38. ముప్పది ఎనిమిదవ అధ్యాయము

(కైరాత పర్వము)

అర్జునుని ఉగ్రతపస్సు, ఆ విషయమును, ఋషులు శంకరునితో చర్చించుట.

జనమేజయ ఉవాచ
భగవన్ శ్రోతుమిచ్ఛామి పార్థస్యాక్లిష్టకర్మణః ।
విస్తరేణ కథామేతాం యథాస్త్రాణ్యుపలబ్ధవాన్ ॥ 1
జనమేజయుడు ఇలా అన్నాడు - పూజ్యుడా! అనాయాసంగా పనులు చేసే కుంతీనందనుడైన అర్జునుడు అస్త్రాలను ఏ విధంగా పొందగలిగాడు? ఈ వృత్తాంతాన్ని విస్తరంగా వినాలనుకొంటున్నాను. (1)
యథా చ పురుషవాఘ్రః దీర్ఘబాహుర్ధనంజయః ।
వనం ప్రవిష్ఠ స్తేజస్వీ నిర్మనుష్యమభీతవత్ ॥ 2
నరోత్తముడు, దీర్ఘబాహువు, తేజస్వి అయిన ధనంజయుడు నిర్జనవనంలో ఒంటరిగా భయం లేకుండా ఎలా ప్రవేశించాడు? (2)
కిం చ తేన కృతం తత్ర వసతా బ్రహ్మవిత్తమ ।
కథం చ భగవాన్ స్థాణుః దేవరాజశ్చ తోషితః ॥ 3
బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడా! ఆ వనంలో అతడు ఏం చేశాడు? శంకరుని, దేవేంద్రుని ఎలా సంతుష్టులను చేశాడు? (3)
ఏతదిచ్ఛామ్యహాం శ్రోతుం త్వత్ర్పసాదాద్ ద్విజోత్తమ ।
త్వం హి సర్వజ్ఞ దివ్యం చ మానుషం చైవ వేత్థ హ ॥ 4
ద్విజోత్తమా! నీ అనుగ్రహంతో ఈ విషయం వినాలనుకొంటున్నాను. సర్వజ్ఞా! నీవు దివ్య, మానుష వృత్తాంతాలన్నింటినీ ఎరుగుదువు. (4)
అట్త్యద్భుతతమం బ్రహ్మన్ రోమహర్షణమర్జునః ।
భవేన సహ సంగ్రామం చకారాప్రతిమం కిల ॥ 5
పురా ప్రహరతాం శ్రేష్ఠః సంగ్రామేష్వపరాజితః ।
యచ్ఛ్రుత్వా నరసింహానాం దైన్యహర్షాతివిస్మయాత్ ॥ 6
శూరాణామపి పార్థానాం హృదయాని చకంపిరే ।
యద్ యచ్చ కృతవానన్యత్ పార్థస్తదఖిలం వద ॥ 7
బ్రాహ్మణోత్తమా! పూర్వకాలంలో యోధులలో శ్రేష్ఠుడు, యుద్ధంలో వెనుదిరగని అర్జునుడు ఈశ్వరునితో అసాధారణమ్, రోమహర్షణం, అత్యద్భుతం అయిన యుద్ధం చేశాడు. దాని గురించి విన్న నరసింహులు, శూరులు అయిన కుంతీకుమారుల హృదయాలు దైన్య హర్ష విస్మయాలతో చలించిపోయాయి. (5-7)
న హ్యస్య నిందితం జిష్ణోః సుసూక్ష్మమపి లక్షయే ।
చరితం తస్య శూరస్య తన్మే సర్వం ప్రకీర్తయ ॥ 8
శూరుడు, జయశీలుడు అయిన అర్జునుని నడవడిలో కొద్దిగా కూడా నిందింపదగింది లేదు. అందువల్ల అతని వృత్తాంతాన్ని సమస్తమూ చెప్పు. (8)
వైశంపాయన ఉవాచ
కథయిష్యామి తే తాత కథామేతాం మహాత్మనః ।
దివ్యాం పౌరవశార్దూల మహతీమద్భుతోపమామ్ ॥ 9
