61. అరువది ఒకటవ అధ్యాయము
నలదమయంతుల అడవుల పాలగుట - నలుని వస్త్రాపహరణము.
బృహదశ్వ ఉవాచ
తతస్తు యాతే వార్ ష్ణేయే పుణ్యశ్లోకస్య దీవ్యతః ।
పుష్కరేణ హృతం రాజ్యం యచ్చాన్యద్ వసు కించన ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు -
వార్ష్ణేయుడు విదర్భకు వెళ్ళిన తర్వాత పుష్కరుడు నలుని రాజ్యమూ, ఇతర ధన సంపదలు కూడ ఏ కొంచెమూ మిగల్చకుండా హరించాడు. (1)
హృతరాజ్యం నలం రాజన్ ప్రహసన్ పుష్కరోఽబ్రవీత్ ।
ద్యూతం ప్రవర్తతాం భూయః ప్రతిపాణోఽస్తి కస్తవ ॥ 2
రాజ్యసంపదలను కోల్పోయిన నలుని చూసి పుష్కరుడు పరిహాసం చేస్తూ పందెం పెట్టటానికి ఏమైనా ఉంటే జూదానికి రావచ్చునని పల్కాడు. (2)
శిష్టా తే దమయంత్యేకా సర్వమన్యజ్జితం మయా ।
దమయంత్యాః పణః సాధు వర్తతాం యది మన్యసే ॥ 3
'నీకు దమయంతి మాత్రమే మిగిలియున్నది. మిగిలినదంతా నాచే జయింపబడింది. దమయంతిని పణంగా పెట్టే తలంపు ఉంటే ఆట సాగించు.' (3)
పుష్కరేణైవముక్తస్య పున్యశ్లోకస్య మన్యునా ।
వ్యదీర్యతేవ హృదయం న చైనం కించిదబ్రవీత్ ॥ 4
పుష్కరు డీ విధంగా అనగానే నలునిహృదయం కోపంతో కోసేసినట్లయింది. అయినా పుష్కరునితో ఏమీ అనలేదు. (4)
తతః పుష్కరమాలోక్య నలః పరమమన్యుమాన్ ।
ఉత్సృజ్య సర్వగాత్రేభ్యః భూషణాని మహాయశాః ॥ 5
తర్వాత యశస్వియైన నలుడు మిక్కిలి కోపంతో తన శరీరం మీద ఉన్న ఆభరణాలన్నింటిని తొలగించాడు. (5)
ఏకవాసా హ్యసంవీతః సుహృచ్ఛోకవివర్ధనః ।
నిశ్చక్రామ తతో రాజా త్యక్త్వా సువిపులాం శ్రియమ్ ॥ 6
నలమహారాజు సకలసంపదలను వదిలి ఒకేబట్ట చుట్టుకొని మిత్రులకు దుఃఖాన్ని పెంచుతూ బయలుదేరాడు. (6)
దమయన్త్యేకవస్త్రాథ గచ్ఛంతం పృష్ఠతోఽన్వగాత్ ।
స తయా బాహ్యతః సార్ధం త్రిరాత్రం నైషధోఽవసత్ ॥ 7
దమయంతి నగరాన్ని విడచివెళ్తున్న నలుని వెంట కట్టుబట్టలతో బయలుదేరింది. పట్టణాన్ని వీడిన నలుడు దమయంతితో కలసి మూడు రాత్రులు మాత్రమే ఉన్నాడు. (7)
పుష్కరస్తు మహారాజ ఘోషయామాస వై పురే ।
నలే యః సమ్యగాతిష్ఠేత్ స గచ్ఛేద్ వధ్యతాం మమ ॥ 8
మహారాజైన పుష్కరుడు "నలునితో స్నేహాంగా ఉండేవారు వధింపదగినవారే" అని చాటించాడు. (8)
పుష్కరస్య తు వాక్యేన తస్య విద్వేషణేన చ ।
పౌరా న తస్య సత్కారం కృతవంతో యుధిష్ఠిర ॥ 9
