57. ఏబది యేడవ అధ్యాయము

దమయంతీ స్వయంవరము - వివాహము.

బృహదశ్వ ఉవాచ
అథ కాలే శుభే ప్రాప్తే తిథౌ పుణ్యే క్షణే తథా ।
ఆజుహావ మహీపాలాన్ భీమో రాజా స్వయంవరే ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
స్వయంవరం జరుగవలసిన శుభతిథినాడు భీమమహారాజు స్వయంవరానికి వచ్చిన భూపతులందరినీ స్వయంవర ప్రదేశానికి ఆహ్వానించాడు. (1)
తచ్ఛ్రుత్వా పృథివీపాలాః సర్వే హృచ్ఛయపీడితాః ।
త్వరితాః సముపాజగ్ముః దమయంతీమభీప్సవః ॥ 2
ఆహ్వానం విన్న రాజులందరూ మదనపీడితులై దమయంతి మీది కోరికతో అతివేగంగా స్వయంవర ప్రదేశానికి చేరారు. (2)
కనకస్తమ్భరుచిరం తోరణేన విరాజితమ్ ।
వివిశుస్తే నృపా రంగం మహాసింహా ఇవాచలమ్ ॥ 3
సువర్నస్తంభాలతో మనోహరంగా ప్రకాశిస్తూ, కాంతిమంతమైన తోరణాలు గల ముఖద్వారంతో విరాజిల్లే స్వయంవర సభారంగాన్ని పర్వతగుహలోకి మహాసింహాలు ప్రవేశించినట్లు రాజులంతా ప్రవేశించారు. (3)
తత్రాసనేషు వివిధేషు ఆసీనాః పృథివీక్షితః ।
సురభిస్రగ్ధరాః సర్వే ప్రమృష్టమణికుండలాః ॥ 4
స్వయంవరసభలో, రకరకాల ఆసనాలున్నాయి. సురభిళ పుష్పమాలలు, మణి కుండలాలు ధరించి రాజులంతా ఆ ఆసనాలపై కూర్చున్నారు. (4)
తాం రాజసమితిం పుణ్యాం నాగైర్భోగవతీమివ ।
సంపూర్ణాం పురుషవ్యాఘ్రైః వ్యాఘ్రైర్గిరిగుహామివ ॥ 5
రాజన్యులతో నిండిన ఆ సభాస్థలి నాగులతో నున్న పాతాళం వలె (భోగవతి వోలె)ను, పెద్దపులులతో నిండిన పర్వతగుహవలెనూ శోభిల్లింది. (5)
తత్ర స్మ పీనా దృశ్యంతే బాహవః పరిఘోపమాః ।
ఆకారవర్ణసుశ్లక్ష్ణాః పంచశీర్షా ఇవోరగాః ॥ 6
స్వయంవరసభలోనున్న మహారాజుల దృఢమైన బాహువులు ఇనుపగుదియలవలె ఉన్నాయి. నున్నగా మెరిసే వారి ఆకారాలు ఐదుతలల సర్పాల్లా కనబడుతున్నాయి. (6)
సుకేశాంతాని చారూణి సునాసాక్షిభ్రువాణి చ ।
ముఖాని రాజ్ఞాం శోభంతే నక్షత్రాణి యథా దివి ॥ 7
ముంగురులు, చక్కని నాసికలు, విశాలమైన కనులు, తీర్చిదిద్దిన కనుబొమలు కలిగిన రాజన్యుల ముఖాలు ఆకాశంలోని నక్షత్రాల వలె ప్రకాశిస్తున్నాయి. (7)
దమయంతీ తతో రంగం ప్రవివేశ శుభాననా ।
ముష్ణంతీ ప్రభయా రాజ్ఞాం చక్షూంషి చ మనాంసి చ ॥ 8
శుభానన అయిన దమయంతి, తనశరీర లావణ్యంతో రాజుల కన్నులనూ, మనస్సులనూ ఆకర్షిస్తూ, స్వయంవర మండపంలో అడుగుపెట్టింది. (8)
తస్యా గాత్రేషు పతితా తేషాం దృష్టిర్మహాత్మనామ్ ।
