45. నలుబది అయిదవ అధ్యాయము

చిత్రసేనోర్వశీసంవాదము.

వైశంపాయన ఉవాచ
ఆదావేవాథ తం శక్రః చిత్రసేనం రహోఽబ్రవీత్ ।
పార్థస్య చక్షురుర్వశ్వాం సక్తం విజ్ఞాయ వాసనః ॥ 1
అర్జునుని కళ్ళు ఊర్వశిపై లగ్నం కావడం గమనించి ఇంద్రుడు మొదట్లోనే ఏకాంతంలో చిత్రసేనుడితో ఇలా చెప్పాడు. (1)
గంధర్వరాజ గచ్ఛాద్య ప్రహితోఽప్సరసామ్ వరామ్ ।
ఉర్వశీం పురుషవ్యాఘ్ర సోపాతిష్ఠతు ఫాల్గునమ్ ॥ 2
గంధర్వ రాజా! నివు ఈ రోజు అప్సరలలో శ్రేష్ఠురాలైన ఊర్వశి వద్దకు వెళ్ళు. పురుషశ్రేష్ఠా! ఆమెను అర్జునుని సేవించుటకు వెళ్ళుమని చెప్పు. (2)
యథార్చితో గృహీతాస్త్రః విద్యయా మన్నియోగతః ।
తతా త్వయా విధాతవ్యం స్త్రీషు సంగవిశారదః ॥ 3
అస్త్రవిద్యను నేర్చుకొన్న తర్వాత నా ఆజ్ఞచే నీవు అర్జునుడికి సంగీతవిద్యను నేర్పావు. అదే విధంగా నివు అతనిని స్త్రీ సాంగత్యంలో నిపుణుడిలా చెయ్యాలి. (3)
ఏవముక్తస్తథేత్యుక్త్వా సోఽనుజ్ఞాం ప్రాప్య వాసవాత్ ।
గంధర్వరాజోఽప్సరసమ్ అభ్యగాదుర్వశీం వరామ్ ॥ 4
ఇంద్రుడిలా చెప్పాక, చిత్రసేనుడు అలాగే అని అతడి అనుజ్ఞ తీసికొని అప్సరసలలో శ్రేష్ఠురాలైన ఊర్వశి దగ్గరకు వెళ్ళాడు. (4)
తాం దృష్ట్వా విదితో హృష్టః స్వాగతేనార్చితస్తయా ।
సుఖాసీనః సుఖాసీనాం స్మితపూర్వం వచోఽబ్రవీత్ ॥ 5
ఆమెను చూసి మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. ఊర్వశి చిత్రసేనునిరాకను గుర్తించి, స్వాగతపూర్వకంగా అతనిని సత్కరించింది. అతడు సుఖాసీనుడై, సుఖాసీనురాలైన ఆమెతో చిరునవ్వుతో ఇలా చెప్పాడు. (5)
విదితం తేఽస్తు సుశ్రోణి ప్రహితోఽహమిహాగతః ।
త్రిదివస్యైకరాజేన త్వత్ర్పసాధాభినంధినా ॥ 6
సుందరీ! ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది. ఈ స్వర్గానికి ఏకచ్ఛత్రాధిపతి ఐన ఇంద్రుడు నీ అనుగ్రహాన్ని కోరి నన్ను పంపగా, ఆతని ఆజ్ఞపై నేనిక్కడకు వచ్చాను. (6)
యస్తు దేవమనుష్యేషు ప్రఖ్యాతః సహజైర్గుణైః ।
శ్రియా శీలేన రూపేణ వ్రతేన చ దమేన చ ।
ప్రక్యాతో బలవీర్యేణ సమ్మతః ప్రతిభానవాన్ ॥ 7
వర్చస్వీ తేజసా యుక్తః క్షమావాన్ వీతమత్సరః ।
సాంగోపనిషదాన్ వేదాన్ చతురాఖ్యానపంచమాన్ ॥ 8
యోఽధీత్ గురుశుశ్రూషాం మేధాం చాష్టగుణాశ్రయామ్ ।
బ్రహ్మచర్యేణ దాక్ష్యేణ ప్రసవైర్వయసాపి చ ॥ 9
ఏకో వై రక్షితా చైవ త్రిదివం మఘవానివ ।
అకత్థనో మానయితా స్థూలలక్ష్యః ప్రియంవదః ॥ 10
సుహృదశ్చాన్నపానేన వివిధేనాభివర్షతి ।
సత్యవాక్ పుజితో వక్తా రూపవాననహంకృతః ॥ 11
భక్తానుకంపీ కాంతశ్చ ప్రియశ్చ స్థిరసంగరః ।
ప్రార్థనీయైర్గుణగణైః మహేంద్రవరుణోపమః ॥ 12
విదితస్తేఽర్జునో వీరః స స్వర్గఫలమాప్నుయాత్ ।
త్వం తు శక్రాభ్యనుజ్ణాతా తస్య పాదాంతికం వ్రజ ।
తదేవం కురు కల్యాణి ప్రసన్నస్త్వాం ధనంజయ ॥ 13