వైశమ్పాయనుడిలా అన్నాడు - నాయనా! పౌరవశార్దూలా! మహాత్ముడైన అర్జునుని యొక్క వృత్తాంతం దివ్యం, అద్భుతం, మహత్త్వపూర్ణం. దాన్ని నీకు చెపుతాను. (9)
గాత్రసంస్పర్శసంబద్ధాం త్య్రంబకేణ సహానఘ ।
పార్థస్య దేవదేవేన శృణు సమ్యక్ సమాగమమ్ ॥ 10
అనఘా! దేవదేవుడైన త్ర్యంబకునితో అర్జునునకు శరీర స్పర్శకలిగిన సమాగమవృత్తాంతాన్ని చెపుతాను, జాగ్రత్తగా విను. (10)
యుధిష్ఠిరనియోగాత్ సః జగామామితవిక్రమః ।
శక్రం సురేశ్వరం ద్రష్టుం దేవదేవం చ శంకరమ్ ॥ 11
దివ్యం తద్ ధనురాదాయ ఖడ్గం చ కనకత్సరుమ్ ।
మహాబలో మహాబాహుః అర్జునః కార్యసిద్ధయే ॥ 12
దిశం హ్యుదీచీం కౌరవ్యః హిమవచ్ఛిఖరమ్ ప్రతి ।
ఐంద్రిః స్థిరమనా రాజన్ సర్వలోకమహారథః ॥ 13
రాజా! అమితవిక్రముడు, మహాబలుడు, మహాబాహువు, కురుకులభూషణుడు, ఇంద్రపుత్రుడు, స్థిరచిత్తుడు, సంపూర్ణవిశ్వంలో విఖ్యాతమహారథుడు అయిన అర్జునుడు యుధిష్ఠిరుని ఆదేశం వల్ల, సురాధిపుడైన ఇంద్రుని, దేవదేవుడైన శంకరుని చూడటం కోసం దివ్యమైన గాండీవధనువును, బంగారుపిడి గల ఖడ్గాన్ని తీసికొని ఉత్తర దిక్కుగా హిమవచ్ఛిఖరం మీదికి వెళ్ళాడు. (11-13)
త్వరయా పరయా యుక్తః తపసే ధృతనిశ్చయః ।
వనం కంటకితం ఘోరమ్ ఏక ఏవాన్వపద్యత ॥ 14
తపస్సు కోసం దృఢమైన నిర్ణయం తీసికొని, మిక్కిలి వేగంగా భయంకరకంటకాకీర్ణమైన వనంలోకి ఒంటరిగా వెళ్ళాడు. (14)
నానాపుష్పఫలోపేతం నానాపక్షినిషేవితమ్ ।
నానామృగగణాకీర్ణం సిద్ధచారణసేవితమ్ ॥ 15
ఆ వనం పలురకాలైన పుష్పఫలాలతో కూడి ఉంది. అనేక విధాలైన పక్షులకు ఆశ్రయమైనది. అనేక మృగసమూహాలతో నిండి ఉంది. సిద్ధులచే, చారణులచే సేవింపబడుతోంది. (15)
తతః ప్రయాతే కౌంతేయే వనం మానుషవర్జితమ్ ।
శంఖానాం పటహానాం చ శబ్దః సమభవద్ దివి ॥ 16
నిర్జనమైన వనానికి అర్జునుడు వెళ్ళిన తర్వాత ఆకాశంలో శంఖపటహాల ధ్వని వినబడింది. (16)
పుష్పవర్షం చ సుమహద్ నిపపాత మహీతలే ।
మేఘజాలం చ వితతం ఛాదయామాస సర్వతః ॥ 17
సోఽతీత్య వనదుర్గాణి సన్నికర్షే మహాగిరేః ।
శుశుభే హిమవత్పృష్ఠే వసమానోఽర్జునస్తదా ॥ 18
అపుడు భూమిపై గొప్ప పుష్పవృష్టి పడింది. ఆకాశమంతా మేఘాల సముదాయం ఆవరించింది. అర్జునుడు దుర్గమాలైన వనాలను దాటి హిమవత్పర్వతం పృష్ఠభాగంలో ఒక మహాపర్వతం దగ్గర నివసిస్తూ శోభిల్లాడు. (17,18)
తత్రాపశ్యద్ ద్రుమాన్ పుల్లాన్ విహగైర్వల్గునాదితాన్ ।
