37. ముప్పది ఏడవ అధ్యాయము

అర్జునుడు సోదరులందరితో కలసి ఇంద్రకీలాద్రికేగి ఇంద్రుని దర్శించుట.

వైశంపాయన ఉవాచ
కస్యచిత్ త్వథ కాలస్య ధర్మరాజో యుధిష్ఠిరః ।
సంస్మృత్య మునిసందేశమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 1
వివిక్తే విదితప్రజ్ఞమ్ అర్జునం పురుషర్షభ ।
సాంత్వపూర్వం స్మితం కృత్వా పాణినా పరిసంస్పృశన్ ॥ 2
స ముహూర్తమివ ధ్యాత్వా వనవాసమరిందమః ।
ధనంజయం ధర్మరాజః రహసీదమువాచ హ ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు - కొంతకాలం తర్వాత ధర్మరాజు వ్యాసమహర్షి సందేశాన్ని స్మరించి, ఏకాంత ప్రదేశంలో ప్రజ్ఞాప్రసిద్ధుడైన అర్జునునితో ఒక మాట చెప్పాడు. ముహూర్తకాలం వనవాసాన్ని స్మరించుకొని, శత్రుదమనుడైన ధర్మరాజు సాంత్వపూర్వకంగా చేతితో స్పృశించి, ఏకాంతంలో ధనంజయునితో ఇలా చెప్పాడు. (1-3)
యుధిష్ఠిర ఉవాచ
భీష్మే ద్రోణే కృపే కర్ణే ద్రోణపుత్రే చ భారత ।
ధనుర్వేదశ్చతుష్పాదః ఏతేష్వద్య ప్రతిష్ఠితః ॥ 4
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
భరతనందనా! భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామలయందు నాలుగు పాదాల ధనుర్వేదమ్ నేడు సంపూర్ణంగా ప్రతిష్ఠితమై ఉంది. (4)
దైవం బ్రాహ్మం మానుషం చ సయత్నం సచికిత్సితమ్ ।
సర్వాస్త్రాణాం ప్రయోగం చ అభిజానంతి కృత్స్నశః ॥ 5
దైవ బ్రాహ్మ మానుషపద్ధతులకు సంబంధించిన సర్వాస్త్ర ప్రయోగం సంపూర్ణంగా ఎరుగుదురు. అస్త్రాల గ్రహణధారణలు ప్రయత్నపూర్వకంగా ఎరుగుదురు. శత్రువులు ప్రయోగించిన ఆయా అస్త్రాల చికిత్స (నివారణోపాయము) ను కూడా వారు ఎరుగుదురు. (5)
తే సర్వే ధృతరాష్ట్రస్య పుత్రేణ పరిసాంత్వితాః ।
సంవిభక్తాశ్చ తుష్టాశ్చ గురువత్ తేషు వర్తతే ॥ 6
ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధనుడు వారందరికి నచ్చచెప్పాడు. వారికి ఉపభోగసామగ్రిని సమకూర్చి సంతుష్టులను చేశాడు. వారిపట్ల గురుభావంతో ప్రవర్తిస్తున్నాడు. (6)
సర్వయోధేషు చైవాస్య సదా ప్రీతిరనుత్తమా ।
ఆచార్యా మానితాస్తుష్టాః శాంతిం వ్యవహరంత్యుత ॥ 7
యోధులందరిపట్ల దుర్యోధనుడికి మిక్కిలిప్రేమ ఉంది. అతడు ఆచార్యులందరిని గౌరవించాడు. వారంతా సంతుష్టులైనారు. అందువల్ల అతనికోసం వారు ఎల్లపుడూ శాంతికి ప్రయత్నిస్తారు. (7)
శక్తిం న హాపయిష్యంతి తే కాలే ప్రతిపూజితాః ।
అద్య చేయం మహీ కృత్స్నా దుర్యోధనవశానుగా ॥ 8
సగ్రామనగరా పార్థ ససాగరవనాకరా ।
