33. ముప్పది మూడవ అధ్యాయము
భీమసేనుడు పురుషార్థమును ప్రశంసించుట, యుధిష్ఠిరుని యుద్ధము చేయుమని ప్రార్థించుట.
వైశంపాయన ఉవాచ
యాజ్ఞసేన్యా వచః శ్రుత్వా భీమసేనో హ్యమర్షణః ।
నిఃశ్వసన్నుపసంగమ్య క్రుద్ధో రాజానమబ్రవీత్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ద్రౌపది మాటలను విని అసహనంతో క్రుద్ధుడై, భీముడు నిట్టూర్పులు విడుస్తూ యుధిష్ఠిరుని సమీపించి ఇలా అన్నాడు. (1)
రాజ్యస్య పదవీం ధర్మ్యాం వ్రజ సత్పురుషోచితామ్ ।
ధర్మకామార్థహీనానాం కిం నో వస్తుం తపోవనే ॥ 2
మహారాజా! సత్పురుషోచితమై, స్వధర్మానికి అనుకూలమైన రాజ్యం పొందే మార్గాన్ని చూడు. ధర్మార్థకామాలను విడిచిపెట్టిన మనం ఈ తపోవనంలో ఉండడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? (2)
నైవ ధర్మేణ తద్ రాజ్యం నార్జవేన న చౌజసా ।
అక్షకూటమధిష్ఠాయ హృతం దుర్యోధనేన వై ॥ 3
దుర్యోధనుడు ధర్మంచేతకాని, ఋజువర్తనం చేతగాని, పరాక్రమంచేతగాని రాజ్యాన్ని పొందలేదు. కేవలం కపటంతో కూడిన జూదంతో రాజ్యాన్ని అపహరించాడు. (3)
గోమాయునేవ సింహానాం దుర్బలేన బలీయసామ్ ।
ఆమిషం విఘసాశేన తద్వద్ రాజ్యం హి నో హృతమ్ ॥ 4
బలవంతమయిన సింహాల యొక్క ఆహారాన్ని దుర్బలమైన గోమాయువు అపహరించినట్లుగా ఇప్పుడు దుర్యోధనుడు మనరాజ్యాన్ని హరించాడు. (4)
ధర్మలేశాప్రతిచ్ఛన్నః ప్రభవం ధర్మకామయోః ।
అర్థముత్సృజ్య కిం రాజన్ దుఃఖేషు పరితప్యసే ॥ 5
రాజా! ధర్మకామాల వల్ల పుట్టిన (అర్థాన్ని) రాజ్యాన్ని విడిచి పెట్టి, స్వల్పమైన ధర్మాన్ని కప్పుకొని దుఃఖాలలో పరితపిస్తున్నావెందుకు? (5)
భవతోఽనవధానేన రాజ్యం నః పశ్యతాం హృతమ్ ।
అహార్యమపి శక్రేణ గుప్తం గాండీవధన్వనా ॥ 6
గాంఢీవం ధరించిన అర్జునుడు రక్షిస్తున్న మనరాజ్యాన్ని ఇంద్రుడు కూడా హరింపలేడు. కాని నీవు అప్రమత్తంగా లేకపోవడం చేత మనం చూస్తూండగానే మనరాజ్యాన్ని దుర్యోధనుడు అపహరించాడు. (6)
కుణీనామివ బిల్వాని పంగూనామివ ధేనవః ।
హృతమైశ్వరమస్మాకం జీవతాం భవతః కృతే ॥ 7
ఈచుకుపోయిన చేతులున్న వారి నుండి మారేడుపళ్ళలను, కుంటివారి నుండి ఆవులను అపహరించినట్లుగా మనం జీవిస్తూండగానే, నీకారణంగా మనరాజ్యం అపహరింపబడింది. (7)