ధర్మజా! విద్వేషపూరితమైన పుష్కరుని మాటలు విన్న పౌరులు నలుని గౌరవించలేదు. (9)
స తథా నగరాభ్యాశే సత్కారార్హో న సత్కృతః ।
త్రిరాత్రముషితో రాజా జలమాత్రేణ వర్తయన్ ॥ 10
సత్కారార్హుడయినా సత్కారం పొందకుండా నగరానికి వెలుపలే నలుడు మూడురాత్రులు నీటిని త్రాగి గడిపాడు. (10)
పీడ్యమానః క్షుధా తత్ర ఫలమూలాని కర్షయన్ ।
ప్రాతిష్ఠత తతో రాజా దమయంతీ తమన్వగాత్ ॥ 11
నలుడు ఆకలిబాధతో వృక్షాల నుండి ఫలాలను కోసుకొని తింటూ బయలుదేరాడు. దమయంతి కూడ అతనిని అనుసరించింది. (11)
క్షుదయా పీడ్యమానస్తు నలో బహుతిథేఽహని ।
అపశ్యచ్ఛకునాన్ కాంశ్చిత్ హిరణ్యసదృశచ్ఛదాన్ ॥ 12
చాలా రోజులుగా ఆకలిగొన్న నలునకు ఒక రోజున బంగారుకాంతులీనే రెక్కలున్న కొన్నిపక్షులు కనిపించాయి. (12)
స చింతయామాస తదా నిషధాధిపతిర్బలీ ।
అస్తి భక్ష్యో మమాద్యాయం వసు చేద భవిష్యతి ॥ 13
'ఈ పక్షులు నాకు ఆహారం అవుతాయి. బంగారం కూడ లభిస్తుంది' అనుకొన్నాడు. (13)
తతస్తాన్ పరిధానేన వాససా స సమావృణోత్ ।
తస్య తద్ వస్త్రమాదాయ సర్వే జగ్ముర్విహాయసా ॥ 14
నలుడు తన ఉత్తరీయాన్ని పక్షులపైకి విసిరాడు. ఆ పక్షులు వస్త్రాన్ని తీసికొని ఆకాశానికి ఎగిరిపోయాయి. (14)
ఉత్పతంతః ఖగా వాక్యమ్ ఏతదాహుస్తతో నలమ్ ।
దృష్ట్వా దిగ్వాసనం భూమౌ స్థితం దీనమధోముఖమ్ ॥ 15
దిగంబరుడై తలవంచుకొని దైన్యంతో నున్న నలుని చూచి ఆకాశాని కెగిరే పక్షులు ఈ విధంగా పలికాయి. (15)
వయమక్షాః సుదుర్బుద్ధే తవ వాసో జిహీర్షవః ।
ఆగతా న హి నః ప్రీతిః సవాససి గతే త్వయి ॥ 16
"బుద్ధిహీనుడా! మీరు కట్టుబట్టలతో వెళ్లుతూ ఉంటే మాకు సంతోషంగా లేదు. దిగంబరుడవైన నిన్ను చూచి సంతోషించటానికి నీవస్త్రాలను అపహరించాలని వచ్చిన పాచికలం మేము" - అని ఆ పక్షులు పలికాయి. (16)
తాన్ సమీపగతానక్షాన్ ఆత్మానం చ వివాససమ్ ।
పుణ్యశ్లోకస్తదా రాజన్ దమయంతీమథాబ్రవీత్ ॥ 17
యేషాం ప్రకోపాదైశ్వర్యాత్ ప్రచ్యుతోఽహమనిందితే ।
ప్రాణయాత్రాం న విందేయం దుఃఖితః క్షుధయాన్వితః ॥ 18
యేషాం కృతే న సత్కారమ్ అకుర్వన్ మయి నైషధాః ।
ఇమే తే శకునా భూత్వా వాసో భీరు హరంతి మే ॥ 19
