59. ఏబది తొమ్మిదవ అధ్యాయము
కలి ఆవేశించిన నలుడు పుష్కరునితో జూదమాడుట.
బృహదశ్వ ఉవాచ
ఏవం స సమయం కృత్వా ద్వాపరేణ కలిః సహ ।
ఆజగామ తతస్తత్ర యత్ర రాజా స నైషధః ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
ఈవిధంగా ద్వాపరునితో కలి ఒప్పందం చేసుకొనిన పిమ్మట నిషధమహారాజు దగ్గరకు వెళ్లాడు. (1)
స నిత్యమంతరప్రేప్సుః నిషధేష్వవసచ్చిరమ్ ।
అథాస్య ద్వాదశే వర్షే దదర్శ కలిరంతరమ్ ॥ 2
కలి నిషధనగరం చేరి అవకాశం కోసం వేచి ఉన్నాడు. పండ్రెండవ సంవత్సరంలో కలికి అవకాశం ఏర్పడింది. (2)
కృత్వా మూత్రముపస్పృశ్య సంధ్యామన్వాస్త నైషధః ।
అకృత్వా పాదయోః శౌచం తత్రైనం కలిరావిశత్ ॥ 3
నలమహారాజొకనాడు మూత్రవిసర్జన చేసి, కాళ్లుకడుక్కోకుండా సంధ్యోపాసన చేశాడు. ఇదే సమయాన అశుచియైన నలునిలో కలి ప్రవేశించాడు. (3)
స సమావిశ్య చ నలం సమీపం పుష్కరస్య చ ।
గత్వా పుష్కరమాహేదమ్ ఏహి దీవ్య నలేన వై ॥ 4
అలా కలి నలుని ఆవేశించి, పుష్కరుని దగ్గరకు వెళ్ళి, నలునితో పాచికలాడుమని చెప్పాడు. (4)
అక్షద్యూతే నలం జేతా భవాన్ హి సహితో మయా ।
నిషధాన్ ప్రతిపద్యస్య జిత్వా రాజ్యం నలం నృపమ్ ॥ 5
నీవు నాతోకలసి పాచికలాడి నలుని జయిస్తావు. నలుని జయించి నిషధరాజ్యాన్ని పొందు. (5)
ఏవముక్తస్తు కలినా పుష్కరో నలమభ్యయాత్ ।
కలిశ్చైవ వృషో భూత్వా గవాం పుష్కరమభ్యయాత్ ॥ 6
కలి ఈవిధంగా చెప్పగానే పుష్కరుడు నలుని చేరాడు. కలియే పాచికలరూపం దాల్చి పుష్కరుని చేరాడు (6)
ఆసాద్య తు నలం వీరం పుష్కరః పరవీరహా ।
దీవ్యావేత్యబ్రవీద్ భ్రాతా వృషేణేతి ముహుర్ముహుః ॥ 7
శత్రుంజయుడగు పుష్కరుడు నలుని చెంతకు వచ్చి పాచికలాటకు రమ్మని పలుమార్లు పలికాడు. పుష్కరుడు నలుని సోదరుడు. (7)
న చక్షమే తతో రాజా సమాహ్వానం మహామనాః ।
వైదర్భ్యాః ప్రేక్షమాణాయాః పణకాలమమన్యత ॥ 8
విజ్ఞుడైన నలమహారాజు ఆ ఆహ్వానాన్ని విని ఊరుకోలేకపోయాడు. దమయంతి చూస్తూ ఉండగానే పందెం వేయటానికి సిద్ధపడ్డాడు. (8)
హిరణ్యస్య సువర్ణస్య యానయుగ్యస్య వాససామ్ ।
ఆవిష్టః కలినా ద్యూతే జీయతే స్మ నలస్తదా ॥ 9
తమక్షమదసమ్మత్తం సుహృదాం న తు కశ్చన ।
నివారణేఽభవచ్ఛ క్తః దీవ్యమానమరిందమమ్ ॥ 10
కలి ఆవహించి యున్నందున తనకు సంబంధించిన ధనకనక వస్తువాహనగృహ వస్త్రాదులను నలుడు జూదంలో ఓడాడు. పట్టుదలతో ఆటను కొనసాగిస్తున్న నలుని ఏ మిత్రులూ ఆపలేకపోయారు. (9,10)