భవతః ప్రియమిత్యేవ మహద్ వ్యసనమీదృశమ్ ।
ధర్మకామే ప్రతీతస్య ప్రతిపన్నాః స్మ భారత ॥ 8
భారతా! నీవు ధర్మాన్ని కోరుకొనేవాడవు. నీకు అట్టి ప్రసిద్ధి కూడా ఉంది. నీ ఇష్టం తీరటం కోసం మేమంతా ఇటువంటి మహాకష్టాన్ని అనుభవిస్తున్నాం. (8)
కర్శయామః స్వమిత్రాణి నందయామశ్చ శాత్రవాన్ ।
ఆత్మానం భవతాం శాస్త్రైః నియమ్య భరతర్షభ ॥ 9
భరతశ్రేష్ఠా! నీ శాసనం చేత మమ్మల్ని మేము అదుపులో ఉంచుకొని, మన మిత్రులను బాధపెడుతున్నాం. శత్రువులను సంతోషపెడుతున్నాం. (9)
యద్ వయం న తదైవైతాన్ ధార్తరాష్ట్రాన్ నిహన్మహి ।
భవతః శాస్త్రమాదాయ తన్నస్తపతి దుష్కృతమ్ ॥ 10
నీ శాసనాన్ని గౌరవించి అపుడే మేము ధృతరాష్ట్రపుత్రులను చంపకుండా ఊరుకొన్నాం. ఆ దోషం ఇప్పటికీ మమ్ములను దహిస్తూనే ఉంది. (10)
అథైనామన్వవేక్షస్వ మృగచర్యామివాత్మనః ।
దుర్బలాచరితాం రాజన్ న బలస్థైర్నిషేవితామ్ ॥ 11
రాజా! బలహీనులు చేసే నీ ఈ వనవాసమే చూడు. మృగాల్లా ఈ వనంలో ఉంటున్నాం. బలవంతులెవరూ ఇలా వనవాసం చెయ్యరు. (11)
యాం న కృష్ణో న బీభత్సుః నాభిమన్యుర్న సృంజయాః ।
న చాహమభినందామి న చ మాద్రీసుతావుభౌ ॥ 12
శ్రీకృష్ణుడుకాని, అర్జునాభిమన్యులుకాని, సృంజయవంశ వీరులుకాని, నేనుకాని, నకులసహదేవులుకాని ఈ వనవాసాన్ని అంగీకరించడం లేదు. (12)
భవాన్ ధర్మో ధర్మ ఇతి సతతం వ్రతకర్శితః ।
కచ్చిద్ రాజన్ న నిర్వేదాద్ ఆపన్నః క్లీబజీవికామ్ ॥ 13
రాజా! నీవెప్పుడూ ధర్మం, ధర్మం అంటూ నియమాన్ని పాలిస్తూ ఇలా కృశిస్తున్నావు. నీవు నిర్వేదంతో సాహసం లేకుండా నపుంసకునిలా జీవితాన్ని గడపటం లేదుకదా! (13)
దుర్మనుష్యా హి నిర్వేదమ్ అఫలం స్వార్థఘాతకమ్ ।
అశక్తాః శ్రియమహర్తుమ్ ఆత్మనః కుర్వతే ప్రియమ్ ॥ 14
తన రాజ్యసంపదను తిరిగి పొందడానికి అశక్తులు, దుర్బలులు అయిన మనుష్యులు స్వార్థవినాశకమైన, నిష్ఫలమైన వైరాగ్యాన్ని తమకిష్టమైందిగా భావిస్తారు. (14)
స భవాన్ దృష్టిమాన్ శక్తః పశ్యన్నస్మాసు పౌరుషమ్ ।
ఆనృశంస్యపరో రాజన్ నానర్థమవబుధ్యసే ॥ 15
రాజా! నీవు సమర్థుడవు. దూరదృష్టికలవాడవు. మాయందు పౌరుషాన్ని చూసి కూడ, నీవు దయాపరుడవై వచ్చే అనర్థాన్ని తెలిసికోలేకపోతున్నావు. (15)
