36. ముప్పది ఆరవ అధ్యాయము
యుధిష్ఠిరునుకి ప్రతిస్మృతి విద్యనిచ్చుట, పాండవులు కామ్యకవనమునకేగుట.
వైశంపాయన ఉవాచ
భీమసేనవచః శ్రుత్వా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నిఃశ్వస్య పురుషవ్యాఘ్రః సంప్రదధ్యౌ పరంతపః ॥ 1
శ్రుతా మే రాజధర్మాశ్చ వర్ణానాం చ వినిశ్చయాః ।
ఆయత్యాం చ తదాత్వే చ యః పశ్యతి స పశ్యతి ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! భిమసేనుని మాటలను విని, కుంతీపుత్రుడు, పురుషసింహుడు, శత్రుమర్దనుడు అయిన యుధిష్ఠిరుడు మనస్సులో విచారించాడు - నేను రాజధర్మాలను, వర్ణధర్మాలను, వాటి నిర్ణయాలను విన్నాను. కాని భవిష్యద్వర్తమానాలపై దృష్టి పెట్టినవాడే యథార్తదర్శి అవుతాడు. (1,2)
ధర్మస్య జానమానోఽహం గతిమగ్ర్యాం సుదుర్విదామ్ ।
కథం బలాత్ కరిష్యామి మేరోరివ విమర్దనమ్ ॥ 3
ధర్మం యొక్క అంతిమలక్ష్యం తెలియడం కష్టం. అది తెలిసిన నేను బలవంతంగా మేరుపర్వతం వంటి ధర్మాన్ని ఎలా అణచివేయగలను? (3)
స ముహూర్తమివ ధ్యాత్వా వినిశ్చిత్యేతికృత్యతామ్ ।
భీమసేనమిదం వాక్యమ్ అపదాంతరమబ్రవీత్ ॥ 4
ఈవిధంగా ముహూర్తకాలం బాగా ఆలోచించి, కర్తవ్యాన్ని నిశ్చయించుకొని, యుధిష్ఠిరుడు వెనువెంటనే భీమునితో ఇలా అన్నాడు. (4)
యుధిష్ఠిర ఉవాచ
ఏవమేతన్మహాబాహీ యథా వదసి భారత ।
ఇదమున్యత్ సమాదత్స్వ వాచ్యం మే వాక్యకోవిద ॥ 5
యుధిష్ఠిరుడిలా అన్నాడు - మహాబాహూ! భారతా! వాక్యకోవిదా! నీవు చెప్పినమాట సరి అయినదే. అయినప్పటికీ నేను మరొక విషయం చెపుతాను. గ్రహించు. (5)
మహాపాపాని కర్మాణి యాని కేవలసాహసాత్ ।
ఆరభ్యంతే భీమసేన వ్యథంతే తాని భారత ॥ 6
భరతనందనా! భీమసేనా! కేవలం సాహసం వల్ల మహాపాపకర్మలు ప్రారంభిస్తే, అవి మనలను బాధపెడతాయి. (6)
సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే ।
సిధ్యంత్యర్థా మహాబాహో దైవం చాత్ర ప్రదక్షిణమ్ ॥ 7
మహాబాహూ! మంచిసలహా తీసికొని, బాగా ఆలోచించి, చక్కగా పూర్ణపరాక్రమం ప్రకటిస్తే దానివల్ల కోరుకొన్న లక్ష్యాలు సిద్ధిస్తాయి. అటువంటి పనిలో దైవం కూడా అనుకూలంగా ఉంటుంది. (7)
యత్ తు కేవలచాపల్యాద్ బలదర్పోత్థితః స్వయమ్ ।
ఆరబ్ధవ్యమిదం కార్యం మన్యసే శృణు తత్ర మే ॥ 8
కేవలం చాపల్యం వల్ల స్వయంగా బలగర్వంచేత ఉద్ధతుడవై ఇపుడు యుద్ధమనే కార్యం ప్రారంభించాలని భావిస్తున్నావు. ఈ విషయంలో నా మాట విను. (8)
భూరిశ్రవాః శలశ్చైవ జలసంధశ్చ వీర్యవాన్ ।
భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ ద్రోణపుత్రశ్చ వీర్యవాన్ ॥ 9
