46. నలుబది ఆరవ అధ్యాయము

ఊర్వశిని అర్జునుడు తిరస్కరించుట, ఆమె అతనిని శపించుట.

వైశంపాయన ఉవాచ
తతో విసృజ్య గంధర్వం కృతకృత్యం శుచిస్మితా ।
ఉర్వశీ చాక్రోత్ స్నానం పార్థదర్శనలాలసా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! గంధర్వరాజైన చిత్రసేనుని పంపిన తర్వాత స్వచ్ఛమైన చిరునవ్వు గల ఊర్వశి అర్జునుని చూడాలనే ఉత్సాహంతో స్నానం చేసింది. (1)
స్నానాలంకరణైర్హృద్యైః గంధమాల్యైశ్చ సుప్రభైఆHఅ ।
ధనంజయస్య రూపేణ శరైర్మన్మథచోదితైః ॥ 2
అతివిద్ధేన మనసా మన్మథేన ప్రదీపితా ।
దివ్యాస్తరణసంస్తీర్ణే విస్తీర్ణే శయనోత్తమే ॥ 3
చిత్తసంకల్పభావేన సుచిత్తానన్యమానసా ।
మనోరథేన సంప్రాప్తం రమంత్యేనం హి ఫాల్గునమ్ ॥ 4
మనోహరాలై, కాంతిమంతాలైన అలంకారాలతో గంధమాల్యాలతో అలంకరించుకొంది. ధనంజయుని సౌందర్యానికి మన్మథబాణాలతో ఆమె మనస్సు మిక్కిలి చలించింది. మన్మథాగ్నిచేత ఆమె మనస్సు రగిలిపోయింది. మనస్సులో అర్జునుని ఊహించుకొంటూ, అతనిపట్ల ఏకాగ్రమైన చిత్తంతో ఆమె సుందరవిశాలశయ్యపై తన మనోరథుడైన అర్జునునితో క్రీడిస్తున్నట్లుగా భావించింది. (2-4)
నిర్గమ్య చంద్రోదయనే విగాఢే రజనీముఖే ।
ప్రస్థితా సా పృథుశ్రోణీ పార్థస్య భవనం ప్రతి ॥ 5
సాయంసంధ్యాకాలం అయ్యాక చంద్రోదయం అయింది. వెన్నెల అంతటా వ్యాపించింది. ఆమె తన భవనం నుండి అర్జునుని భవనానికి బయలుదేరింది. (5)
మృదుకుంచితదీర్ఘేణ కుముదోత్కరధారిణా ।
కేశహస్తేన లలనా జగామాథ విరాజతీ ॥ 6
మృదువుగా పొడవుగా ఉన్న ఉంగరాల జుట్టును సవరించుకొని నల్లకలువలను గుత్తిగా చేసి అలంకరించుకొన్నది. దానితో విరాజిల్లుతూ ఆ లలన వెళ్ళింది. (6)
భ్రూక్షేపాలాపమాధుర్యైః కాంత్యా సౌమ్యతయాపి చ ।
శశినం వక్ర్తచంద్రేణ సాఽఽహ్వయంతీవ గచ్ఛతి ॥ 7
ఆమె భ్రూవిక్షేపాలచేత, తీయని మాటలచేత, ఉజ్జ్వల కాంతిచేత, సౌమ్యస్వభావం చేత తన ముఖచంద్రునితో ఆ చంద్రుని ఆహ్వానిస్తున్నట్లుగా వెళ్ళింది. (7)
దివ్యాంగరాగౌ సుముఖౌ దివ్యచందనరూషితౌ ।
గచ్ఛంత్యా హారరుచిరౌ స్తనౌ తస్యా వవల్గతుః ॥ 8
ఆమె అలా నడిచి వెళుతూంటే, దివ్యమైన అంగరాగం దివ్యచందనం పూయబడి, హారాలచే మనోహరాలైన ఆమె వక్షోజాలు గంతులు వేస్తూ ఉన్నాయి. (8)
స్తనోద్వహనసంక్షోభాద్ నమ్యమానా పదే పదే ।
త్రివలీదామచిత్రేణ మధ్యేనాతీవశోభినా ॥ 9