అస్మానమీ ధార్తరాష్ట్రాః క్షమమాణానలం సతః ।
అశక్తానివ మన్యంతే తద్ దుఃఖం నాహవే వధః ॥ 16
సహనశీలులమై సజ్జనులమైన మనలను ఆ ధృతరాష్ట్రపుత్రులు దుర్యోధనాదులు అసమర్థులుగా భావిస్తున్నారు. ఇది మాకు చాలా దుఃఖంగా ఉంది. యుద్ధంలో మరణం కూడా అంతటి దుఃఖం కలిగించదు. (16)
తత్ర చేద్ యుధ్యమానానామ్ అజిహ్మమనివర్తినామ్ ।
సర్వశో హి వధః శ్రేయాన్ ప్రేత్య లోకాన్ లభేమహి ॥ 17
యుద్ధంలో వెన్ను చూపకుండా నిష్కపటంగా యుద్ధం చేసేవారికి మరణించడమే అన్నివిధాలా మేలు. యుద్ధంలో మరణిస్తే ఉత్తమలోకాలు లభిస్తాయి. (17)
అథవా వయమేవైతాన్ నిహత్య భరతర్షభ ।
ఆదదీమహి గాం సర్వాం తథాపి శ్రేయ ఏవ నః ॥ 18
భరతశ్రేష్ఠా! లేదా మనమే శత్రువులను చంపి సమస్త భూమండలాన్ని పొందితే అదీ మనకు శ్రేయస్సే. (18)
సర్వథా కార్యమేతన్నః స్వధర్మమనుతిష్ఠతామ్ ।
కాంక్షతాం విపులాం కీర్తిం వైరం ప్రతిచికీర్షతామ్ ॥ 19
అన్నివిధాలా క్షత్రియ ధర్మమైన యుద్ధాన్ని అనుష్ఠించు. తద్ద్వారా విపులమైన కీర్తిని కాంక్షించు. మనం యుద్ధం చెయ్యడమే అన్నివిధాలా ఉచితమైంది. (19)
ఆత్మార్థం యుధ్యమానానాం విదితే కృత్యలక్షణే ।
అన్యైరపి హృతే రాజ్యే ప్రశంసైవ న గర్హణా ॥ 20
కర్తవ్యాన్ని గుర్తించి శత్రువు లపహరించిన రాజ్యం విషయంలో స్వలాభంకోసం యుద్ధం చేస్తే, లోకం ప్రశంసిస్తుందే కాని నిందించదు. (20)
కర్శనార్థో హి యో ధర్మః మిత్రాణా మాత్మనస్తథా ।
వ్యసనం నామ తద్ రాజన్ న ధర్మః స కుధర్మ తత్ ॥ 21
మహారాజా! మిత్రులకు, తనకు క్లేశాన్ని కల్గించే ధర్మం - అది వ్యసనమవుతుందేకాని, ధర్మం కాదు. కుధర్మం అవుతుంది. (21)
సర్వథా ధర్మనిత్యం తు పురుషం ధర్మదుర్బలమ్ ।
త్యజతస్తాత ధర్మార్థౌ ప్రేతం దుఃఖసుఖే యథా ॥ 22
మరణించినవాడికి సుఖదుఃఖాలు లేనట్లే, ఎల్లప్పుడు, అన్ని అవస్థలలోను ధర్మమందే తాత్పర్యంతో ఉండి దుర్బలుడైన వాడిని ధర్మార్థాలు రెండూ విడిచిపెడతాయి. (22)
యస్య ధర్మో హి ధర్మార్థః క్లేశభాక్ న స పండితః ।
న స ధర్మస్య వేదార్థం సూర్యస్యాంధః ప్రభామివ ॥ 23