ధార్తరాష్ట్రా దురాధర్షాః దుర్యోధనపురోగమాః ।
సర్వ ఏవ కృతాస్త్రాశ్చ సతతం చాతతాయినః ॥ 10
రాజానః పార్థివాశ్చైవ యేఽస్మాభిరుపతాపితాః ।
సంశ్రితాః కౌరవం పక్షం జాతస్నేహాశ్చ తం ప్రతి ॥ 11
భూరిశ్రవుడు, శలుడు, పరాక్రమవంతుడైన జలసంధుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పరాక్రమవంతుడైన ద్రోణపుత్రుడు, ఎదిరింపశక్యంగాని ధృతరాష్ట్రుని కుమారులైన దుర్యోధనాదులు - వీరంతా అస్త్రవిద్యాకోవిదులు. మనచే అణాచివేయబడిన, దుష్టులైన రాజులందరు ఇపుడు కౌరవపక్షాన్ని ఆశ్రయించి, వారితో మంచి స్నేహాన్ని కలిగి ఉన్నారు. (9-11)
దుర్యోధనహితే యుక్తాః న తతాస్మాసు భారత ।
పూర్ణకోశా బలోపేతాః ప్రయతిష్యంతి సంగరే ॥ 12
వారంతా దుర్యోధనుని హితానికి కట్టుబడి ఉన్నారు. మనపట్ల వారికి సద్భావం ఉండదు. వారు ధనాగారాలు నిండి, సైనికబలంతో శక్తిసంపన్నులుగా ఉన్నారు. వారంతా యుద్ధంలో మనకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తారు. (12)
సర్వే కౌరవసైన్యస్య సపుత్రామాత్యసైనికాః ।
సంవిభక్తా హి మాత్రాభిః భోగైర్రపి చ సర్వశః ॥ 13
కౌరవసైన్యంలోని అమాత్యులకు, సైనికులకు, వారి వారి పుత్రులకు సంపూర్ణవేతనాలను, అన్నివిధాలైన భోగసామగ్రిని దుర్యోధనుడు వితరణ చేశాడు. (13)
దుర్యోధనేన తే వీరాః మానితాశ్చ విశేషతః ।
ప్రాణాంస్త్యక్ష్యంతి సంగ్రామే ఇతి మే నిశ్చితా మతిః ॥ 14
దుర్యోధనుడు సైన్యంలోని వీరులందరిని విశేషంగా గౌరవించాడు. వారు దుర్యోధనుడి కోసం యుద్ధంలో ప్రాణాలు కూడా విడుస్తారు అని నా నిశ్చితాభిప్రాయం. (14)
సమా యద్యపి భీష్మస్య వృత్తిరస్మాసు తేషు చ ।
ద్రోణస్య చ మహాబాహో కృపస్య చ్ మహాత్మనః ॥ 15
అవశ్యం రాజపిండస్తైః నిర్వేశ్య ఇతి మే మతిః ।
తస్మాత్ త్యక్ష్యంతి సంగ్రామే ప్రాణానపి సుదుస్త్యజాన్ ॥ 16
మహాబాహూ! భీష్మ, ద్రోణ, కృపులకు వారి పట్ల, మన పట్ల సమానమైన ప్రీతి ఉంది. కాని దుర్యోధనుడి అన్నం తింటున్నారు. అందువల్ల వారు యుద్ధంలో దుర్యోధనుడి కోసం విడువశక్యంగాని ప్రాణాలనైనా వదిలిపెడతారు. (15,16)
సర్వే దివ్యాస్త్రవిద్వాంసః సర్వే ధర్మపరాయణాః ।
అజేయాశ్చేతి మే బుద్ధిః అపి దేవైః సవాసవైః ॥ 17
వారంతా దివ్యాస్త్రవిద్వాంసులు. ధర్మపరాయనులు. వారిని ఇంద్రాదిదేవతలు కూడ జయించలేరు అని నా అభిప్రాయం. (17)
అమర్షీ నిత్యసంరబ్ధః తత్ర కర్ణో మహారథః ।
సర్వాస్త్రవిదనాధృష్యః హ్యభేద్యకవచావృతః ॥ 18