తత్ర తత్రైవ సక్తాభూత్ న చచాల చ పశ్యతామ్ ॥ 9
రాజశ్రేష్ఠుల దృష్టి ఆ దమయంతి శరీరసౌందర్యం పైబడి అచటనే నిలిచిపోయింది. రాజులందరు ఆమె సౌందర్యాతిశయాన్ని చూచి నిశ్చేష్టులయ్యారు. (9)
తతః సంకీర్త్యమానేషు రాజ్ఞాం నామసు భారత ।
దదర్శ భైమీ పురుషాన్ పంచ తుల్యాకృతీనిహ ॥ 10
ధర్మజా! అటు పిమ్మట, రాజుల యొక్క పేర్లు చెప్పి వారిని గురించి వివరించే సమయంలో దమయంతి ఒకే ఆకృతి గల ఐదుగురు వ్యక్తులను చూసింది. (10)
తాన్ సమీక్ష్య తతః సర్వాన్ నిర్విశేషాకృతీన్ స్థితాన్ ।
సందేహాదథ వైదర్భీ నాభ్యజానాన్నలం నృపమ్ ॥ 11
ఒకే రూపంతోనున్న వారందరినీ చూసి దమయంతి, వారిలో నిజమైన నలమహారాజు ఎవరో తెలిసికొనలేకపోయింది. (11)
యం యం హి దదృశే తేషాం తం తం మేనే నలం నృపమ్ ।
సా చింతయంతీ బుద్ధ్యాథ తర్కయామాస భావినీ ॥ 12
ఆ అయిదుగురిలో ఎవరిని చూసినా ఆమెకు నలమహారాజుగానే తోచింది. అపుడామె విచారిస్తూ తనబుద్ధితో ఇలా తర్కించుకొన్నది. (12)
కథం హి దేవాన్ జానీయాం కథం విద్యాం నలం నృపమ్ ।
ఏవం సంచింతయంతీ సా వైదర్భీ భృశదుఃఖితా ॥ 13
ఎవరు దేవతలో, ఎవరు నలమహారాజో ఎలా తెలిసికోవాలి? అని మిక్కిలి దుఃఖిస్తూ ఆలోచించింది. (13)
శ్రుతాని దేవలింగాని తర్కయామాస భారత ।
దేవానాం యాని లింగాని స్థవిరేభ్యః శ్రుతాని మే ॥ 14
తానీహ తిష్ఠతాం భూమౌ ఏకస్యాపి న లక్షయే ।
సా వినిశ్చిత్య బహుధా విచార్య చ పునః పునః ॥ 15
శరణం ప్రతి దేవానాం ప్రాప్తకాలమమన్యత ।
'పెద్దవారు చెప్పగా, దేవతలకుండవలసిన లక్షణాల గురించి విన్నాను. ఆ లక్షణాలలో ఏ ఒక్కటీ కూడ, భూమిపై నున్న వీరిలో కనిపించటం లేదే!' అలా అనేక పర్యాయాలు, బహువిధాల ఆలోచించిన దమయంతి, దేవతలను శరణువేడటానికిదే సమయమని భావించింది. (14,15)
వాచా చ మనసా చైవ నమస్కారం ప్రయుజ్య సా ॥ 16
దేవేభ్యః ప్రాంజలిర్భూత్వా వేపమానేదమబ్రవీత్ ।
హంసానాం వచనం శ్రుత్వా యథా మే నైషధో వృతః ।
పతిత్వే తేన సత్యేన దేవాస్తం ప్రదిశంతు మే ॥ 17
అంజలి ఘటించి, వాచా మనసా దేవతలకు నమస్కరించి, వినయవిధేయతలతో దమయంతి ఈవిధంగా పల్కింది. "దేవతలారా! హంసల మాటలు విని నలమహారాజును భర్తగా నేను వరించాను. నామాట దక్కించి, ఆ నలుని నాకు ప్రసాదించండి." (16,17)
మనసా వచసా చైవ యథా నాభిచరామ్యహమ్ ।
