58. ఏబది ఎనిమిదవ అధ్యాయము

నలుని సద్గుణములను విని కలి కోపించుట.

బృహదశ్వ ఉవాచ
వృతే తు నైషధే భైమ్యా లోకపాలా మహౌజసః ।
యాంతో దదృశురాయాంతం ద్వాపరం కలినా సహ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
దమయంతి నలుని వరించిన తర్వాత లోకపాలురు తిరిగి వెళ్తూ కలితో కలిసి వస్తున్న ద్వాపరుని చూశారు. (1)
అథాబ్రవీత్ కలిం శక్రః సంప్రేక్ష్య బలవృత్రహా ।
ద్వాపరేణ సహాయేన కలే బ్రూహి క్వ యాస్యసి ॥ 2
ఇంద్రుడు, కలిని చూసి - "కలీ! ద్వాపరునితో కలసి ఎచ్చటకు ఎందుకు వెళ్తున్నావో చెప్పుమని" అడిగాడు. (2)
తతోఽఽబ్రవీత్ కలిః శక్రం దమయంత్యాః స్వయంవరమ్ ।
గత్వా హి వరయిష్యే తాం మనో హి మమ తాం గతమ్ ॥ 3
నా మనస్సు దమయంతి యందు లగ్నమైంది. దమయంతీ స్వయంవరానికి వెళ్ళి ఆమెను వరిస్తాను - అని ఇంద్రునితో కలి అన్నాడు. (3)
తమబ్రవీత్ ప్రహస్యేంద్రః నిర్వృత్తః స స్వయంవరః ।
వృతస్తయా నలో రాజా పతిరస్మత్సమీపతః ॥ 4
ఇంద్రుడు పెద్దగా నవ్వి, "దమయంతీ స్వయంవరం పూర్తయింది. మా సమక్షంలోనే దమయంతి నలమహారాజును భర్తగా వరించింది" - అని కలితో చెప్పాడు. (4)
ఏవముక్తస్తు శక్రేణ కలిః కోపసమన్వితః ।
దేవానామంత్ర్య తాన్ సర్వాన్ ఉవాచేదం వచస్తదా ॥ 5
ఇంద్రుడీ విధంగా చెప్పగా క్రోధంతో కలి దేవతలను దగ్గరకు పిలచి, ఇలా అన్నాడు. (5)
దేవానాం మానుషం మధ్యే యత్ సా పతిమవిందత ।
తతస్తస్యా భవేన్న్యాయ్యం విపులం దండధారణమ్ ॥ 6
దేవతలమధ్య, ఒకమానవుని దమయంతి పతిగా స్వీకరించడమా! అందులకామె, పెద్దశిక్ష పొందటమే న్యాయం. (6)
ఏవముక్తే తు కలినా ప్రత్యూచుస్తే దివౌకసః ।
అస్మాభిః సమనుజ్ఞాతే దమయంత్యా నలో వృతః ॥ 7
కలిపురుషుడీవిధంగా అనగానే దేవతలిలా పలికారు. "మేము అనుమతిస్తేనే దమయంతి నలుని వరించింది. (7)
కా చ సర్వగుణోపేతం నాశ్రయేత నలం నృపమ్ ।
యో వేద ధర్మానఖిలాన్ యతావచ్చరితవ్రతః ॥ 8
యోఽధీతే చతురో వేదాన్ సర్వానాఖ్యానపంచమాన్ ।
నిత్యం తృప్తా గృహే యస్య దేవా యజ్ఞేషు ధర్మతః ॥ 9
అహింసానిరతో యశ్చ సత్యవాదీ దృఢవ్రతః ।
యస్మిన్ దాక్ష్యం ధృతిర్ జ్ఞానం తపః శౌచం దమః శమః ।
ధ్రువాణి పురుషవ్యాఘ్రే లోకపాలసమే నృపే ॥ 10
ఏవంరూపం నలం యో వై కామయేచ్ఛపితుం కలే ।
ఆత్మానం స శపేన్మూఢః హన్యాదాత్మానమాత్మనా ॥ 11
సకలగుణోపేతుడైన నలమహారాజును ఏ స్త్రీ వరించకుండా ఉంటుంది. నలమహారాజు సకల వేద ధర్మాలు తెలిసినవాడు. ధర్మమార్గంలో ప్రవర్తించటమే అతని వ్రతం. నాలుగు వేదాలను అధ్యయనం చేశాడు. కలీ! ఆతని గృహంలో జరిగే యజ్ఞాల్లో దేవతలు నిత్యతృప్తులై ఉంటారు. అహింసానిరతుడు. సత్యాన్నే పలుకుతాడు. దృఢవ్రతుడు, సమర్థత, ధైర్యం, జ్ఞానం, తపస్సు, శౌచం, దండోపాయం, శాంతస్వభావం - లోకపాలురతో సమంగా నలమహారాజులో ఉన్నాయి. ఇట్టి మహారాజును ఎవరైనా శపించాలనుకొంటారా? అట్టివాడు తన్ను తాను శపించుకొని, తన్నుతాను చంపుకొనే మూర్ఖుడే అవుతాడు. (7-11)
ఏవంగుణం నలం యో వై కామయేచ్ఛపితు కలే ।
కృచ్ఛ్రే స నరకే మజ్జేద్ అగాధే విపులే హ్రదే ।
ఏవముక్త్వా కలిం దేవాః ద్వాపరం చ దివం యయుః ॥ 12
మంచిగుణాలు కల్గిన నలుని శపించటానికి సిద్ధపడినవారిని, అతిక్లిష్టమైన నరకంలో లోతయిన నదిలో ముంచుతారు.
ఈవిధంగా కలికిని, ద్వాపరునకును చెప్పి, దేవతలు స్వర్గానికి వెళ్ళారు. (12)
తతో గతేషు దేవేషు కలిర్ద్వాపరబ్రవీత్ ।
సంహర్తుం నోత్సహే కోపం నలే వత్స్యామి ద్వాపర ॥ 13
భ్రంశయిష్యామి తం రాజ్యాత్ న భైమ్యా సహ రంస్యతే ।
త్వమప్యక్షాన్ సమావిశ్య సాహాయ్యం కర్తుమర్హసి ॥ 14
దేవతలు వెళ్ళిన పిదప, ద్వాపరునితో కలి ఇలా అన్నాడు. "ద్వాపరా! నలునిమీది కోపం చంపుకోలేకపోతున్నాను. నేను నలునిలో నివసిస్తాను. ఆవేశిస్తాను. నలుని రాజ్యభ్రష్టునిగా జేసి, దమయంతితో సుకపడకుండా చేస్తాను. నీవు కుడ పాచికలనావహించి నాకు సహాయపడు"మని కోరాడు. (13,14)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి కలిదేవసంవాదే అష్టపంచాశత్తమోఽధ్యాయః ॥ 58 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున కలి-దేవతల సంవాదమను ఏబది ఎనిమిదవ అధ్యాయము. (58)