కౌర్వపక్షంలో ఉన్న కర్ణుడు మహారథుడు. అసహనశీలి. నిత్యం క్రోధంతో ఉండేవాడు. అన్ని అస్త్రాలు తెలిసినవాడు. ఎదిరింప శక్యంగాని వాడు. అభేద్యమైన కవచం చేత సురక్షితుడు కూడా. (18)
అనిర్జిత్య రణే సర్వాన్ ఏతాన్ పురుషసత్తమాన్ ।
అశక్యో హ్యాసహాయేన హంతుం దుర్యోధస్త్వయా ॥ 19
యుద్ధంలో పురుషశ్రేష్ఠులైన వీరినందరినీ జయించకుండా నిస్సహాయుడవైన నీవు దుర్యోధనుని చంపలేవు. (19)
న నిద్రామధిగచ్ఛామి చింతయానో వృకోదర ।
అతిసర్వాన్ ధనుర్గ్రాహాన్ సూతపుత్రస్య లాఘవమ్ ॥ 20
వృకోదరా! ధనర్ధారులందరినీ మించిన కర్ణుడు బాణం వేయడంలోని లాఘవాన్ని తలచుకొంటూంటే నాకు నిద్రపట్టడం ళేదు. (20)
వైశంపాయన ఉవాచ
ఏతద్ వచనమాజ్ఞాయ భీమసేనోఽత్యమర్షణః ।
బభూవ విమనాస్త్రస్తః న చైవోవాచ కించన ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! యుధిష్ఠిరుడు చెప్పిన మాటల అభిప్రాయం తెలిసి, అసహనశీలుడైన భీమసేనుడు ఉద్వేగం పొంది, విమనస్కుడై ఏమీ మాట్లాడలేకపోయాడు. (21)
తయోః సంవదతోరేవం తదా పాండవయోర్ధ్వయోః ।
ఆజగామ మహాయోగీ వ్యాసః సత్యవతీసుతః ॥ 22
పాండుపుత్రులు ఈవిధంగా మాట్లాడుకొంటూండగా, సత్యవతీసుతుడు, మహాయోగి అయిన వ్యాసుడు అక్కడకు వచ్చాడు. (22)
సోఽభిగమ్య యథాన్యాయం పాండవైః ప్రతిపూజితః ।
యుధిష్ఠిరమిదం వాక్యమ్ ఉవాచ వదతాం వరః ॥ 23
అలా వచ్చిన వ్యాసుని పాండవులు యథోచితంగా పూజించారు. పిదప ఔపదేశికులలో శ్రేష్ఠుడైన వ్యాసుడు యుధిష్ఠిరునితో ఇలా చెప్పాడు. (23)
వ్యాస ఉవాచ
యుధిష్ఠిర మహాబాహో వేద్మి తే హృదయస్థితమ్ ।
మనీషయా తతః క్షిప్రమ్ ఆగతోఽస్మి నరర్షభ ॥ 24
వ్యాసుడిలా అన్నాడు - మహాబాహూ! నరశ్రేష్ఠా! యుధిష్ఠిరా! నాబుద్ధితో నీహృదయంలోని భావాన్ని తెలుసుకొన్నాను. అందువల్ల వేగంగా వచ్చాను. (24)
భీష్మాద్ ద్రోణాత్ కృపాత్ కర్ణాద్ ద్రోణపుత్రాశ్చ భారత ।
దుర్యోధనాన్నృపసుతాత్ తథా దుఃశాసనాదపి ॥ 25
యత్ తే భయమమిత్రఘ్న హృది సంపరివర్తతే ।
తత్ తేఽహం నాశయిష్యామి విధిదృష్ణేన కర్మణా ॥ 26
భరతనందనా! శత్రుఘ్నా! భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, ద్రోణపుత్ర(అశ్వత్థామ), దుర్యోధన, దుఃశాసనుల వల్ల నీ హృదయంలో కలిగిన భయాన్ని శాస్త్రీయమైన ఉపాయంతో పోగొట్టుతాను. (26)
తచ్ఛ్రుత్వా ధృతిమాస్థాయ కర్మణా ప్రతిపాదయ ।
ప్రతిపాద్య తు రాజేంద్ర తతః క్షిప్రం జ్వరం జహి ॥ 27
రాజేంద్రా! ఆ ఉపాయాన్ని విని, ధైర్యం వహించి, ప్రయత్నంతో అనుష్ఠించు. అలా అనుష్ఠించిన తర్వాత శీఘ్రంగా నీ మానసిక చింతను విడిచిపెట్టు. (27)