తేన సత్యేన విబుధాః తమేవ ప్రదిశంతు మే ॥ 18
దేవతలారా! యథార్థంగా నేను మనస్సుతోగాని, వాక్కుతోగాని మరొకనిని భావింపను అనేది సత్యమయితే ఆ సత్యంతో నలుని నాకు ఇచ్చెదరు గాక! (18)
యథా దేవైః స మే భర్తా విహితో నిషధాధిపః ।
తేన సత్యేన మే దేవాః తమేవ ప్రదిశంతు మే ॥ 19
దేవతలచేతనే నలమహారాజు నాకు భర్తగా కూర్చబడినాడు. ఇది సత్యం కాబట్టి నలుని నాకు ప్రసాదించండి. (19)
యథేదం వ్రతమారబ్ధం నలస్యారాధనే మయా ।
తేన సత్యేన మే దేవాః తమేవ ప్రదిశంతు మే ॥ 20
నలుని పతిగా ఆరాధించటం అనే వ్రతం ఆరంభింపబడింది. ఇది సత్యం కావున, దేవతలు నలుని నాకు ప్రసాదింతురు గాక! (20)
స్వం చైవ రూపం కుర్వంతు లోకపాలా మహేశ్వరాః ।
యథాహమభిజానీయాం పుణ్యశ్లోకం నరాధిపమ్ ॥ 21
పుణ్యశ్లోకుడైన నలమహారాజును నేను గుర్తించటానికి తగినట్లు, లోకపాలురైన మీరు, మీ మీ స్వీయరూపాలను పొందుదురు గాక! (21)
నిశమ్య దమయన్త్యాస్తత్ కరుణం ప్రతిదేవితమ్ ।
నిశ్చయం పరమం తథ్యమ్ అనురాగం చ నైషధే ॥ 22
మనోవిశుద్ధిం బుద్ధిం చ భక్తిం రాగం చ నైషధే ।
యథోక్తం చక్రిరే దేవాః సామర్థ్యం లింగధారణే ॥ 23
దమయంతి కరుణంగా చేసిన అభ్యర్థనను విని, నలుని యందు దమయంతికి గల అనురాగంలోని యథార్థతను, నలునిపై ఆమెకు గల భక్తిని, ప్రేమను, విశుద్ధమైన మనస్సును, సద్బుద్ధిని గ్రహించిన దేవతలు, ఆమె ప్రార్థన నాలకించి, తమ తమ రూపాలు ధరించారు. (22,23)
సాపశ్యద్ విబుధాన్ సర్వాన్ అస్వేదాన్ స్తబ్ధలోచనాన్ ।
హృషితస్రగ్రజోహీనాన్ స్థితానస్పృశతః క్షితిమ్ ॥ 24
చెమటలేనిదేహాలు, చలనరహితనేత్రాలు, వాడని పూలదండలు కలిగి ధూళిరహితులై భూమిని తాకకుండ నిలచిన దేవతలను దమయంతి చూచింది. (24)
ఛాయాద్వితీయో మ్లానస్రగ్రజః స్వేదసమన్వితః ।
భూమిష్ఠో నైషధశ్చైవ నిమేషేణ చ సూచితః ॥ 25
నలుని ప్రక్కన ఆయన నీడ కూడా ఉంది. పూలదండలు వాడి ఉన్నాయి. చెమట కనిపిస్తోంది. పాదాలు నేలకు ఆని ఉన్నాయి. రెప్పపాటు తెలుస్తోంది. ఈ సూచనలతో నలుని గుర్తించింది దమయంతి. (25)
సా సమీక్ష్య తు తాన్ దేవాన్ పుణ్యశ్లోకం చ భారత ।
నైషధం వరయామాస భైమీ ధర్మేణ పాండవ ॥ 26
దేవతలను పరిశీలనగా చూసి, పుణ్యశ్లోకుడైన నలునీ చూసి భీమరాజు పుత్రిక దమయంతి ధర్మబద్ధంగానే నిషధరాజయిన నలుని వరించింది. (26)
విలజ్జమానా వస్త్రాంతం జగ్రాహాయతలోచనా .