తన సమీపంలో నున్న పాచికలను చూచి దిగంబరుడైన నలుడు దమయంతితో ఇలా అన్నాడు - దమయంతీ! ఈ పాచికల కోపం వలననే మన మీవిధంగా సకలసంపదలను కోల్పోయాము. ఆకలి బాధతో దుఃఖితులమై ప్రాణాలను నిల్పుకోలేకున్నాము. వీనిమూలంగానే నిషధప్రజల గౌరవాన్ని పొందలేకపోయాం. పాచికలే పక్షుల రూపంలో వచ్చి నావస్త్రాన్ని కూడ అపహరించాయి. (17-19)
వైషమ్యం పరమం ప్రాప్తః దుఃఖితో గతచేతనః ।
భర్తా తేఽహం నిబోధేదం వచనం హితమాత్మనః ॥ 20
అత్యంతవిషమపరిస్థితిని పొంది దుఃఖిస్తూ చంచలమైన మనస్సుతో దమయంతితో ఇలా చెప్పటం ప్రారంభిమ్చాడు. "నీభర్తగా నీకు హితాన్ని కల్గించే మాట చెపుతున్నాను. (20)
ఏతే గచ్ఛంతి బహవః పంథానో దక్షిణాపథమ్ ।
అవంంతీమృక్షవంతం చ సమతిక్రమ్య పర్వతమ్ ॥ 21
ఈత్రోవలన్నీ ఋక్షవంత పర్వతాన్ని దాటి, అవంతీ నగరాన్ని దాటి దక్షిణాపథానికి వెళ్ళేవి. (21)
ఏష వింధ్యో మహాశైలః పయోష్ణీ చ సముద్రగా ।
ఆశ్రమాశ్చ మహర్షీణాం బహుమూలఫలాన్వితాః ॥ 22
ఏష పంథా విదర్భాణామ్ అసౌ గచ్ఛతి కోసలాన్ ।
అతః పరం చ దేశోఽయం దక్షిణే దక్షిణాపథః ॥ 23
ఇది వింధ్యపర్వతం. ఇది పయోష్ణీనది. అనేకరకాల కందమూలఫలాలచే సుసంపన్నమైన ఈ ప్రాంతంలో మహర్షుల ఆశ్రమాలున్నాయి. ఇది విదర్భరాజ్యానికి మార్గం. ఈ మార్గం కోసలరాజ్యానికి పోతుంది. ఆ తర్వాత దక్షిణంలో నున్న దేశమంతా దక్షిణదేశమే! (22,23)
ఏతద్ వాక్యం నలో రాజా దమయంతీం సమాహితః ।
ఉవాచాసకృదార్తో హి భైమీముద్దిశ్య భారత ॥ 24
ధర్మజా! బాధాతప్తహృదయుడైనప్పటికీ దమయంతిని ఓదారుస్తూనే నలుడు ఆమెతో 'ఈమాట' చాలాసార్లు అన్నాడు. (నీకిష్టమైన దేశమునకు నీవు వెళ్ళు) (24)
తతః సా బాష్పకలయా వాచా దుఃఖేన కర్శితా ।
ఉవాచ దమయంతీ తం నైషధం కరుణం వచః ॥ 25
దుఃఖభారంతో కన్నీరు కారుస్తూ, జాలిగొలిపే మాటలతో దమయంతి నలునితో ఇలా పలికింది. (25)
ఉద్వేజతే మే హృదయం సీదంత్యంగాని సర్వశః ।
తవ పార్థివ సంకల్పం చింతయంత్యాః పునః పునః ॥ 26
హృతరాజ్యం హృతద్రవ్యం వివస్త్రం క్షుచ్ఛ్రమాన్వితమ్ ।
కథముత్సృజ్య గచ్ఛేయమ్ అహం త్వాం నిర్జనే వనే ॥ 27
మహారాజా! మీసంకల్పం విన్న నాహృదయం దహించుకుపోతోంది. శరీరావయవాలు స్తంభిస్తున్నాయి! రాజ్యాన్ని, సంపదలనూ కోల్పోయి ఆకలితో శ్రమపడుతూ వివస్త్రులైన మిమ్ము విడచి నేనెలా వెళ్ళగలను. (26,27)
శ్రంతస్య తే క్షుధార్తస్య చింతయానస్య తత్ సుఖమ్ ।
వనే ఘోరే మహారాజ నాశయిష్యామ్యహం క్లమమ్ ॥ 28