వక్షోజభారాన్ని మోయడం వల్ల అడుగడుగునా వంగుతున్న ఆమె నడుము త్రివలీరేఖలతో విచిత్రమైన అందంతో శోభిల్లుతోంది. (9)
అధో భూధరవిస్తీర్ణం నితంబోన్నతపీవరమ్ ।
మన్మథాయతనం శుభ్రం రశనాదామభూషితమ్ ॥ 10
ఋషీణామపి దివ్యానాం మనోవ్యాఘాతకారణమ్ ।
సూక్ష్మవస్త్రధరం రేజే జఘనం నిరవద్యవత్ ॥ 11
సూక్ష్మమైన వస్త్రం చేత కప్పబడిన ఆమె జఘనమండలం ప్రశంసింపదగిన సౌందర్యంతో ప్రకాశిస్తోంది. అది మన్మథుని ఉజ్జ్వలనివాసంలా ఉంది. అందమైన మొలత్రాటితో అలంకరింపబడింది. మహర్షులనూ, దేవతలనూ మోహపరిచే పలుచని వస్త్రం దాల్చిన ఆ నితంబం లోపరహితంగా ఉంది. (10,11)
గూఢగుల్ఫధరౌ పాదౌ తామ్రాయతతలాంగులీ ।
కూర్మపృష్ఠోన్నతౌ చాపి శోభేతే కింకిణీకిణౌ ॥ 12
ఆమె పాదాలు బలిసిన మడమలతో ఎర్రని పొడవైన వ్రేళ్ళతో, తాబేటి వీపువలె ఎత్తుగా కింకిణులచిహ్మాలతో శోబిస్తున్నాయి. (12)
సీధుపానేన చాల్పేన తుష్ట్యాథ మదనేన చ ।
విలాసనైశ్చ వివిధైః ప్రేక్షణీయతరాభవత్ ॥ 13
కొంచెంగా మధువు సేవించడం చేత, సంతోషం చేత, మదనభావం చేత, వివిధవిలాసాలచేత, ఆమె చాలా అందంగా చూడముచ్చటగా ఉంది. (13)
సిద్ధచారణగంధర్వైః సా ప్రయాతా విలాసినీ ।
బహ్వాశ్చర్యేఽపి వై స్వర్గే దర్శనీయతమాకృతిః ॥ 14
సుసూక్ష్మేణోత్తరీయేణ మేఘవర్ణేన రాజతా ।
తనురభ్రావృతా వ్యోమ్ని చంద్రలేఖేవ గచ్ఛతి ॥ 15
అనేకాద్భుతాలతో నిండిన స్వర్గంలో అలా వెళుతూన్న ఆ విలాసవతి సిద్ధచారణ గంధర్వులు కూడ ఆశించదగిందిగా ఉంది. మేఘంలా నల్లనైన పలుచని ఉత్తరీయం కప్పిన ఆమె శరీరం ఆకాశంలో మేఘాలతో కప్పబడిన చంద్రలేఖ కదలి వెళుతూన్నట్లు ఉన్నది. (14,15)
తతః ప్రాప్తా క్షణేనైవ మనః పవనగామినీ ।
భవనం పాండుపుత్రస్య ఫాల్గునస్య శుచిస్మితా ॥ 16
ఆమె మనోవేగవాయువేగాలతో క్షణకాలంలో పాండుకుమారుడైన అర్జునుని భవనానికి చిరునవ్వుతో చేరింది. (16)
తత్ర ద్వారమనుప్రాప్తా ద్వారస్థైశ్చ నివేదితా ।
అర్జునస్య నరశ్రేష్ఠ ఉర్వశీ శుభలోచనా ॥ 17
ఉపాతిష్ఠత తద్ వేశ్మ నిర్మలం సుమనోహరమ్ ।
స శంకితమనా రాజన్ ప్రత్యుద్గచ్ఛత తాం నిశి ॥ 18
నరశ్రేష్ఠా! ఆ అర్జునభవనం యొక్క ద్వారం దగ్గరికి ఊర్వశి చేరింది. ఆమె రాకను ద్వారపాలకుడు అర్జునునికి నివేదించాడు. రాత్రిసమయంలో అందమైన ఊర్వశి నిర్మలమైన అందమైన ఆ భవనానికి వెళ్ళింది. రాజా! ఆ రాత్రి సమయంలో శంకించిన మనస్సుతోనే అర్జునుడు ఆమె దగ్గరకు వచ్చాడు. (17,18)
దృష్ట్వైవ చొర్వశీమ్ పార్థః లజ్జాసంవృతలోచనః ।