భవానేవ ప్రియోఽస్మాకం త్వయి భారః సమాహితః ॥ 9
సమయోచితంగా పూజింపబడిన వారంతా ఏ పరిస్థితుల్లోనూ కూడ అతని శక్తిని క్షీణింపనీయరు. ఈ రోజున గ్రామ నగరాలతో, సాగర వనాలతో శోభిల్లుతున్న ఈ భుమండలం అంతా దుర్యోధనుడి వశంలో ఉంది. అర్జునా నీవే మాకు మిక్కిలి ఇష్టుడవు. నీపైనే భారమంతా ఉంచాం. (8,9)
అత్ర కృత్యం ప్రపశ్యామి ప్రాప్తకాలమరిందమ ।
కృష్ణద్వైపాయనాత్ తాత గృహీతోపనిషన్మయా ॥ 10
శత్రుదమనా! ఈ సమయంలో చేయదగిన పనిని నేను కనుగొన్నాను. అది చెపుతాను విను. నాయనా! నేను కృష్ణద్వైపాయనుడైన వ్యాసుని నుండి ఒక రహస్యమైన విద్యను పొందాను. (10)
తయా ప్రయుక్తయా సమ్యగ్ జగత్ సర్వం ప్రకాశతే ।
తేన త్వం బ్రహ్మణా తాత సంయుక్తః సుసమాహితః ॥ 11
దేవతానాం యథాకాలం ప్రసాదం ప్రతిపాలయ ।
తపసా యోజయాత్మానమ్ ఉగ్రేణ భరతర్షభ ॥ 12
ధనుష్మాన్ కవచీ ఖడ్గీ మునిః సాధువ్రతే స్థితః ।
న కస్యచిద్ దదన్మార్గం గచ్ఛ తాతోత్తరాం దిశమ్ ॥ 13
ఆ విద్యను యథావిధిగా ప్రయోగిస్తే సమస్తజగత్తు నీకు ప్రకాశిస్తుంది. నాయనా! ఏకాగ్రచిత్తంతో దాన్ని ధ్యానించడం ద్వారా ఆయా సమయాలలో దేవతల అనుగ్రహాన్ని పొందుతావు. భరతశ్రేష్ఠా! నీవు ఉగ్రమైన తపస్సు చెయ్యి. ధనుస్సు, కవచం, ఖడ్గం ధరించి సాధువ్రతాన్ని అవలంబిస్తున్నావు. మౌనంగా ఉండి, ఆక్రమించడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఉత్తర దిక్కుగా వెళ్లు. (11-13)
ఇంద్రే హ్యస్త్రాణి దివ్యాని సమస్తాని ధనంజయ ।
వృత్రాద్ భీతైర్బలం దేవైః తదా శక్రే సమర్పితమ్ ॥ 14
ధనంజయా! ఇంద్రునికి అన్ని దివ్యాస్త్రాల విజ్ఞానమూ ఉంది. వృత్రాసురుని వల్ల భయపడిన దేవతలంతా తమ తమ అస్త్రాలను ఇంద్రుని కిచ్చారు. (14)
తాన్యేకస్థాని సర్వాణి తతస్త్వం ప్రతిపత్స్యసే ।
శక్రమేవ ప్రపద్యస్వ తేఽస్త్రాణి ప్రదాస్యతి ॥ 15
దీక్షితోఽద్యైవ గచ్ఛ త్వం ద్రష్టుం దేవం పురందరమ్ ।
ఆ దివ్యాస్త్రాలన్నీ ఇంద్రుడొక్కని దగ్గరే ఉన్నాయి. అందువల్ల అతని నుండి నీవు పొందగలవు. కనుక నీవు ఇంద్రుడినే ఆశ్రయించు. అతడు నీకు అస్త్రాల నిస్తాడు. ఈ రోజే దీక్షితుడవై ఆ దేవేంద్రుని చూడటానికి వెళ్లు. (15 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా ధర్మరాజః తమధ్యాపయత ప్రభుః ॥ 16
దీక్షితం విధినానేన ధృతవాక్కాయమానసమ్ ।
అనుజజ్ఞే తదా వీరం భ్రాతా భ్రాతరమగ్రజః ॥ 17