స్కంధ దేశేఽసృజత్ తస్య స్రజం పరమశోభనామ్ ॥ 27
విశాలనేత్రాలు గల దమయంతి యొక్క సిగ్గు మొగ్గ తొడిగింది. పైట సవరించుకొని, మంగళప్రదమైన పూలదండను నలునిమెడలో వేసింది. (27)
వరయామాస చైవైనం పతిత్వే వరవర్ణినీ ।
తతో హాహేతి సహసా ముక్తః శబ్దో నరాధిపైః ॥ 28
వరవర్ణినియైన దమయంతి ఈ రీతిగా నలుని పతిగా వరించింది. వెనువెంటనే అచటనున్న రాజశ్రేష్ఠుల నుండి హా!హా! అనుశబ్దాలు వినబడ్డాయి. (28)
దేవైర్మహర్షిభిస్తత్ర సాధు సాధ్వితి భారత ।
విస్మితైరీరిత శబ్దః ప్రశంసద్భిర్నలం నృపమ్ ॥ 29
ఆశ్చర్యంతో నలమహారాజును ప్రశంసిస్తున్న దేవతలనుండి, మహర్షుల నుండి, సాధు, సాధు అనే శబ్దాలు వినిపించాయి. (29)
దమయంతీం తు కౌరవ్య వీరసేనసుతో నృపః ।
ఆశ్వాసయద్ వరారోహం ప్రహృష్టేనాంతరాత్మనా ॥ 30
ధర్మజా! ఉత్తమస్త్రీయైన దమయంతిని వీరసేనసుతుడగు నలమహారాజు సంతుష్టమైన అంతరాత్మతో ఊరడించాడు. (30)
యత్ త్వం భజసి కల్యాణి పుమాంసం దేవసన్నిధౌ ।
తస్మాన్మాం విద్ధి భర్తారమ్ ఏవం తే వచనే రతమ్ ॥ 31
దేవతల ఎదుట నన్ను నీవు భర్తగా పొందావు. అందుచే నీమాట యందు ఆసక్తికలవానినిగా నన్ను తెలుసుకో! (31)
యావచ్చ మే ధరిష్యంతి ప్రాణా దేహే శుచిస్మితే ।
తావత్ త్వయి భవిష్యామి సత్యమేతద్ బ్రవీమి తే ॥ 32
తెలినవ్వుల దమయంతీ! నా ఈ దేహంలో ప్రాణాలున్నంతవరకు, నీవిషయంలో ప్రేమతోనే ఉంటాను. ఈ నిజాన్ని నీకు తెలియజేస్తున్నాను. (32)
దమయంతీ తథా వాగ్భిః అభినంద్య కృతాంజలిః ।
తౌ పరస్పరతః ప్రీతౌ దృష్ట్వా త్వగ్నిపురోగమాన్ ॥ 33
తానేవ శరణం దేవాన్ జగ్మతుర్మనసా తదా ।
కృతాంజలియై దమయంతి కూడా తనవాక్కులతో అభినందించింది. పరస్పరానురక్తులై నూతనవధూవరులయిన నలదమయంతులు అగ్నిహోత్రునితో పాటు ఆ దేవతలనే ఆ సమయంలో శరణు పొందారు. (33)
వృతే తు నైషధే భైమ్యా లోకపాలా మహౌజసః ॥ 34
ప్రహృష్టమనసః సర్వే నలాయాష్టౌ వరాన్ దదుః ।
దమయంతి నలుని వరించినందుకు మహాత్ములైన లోకపాలురు సంతోషస్వాంతులై నలమహారాజునకు ఎనిమిది వరాలు ప్రసాదించారు. (34)
ప్రత్యక్షదర్శనం యజ్ఞే గతిం చానుత్తమాం శుభామ్ ॥ 35
నైషధాయ దదౌ శక్రః ప్రీయమాణః శచీపతిః ।
శచీపతియైన దేవేంద్రుడు సంతోషించి నలునకు శుభప్రదమైన అత్యుత్తమగతిని, యజ్ఞాలు చేసే సమయాన తమ ప్రత్యక్షదర్శనాన్ని అనుగ్రహించాడు. (35)
అగ్నిరాత్మభవం ప్రాదాద్ యత్ర వాంఛతి నైషధః ॥ 36
లోకానాత్మప్రభాంశ్చైవ దదౌ తస్మై హుతాశనః ॥
నలుడు కోరిన చోట తానుండేటట్లుగా అగ్ని వరాన్ని ఇచ్చాడు. అంతే కాదు, నలునకు తనకాంతి గల లోకాలను ప్రసాదించాడు. (36)
యమస్త్వన్నరసం ప్రాదాద్ ధర్మే చ పరమాం స్థితిమ్ ॥ 37
యముడు అన్నరసాన్ని, ధర్మమందు ఉత్తమస్థితిని ప్రసాదించాడు. (37)
అపాం పతిరపాం భావం యత్ర వాంఛతి నైషధః ।