తత ఏకాంతమున్నీయ పారాశర్యో యుధిష్ఠిరమ్ ।
అబ్రవీదుపపన్నార్థమ్ ఇదం వాక్యవిశారదః ॥ 28
ఆ తరువాత వాక్యవిశారదుడు, పరాశరనందనుడు అయిన వ్యాసుడు యుధిష్ఠిరుని ఏకాంతానికి తీసుకువెళ్ళి యుక్తియుక్తంగా ఇలా చెప్పాడు. (28)
శ్రేయసస్తే పరః కాలః ప్రాప్తో భరతసత్తమ ।
యేనాభిభవితా శత్రూన్ రణే పార్థో ధనుర్ధరః ॥ 29
భరతశ్రేష్ఠా! నీకు అభివృద్ధి కలిగే శ్రేష్ఠమైన సమయం వచ్చింది. ధనుర్ధరుడైన అర్జునుడు రణరంగంలో శత్రువులను పరాజితులను చేస్తాడు. (29)
గృహాణేమాం మయా ప్రోక్తాం సిద్ధిం మూర్తిమతీమివ ।
విద్యాం ప్రతిస్మృతిం నామ ప్రపన్నాయ బ్రవీమి తే ॥ 30
మూర్తీభవించిన సిద్ధివంటి, ప్రతిస్మృతి అనే విద్యను నేను చెపుతున్నాను. తీసుకో, నన్ను ఆశ్రయించిన వాడవుగాన, నీ కీవిద్యను చెపుతున్నాను. (30)
యామవాప్య మహాబాహుః అర్జునః సాధయిష్యతి ।
అస్త్రహేతోర్మహేంద్రం చ రుద్రం చైవాభిగచ్ఛతు ॥ 31
వరుణం చ కుబేరం చ ధర్మరాజం చ పాండవ ।
శక్తో హ్యేష సురాన్ ద్రష్టుం తపసా విక్రమేణ చ ॥ 32
ఆ విద్యను పొంది అర్జునుడు నీ కార్యాన్ని సాధిస్తాడు. దాని ద్వారా అర్జునుడు దివ్యాస్త్రాల కోసం మహేంద్రుని, రుద్రుని, వరుణుని, కుబేరుని, (యమ) ధర్మరాజును కూడ సమీపించవచ్చు. అతడు తన తపస్సుచేత, పరాక్రమం చేత దేవతలను ప్రత్యక్షంగా చూడగలను. (31,32)
ఋషిరేష మహాతేజాః నారాయణసహాయవాన్ ।
పురాణః శాశ్వతో దేవః త్వజేయో జిష్ణురచ్యుతః ॥ 33
అస్త్రాణీంద్రాచ్చ రుద్రాచ్చ లోకపాలేభ్య ఏవ చ ।
సమాదాయ మహాబాహుః మహత్ కర్మ కరిష్యతి ॥ 34
ఈ అర్జునుడు పురాతనుడు, మహాతేజస్వి అయిన నరుడనే మహర్షి. ఇతనికి శాశ్వతుడు, అజేయుడు, జయశీలుడు అచ్యుతుడు అయిన నారాయణుడు సహాయుడు. మహాబాహువైన అర్జునుడు ఇంద్ర, రుద్ర, లోకపాలురనుండి అస్త్రాలను తీసికొని, మహాకార్యాన్ని నిర్వహిస్తాడు. (33,34)
వనాదస్మాచ్చ కౌంతేయ వనమన్యద్ విచింత్యతామ్ ।
నివాసార్థాయ యద్ యుక్తం భవేద్ వః పృథివీపతే ॥ 35
పృథివీపతీ! కుంతీనందనా! ఈ వనం విడిచి నివాసయోగ్యమైన మరొక వనాన్ని గురించి ఆలోచించండి. అది మీకు యోగ్యమైనదవుతుంది. (35)
ఏకత్ర చిరవాసో హి న ప్రీతిజననో భవేత్ ।
తాపసానాం చ సర్వేషాం భవేదుద్వేగకారకః ॥ 36
ఒకేచోట ఎక్కువకాలం ఉండడం ప్రీతిజనకంగా ఉండదు. ఇక్కడుండే తాపనులందరికి ఉద్వేగకారకంగా కూడా ఉంటుంది. (36)
మృగాణాముపయోగశ్చ వీరుదోషధిసంక్షయః ।
బిభర్షి చ బహూన్ విప్రాన్ వేదవేదాంగపారగాన్ ॥ 37
