44. నలుబది నాలుగవ అధ్యాయము

అర్జున్డు, అస్త్రములను, సంగీతమును నేర్చుకొనుట.

వైశంపాయన ఉవాచ
తతో దేవాః సగంధర్వాః సమాదాయార్ఘ్యముత్తమమ్ ।
శక్రస్య మతమాజ్ఞాయ పార్థమానర్చురంజసా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! అటు తర్వాత దేవేంద్రుని అభిప్రాయాన్ని తెలిసికొని దేవగంధర్వులు ఉత్తమమైన అర్ఘ్యాన్ని తీసికొని వచ్చి, అర్జునుని యథోచితంగా పూజించారు. (1)
పాద్యమాచమనీయం చ ప్రతిగ్రాహ్య నృపాత్మజమ్ ।
ప్రవేశయామాసురథో పురందరనివేశనమ్ ॥ 2
అర్జునునికి పాద్యాన్ని, ఆచమనీయాన్ని ఇచ్చి, వారు అతనిని ఇంద్రభవనంలోకి తీసికొనివెళ్లారు. (2)
ఏవం సంపూజితో జిష్ణుః ఉవాస భవనే పితుః ।
ఉపశిక్షన్ మహాస్త్రాణి ససంహారాని పాండవః ॥ 3
ఈ విధంగా దేవగణాలచే పూజింపబడ్డ అర్జునుడు జయశీలుడై తండ్రి భవనంలో ప్రయోగోపసంహార సహితంగా మహాస్త్రాలను అభ్యసిస్తూ నివసించాడు. (3)
శక్రస్య హస్తాద్ దయితం వజ్రమస్త్రం చ దుఃసహమ్ ।
అశనీశ్చ మహానాదాః మేఘబర్హిణలక్షణాః ॥ 4
సాక్షాత్తూ ఇంద్రుని చేతిమీదుగా అతనికి ప్రియమైన, దుఃసహమైన వజ్రాస్త్రాన్ని గ్రహించాడు. అశనులనే అస్త్రాలను గ్రహించాడు. వాటిని ప్రయోగిస్తే మహానాదం చేసే మేఘాలు ఆకాశంలో ఆవరిస్తాయి. వాటిని చూసి నెమళ్ళు కూడ నృత్యం చేస్తాయి. (4)
గృహీతాస్త్రస్తు కౌంతేయః భ్రాతౄన్ సస్మార పాండవః ।
పురందరనియోగాశ్చ పంచాబ్దానవసత్ సుఖీ ॥ 5
కుంతీనందనుడు, పాండుకుమారుడు అయిన అర్జునుడు ఈ విధంగా అస్త్రాలను గ్రహించి తన సోదరులను తలచుకొన్నాడు. ఇంద్రుని ఆజ్ఞ వల్ల ఐదు సంవత్సరాలు అక్కడ సుఖంగా ఉన్నాడు. (5)
తతః శక్రోఽబ్రవీత్ పార్థం కృతాస్త్రం కాల ఆగతే ।
నృత్యం గీతం చ కౌంతేయ చిత్రసేనాదవాప్నుహి ॥ 6
అర్జునుడు అస్త్రాలు ధరించిన తరువాత ఇంద్రుడు అదను చూసి 'కుంతీనందనా! నృత్య గీతాలను చిత్రసేనుడి నుండి స్వీకరించు' అని చెప్పాడు. (6)
వాదిత్రం దేవవిహితం నృలోకే యన్న విద్యతే ।
తదర్జయస్వ కౌంతేయ శ్రేయో వై తే భవిష్యతి ॥ 7
'కుంతీనందనా! మానవలోకంలో లేనిదై దేవనిర్మతమిన ఆ వాద్య కళను నీవు సంపాదించు, దాని వల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది. (7)
సఖాయం ప్రదదౌ చాస్య చిత్రసేనం పురందరః ।
స తేన సహ సంగమ్య రేమే పార్థో నిరామయః ॥ 8
ఆ రీతిగా చెప్పి, ఇంద్రుడు చిత్రసేనుని అతనికి స్నేహితునిగా ఇచ్చాడు. పార్థుడు అతనితో కలిసి ఎటువంటి చింత లేకుండా ఆనందంగా ఉన్నాడు. (8)
గీతవాదిత్రనృత్యాని భూయ ఏవాదిదేశ హ ।
తథాపి నాలభచ్ఛర్మ తపస్వీ ద్యూతకారితమ్ ॥ 9
చిత్రసేనుడు మళ్ళీ మళ్ళీ గీతవాద్య నృత్యాలను నేర్పినప్పటికీ తపస్వి అయిన అర్జునుడు జూదం వల్ల జరిగిన అవమానాన్ని స్మరించి, కొంచెం కూడా శాంతిని పొమ్దలేకపోయాడు. (9)
దుఃశాసనవధామర్షీ శకునేః సౌబలస్య చ ।
తతస్తేనాతులాం ప్రీతిమ్ ఉపాగమ్య క్వచిత్ క్వచిత్ ।
గాంధర్వమతులం నృత్యం వాదిత్రం చోపలబ్ధవాన్ ॥ 10
దుఃశాసన, శకునులను, చంపడానికై అసహనంతో ఉన్నా చిత్రసేనుని అనుపమానమైన ప్రీతికి పాత్రుడై గంధర్వసంబంధమైన నృత్యగీతవాద్యాలను నేర్చుకొన్నాడు. (10)
స శిక్షతో నృత్యగుణాననేకాన్
వాదిత్రగీతార్థగుణాంశ్చ సర్వాన్ ।
న శర్మ లేభే పరవీరహంతా
భ్రాతౄన్ స్మరన్ మాతరం చైవ కుంతీమ్ ॥ 11
శత్రువీరులను చంపునట్టి మహావీరుడు అర్జునుడు నృత్య సంబంధమైన అనేక వీశేషాలను నేర్చుకొన్నాడు, వాద్య, గీతములకు సంబంధించిన అన్ని విశేషాలను నేర్చుకొన్నాడు, అయినప్పటికీ, తన సోదరులను, తల్లి కుంతిని స్మరిస్తూ శాంతిని పొందలేకపోయాడు. (11)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః ॥ 44 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమపర్వమను ఉపపర్వమున నలుబది నాల్గవ అధ్యాయము. (44)