60. అరువదియవ అధ్యాయము
దమయంతి తన సంతానమును కుండినపురమునకు పంపుట.
బృహదశ్వ ఉవాచ
దమయంతీ తతో దృష్ట్వా పుణ్యశ్లోకం నరాధిపమ్ ।
ఉన్మత్తవదనున్మత్తా దేవనే గతచేతసమ్ ॥ 1
భయశోకసమావిష్టా రాజన్ భీమసుతా తతః ।
చింతయామాస తత్ కార్యం సుమహత్ పార్థివం ప్రతి ॥ 2
బృహదశ్వుడిలా అన్నాడు - ధర్మజా! తర్వాత దమయంతి జూదంలో పిచ్చిపట్టినవానివలె ఉన్న పుణ్యాత్ముడయిన నలుని చూసి భయమూ, శోకమూ కలిగినా కనపడనీయక స్తిమితంగా నలవిషయంలో తన కర్తవ్యాన్ని గురించి ఆలోచించింది. (1,2)
సా శంకమానా తత్ పాపం చికీర్షంతీ చ తత్ప్రియమ్ ।
నలం చ హృతసర్వస్వమ్ ఉపలభ్యేదమబ్రవీత్ ॥ 3
దమయంతి పాపాన్ని శంకిస్తూనే నలునికి ప్రియం చెయ్యాలని కోరి, నలుడు సర్వస్వాన్ని పోగొట్టుకున్నట్లు తెలిసి... (3)
బృహత్సేనామతియశాం తాం ధాత్రీం పరిచారికామ్ ।
హితాం సర్వార్తకుశలామ్ అనురక్తాం సుభాషితామ్ ॥ 4
యశోవతీ, హితురాలూ, సర్వవిషయాలలోనూ నేర్పరియు, తమపట్ల అనురాగం గలదీ మాటకారీ యైన పరిచారిక బృహత్సేన నుద్దేశించి - (దమయంతి ఈ క్రింది విధంగా పల్కింది). (4)
బృహత్సేనే వ్రజామాత్యాన్ ఆనాయ్య నలశాసనాత్ ।
ఆచక్ష్వ యద్ధృతం ద్రవ్యమ్ అవశిష్టం చ యద్ వసు ॥ 5
బృహత్సేనా! మంత్రులను రావించి, జూదంలో పోయినదిగాక మిగిలిన ధనం ఎంతో? తెలుపుమని రాజాజ్ఞగా చెప్పు. (5)
తతస్తే మంత్రిణః సర్వే విజ్ఞాయ నలశాసనమ్ ।
అపి నో భాగధేయం స్యాత్ ఇత్యుక్త్వా నలమావ్రజన్ ॥ 6
అపుడు మంత్రులందరు నలుని శాసనాన్ని విని మన అదృష్టమెట్లున్నదో అని మహారాజును చేరారు. (6)
తాస్తు సర్వాః ప్రకృతయః ద్వితీయం సముపస్థితాః ।
న్యవేదయద్ భీమసుతా న చ తత్ ప్రత్యనందత ॥ 7
వారందరు రెండవపర్యాయం దమయంతి చెంతకు వచ్చారు. దమయంతి కూడ మరోసారి నలునకు నివేదించింది. కాని అతడు ఆమోదించలేదు. (7)
వాక్యమప్రతినందంతం భర్తారమైవీక్ష్య సా ।
దమయంతీ పునర్వేశ్మ వ్రీడితా ప్రవివేశ హ ॥ 8
నిశమ్య సతతం చాక్షాన్ పుణ్యశ్లోకపరాఙ్ ముఖాన్ ।
నలం చ హృతసర్వస్వం ధాత్రీం పునరువాచ హ ॥ 9
బృహత్సేనే పునర్గచ్ఛ వార్ ష్ణేయం నలశాసనాత్ ।
సూతమానయ కల్యాణి మహత్ కార్యముపస్థితమ్ ॥ 10
తనమాటను ఆమోదించని భర్తను చూచి దమయంతి సిగ్గుతో అంతఃపురానికి వెళ్ళింది. జూదం నలునకు ప్రతికూలంగా ఉన్నట్లు, నలుని సర్వస్వం హరింపబడినట్లు తెలిసింది. బృహత్సేనను పిలిచి వెంటనే నలుని ఆజ్ఞగా తెల్పి రథసారథియైన వార్ష్ణేయుని తోడ్కొని రమ్మని పంపింది. (8-10)
బృహత్సేనా తు సా శ్రుత్వా దమయంత్యాః ప్రభాషితమ్ ।
వార్ ష్ణేయమానయామాస పురుషైరాప్తకారిభిః ॥ 11
వార్ ష్ణేయం తు తతో భైమీ సాంత్వయంశ్లక్ష్ణయా గిరా ।
ఉవాచ దేశకాలజ్ఞా ప్రాప్తకాలమనిందితా ॥ 12
ఆ దమయంతి మాటలు విన్న బృహత్సేన వార్ష్ణేయుని తోడ్కొని వచ్చింది. ఆప్తులైన పురుషులతోనున్న వార్ష్ణేయునితో దేశకాలపరిస్థితులను, ప్రాప్తకాలాన్ని గుర్తించిన దమయంతి సాంత్వనవాక్కులతో ఇలా పలికింది. (11,12)
జానీషే త్వ యథా రాజా సమ్యగ్ వృత్తః సదా త్వయి ।
తస్య త్వం విషమస్థస్య సాహాయ్యం కర్తుమర్హసి ॥ 13
వార్ష్ణేయా! మహారాజు మంచిస్థితిలో ఉన్నప్పుడు నీవిషయంలో ఎలా వుండేవారో నీకు తెలుసు కదా! విషమస్థితిలోనున్న మహారాజునకు సహాయం చేయటానికి నీవే తగినవాడవు. (13)
యథా యథా హి నృపతిః పుష్కరేణైవ జీయతే ।