వైశంపాయనుడిలా అన్నాడు - ఈ విధంగా చెప్పి శక్తిశాలి అయిన ధర్మరాజు మనోవాక్కాయాలను నిగ్రహించుకొని దీక్షితుడైన అర్జునునకు విధివిధానంగా ప్రతిస్మృతి విద్యను ఉపదేశించాడు. తన వీరసోదరుడైన అర్జునుని బయలుదేరమని ధర్మరాజు అనుమతి నిచ్చాడు. (16,17)
నిదేశాద్ ధర్మరాజస్య ద్రష్టుకామః పురందరమ్ ।
ధనుర్గాండీవమాదాయ తథాక్షయ్యే మహేషుధీ ॥ 18
కవచీ సతలత్రాణః బద్దగోధాంగులిత్రవాన్ ।
హుత్వాగ్నిం బ్రాహ్మణాన్నిష్కైః స్వస్తి వాచ్య మహాభుజః ॥ 19
ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహీతశరాసనః ।
వధాయ ధార్తరాష్ట్రాణాం నిఃశ్వస్యోర్ధ్వముదీక్ష్య చ ॥ 20
ధర్మరాజు ఆజ్ఞతో ఇంద్రుని చూడగోరిన ధనంజయుడు అగ్నికి ఆహుతు లిచ్చి, బ్రాహ్మణులకు దక్షిణలిచ్చాడు. వారు స్వస్తి వచనం పలికారు. కవచ, తలత్ర, అంగుళిత్రాలను ధరిమ్చి గాండీవాన్ని, అక్షయ్యమగు అంబులపొదిని తీసికొని, ధార్త రాష్ట్రుల వధకొరకు నిట్టూర్చి, పైకి చూచి, బయలుదేరాడు. (18-20)
తం దృష్ట్వా తత్ర కౌంతేయం ప్రగృహితశరాసనమ్ ।
అబ్రువన్ బ్రాహ్మణాః సిద్ధా భూతాన్యంతర్హితాని చ ॥ 21
శరాసనం ధరించి బయలుదేరిన అర్జునుని చూసి బ్రాహ్మణులు, సిద్ధులు, అదృశ్యంగా ఉన్న భూతాలు ఇలా అన్నాయి. (21)
క్షిప్రమాప్నుహి కౌంతేయ మనసా యద్ యదిచ్ఛసి ।
అబ్రువన్ బ్రాహ్మణాః పార్థమ్ ఇతి కృత్వా జయాశిషః ॥ 22
సంసాధయస్వ కౌంతేయ ధ్రువోఽస్తు విజయస్తవ ।
బ్రాహ్మణులు జయాశీస్సులనిస్తూ - 'కుంతీనందనా! నీవు మనస్సులో కోరుకొన్న దానిని శీఘ్రంగా పొందుతావు. పార్థా! నీవు నీ అభీష్టాన్ని సాధించు. నీకు విజయం తప్పక కలుగుతుంది.' అని పలికారు. (22 1/2)
తం తథా ప్రస్థితాం వీరం శాలస్కంధోరుమర్జునమ్ ॥ 23
మనాంస్యాదాయ సర్వేషాం కృష్ణా వచనమబ్రవీత్ ।
సాలవృక్షం వంటి భుజాలు, ఊరువులు కల అర్జునుడు అలా బయలుదేరుతుంటే అందరి మనస్సులలోని అభిప్రాయాన్ని గ్రహించిన ద్రౌపది ఆ వీరునితో ఇలా అంది. (23 1/2)
కృష్ణోవాచ
యత్ తే కుంతీ మహాబాహో జాతస్యైచ్ఛద్ ధనంజయ ॥ 24
తత్ తేఽస్తు సర్వం కౌంతేయ యథా చ స్వయమిచ్ఛసి ।
ద్రౌపది ఇలా చెప్పింది - కుంతీకుమారా! ధనంజయా! నిన్ను కన్నప్పుడు నీ తల్లికుంతి నీ గురించి ఏమని భావించిందో, నీ మనస్సులో ఏం కోరుకొంటున్నావో, అవన్నీ నీకు లభించుగాక. (24 1/2)
మాస్మాకం క్షత్రియకులే జన్మ కశ్చిదవాప్నుయాత్ ॥ 25
బ్రాహ్మణేభ్యో నమో నిత్యం యేషాం భైక్ష్యేణ జీవికా ।
మన క్షత్రియకులంలో ఎవరూ పుట్టుకుండుగాక! బ్రాహ్మణులకు నమస్కారం. వారు భిక్షాటనచే కూడ జీవించవచ్చును. (25 1/2)
ఇదం మే పరమం దుఃఖం యః స పాపః సుయోధనః ॥ 26