తదాభివాదనం కృత్వా గురుపూజాం ప్రయుక్తవాన్ ॥ 19
ఊర్వశిని చూసి అర్జునుడు సిగ్గుతో కన్నులు దించుకొన్నాడు. అప్పుడామెకు నమస్కారం చేసి గురుజనోచితంగా గౌరవించాడు. (19)
అర్జున ఉవాచ
అభివాదయే త్వాం శిరసా ప్రవరాప్సరసాం వరే ।
కిమాజ్ఞాపయసే దేవి ప్రేష్యస్తేఽహముపస్థితః ॥ 20
అర్జునుడిలా అన్నాడు - అప్సరసలలో శ్రేష్ఠురాలా! నీకు శిరస్సువంచి అభివాదనం చేస్తున్నాను. దేవీ! నన్ను ఏమని ఆజ్ఞాపిస్తున్నావో చెప్పు. నీ సేవకుడిని నేను. (20)
ఫాల్గునస్య వచః శ్రుత్వా గతసంజ్ఞా తదోర్వశీ ।
గంధర్వవచనం సర్వం శ్రావయామాస తం తదా ॥ 21
ఫల్గునుని మాటలు విని ఊర్వశి నిశ్చేష్టురాలైంది. అపుడు గంధర్వరాజు చిత్రసేనుడు చెప్పిన మాటలన్నింటిని అర్జునుడికిలా చెప్పింది. (21)
ఉర్వశ్యువాచ
యథా మే చిత్రసేనేన కథితం మనుజోత్తమ ।
తత్ తేఽహం సంప్రవక్ష్యామి యథా చాహమిహగతా ॥ 22
ఊర్వశి ఇలా చెప్పింది - మనుజోత్తమా! చిత్రసేనుడు నాకు చెప్పిన మాటలను, నేను ఎలా ఇక్కడకు వచ్చానో, అదంతా నీకు నేను చెపుతాను. (22)
ఉపస్థానే మహేంద్రస్య వర్తమానే మనోరమే ।
తవాగమనతో వృత్తే స్వర్గస్య పరమోత్సవే ॥ 23
రుద్రాణాం చైవ సాన్నిధ్యమ్ ఆదిత్యానాం చ సర్వశః ।
సమాగమేఽశ్వినోశ్చైవ వసూనాం చ నరోత్తమ ॥ 24
మహర్షీణాం చ సంఘేషు రాజర్షిప్రవరేషు చ ।
సిద్ధచారణయక్షేషు మహోరగగణేషు చ ॥ 25
ఉపవిష్టేషు సర్వేషు స్థానమానప్రభావతః ।
బుద్ధ్యా ప్రజ్వలమానేషు అగ్నిసోమార్కవర్ష్మసు ॥ 26
వీణాసు వాద్యమానాసు గంధర్వైః శక్రనందన ।
దివ్యే మనోరమే గేయే ప్రవృత్తే పృథులోచన ॥ 27
సర్వాప్సరస్సు ముఖ్యాసు ప్రనృత్తాసు కురూద్వహ ।
త్వం కిలానిమిషః పార్థ మామేకాం తత్ర దృష్టవాన్ ॥ 28
దేవేంద్రుని నివాసస్థానమై అందమైన ఈ స్వర్గలోకంలో నీ రాక వల్ల మహోత్సవం జరిగింది. నరోత్తమా! రుద్రులు, ఆదిద్యులు, అశ్వినులు, వసువులు, మహర్షి సంఘాలు, శ్రేష్ఠులైన రాజర్షులు, సిద్ధచారణయక్షులు, మహానాగగణాలు వారి వారి ప్రభావానికనుగుణమైన స్థానాల్లో వారు కూర్చొని ఉండగా, సూర్యచంద్రాగ్నులు ప్రకాశిస్తుండగా, గంధర్వులు వీణావాదనం చేస్తూండగా, దివ్యమిన , మనోహరమైన గానం చేయబడింది. విశాలలోచనా! కురునందనా! అపుడు అప్సరసలలో ముఖ్యులందరూ నృత్యం చేశారు. ఆ సమయంలో అక్కడ నీవు నన్ను రెప్పవేయకుండా చూశావు. (23-28)
తత్ర చావభృథే తస్మిన్నుపస్థానే దివౌకసామ్ ।
