శోభసే ॥ 125
యథా భగీరథో రాజా యథా రామశ్చ విశ్రుతః ।
తథా త్వం సర్వరాజభ్యః భ్రాజసే రశ్మివానివ ॥ 126
ధర్మాత్ముడైన యయాతి వలె, పురూరవునివలె ధర్మాచరణంచే నీవు కూడ ప్రకాశిస్తావు. భగీరథుడు, రామచంద్రుడు మొదలగు వారివలె నీవు సూర్యకాంతితో అందరినీ మించి ప్రకాశిస్తావు. (125,126)
యథా మనుర్యథేక్ష్వాకుః యథా పూరుర్మహాయశాః ।
యథా వన్యో మహారాజ తథా త్వమపి విశ్రుతః ॥ 127
యథా చ వృత్రహా సర్వాన్ సపత్నాన్ నిర్దహన్ పురా ।
త్రైలోక్యం పాలయామాస దేవరాడ్ విగతజ్వరః ॥ 128
తథా శత్రుక్షయం కృత్వా త్వం ప్రజాః పాలయిష్యసి ।
స్వధర్మవిజితాముర్వీం ప్రాప్య రాజీవలోచన ॥ 129
ఖ్యాతిం యాస్యసి ధర్మేణ కార్తవీర్యార్జునో యథా ॥ 130
మహాకీర్తిమంతులైన, మనువు, ఇక్ష్వాకువు, పూరుడు, వైన్యుడు ఆదిగాగల రాజులవలె నీవు ప్రసిద్ధిని పొందుతావు. వృత్రాసురుని సంహరించి, శత్రువులను జయించి ఇంద్రుడు పూర్వం ముల్లోకాలను పొంది సుఖించాడు. ఆ విధంగా నీవు శత్రువులను సంహరించి ప్రజలను పరిపాలిస్తావు. స్వధర్మంచే భూమిను జయించి కార్తవీర్యార్జునునివలె ధర్మంగా ఖ్యాతిని సంపాదిస్తావు. (127-130)
వైశంపాయన ఉవాచ
ఏవమాశ్వాస్య రాజానం నారదో భగవానృషిః ।
అనుజ్ఞాప్య మహారాజ తత్రైవాంతరధీయత ॥ 131
మహారాజా! దేవర్షి అయిన నారదుడు పైన వివరించిన ప్రకారంగా ధర్మరాజును ఊరడించి అతని ఆజ్ఞ గైకొని అక్కడే అంతర్ధానం అయ్యాడు. (131)
యుధిష్ఠిరోఽపి ధర్మాత్మా తమేవార్థం విచింతయన్ ।
తీర్థయాత్రాశ్రితం పుణ్యమ్ ఋషీణాం ప్రత్యవేదయత్ ।
ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు ఆ విషయాలను ఆలోచిస్తూ తన వద్ద ఉన్న ఋషులందరికీ పుణ్యప్రదమయిన ఆ తీర్థయాత్రల వృత్తాంతాన్ని తెలిపాడు. (132)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి పులస్త్యతీర్థయాత్రాయాం నారదవాక్యే పంచాశీతితమోఽధ్యాయః ॥ 85 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున పులస్త్యతీర్థయాత్రలో నారదవాక్యము అను ఎనుబది ఐదవ అధ్యాయము. (85)