కేవలం ధర్మం కోసమే ధర్మాన్ని అనుసరిస్తూ కష్టాలు పడేవాడు బుద్ధిమంతుడు కాదు. అంధుడు నిజంగా ధర్మం యొక్క అర్థాన్ని తెలియజాలడు. (23)
యస్య చార్థార్థమేవార్థఆః స చ నార్థస్య కోవిదః ।
రక్షేత భృతకోఽరణ్యే యథా గాస్తాదృగేవ సః ॥ 24
ఎవడి ధనం కేవలం ధనం కోసమే అవుతుండో, దానాదుల కొరకు కాదో, అతడు నిజంగా ధనం యొక్క తత్త్వాన్ని తెలిసినవాడు కాదు. సేవకుడు ఇతరుల కోసం అరణ్యంలో గోవులను సంరక్షించినట్లుగా, అతడు ఇతరులకోసం ధనాన్ని రక్షించేవాడౌతాడు. (24)
అతివేలం హి యోఽర్థార్థీ నేతరావనుతిష్ఠతి ।
స వధ్యః సర్వభూతానాం బ్రహ్మహేవ జుగుప్సితః ॥ 25
హద్దుమీరి కేవలం ధనాన్నే సంపాదిస్తూ, ధర్మకామాలను అనుష్ఠింపనివాడు బ్రహ్మహత్య చేసినవానివలే గర్హింప దగినవాడు. అతడు ప్రాణులన్నింటికి వధ్యుడౌతాడు. (25)
సతతం యశ్చ కామార్థీ నేతరావనుతిష్ఠతి ।
మిత్రాణి తస్య నశ్యంతి ధర్మార్థాభ్యాం చ హీయతే ॥ 26
ఎల్లపుడు కామార్థియై సంచరిస్తూ, ధర్మార్థాలను అనుష్ఠించనివాడు తనమిత్రులను కోల్పోతాడు. ధర్మార్థాలకు దూరమౌతాడు. (26)
తస్య ధర్మార్థహీనస్య కామాంతే నిధనం ధ్రువమ్ ।
కామతో రమమాణస్య మీనస్యేవాంభసః క్షయే ॥ 27
ధర్మార్థహీనుడు కామోపభోగాల తర్వాత చివరకు నీటిలోని చేప నీరు ఎండిపోతే మరణించినట్లుగా, మృత్యువును పొందుతాడు. ఇది నిశ్చయం. (27)
తస్మాద్ ధర్మార్థయోర్నత్యం న ప్రమాద్యంతి పండితాః ।
ప్రకృతిః సా హి కామస్య పావకస్యారణిర్యథా ॥ 28
అందువల్ల, ధర్మార్థాల విషయంలో పండితులు పొరపాటుపడరు. అరణి అగ్నికి ఉత్పత్తి స్థానమైనట్లుగా, ధర్మార్థాలు కామానికి ఉత్పత్తి స్థానం. (28)
సర్వతా ధర్మమూలోఽర్థః ధర్మశ్చార్థపరిగ్రహః ।
ఇతరేతరయోర్నీతౌ విద్ధి మేఘోదధీ యథా ॥ 29
అన్నివిధాలా అర్థం ధర్మమూలం. ధర్మం అర్థమూలం. మేఘం-సముద్రం పరస్పరాశ్రయాలైనట్లే ధర్మార్థాలు పరస్పరాశ్రయాలు అని గ్రహించు. (29)
ద్రవ్యార్థస్పర్శసంయోగే యా ప్రీతిరుపజాయతే ।
స కామశ్చిత్తసంకల్పః శరీరం నాస్య దృశ్యతే ॥ 30
పూలమాల, చందనాది ద్రవ్యాల స్పర్శచేత, సువర్ణాది ధనస్పర్శచేత ప్రీతి కలుగుతుంది. దాని గురించి మనస్సులో ఏర్పడిన సంకల్పాన్నే కామమంటారు. దానికి రూపం ఉమ్డదు. (30)
అర్థార్థీ పురుషో రాజన్ బృహంతం ధర్మమిచ్ఛతి ।