కళ్యాణీ! సుందరీ! మహావీరుడైన అర్జునుడు ఈ స్వర్గానికి వచ్చాడు. నీకు అతడు తెలిసే ఉంటాడు. అతడు దేవతలలోను, మనుష్యులలోను సహజ సద్గుణాలచేత, శోభచేత, నడవడిచేత, రూపం చేత, నియమాచరణచేత, ఇంద్రియనిగ్రహం చేతను మిక్కిలి ప్రసిద్ధుడు. బలపరాక్రమాల చేత విఖ్యాతుడు, అతడు అందరికీ ఇష్టుడు, ప్రతిభాశాలి. వర్చస్వి, తేజస్వి, క్షమగలవాడు, మాత్సర్యం లేనివాడు, సాంగోపాంగంగా నాలుగువేదాలను ఇతిహాసపురాణాలను చదివినవాడు, గురుశుశ్రూషచేసి అధ్యయనం చేసి ఎనిమిది విధాలైన మేధను పొందినవాడు. బ్రహ్మచర్యం చేత, కార్యదక్షతచేత, సంతానం చేత, వయస్సుచేత ఇంద్రునిలా స్వర్గాన్ని ఒక్కడే రక్షింపగలవాడు, అతడు గొప్పలు చెప్పుకోడి. ఇతరులను గౌరవిస్తాడు. స్థూలంగా సుక్ష్మాన్ని కూడ త్వరగా గ్రహింపగలడు. ప్రియంగా మాట్లాడుతాడు. వివిధాలైన అన్నపానాదులచే స్నేహితులను తృప్తి పరుస్తాడు. సత్యం పలుకుతాడు. అందరిచే పూజింపబడినవాడు. మంచివక్త. అందమైనవాడు, అహంకారం లేనివాడు, తనకు విధేయులైన వారిపట్ల జాలికలవాడు. అందరిచే కోరబడేవాడు. ప్రియుడు. యుద్ధంలో స్థిరంగా ఉండేవీరుడు, కోరదగిన (ప్రశంసింపదగిన) గుణ గణాల చేత మహేంద్రవరుణులతో సమానమైనవాడు అటువంటి అర్జునుడు స్వర్గానికి వచ్చాడు. నీకు తెలిసే ఉంటుంది. ఇంద్రుని ఆజ్ఞప్రకారం నీవు అతని దగ్గరకు వెళ్ళు. ధనంజయుడు నీపట్ల ప్రసన్నుడై ఉన్నాడు. అందువల్ల నీవీవిధంగా చెయ్యి. (7-13)
వి॥సం॥ మేధ ఎనిమిది విధాలు
మేధాశక్తి ఈ ఎనిమిది గుణాలకూ స్థానం -
శుశ్రూషా శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ।
ఊహాపోహార్థ విజ్ఞానం తత్త్వజ్ఞానం చ ధీగుణాః ॥
శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, అర్థవిజ్ఞానం, తత్త్వజ్ఞానం - ఇవి బుద్ధిగుణాలు. (నీల)
ఏవముక్తా స్మితం కృత్వా సమ్మానం బహు మన్య చ ।
ప్రత్యువాచోర్వశీ ప్రీతా చిత్రసేనమనిందితా ॥ 14
చిత్రసేనుడిలా చెప్పగా, ఊర్వశి మందహాసం చేసింది. ఆ ఆదేశం తనకు సమ్మానంగా భావించింది. ప్రశంసింపదగిన సుందరి ఊర్వశి మిక్కిల్లి ప్రసన్నురాలై చిత్రసేనుడితో ఈ విధంగా బదులు పలికింది. (14)
యస్త్వస్య కథితః సత్యః గుణోద్దేశస్త్వయా మమ ।
తం శ్రుత్వావ్యథయం పుంసః వృణుయాం కిమతోఽర్జునమ్ ॥ 15
గంధర్వరాజా! నీవు అర్జునుడి గురించి చెప్పిన గుణవర్ణనమంతా సత్యమైంధే, నేను ఇతరుల ద్వారా అతని గుణగణాలు విని, అతనిపట్ల కామమోహితురాలనయ్యాను. అందువల్ల అతనినిగాక ఇంకెవరిని వరిస్తాను? (15)
మహేంద్రస్య నియోగేన త్వత్తః సంప్రణయేన చ ।
తస్య చాహం గుణౌఘేన పాల్గునే జాతమన్మథా ।
గచ్ఛత్వం హి యథాకామమ్ ఆగమిష్యామ్యహం సుఖమ్ ॥ 16
మహేంద్రుని ఆజ్ఞచేత, నీప్రీతిపూర్వకమైన మాటలచేత, అర్జునుని సద్గుణసమూహంచేత నాకు అతనిపట్ల కామభావం కలిగింది. అందువల్ల ఇక నీవు వెళ్ళు. నేను స్వేచ్ఛగా సుఖంగా అతని దగ్గరకు వస్తాను. (16)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి చిత్రసేనోర్వశీసంవాదే పంచచత్వారింశోఽధ్యాయః ॥ 45 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమపర్వమను ఉపపర్వమున చిత్రసేనోర్వశీ సంవాదమను నలుబది ఐదవ అధ్యాయము. (45)