దృష్ట్వా మాం గౌరితి ప్రాహ ప్రహసన్ రాజసంసది ।
ఇది నాకు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తోంది. పాపాత్ముడైన ఆ దుర్యోధనుడు రాజసభలో బిగ్గరగా నవ్వుతూ నన్ను 'గౌః' అని అన్నాడు. (అనేక పురుషులకు ఉపభోగక్షమమైనదని అభిప్రాయం) (26 1/2)
తస్మాద్ దుఃఖాదిదం దుఃఖం గరీయ ఇతి మే మతిః ॥ 27
యత్ తత్ పరిషదో మధ్యే బహ్వయుక్తమభాషత ।
ఆ దుఃఖం కంటె కూడా, నన్ను నిండుసభలో మిక్కిలి అనుచితంగా మాట్లాడాడు, అది నాకు ఇంకా దుఃఖాన్ని కలిగిస్తోంది. (27 1/2)
మానం తే భ్రాతరః సర్వే త్వత్కథాభిః ప్రజాగరే ॥ 28
రంస్యంతే వీర కర్మాణి కథయంతః పునః పునః ।
నైవ నః పార్థ భోగేషు న ధనే నోత జీవితే ॥ 29
తుష్టిబుద్ధిర్భవిత్రీ వా త్వయి దీర్ఘప్రవాసిని ।
త్వయి నః పార్థ సర్వేషాం సుఖదుఃఖే సమాహితే ॥ 30
జీవితం మరణం చైవ రాజ్యమైశ్వర్యమేవ చ ।
ఆపృష్టో మేఽసి కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత ॥ 31
వీరశ్రేష్ఠా! నీవు వెళ్ళిన తర్వాత నీ సోదరులు మెలకువగా ఉన్న సమయంలో నీ వీరగాథలను మాటిమాటికి చెప్పుకొంటూ ఆనందిస్తారు. ఇది నిశ్చయం. కానీ, పార్థా! నీవు చాలాకాలం ప్రవాసంలో ఉంటే మాకు భోగాలపట్ల గాని, ధనంపట్ల గాని, జీవితం పట్ల గాని ప్రీతి కలగదు. మా అందరి సుఖ దుఃఖాలు, జీవన్మరణాలు, రాజ్యం ఐశ్వర్యం, అన్నీ నీమీదే ఆధారపడి ఉన్నాయి. నీకు వీడ్కోలు పలుకుతున్నాను. కుంతీకుమారా! భరతనందనా! నీకు శుభమగుగాక! (28-31)
బలవద్భిర్విరుద్ధం న కార్యమేతత్ త్వయానఘ ।
ప్రయాహ్యవిఘ్నే నైవాశు విజయాయ మహాబల ।
నమో ధాత్రే విధాత్రే చ స్వస్తి గచ్ఛ హ్యనామయమ్ ॥ 32
మహాబలా! నీవు బలవంతులలో విరోధించవద్దు, నిర్విఘ్నంగా విజయం కొరకు శీఘ్రంగా వెళ్లు. ధాతకు, విధాతకు నమస్కారం. క్షేమంగా, ఆరోగ్యంగా వెళ్ళిరా. (32)
హ్రీః శ్రీః కీర్తిర్ద్యుతిః పుష్టిః ఉమా లక్ష్మీః సరస్వతీ ।
ఇమా వై తవ పాంథస్య పాలయంతు ధనంజయ ॥ 33
ధనంజయా! హ్రీ, శ్రీ, కీర్తి, ద్యుతి, పుష్టి, ఉమ, లక్ష్మి, సరస్వతి - ఈ దేవతలందరూ ప్రయాణంలో నిన్ను రక్షింతురు గాక! (33)
జ్యేష్ఠాపచాయీ జ్యేష్ఠస్య భ్రాతుర్వచనకారకః ।
ప్రపద్యేఽహం వసూన్ రుద్రాన్ ఆదిత్యాన్ సమరుద్గణాన్ ॥ 34
విశ్వేదేవాంస్తథా సాధ్యాన్ శాంత్యర్థం భరతర్షభ ।
స్వస్థి తేఽస్త్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యశ్చ భారత ॥ 35
దివ్యేభ్యశ్చైవ భూతేభ్యః యే చాన్యే పరిపంథినః ।