తథా తథాస్య వై ద్యూతే రాగో భూయోఽబివర్ధతే ॥ 14
పుష్కరుని చేతిలో ఓడిపోయినపుడల్లా మహారాజునకు పాచికలాటపై ఆసక్తి పెరుగుతోంది. (14)
యథా చ పుష్కరస్యాక్షాః పతంతి వశవర్తినః ।
తథా విపర్యయశ్చాపి నలస్యాక్షేషు దృశ్యతే ॥ 15
పుష్కరుని పాచికలు ఆతనికి అధీనాలై ప్రవర్తిస్తున్నాయి. నలుని పాచికలు అభీష్టానికి వ్యతిరేకంగా పడుతున్నాయి. (15)
సుహృత్స్వజనవాక్యాని యథావన్న శృణోతి చ ।
మమాపి చ తథా వాక్యం నాభినందతి మోహితః ॥ 16
మానం మన్యే న దోషోఽస్తి నైషధస్య మహాత్మనః ।
యత్ తు మే వచనం రాజా నాభినందతి మోహితః ॥ 17
మహారాజు తనవారి మాటలను, మిత్రుల మాటలను, చివరకు నామాటలనూ జూదంపై వ్యామోహంతో పెడచెవిని పెడుతున్నారు. ఈ విధంగా మా మాటలను అభినందించకపోవటం కేవలం మహాత్ముడైన మహారాజు దోషమని నేను భావింపను. ఎందుకో! రాజు మోహంతో నామాట కూడా వినటంలేదు. (16,17)
శరణం త్వాం ప్రపన్నాస్మి సారథే కురు మద్వచః ।
న హి మే శుధ్యతే భావః కదాచిద్ వినశేదపి ॥ 18
సారథీ! నా మనస్సు నిర్మలంగా లేదు. ఎపుడయినా భావం కూడ మారవచ్చు. కాని నిన్నిపుడు శరణు వేడుతున్నాను. నా మాట ప్రకారం చేయుము. (18)
నలస్య దయితానశ్వాన్ యోజయిత్వా మనోజవాన్ ।
ఇదమారోప్య మిథునం కుండినం యాతుమర్హసి ॥ 19
నలునకు ప్రీతిపాత్రమై మనోవేగంతో వెళ్ళే గుర్రాలను రథానికి పూన్చి మాపిల్లలైన ఈ ఇంద్రసేనుని, ఇంద్రసేనను రథంపై కూర్చుండబెట్టి కుండినగరానికి తీసుకొనివెళ్ళాలి. (19)
మమ జ్ఞాతిషు నిక్షిప్య దారకౌ స్యందనం తథా ।
అశ్వాంశ్చేమాన్ యథాకామం వస వాన్యత్ర గచ్ఛ వా ॥ 20
నాజ్ఞాతుల వద్ద (తల్లిదండ్రులచెంత) ఈ పిల్లలిద్దరిని ఉంచి రథాశ్వసహితంగా నీవు యథేచ్ఛగా అక్కడే ఉండు. లేదంటే మరెక్కడికైనా వెళ్ళు. (20)
దమయంత్యాస్తు తద్ వాక్యం వార్ ష్ణేయో నలసారథిః ।
న్యవేదయదశేషేణ నలామాత్యేషు ముఖ్యశః ॥ 21
నలసారథియైన వార్ష్ణేయుడు దమయంతి చెప్పిన విషయాన్నంతా నలమహారాజుయొక్క ముఖ్యులైన మంత్రులకు నివేదించాడు. (21)
తైః సమేత్య వినిశ్చిత్య సోఽనుజ్ఞాతో మహీపతే ।
యయౌ మిథునమారోప్య విదర్భాంస్తేన వాహినా ॥ 22
ధర్మరాజా! మంత్రులతో కలసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి వారి అనుమతిని పొంది, వార్ష్ణేయుడు పిల్లలిద్దరినీ రథంపై ఎక్కించుకొని విదర్భకు వెళ్ళాడు. (22)
హయాంస్తత్ర వినిక్షిప్య సూతో రథవరం చ తమ్ ।
ఇంద్రసేనాం చ తాం కన్యామ్ ఇంద్రసేనం చ బాలకమ్ ॥ 23
ఆమంత్ర్య భీమం రాజానమ్ ఆర్తః శోచన్ నలం నృపమ్ ।
అటమానస్తతోఽయోధ్యాం జగామ నగరీం తదా ॥ 24
విదర్భ చేరి భీమమహారాజునకు నలుని విషయాన్ని తెలిపి ఇంద్రసేనను, ఇంద్రసేనుని వారిచెంతనే ఉంచి, గుర్రాలను రథాన్ని కూడ కుండిన నగరంలోనే వదలి తిరిగి, తిరిగి, వార్ష్ణేయుడు అయోధ్యకు వెళ్ళాడు. (23,24)
ఋతుపర్ణం స రాజానమ్ ఉపతస్థే సుదుఃఖితః ।
భృతిం చోపయయౌ తస్య సారథ్యేన మహీపతే ॥ 25
దుఃఖంతో వార్ష్ణేయుడు ఋతుపర్ణమహారాజు చెంతకు చేరాడు. వారికి రథసారథియై జీవనభృతిని పొందాడు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి కుండినం ప్రతి కుమారయోః ప్రస్థాపనే షష్టితమోఽధ్యాయః ॥ 60 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలదమయంతుల సంతానమును కుండిననగరమునకు జేర్చుట యను అరువదియవ అధ్యాయము. (60)