తవ పిత్రాభ్యనుజ్ఞాతా గతాః స్వం స్వం గృహం సురాః ॥ 29
తథైవాప్సరసః సర్వాః విశిష్టాః స్వగృహం గతాః ।
అపి చాన్యాశ్చ శత్రుఘ్న తవ పిత్రా విసర్జితాః ॥ 30
దేవసభలో ఆ మహోత్సవం ముగిసిన తరువాత నీ తండ్రి అనుజ్ఞ తీసికొని దేవతలంతా వారి వారి గృహాలకు వెళ్ళారు. విశిష్టలైన అప్సరలు కూడా వారి నివాసాలకు వెళ్ళారు. శత్రఘ్నా! ఇంకా మిగిలి ఉన్నవారిని నీ తండ్రి పంపించివేశాడు. (29,30)
తత్రః శక్రేణ సందిష్టః చిత్రసేనో మమాంతికమ్ ।
ప్రాప్తః కమలపత్రాక్ష స చ మామబ్రవీదథ ॥ 31
కమలపత్రనేత్రా! ఆ తరువాత ఇంద్రుడు చిత్రసేనుని నా దగ్గరకు పంపించాడు. అతడు నా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు. (31)
త్వత్కృతేఽహం సురేశేన ప్రేషితో వరవర్ణిని ।
ప్రియం కురు మహేంద్రస్య మమ చైవాత్మనశ్చ హ ॥ 32
సుందరీ! దేవేంద్రుడు నీకోసమే ఒక సందేశాన్నిచ్చి నన్ను పంపాడు. నీవు మహేంద్రునికి, నాకు, నీకూ కూడ ప్రియమైన ఆ పనిని చెయ్యి. (32)
శక్రతుల్యం రణే శూరం సదౌదార్యగుణాన్వితమ్ ।
పార్థం ప్రార్థయ సుశ్రోణి త్వమిత్యేనం తదాబ్రవీత్ ॥ 33
'సుశ్రోణీ! యుద్ధంలో ఇంద్రుడంతటి శూరుడు, ఎల్లపుడూ ఔదార్యగుణాలతో ఉండేవాడు, పృథానందనుడు అయిన అర్జునుని సేవించు అని అపుడు నాకు చెప్పాడు. (33)
తతోఽహం సమనుజ్ఞాతా తేన పిత్రా చ తేఽనఘ ।
తవాంతికమనుప్రాప్తా శుశ్రూష్తుమరిందమ ॥ 34
అనఘా! శత్రుదమనా! ఆ విధంగా నీ తండ్రిచే ఆజ్ఞాపించబడిన నేను నీ దగ్గరకు సేవించడానికి వచ్చాను. (34)
త్వద్గుణాకృష్టచిత్తాహమ్ అనంగవశమాగతా ।
చిరాభిలషితో వీర మమాప్యేష మనోరథః ॥ 35
నీ సద్గుణాలు నా హృదయాన్ని ఆకర్షించాయి. నేను మన్మథునకు వశమయ్యాను. మహావీరా! చాలాకాలం నుండి నా హృదయంలో కూడా ఈ కోరిక ఉంది. (35)
వైశంపాయన ఉవాచ
తాం తథా బ్రువతీం శ్రుత్వా భృశం లజ్జాఽఽవృతోఽర్జునః ।
ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం పిధాయ త్రిదశాలయే ॥ 36
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! అపుడు స్వర్గలోకంలో ఊర్వశి అలా అంటూంటే విని అర్జునుడు మిక్కిలి సిగ్గుపడి రెండుచెవులూ మూసికొని, ఇలా పలికాడు. (36)
దుఃశ్రుతం మేఽస్తు సుభగే యన్మాం వదపి భావిని ।
గురుదారైః సమానా మే నిశ్చయేన వరాననే ॥ 37
సౌభాగ్యశాలినీ! భావినీ! నాతో నీవు చెప్పిన మాట వినడానికి చాలా బాధగా ఉంది. నిశ్చయంగా నీవు నాదృష్టిలో గురుపత్నితో సమానురాలివి. (37)