ఆకలిబాధతో అలసిపోయి గతసుఖాలను గూర్చి ఆలోచించే మీకు, ఈ ఘోరారణ్యంలో బాధను పోగొట్టగలదానను నేను మాత్రమే. (28)
న చ భార్యాసమం కించిద్ విద్యతే భిషజాం మతమ్ ।
ఔషధం సర్వదుఃఖేషు సత్యమేతద్ బ్రవీమి తే ॥ 29
సమస్తదుఃఖసమయాల్లోను ఓదార్పుగల భార్యతో సమానమైన మందు మరేదీ లేదని వైద్యులు చెప్పిన సత్యాన్ని మీకు చెపుతున్నాను. (29)
నల ఉవాచ
ఏవమేతద్ యథాఽఽత్థ త్వం దమయంతి సుమధ్యమే ।
నాస్తి భార్యాసమం మిత్రం నరస్యార్తస్య భేషజమ్ ॥ 30
దమయంతీ! బాధాతప్తులైన వారికి భార్యతో సమానమైన మిత్రుడుగాని, ఆమెతో సమానమైన మందుగాని లేదు. (30)
న చాహం త్యక్తకామస్త్వాం కిమలం భీరు శంకసే ।
త్యజేయమహమాత్మానం న చైవ త్వామనిందితే ॥ 31
దమయంతీ! నిన్ను విడచి వెళ్ళాలనే కోరిక నాకున్నట్లుగా నీవు అనుమానపడుతున్నావు. నన్నైనా నేను విడుస్తాను కాని నిన్ను విడిచిపెట్టను. (31)
దమయంత్యువాచ
యది మాం త్వం మహారాజ న విహాతుమిహేచ్ఛసి ।
తత్ కిమర్థం విదర్భాణాం పంథాః సముపదిశ్యతే ॥ 32
దమయంతి ఇలా అన్నది - మహారాజా! నన్ను విడచివెళ్ళాలనే కోరిక మీకు లేనట్లయితే విదర్భరాజ్యానికి వెళ్ళేమార్గం గురించి నాకెందుకు చెప్పారు? (32)
అవైమి చాహం నృపతే న తు మాం త్యక్తుమర్హసి ।
చేతసా త్వపకృష్టేన మాం త్యజేథా మహీపతే ॥ 33
మహారాజా! నన్ను విడచి వెళ్ళరని నేనెరుగుదును కాని బుద్ధి పెడదారి పట్టి నన్ను విడిచి వెళ్ళకండి. (33)
పంథానం హి మమాభీక్ష్ణమ్ ఆఖ్యాసి చ నరోత్తమ ।
అతో నిమిత్తం శోకం మే వర్ధయస్యమరోపమ ॥ 34
రాజా! విదర్భ, కోసలరాజ్యాలకు దారులను నాకు చెప్పటం వల్ల నాకు మరింత దుఃఖం పెంచుతున్నారు. (34)
యది చాయమభిప్రాయః తవ జ్ఞాతీన్ వ్రజేదితి ।
సహితావేవ గచ్ఛావః విదర్భాన్ యది మన్యసే ॥ 35
మహారాజా! విదర్భలో మాజ్ఞాతుల దగ్గర ఉండాలనుకొంటే ఇద్దరం కలసివెళదాము! (35)
విదర్భరాజస్తత్ర త్వాం పూజయిష్యతి మానద ।
తేన త్వం పూజితో రాజన్ సుఖం వత్స్యసి నో గృహే ॥ 36
విదర్భరాజు మిమ్మల్ని గౌరవిస్తారు. వారిచే పూజింపబడుతూ సుఖంగా మనయింట్లో ఉండవచ్చు. (36)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలవనయాత్రాయామేకషష్టితమోఽధ్యాయః ॥ 61 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలవనయాత్ర అను అరువది యొకటవ అధ్యాయము. (61)