నదీశ్చ విపులావర్తాః వైఢూర్యవిమలప్రభాః ॥ 19
వికసించినపూలతో నిండి, పక్షుల మధురనాదాలతో ఉన్న వృక్షాలను, వైడూర్యాల వలె స్వచ్ఛమైన కాంతితో, పెద్ద సుడులు గల నదులను అర్జునుడు చూశాడు. (19)
హంసకారండవోద్గీతాః సారసాభిరుతాస్తథా ।
పుంస్కోకిలరుతాశ్చైవ క్రౌంచబర్హిణనాదితాః ॥ 20
హంస, కారండవ, సారసాల ధ్వనులతో, పుంస్కోకిలల స్వరాలతో, క్రౌంచ, బర్హిణనాదాలతో ఆ నదులు మనోహరంగా ఉన్నాయి. (20)
మనోహరవనోపేతాః తస్మిన్నతిరథోఽర్జునః ।
పుణ్యశీతామలజలాః పశ్యన్ ప్రీతమనాభవత్ ॥ 21
నదులను ఆనుకొని అందమైన వనాలున్నాయి. అక్కడ ఉన్న అతిరథుడైన అర్జునుడు పవిత్రాలైన చల్లని నీళ్ళున్న నదులను చూసి సంతుష్టాంతరంగుడయ్యాడు. (21)
రమణీయ వనోద్దేశే రమమాణోఽర్జునస్తదా ।
తపస్యుగ్రే వర్తమానః ఉగ్రతేజా మహామనాః ॥ 22
అందమైన ఆ వనంలో ఉగ్రతేజుసు, మహామనస్వు అయిన అర్జునుడు సంతోషంతో ఉగ్రమైన తపస్సులో ఉన్నాడు. (22)
దర్భచీరం నివస్యాథ దండాజినవిభూషితః ।
శీర్ణం చ పతితం భూమౌ పర్ణం సముపయుక్తవాన్ ॥ 23
దర్భవస్త్రం ధరించి, దండం, మృగచర్మాలు స్వీకరించిన అర్జునుడు నేలపైపడిన ఎండుటాకులను భోజనానికి ఉపయోగించేవాడు. (23)
పూర్ణే పూర్నే త్రిరాత్రే తు మాసమేకం ఫలాశనః ।
ద్విగుణేన హి కాలేన ద్వితీయం మాసమత్యయాత్ ॥ 24
ఒక నెల వరకు మూడేసి రాత్రులకొకసారి ఫలాలను తినేవాడు. రెండవనెలలో వెనుకటి దానికి రెట్టింపు సమయంలో, ఆరు రాత్రులకొకసారి ఫలాహారం తీసికొనేవాడు. (24)
తృతీయమపి మాసం సః పక్షేణాహారమాచరన్ ।
చతుర్థే త్వథ సంప్రాప్తే మాసే భరతసత్తమః ॥ 25
వాయుభక్షో మహాబాహుః అభవత్ పాండునందనః ।
ఊర్ధ్వబాహుర్నిరాలంబః పాదాంగుష్ఠాగ్రవిష్ఠితః ॥ 26
మూడవమాసంలో పదిహేనురోజులకొకసారి ఆహారం తీసికొనేవాడు. ఆ తరువాత మహాబాహువైన, అర్జునుడు కేవలం వాయుభక్షకుడై, చేతులు పైకెత్తి, ఆసరా లేకుండా కాలిబొటనవ్రేలి కొనమీద నిలిచి తపస్సుచేశాడు. (25,26)
సదోపస్పర్శనాచ్చాస్య బభూవురమితౌజసః ।
విద్యుదంభోరుహనిభాః జటాస్తస్య మహాత్మనః ॥ 27
అమితతేజస్వి, మహాత్ముడు అయిన అర్జునుని శిరోజాలు నిత్యమూ స్నానం చేయడం వల్ల విద్యుత్తువలె, పద్మం వలె ప్రకాశిస్తున్నాయి. (27)
తతో మహర్షయః సర్వే జగ్ముర్దేవం పినాకినమ్ ।
నివేదయిషవః పార్థం తపస్యుగ్రే సమాస్థితమ్ ॥ 28