నీవు పెద్దవారిని గౌరవిస్తావు. పెద్దన్నగారి మాటను ఆచరిస్తావు. భరతశ్రేష్ఠా! నీకు శాంతికలగడం కోసం నేను వసు, రుద్ర, ఆదిత్య, మరుద్గణాలను, విశ్వేదేవతలను, సాధ్యులను, ప్రార్థిస్తాను. అంతరిక్షంలో ఉన్న దివ్యులైన భూతాల నుండి, మార్గంలో విఘ్నం కలిగించే ఇతర ప్రాణుల నుండి నీకు శుభమగుగాక! (34, 35 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వాఽఽశిషః కృష్ణా విరరామ యశస్వినీ ॥ 36
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! ఈ విధంగా మంగళవచనాలు పలికి యశస్విని అయిన ద్రౌపది విరమించింది. (36)
తతః ప్రదక్షిణం కృత్వా భ్రాతౄన్ ధౌమ్యం చ పాండవః ।
ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహ్య రుచిరం ధనుః ॥ 37
ఆ తరువాత పాండునందనుడు, మహాబాహువు అయిన అర్జునుడు సోదరులకు, ధౌమ్యునకు ప్రదక్షిణం చేసి, మెరిసే తన గాండీవాన్ని తీసికొని బయలుదేరాడు. (37)
తస్య మార్గాదపాక్రామన్ సర్వభూతాని గచ్ఛతః ।
యుక్తస్యైంద్రేణ యోగేన పరాక్రాంతస్య శుష్మిణః ॥ 38
అర్జునుడు ఇంద్రుని నుండి పొందిన ప్రతిస్మృతి అనే యోగవిద్యతో కూడి ప్రకాశిస్తూ ఉండడం వల్ల, అతడు దారిలో వెళుతూ ఉంటే సర్వభూతాలూ ప్రక్కకు తప్పుకొంటున్నాయి. (38)
సోఽగచ్ఛత్ పర్వతాంస్తాత తపోధననిషేవితాన్ ।
దివ్యం హైమవతం పుణ్యం దేవజుష్టం పరంతపః ॥ 39
పరంతపుడైన అర్జునుడు తపస్వులచే సేవింపబడిన పర్వతాల మార్గంలో వెళుతూ దివ్యమూ, పుణ్యమూ, దేవతలకు ప్రీతికరమూ అయిన హిమవత్పర్వతానికి చేరుకొన్నాడు. (39)
అగచ్ఛత్ పర్వతం పుణ్యమ్ ఏకాహ్నైవ మహామనాః ।
మనోజవగతిర్భుత్వా యోగయుక్తో యతానిలః ॥ 40
మహామనస్వి అయిన అర్జునుడు యోగయుక్తుడవటం వల్ల మనోవేగంతో కూడిన గమనంతో వాయువులా ఒక్కరోజులోనే పవిత్రమైన ఆ హిమవత్పర్వతానికి చేరుకొన్నాడు. (40)
హిమవంట్తమతిక్రమ్య గంధమాదనమేవ చ ।
అత్యక్రామత్ స దుర్గాని దివారాత్రమతంద్రితః ॥ 41
అతడు అలసటలేకుండా హిమవత్పర్వతాన్ని దాటి, గంధమాదనాన్ని చేరి, అక్కడ నుండి రాత్రింబవళ్ళు దుర్గమ ప్రదేశాలను దాటి వెళ్ళాడు. (41)
ఇంద్రకీలం సమాసాద్య తతోఽతిష్ఠద్ ధనంజయః ।
అంతరిక్షేఽతిశుశ్రావ తిష్ఠేతి స వచస్తదా ॥ 42
ఆ తరువాత ఇంద్రకీలాద్రి మీదకు చేరుకొన్నాడు. అక్కడ అంతరిక్షం నుండి 'ఆగు' (నిలు) అనే మాట విన్నాడు. అక్కడే ఆగాడు. (42)
తచ్ఛ్రుత్వా సర్వతో దృష్టిం చారయామాస పాండవః ।
అతాపశ్యత్ సవ్యసాచీ వృక్షమూలే తపస్వినమ్ ॥ 43
ఆ మాటను విని పాండునందనుడు అర్జునుడు అన్ని వైపులకు దృష్టి సారించాడు. అక్కడొక చెట్టు మొదట్లో కూర్చున్న ఒక తపస్విని చూశాడు. (43)