అర్థమిచ్ఛతి కామార్థీ న కామాదన్యమిచ్ఛతి ॥ 31
రాజా! ధనాన్ని కోరుకొనే పురుషుడు గొప్పధర్మాన్ని కోరుకొంటాడు. కామాన్ని కోరుకొనేవాడు ధనాన్ని కోరుకొంటాడు. కామం వల్ల మరొకటేదీ కోరుకోడు. (31)
న హి కామేన కామోఽన్యః సాధ్యతే ఫలమేవ తత్ ।
ఉపయోగాత్ ఫలస్యైన కాష్ఠాద్ భస్మేవ పండితైః ॥ 32
కామం చేత మరొకకామం ఏదీ సాధింపబడదు. ఉపభోగమే దాని ఫలం. కర్ర భస్మమయ్యాక భస్మం నుండి వేరొక పదార్థం తయారుకానట్లే కామోపభోగం వల్ల వేరొక కామం సాధింపబడదు అని పండితులు చెపుతారు. (32)
ఇమాన్ శకునకాన్ రాజన్ హంతి వైతంసికో యథా ।
ఏతద్ రూపమధర్మస్య భూతేషు హి విహింసతా ॥ 33
కామాల్లోభాచ్చ ధర్మస్య ప్రకృతిం యో న పశ్యతి ।
స వధ్యః సర్వభూతానాం ప్రేత్య చేహ చ దుర్మతిః ॥ 34
రాజా! వ్యాధుడు పక్షులను చంపుతాడు. ఈ ప్రత్యేకమైన హింస అధర్మం యొక్క స్వరూపం. ప్రాణుల పట్ల అహింస కలిగి ఉండడం ధర్మం. కామం వల్ల, లోభం వల్ల ధర్మం యొక్క స్వభావాన్ని తెలియజాలడు. అట్టి బుద్ధిహీనుడు ఇహపరలోకాలలో ప్రాణులన్నింటికి చంపదగినవాడు. (33,34)
వ్యక్తం తే విదితే రాజన్ అర్థో ద్రవ్యపరిగ్రహః ।
ప్రకృతిం చాపి వేత్థాస్య వికృతిం చాపి భూయసీమ్ ॥ 35
రాజా! ఈ విషయం నీకు బాగా తెలుసు - ధనం చేతనే భోగ్యవస్తువులను సమకూర్చుకోగలం. ధనానికి కారణమైన దాన్ని నీవెరుగుదువు. ధనం వల్ల పొందే కార్యసిద్ధిని గురించి కూడా నీవెరుగుదువు. (35)
తస్య నాశే వినాశే వా జరయా మరణేన వా ।
అనర్థ ఇతి మన్యంతే సోఽయమస్మాసు వర్తతే ॥ 36
ధనం లేకపోయినా, ఉన్నధనాన్ని కోల్పోయినా, స్త్రీ మున్నగు ధనం జరామరణాలచే నశించినా, అట్టి మనుష్యుడి దశను అనర్థమని భావిస్తారు. ప్రస్తుతం ఆ స్థితి మనలో ఉన్నది. (36)
ఇంద్రియాణాం చ పంచానాం మనసో హృదయస్య చ ।
విషమే వర్తమానానాం యా ప్రీతిరుపజాయతే ॥ 37
స కామ ఇతి మే బుద్ధిః కర్మణాం ఫలముత్తమమ్ ।
ఐదు ఇంద్రియాలకు, మనోబుద్ధులు ఆయా విషయాల్లో ప్రవర్తించేటపుడు కలిగే ప్రీతినే కామమంటారని నా అభిప్రాయం. అది కర్మలకు ఉత్తమమైన ఫలం. (37 1/2)
ఏవమేవ పృథక్ దృష్ట్వా ధర్మార్థౌ కామమేవ చ ॥ 38
న ధర్మపర ఏవ స్యాద్ న చార్థపరమో నరః ।