అప్పుడు మహర్షులంతా ఉగ్రమైన తపస్సులో ఉన్న అర్జునుని గురించి నివేదించడానికి ఈశ్వరుని వద్దకు వెళ్ళారు. (28)
తం ప్రణమ్య మహాదేవం శశంసుః పార్థకర్మ తత్ ।
ఏష పార్థో మహాతేజాః హిమవత్పృష్ఠమాస్థితః ॥ 29
ఉగ్రే తపసి దుష్పారే స్థితో ధూమాయయన్ దిశః ।
తస్య దేవేశ న వయం విద్మః సర్వే చికీర్షితమ్ ॥ 30
వారు మహాదేవునికి నమస్కరించి పార్థుడు చేస్తున్న తపస్సు గురించి ఇలా చెప్పాడు - దేవేశా! మహాతేజస్వి, కుంతీకుమారుడైన అర్జునుడు అంతులేని ఉగ్రతపస్సుతో ఉండి, దిక్కులన్నింటిని ధూమావృతం చేస్తున్నాడు. అతని కోరిక ఏమిటో మేము ఎరుగము. (30)
సంతాపయతి నః సర్వాన్ అసౌ సాధు నివార్యతామ్ ।
తేషాం తద్వచనం శ్రుత్వా మునీనాం భావితాత్మనామ్ ॥ 31
ఉమాపతిర్భూతపతిః వాక్యమేతదువాచ హ ।
మమ్మందర్నీ అతడు తపింపజేస్తున్నాడు. కావున మంచిగా అతనిని తపస్సు నుండి నివర్తింపజేయి. సద్భావం గల ఆ మునీశ్వరుల మాటలు విని భూతనాథుడైన ఉమాపతి ఇలా పలికాడు. (31 1/2)
మహాదేవ ఉవాచ
న వో విషాదః కర్తవ్యః ఫాల్గునం ప్రతి సర్వశః ॥ 32
శీఘ్రం గచ్ఛత సంహృష్టాః యథాగతమతంద్రితాః ।
అహమస్య విజానామి సంకల్పం మనసి స్థితమ్ ॥ 33
మహాదేవుడిలా అన్నాడు.
మహర్షులారా! అర్జునుడి విషయంలో మీరేమీ విచారించనవసరంలేదు. మీరు శీఘ్రంగా, సంతోషంతో, అలసత్వం లేకుండా మరలి వెళ్ళండి అతని మనస్సంకల్పాన్ని నేను ఎరుగుదును. (32,33)
నాస్య స్వర్గస్పృహా కాచిద్ నైశ్వర్యస్య తథాఽఽయుషః ।
యత్ తస్య కాంక్షితం సర్వం తత్ కరిష్యేఽహమద్య వై ॥ 34
అతనికి స్వర్గం పట్ల కోరికలేదు. ఐశ్వర్యంగాని, ఆయువుకాని అతడు కోరుకోవటం లేదు. అతడు కోరినదంతటినీ నేను ఈ రోజే ఇప్పుడే చేస్తాను. (34)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా శర్వవచనమ్ ఋషయః సత్యవాదినః ।
ప్రహృష్టమనసో జగ్ముః యథా స్వాన్ పునరాలయాన్ ॥ 35
వైశంపాయనుడిలా అన్నాడు.
ఈశ్వరుని ఆ మాటలను విని సత్యవాదులైన మహర్షులు మనస్సులో ఆనందించి వారివారి నివాసాలకు తిరిగి వెళ్ళారు. (35)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కైరాతపర్వణి మునిశంకరసంవాదే అష్టాత్రింశోఽధ్యాయః ॥ 38 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున కైరాతపర్వమను ఉపపర్వమున ముని - శంకరసంవాదమను ముప్పది ఎనిమిదవ అధ్యాయము. (38)