బ్రాహ్మ్యాశ్రియా దీప్యమానం పింగలం జటిలం కృశమ్ ।
సోఽబ్రవీదర్జునం తత్ర స్థితం దృష్ట్వా మహాతపాః ॥ 44
బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ, పింగళవర్ణ జటలు ధరించి, కృశించి ఉన్న ఆ తపశ్వి అర్జునునితో ఇలా అన్నాడు. (44)
కస్త్వం తాతేహ సంప్రాప్తః ధనుష్మాన్ కవచీ శరీ ।
నిబద్ధాసితలత్రాణః క్షత్రధర్మమనువ్రతః ॥ 45
నేహ శస్త్రేణ కర్తవ్యం శాంతానామేష ఆలయః ।
వినీతక్రోధహర్షాణాం బ్రాహ్మణానాం తపస్వినామ్ ॥ 46
"నాయనా! ధనుర్బాణాలు, కవచం ధరించి, ఖడ్గం, తలత్రాణం ధరించి, క్షత్రధర్మాన్ని అనుసరిస్తూ ఇక్కడకు వచ్చిన నీవెవరు? ఇక్కడ శస్త్రంతో చేయదగింది ఏమీలేదు. ఇది ఇంద్రియనిగ్రహంతో, క్రోధహర్షాలు జయించి, తపస్వులైన బ్రాహ్మణులుండే ప్రదేశం. (45,46)
నేహాస్తి ధనుషా కార్యం న సంగ్రామోఽత్ర కర్హిచిత్ ।
నిక్షిపైతద్ ధనుస్తాత ప్రాప్తోఽసి పరమాం గతిమ్ ॥ 47
ఇక్కడ ధనుస్సుతో చేయవలసిన పనేమీలేదు. ఇక్కడేమీ ఎక్కడా యుద్ధం జరగటం లేదు. నాయనా! నీవు నీ ఈ ధనుస్సులు అలా ఉంచు. (పడవేయి), నీవు ఉత్తమమైన గతిని పొందుతావు. (47)
ఓజసా తేజసా వీర యథా నాన్యః పుమాన్ క్వచిత్ ।
తథా హసన్నివాభీక్ష్ణం బ్రాహ్మణోఽర్జునమబ్రవీత్ ।
న చైనం చాలయామాస ధైర్యాత్ సుధృతనిశ్చయమ్ ॥ 48
వీరా! తేజోబలాలలో నీతో సమానమైన వాడు వేరొకడు లేడు" అని పలికి ఆ బ్రహ్మర్షి మరల మరల అర్జునుని ధనుస్సు వదిలిపెట్టమని నవ్వుతూ చెప్పాడు. కాని దృఢనిశ్చయం గల అర్జునుని ధైర్యం నుండి అతడు చలింపజేయలేకపోయాడు. (48)
తమువాచ తతః ప్రీతః స ద్విజః ప్రహసన్నివ ।
వరం వృణీష్వ భద్రం తే శక్రోఽహమరిసూదన ॥ 49
ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు నవ్వుతూ అర్జునుడితో ఇలా అన్నాడు - అరిసూదనా! నేను ఇంద్రుడను, నీకు శుభమగుగాక! నీవు వరం కోరుకో. (49)
ఏవముక్తః సహస్రాక్షం ప్రత్యువాచ ధనంజయః ।
ప్రాంజలిః ప్రణతో భూత్వా శూరః కురుకులోద్వహః ॥ 50
అలా చెప్పిన ఇంద్రునితో శూరుడు కురుకులశ్రేష్ఠుడు అయిన అర్జునుడు చేతులు జోడించి నమస్కరించి ఇలా బదులు పలికాడు. (50)
ఈప్సితో హ్యేష వై కామః వరం చైనం ప్రయచ్ఛ మే ।
త్వత్తోఽద్య బగవన్నస్త్రం కృత్స్నమిచ్ఛామి వేదితుమ్ ॥ 51
ఇపుడు నేను నీ నుండి సంపూర్ణమ్గా అస్త్ఱాన్ని గురించి తెలిసికోవాలనుకొంటున్నాను. పూజ్యుడా! ఇది నా అభీష్టం. ఈ వరాన్ని నాకియ్యి. (51)