స్రజశ్చోత్తమగంధాఢ్యాః సర్వే చ మిథునం దదుః ॥ 38
వరుణుడు, నలుడు కోరిన చోట జలసమృద్ధిని అనుగ్రహించాడు. లోకపాలురందరూ కలసి, ఆ పుణ్యదంపతులకు పరిమళంతో కూడిన పూలదండలను ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరు రెండేసి వరాలిచ్చారు. (38)
వరానేవం ప్రదాయాస్య దేవాస్తే త్రిదివం గతాః ।
పార్థివాశ్చానుభూయాస్య వివాహం విస్మయాన్వితాః ॥ 39
దమయంత్యాశ్చ ముదితాః ప్రతిజగ్ముర్యథాగతమ్ ।
దేవతలు నలునకు ఇలా వరాలను ప్రసాదిమ్చి, దేవలోకానికి వెళ్ళారు. రాజులంతా దమయంతి వివాహానికి సంతోషించి తమతమ నగరాలకు తిరిగి వెళ్ళారు. (39)
గతేషు పార్థివేంద్రేషు భీమః ప్రీతో మహామనాః ॥ 40
వివాహం కారయామాస దమయంత్యా నలస్య చ ।
స్వయంవరానికి వచ్చిన రాజులంతా తిరిగివెళ్ళితే భీమరాజు ఎంతో సంతోషించి నలదమయంతుల పెండ్లి వైభవంగా జరిపించాడు. (40)
ఉష్య తత్ర యథాకామం నైషధో ద్విపదాం వరః ॥ 41
భీమేన సమనుజ్ఞాతః జగామ నగరం స్వకమ్ ।
నిషధదేశాధిపతి నలమహారాజు, తాను కోరుకొన్నట్లుగా కొంతకాలం విదర్భలో ఉండి, భీమరాజు అనుమతితో భార్యాసహితుడై తన నగరానికి వెళ్ళాడు. (41)
అవాప్య నారీరత్నం తు పుణ్యశ్లోకోఽపి పార్థివః ॥ 42
రేమే సహ తయా రాజన్ శాచ్యేవ బలవృత్రహా ।
పుణ్యశ్లోకుడైన నలమహారాజు నారీరత్నమయిన దమయంతిని పొంది శచీదేవితోనున్న దేవేంద్రునివలె దమయంతితో ఆనందించాడు. (42)
అతీవ ముదితో రాజా భ్రాజమానోఽంశుమానివ ॥ 43
అరంజయత్ ప్రజా వీరః ధర్మేణ పరిపాలయన్ ।
మిక్కిలి సంతుష్టుడైన నలమహారాజు, సూర్యునివలె ప్రకాశిస్తూ, వీరుడై ధర్మమార్గాన పరిపాలన చేస్తూ, ప్రజలను రంజింపజేశాడు. (43)
ఈజే చాప్యశ్వమేధేన యయాతిరివ నాహుషః ॥ 44
అన్యైశ్చ బహుభిర్ధీమాన్ క్రతుభిశ్చాప్తదక్షిణైః ।
యయాతిమహారాజువలె ధీమంతుడైన నలుడు భూరిదక్షిణలతో ఇతర క్రతువులతోపాటు అశ్వమేధయాగాన్ని కూడ చేశాడు. (44)
పునశ్చ రమణీయేషు వనేఘాపవనేషు చ ॥ 45
దమయంత్యా సహ నలః విజహారామరోపమః ।
రమణీయమైన వనాల్లో, ఉద్యానవనాల్లో, దేవతుల్యుడయిన నలుడు, దమయంతితో సహా విహరించాడు. (45)
జనయామాస చ తతః దమయంత్యాం మహామనాః ।
ఇంద్రసేనం సుతం చాపి ఇంద్రసేనాం చ కన్యకామ్ ॥ 46
అనంతరం నలమహారాజుకు దమయంతి యందు ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే పుత్రిక జన్మించారు. (46)
ఏవం స యజమానశ్చ విహరంశ్చ నరాధిపః ।
రరక్ష వసుసంపూర్ణాం వసుధాం వసుధాధిపః ॥ 47
ఈవిధంగా నలమహారాజు యజ్ఞాలు చేస్తూ విహరిస్తూ, వసుధాధిపుడుగా సిరిసంపదలతో తులతూగేటట్లు పృథ్విని పరిపాలించాడు. (47)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి దమయంతీస్వయంవరే సప్తపంచాశత్తమోఽధ్యాయః ॥ 57 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున స్వయంవరమను ఏబది ఏడవ అధ్యాయము. (57)