తతః పౌరజనాః సర్వే మంత్రిభిః సహ భారత ।
రాజానం ద్రష్టుమాగచ్ఛన్ నివారయితుమాతురమ్ ॥ 11
ధర్మజా! అపుడు మంత్రులతో కలిసి పురజనులంతా కష్టాల్లో ఉన్న రాజును జూదం నుండి నివారించటానికి, చూడటానికి వచ్చారు. (11)
తతః సూత ఉపాగమ్య దమయంత్యై న్యవేదయత్ ।
ఏష పౌరజనో దేవి ద్వారి తిష్ఠతి కార్యవాన్ ॥ 12
పిమ్మట సూతుడు వచ్చి "కార్యార్థులైన పురజనులు ద్వారం చెంత వేచియున్నా"రని దమయంతికి తెలియజేశాడు. (12)
నివేద్యతాం నైషధాయ సర్వాః ప్రకృతయః స్థితాః ।
అమృష్యమాణా వ్యసనం రాజ్ఞో ధర్మార్థదర్శినః ॥ 13
ధర్మార్థదర్శనుడైన మహారాజు వ్యసనాన్ని సహించలేక ప్రజలంతా వచ్చినట్లు మహారాజుకు తెలియజేయవలసినదిగా దమయంతికి నివేదించాడు. (13)
తతః సా బాష్పకలయా వాచా దుఃఖేన కర్శితా ।
ఉవాచ నైషదం భైమీ శోకోపహతచేతనా ॥ 14
అపుడు దమయంతి దుఃఖంతో, శోకతప్తమైన మనస్సుతో, కన్నీటితో, గద్గద స్వరంతో నైషధునికిలా చెప్పింది. (14)
రాజన్ పౌరజనో ద్వారి త్వాం దిదృక్షురవస్థితః ।
మంత్రిభిః సహితః సర్వైః రాజభక్తిపురస్కృతః ॥ 15
తం ద్రష్టుమర్హసీత్యేవం పునః పునరభాషత ।
తాం తథా రుచిరాపాంగీం విలపంతీం తథావిధామ్ ॥ 16
ఆవిష్టః కలినా రాజా నాభ్యభాషత కించన ।
తతస్తే మంత్రిణః సర్వే తే చైవ పురవాసినః ॥ 17
నాయమస్తీతి దుఃఖార్తాః పుష్కరస్య నలస్య చ ।
తథా తదభవద్ ద్యూతం పుష్కరస్య నలస్య చ ।
యుధిష్ఠిర బహూన్ మాసాన్ పుణ్యశ్లోకస్త్వజీయత ॥ 18
మహారాజా! "పురజనులందరూ మంత్రులతో కలసి, రాజభక్తితో తమ దర్శనార్థమై వచ్చి ద్వారం దగ్గర ఉన్నారు. వారిని మీరు చూడాలి" అని పలుమారు చెప్పింది.
కలి ఆవేశించిన నలుడు అలా విలపిస్తున్న దమయంతితో ఏమీ మాటాడలేదు. మంత్రులూ, పురజనులూ అంతా "ఇతడు మనకు దక్కడు" అనుకొని దుఃఖార్తులై సిగ్గుతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
ధర్మరాజా! అలా పుష్కరునకు, నలునకు ఎన్నో నెలలపాటు పాచికలాట సాగింది. పుణ్యశ్లోకుడైన నలుడు పరాజితుడయ్యాడు. (15-18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నల ద్యూతే ఏకోనషష్టితమోఽధ్యాయః ॥ 59 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలద్యూతమను ఏబది తొమ్మిదవ అధ్యాయము. (59)