యథా కుంతీ మహాభాగా యథేంద్రాణీ శచీ మమ ।
తథా త్వమపి కల్యాణి నాత్ర కార్యా విచారణా ॥ 38
కళ్యాణీ! నాకు నా తల్లి కుంతి ఎటువంటిదో, ఇంద్రుని భార్య శచీదేవి ఎటువంటిదో, నీవు కూడా అటువంటిదానివే. ఈ విషయంలో వేరొకలా ఆలోచించరాదు. (38)
యచ్చేక్షితాసి విస్పష్టం విశేషేణ మయా శుభే ।
తచ్చ కారణపూర్వం హి శృణు సత్యం శుచిస్మితే ॥ 39
శుభాననా! శుచుస్మితా! నేను సభలో నీవైపు రెప్పవేయకుండా విస్పష్టంగా, విశేషంగా చూడటానికి తగిన కారణం ఉంది. ఇది సత్యం. చెపుతాను విను. (39)
ఇయం పౌరవవంశస్య జననీ ముదితేతి హ ।
త్వామహం దృష్టవాంస్తత్ర విజ్ఞాయోత్ఫుల్లలోచనః ॥ 40
న మామర్హసి కల్యాణి అన్యథా ధ్యాతుమప్సరః ।
గురోర్గురుతరా మే త్వం మమ త్వం వంశవర్ధినీ ॥ 41
ఆనంద స్వరూపిణియైన ఈ ఊర్వశియే కదా పూరు వంశానికి తల్లి (వంశప్రవర్తకురాలు)', అని భావించిన నేను విచ్చిన కన్నులతో, గౌరవభావంతో నిన్ను చూశాను. కళ్యాణీ! అప్సరా! నన్ను నీవు మరొకలా భావించడం తగదు. నివు మా వంశవర్ధకురాలవు. అందువల్ల నీవు నాకు గురువుకంటె ఎక్కువ గౌరవవింపదగినదానవు. (40,41)
ఉర్వశ్యువాచ
అనావృతాశ్చ సర్వాః స్మ దేవరాజాభినందన ।
గురుస్థానే న మాం వీర నియోక్తుం త్వమిహార్హసి ॥ 42
అపుడు ఊర్వశి ఇలా అంది - దేవేంద్రనందనా! స్వర్గవాసులమైన మాకందరికి కట్టుబాట్లు ఉండవు. వీరా! ఇక్కడ నీవు నన్ను గురుస్థానంలో ఉంచడం తగదు. (42)
పూరోర్వంశే హి యే పుత్రాః నప్తారో వా త్విహాగతాః ।
తపసా రమయన్త్యస్మాన్ న చ తేషాం వ్యతిక్రమః ॥ 43
తత్ ప్రసీద న మామార్తాం విసర్జయితుమర్హసి ।
హృచ్ఛయేన చ సంతప్తం భక్తాం చ భజ మానద ॥ 44
పూరువంశంలో జన్మించిన పుత్రులు, మనుమలు కూడ తపస్సుచే ఇక్కడకు వచ్చి మాతో ఆనందిస్తారు. ఇందులో వారి అపరాధం ఏమీ లేదు. మానదా! అందువల్ల నీవు నా పట్ల ప్రసన్నుడివి కమ్ము. కామపీడితురాలనైన నన్ను ఇలా విడిచిపెట్టటం నీకు తగదు. నీ భక్తురాలిని, పైగా మన్మథాగ్నిచే దహింపబడుతున్న దాన్ని, అందువల్ల నన్ను అంగీకరించు. (43,44)
అర్జున ఉవాచ
శృణు సత్యం వరారోహే యత్ త్వాం వక్ష్యామ్యనిందితే ।
శృణ్వంతు మే దిశశ్చైవ విదిశశ్చ సదేవతాః ॥ 45
అప్పుడు అర్జునుడిలా అన్నాడు - వరారోహో! ప్రశంసింప దగినదానా! నేను నీకు నిజం చెపుతాను. దిక్కులను, విదిక్కులను అధిష్ఠించిన దేవతలందరూ కూడా ఈ మాటను విందురు గాక! (45)