ఇక్కడున్న అనేక మృగాలను ఉపయోగించడం జరిగింది. వేదవేదాంగపారంగతులైన బ్రాహ్మణులను చాలామందిని పోషిస్తున్నావు. అందువల్ల ఇక్కడున్న లతలకు, ఓషధులకు కొరత ఏర్పడుతుంది. (37)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా ప్రపన్నాయ శుచయే భగవాన్ ప్రభుః ।
ప్రోవాచ లోకతత్త్వజ్ఞః యోగీ విద్యామనుత్తమామ్ ॥ 38
ధర్మరాజాయ ధీమాన్ సః వ్యాసః సత్యవతీసుతః ।
అనుజ్ఞాయ చ కౌంతేయం తత్రైవాంతరధీయత ॥ 39
వైశంపాయనుడిలా అన్నాడు - ఈ విధంగా చెప్పి, భగవంతుడు, సమర్థుడు, లోకతత్త్వజ్ఞుడు, యోగి, ధీమంతుడు, సత్యవతీసుతుడు అయిన వ్యాసుడు తన్ను ఆశ్రయించిన యుధిష్ఠిరునకు శ్రేష్ఠమైన ఆ విద్య నుపదేశించి, అక్కడే అంతర్ధానమయ్యాడు. (38,39)
యుధిష్ఠిరస్తు ధర్మాత్మా తద్ బ్రహ్మ మనసా యతః ।
ధారయామాస మేధావీ కాలే కాలే సదాభ్యసన్ ॥ 40
ధర్మాత్ముడు, సంయతచిత్తుడు, మేధావి అయిన యుధిష్ఠిరుడు, ఆ వేదమంత్రాన్ని మనస్సుచే ధారణచేసి, ఆయా సమయాలలో దాన్ని చక్కగా అభ్యాసం చేయసాగాడు. (40)
స వ్యాసవాక్యముదితః వనాద్ ద్వైతవనాత్ తతః ।
యయౌ సరస్వతీకూలే కామ్యకం నామ కాననమ్ ॥ 41
అటు తరువాత వ్యాసుని మాటననుసరించి ధర్మరాజు తనవారందరితో ద్వైతవనాన్ని విడిచి సరస్వతీ నది ఒడ్డున ఉన్న కామ్యకవనానికి వెళ్ళాడు. (41)
తమన్వయుర్మహారాజ శిక్షాక్షరవిశరదాః ।
బ్రాహ్మణాస్తపసా యుక్తాః దేవేంద్రమృషయో యథా ॥ 42
మహారాజా! దేవేంద్రుని ఋషులందరూ అనుసరించినట్లు, ఆ ధర్మరాజును శిక్షాక్షరవిశారదులు, తపస్వులు అయిన బ్రాహ్మణులు అనుసరించారు. (42)
తతః కామ్యకమాసాద్య పునస్తే భరతర్షభ ।
న్యవిశంత మహాత్మానః సామాత్యాః సపరిచ్ఛదాః ॥ 43
భరతశ్రేష్ఠా! వారు ఆ ద్వైతవనం నుండి కామ్యకవనానికి చేరి అమాత్య పరిజనులతో కూడి అక్కడ నివసింపసాగారు. (43)
తత్ర తే న్యవసన్ రాజన్ కించిత్ కాలం మనస్వినః ।
ధనుర్వేదపరా వీరాః శృణ్వంతో వేదముత్తమమ్ ॥ 44
రాజా! అక్కడవారు కొంచెం కాలం నివసించారు. ధనుర్వేదాభ్యాసాల్లో తత్పరులు, వీరులు, మనస్వులు అయిన పాండవులు ఉత్తమమైన వేదాన్ని వింటూ కొంతకాలం అక్కడున్నారు. (44)
చరంతో మృగయాం నిత్యం శుద్ధైర్బాణైర్బగార్థినః ।
పితృదైవతవిప్రేభ్యః నిర్వపంతో యథావిధి ॥ 45
నిత్యం వేటకు వెళుతూ, శుద్ధమైన బాణాలతో మృగాలను వేటాడుతూ, పితృ, దైవత, విప్రులకు యథావిధిగా శ్రాద్ధకర్మలు ఆచరించారు. (45)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి కామ్యకవనగమనే షట్ర్తింశోఽధ్యాయః ॥ 36 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున కామ్యకవనగమనమను ముప్పది ఆరవ అధ్యాయము. (36)