ప్రత్యువాచ మహేంద్రస్తం ప్రీతాత్మా ప్రహసన్నివ ।
ఇహ ప్రాప్తస్య కిం కార్యమ్ అస్త్రైస్తవ ధనంజయ ॥ 52
కామాన్ వృణీష్వ లోకాంస్త్వంప్రాప్తోఽసి పరమాం గతిమ్ ।
ఏవముక్తః ప్రత్యువాచ సహస్రాక్షం ధనంజయః ॥ 53
న లోభాన్న పునః కామాద్ న దేవత్వం పునః సుఖమ్ ।
న చ సర్వామరైశ్వర్యం కామయే త్రిదశాధిప ॥ 54
భ్రాతౄంస్తాన్ విపినే త్యక్త్వా వైరమప్రతియాత్య చ ।
అకీర్తిం సర్వలోకేషు గచ్ఛేయం శాశ్వతీః సమాః ॥ 55
అపుడాతడు సంతోషించి ఇంద్రుడై నవ్వుతూ అర్జునునితో ఇలా అన్నాడు - ధనంజయా! ఇక్కడకు వచ్చిన నీకు అస్త్రాలతో పని ఏమిటి? నీకిష్టమైన లోకాలను కోరుకో. నీవు పరమస్థితిని పొందావు, అది విని ధనంజయుడు సహస్రాక్షుడైన ఇంద్రునితో మళ్ళీ ఇలా అన్నాడు - త్రిదశాధిపా! లోభం వల్లకాని, కామం వల్ల కాని ఇక్కడకు రాలేదు. దేవత్వం కాని, సుఖం కాని, సంపూర్ణమైన దేవతల ఐశ్వర్యం కాని నేను కోరుకోవటం లేదు. అలా చేస్తే, సోదరుల నలా అడవిలో వదిలి, విరోధాన్ని పోగొట్టుకోక, సర్వలోకాలలో శాశ్వతంగా అపకీర్తిని నేను పొందుతాను. (52-55)
ఏవముక్తః ప్రత్యువాచ వృత్రహా పాండునందనమ్ ।
సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచా సర్వలోకనమస్కృతః ॥ 56
అర్జునుడిలా చెప్పగానే, విశ్వవందితుడు, శత్రుసంహారకుడు అయిన ఇంద్రుడు మధురమైన మాటలతో అర్జునుని ఊరడిస్తూ ఇలా అన్నాడు. (56)
యదా ద్రక్ష్యసి భుతేశం త్ర్యక్షం శూలధరం శివమ్ ।
తదా దాతాస్మి తే తాత దివ్యాన్యస్త్రాణి సర్వశః ॥ 57
నాయనా! త్రినేత్రుడు, శూలధరుడు, భుతేశుడు అయిన శివుని నీవు దర్శిమ్చగలిగినట్లైతే, అపుడు నీకు అన్నివిధాలైన దివ్యాస్త్రాలను ఇస్తాను. (57)
క్రియతాం దర్శనే యత్నః దేవస్య పరమేష్ఠినః ।
దర్శనాత్ తస్య కౌంతేయ సంసిద్ధః స్వర్గమేష్యసి ॥ 58
కుంతీకుమారా! పరమేశ్వరుడైన ఆ మహాదేవుని దర్శించడానికి ప్రయత్నం చెయ్యి. అతనిని చూడటం వల్ల నీకు సంపూర్ణకార్యసిద్ధి కలుగుతుంది. అటుపై స్వర్గానికి వెళతావు. (58)
ఇత్యుక్త్వా ఫాల్గునం శక్రః జగామాదర్శనం పునః ।
అర్జునోఽప్యథ తత్రైవ తస్థౌ యోగసమన్వితః ॥ 59
అర్జునుడికి ఈ విధంగా చెప్పి ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. అటు తర్వాత అర్జునుడు కూడా యోగయుక్తుడై నిలిచాడు. (59)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ఇంద్రదర్శనే సప్తత్రింశోఽధ్యాయః ॥ 37 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ఇంద్రదర్శనమను ముప్పది ఏడవ అధ్యాయము. (37)