యథా కుంతీ చ మాద్రీ చ శచీ చైవ మమానఘే ।
తథా చ వంశజననీ త్వం హి మేఽద్య గరీయసీ ॥ 46
అనఘో! కుంతి, మాద్రి, శచీదేవి వలె మా వంశజననివగు నూవుకూడ నాకు గౌరవింపదగినదానవు. (46)
గచ్ఛ మూర్ధ్నా ప్రపన్నోఽస్మి పాదౌ తే వరవర్ణిని ।
త్వం హి మే మాతృవత్ పూజ్యా రక్ష్యోఽహం పుత్రవత్ త్వయా ॥ 47
వరవర్ణినీ! నీపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీవు తిరిగి వెళ్ళు. నీవు నాకు తల్లివలె పూజింపదగినదానవు. నన్ను పుత్రునిలా రక్షించు. (47)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తా తు పార్థేన ఉర్వశీ క్రోధమూర్ఛితా ।
వేపంతీ భ్రుకుటీవక్రా శశాపాథ ధనంజయమ్ ॥ 48
వైశంపాయనుడిలా అన్నాడు - అర్జునుడు ఈ విధంగా చెప్పగానే, ఊర్వశి క్రోధంతో వివశురాలై, కంపిస్తూ వక్రమైన కనుబొమలతో అర్జునుని శపించింది. (48)
ఊర్వశ్యువాచ
తవ పిత్రాభ్యనుజ్ఞాతాం స్వయం చ గృహమాగతామ్ ।
యస్మాన్మాం నాభినందేథాః కామబాణవశంగతామ్ ॥ 49
తస్మాత్ త్వం నర్తనః పార్థ స్త్రీమధ్యే మానవర్జితః ।
అపుమానితి విఖ్యాతః షండవద్ విచరిష్యసి ॥ 50
ఊర్వశి ఇలా అంది - అర్జునా! నీతండ్రి అనుమతితో స్వయంగా ఇంటికి వచ్చి, మన్మథబాణాలకు వశమైయున్న, నన్ను నీవు ఆదరించటం లేదు. అందువల్ల నీవు స్త్రీలమధ్యలో గౌరవం లేకుండా (సిగ్గులేకుండా) నాట్యం చేస్తావు. నపుండకుడని ప్రఖ్యాతుడవై నపుండకునిలా సంచరిస్తావు. (49,50)
ఏవం దత్త్వ్ర్జునే శాపం స్ఫురదోష్ఠీ శ్వసంత్యథ ।
పునః ప్రత్యాగతా క్షిప్రమ్ ఉర్వశీ గృహమాత్మనః ॥ 51
ఈ విధంగా అర్జునుడికి శాపమిచ్చి కంపిస్తున్న పెదవులతో నిట్టూర్పులు విడుస్తూ వేగంగా ఊర్వశి తిరిగి తన గృహానికి వచ్చింది. (51)
తత్ఽర్జునస్త్వరమాణః చిత్రసేనమరిందమః ।
సంప్రాప్య రజనీవృత్తం తదుర్వశ్యా యథాతథమ్ ॥ 52
నివేదయామాస తదా చిత్రసేనాయ పాండవః ।
తత్ర చైవం యథావృత్తం శాపం చైవ పునః పునః ॥ 53
తరువాత శత్రుదమనుడైన అర్జునుడు కంగారుపడుతూ తొందరగా చిత్రసేనుడి దగ్గరకు వచ్చి ఊర్వశితో రాత్రి జరిగిన వృత్తాంతాన్ని యథాతథంగా చెప్పాడు. అక్కడ జరిగిన సన్నివేశాన్ని, శాపవృత్తాంతాన్ని మళ్ళీమళ్ళీ చెప్పాడు. (52,53)
అవేదయచ్చ శక్రస్య చిత్రసేనోఽపి సర్వశః ।
తత ఆనాయ్య తనయం వివిక్తే హరివాహనః ॥ 54
సాంత్వయిత్వా శుభైర్వాక్యైః స్మయమానోఽభ్యభాషత ।
సుపుత్రాద్య పృథా తాత త్వయా పుత్రేణ సత్తమ ॥ 55
చిత్రసేనుడు కూడా ఇంద్రునికి ఈ విషయాలన్నింటిని చెప్పాడు. ఇంద్రుడు తనకుమారుని రప్పించి ఏకాంతంలో మంచిమాటలతో అతనిని ఊరడించి, 'నాయనా! కుమారా! నరోత్తమా! నీవంటి పుత్రుని పొంది నీతల్లి కుంతి ఈరోజు సుపుత్రవతి అయింది. (54,55)
ఋషయోఽపి హి ధైర్యేణ జితా వై తే మహాభుజ ।
యత్ తు దత్తవతీ శాపమ్ ఉర్వశీ తవ మానద ॥ 56
స చాపి తేఽర్థకృత్ తాత సాధకశ్చ భవిష్యతి ॥ 57
అజ్ఞాతవాసో వస్తవ్యః భవద్భిర్భూతలేఽనఘ ।
వర్షే త్రయోదశే వీర తత్ర త్వం క్షపయిష్యసి ॥ 58
మహాబాహూ! నీ మనోధైర్యంచేత ఋషులు కూడా జయింపబడ్డారు. మానదా! ఊర్వశి నీకిచ్చిన శాపం కూడా నీఅభీష్టార్థానికి సాధకమే అవుతుంది. అనఘా! భూమి మీద మీరు పదమూడవ సంవత్సరంలో అజ్ఞాతవాసం చేయవలసి ఉంది. ఆ సమయలో ఊర్వశీ శాపం సంవత్సరకాలాన్ని పూర్తిచేస్తుంది. (56-58)
తేన నర్తనవేషేణ అపుంస్త్వేన తథైవ చ ।
వర్షమేకం విహృత్యైవ తతః పుంస్త్వమవాప్స్యసి ॥ 59
నర్తకవేషంలో నపుంసకభావంతో ఆ ఒక సంవత్సరం సంచరించిన తరువాత మరల పుంస్త్వాన్ని పొందుతావు. (59)
ఏవముక్తస్తు శక్రేణ ఫాల్గునః పరవీరహా ।
ముదం పరమికాం లేభే న చ శాపం వ్యచింతయత్ ॥ 60
ఇంద్రుడు ఈవిధంగా చెప్పాక, శత్రువీర సంహారకుడిఅన అర్జునుడు మిక్కిలి ఆనందాన్ని పొందాడు. ఇక శాపాన్ని గురించి చింతించలేదు. (60)
చిత్రసేనేన సహితః గంధర్వేణ యశస్వినా ।
రేమే స స్వర్గభవనే పాండుపుత్రో ధనంజయః ॥ 61
పాండుకుమారుడైన ధనంజయుడు మహాయశస్వి, గంధర్వరాజు అయిన చిత్రసేనుడితో స్వర్గలోకంలో సుఖంగా ఉండసాగాడు. (61)
ఇదం యః శృణుయాద్ వృత్తం నిత్యం పాండుసుతస్య వై ।
న తస్య కామః కామేషు పాపకేషు ప్రవర్తతే ॥ 62
పాండునందనుడైన అర్జునుని ఈ వృత్తాంతాన్ని నిత్యం విన్నవాడు పాపపూర్ణమైన విషయభోగాలలో ప్రవర్తింపడు. (62)
ఇదమమరవరాత్మజస్య ఘోరం
శుచి చరితం వినిశమ్య ఫాల్గునస్య ।
వ్యపగతమదదంభరాగదోషాః
త్రిదివగతా విఅరమంతి మానవేంద్రాః ॥ 63
దేవేంద్రుని కుమారుడైన ఫాల్గునుని పవిత్రమైన నడవడిని గూర్చి వింటే మద, దంభ, విషయాసక్తి దొషాలు తొలగి మానవశ్రేష్ఠులు స్వర్గానికి వెళ్ళి సుఖంగా నివసిస్తారు. (63)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి ఉర్వశీశాపో నామ షట్చత్వారింశోఽధ్యాయః ॥ 46 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమపర్వమను ఉపపర్వమున ఊర్వశిశాపమను నలువది ఆరవ అధ్యాయము. (46)