న కామపరమో వా స్యాత్ సర్వాన్ సేవేత సర్వదా ॥ 39
ధర్మం పూర్వే ధనం మధ్యే జఘన్యే కామమాచరేత్ ।
అహన్యనుచరేదేవమ్ ఏష శాస్త్రకృతో విధిః ॥ 40
ఈ విధంగా ధర్మార్థకామాలను మూడింటిని వేరువేరుగా తెలిసికొని ఆచరించాలి. కేవలం ధర్మపరుడో, కేవలం అర్థపరుడో, కేవలం కామతత్పరుడో కారాదు. అన్నింటినీ ఎల్లపుడూ సేవించాలి. రోజులో ఉదయం ధర్మాన్ని, మధ్యాహ్నం అర్థాన్ని, చివరి భాగంలో కామాన్ని సేవించాలి. ఇది శాస్త్రాలు చెప్పిన విధానం. (38-40)
కామం పూర్వే ధనం మధ్యే జఘన్యే ధర్మమాచరేత్ ।
వయస్యనుచరేదేవమ్ ఏష శాస్త్రకృతో విధిః ॥ 41
వయోవస్థలలో పూర్వభాగంలో కామాన్ని, మధ్యభాగంలో ధనాన్ని, అంతిమభాగంలో ధర్మాన్ని సేవించాలి. ఇది శాస్త్రవిధానం. (41)
ధర్మం చార్థం చ కామం చ యథావద్ వదతాం వర ।
విభజ్య కాలే కాలజ్ఞః సర్వాన్ సేవేత పండితః ॥ 42
వక్తలలో శ్రేష్ఠుడా! సమయోచితజ్ఞానం కల పండితుడు ధర్మార్థకామాలను యథాయోగ్యంగా విభజించుకొని, అన్నింటినీ సేవించాలి. (42)
మోక్షో వా పరమం శ్రేయః ఏష రాజన్ సుఖార్థినామ్ ।
ప్రాప్తిర్వా బుద్ధిమాస్థాయ సోపాయాం కురునందన ॥ 43
తద్ వాఽఽశు క్రియతాం రాజన్ ప్రాప్తిర్వాప్యధిగమ్యతామ్ ।
జీవితం హ్యాతురస్యేవ దుఃఖమంతరవర్తినః ॥ 44
రాజా! నిరతిశయసుఖాన్ని కోరుకొనే వారికి మోక్షం మిక్కిలి శ్రేయస్కరం. కురునందనా! త్రివర్గప్రాప్తికి అయినచో ధర్మార్థకామాలను ఉపాయంతో కూడిన బుద్ధిని ఆశ్రయించి పొందాలి. అందువలన శీఘ్రంగా కార్యమాచరించి సిద్ధిని పొందు. ఈ రెండిటి మధ్యలో ఉన్నవాని జీవితం ఆతురునిజీవితం వలె దుఃఖమయమవుతుంది. (43,44)
విదితశ్చైవ మే ధర్మః సతతం చరితశ్చ తే ।
జానంతస్త్వయి శంసంతి సుహృదః కర్మచోదనామ్ ॥ 45
నీవెప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటావని నాకు తెలుసు. ఈ విషయం తెలిసి కూడ నీ స్నేహితులు నిన్ను పురుషార్థం కోసం ప్రేరేపిస్తారు. (45)
దానమ్ యజ్ఞాః సతాం పూజా వేదధారణమార్జవమ్ ।
ఏష ధర్మః పరో రాజన్ బలవాన్ ప్రేత్య చేహ చ ॥ 46
మహారాజా! ఇహపరలోకాలలో దానం, యజ్ఞం, సత్పురుషులను గౌరవించటం, వేదాధ్యయనం, ఋజువర్తనం - ఈ ధర్మం ఉత్తమమైనది, ప్రబలమైనది కూడ. (46)
ఏష నార్థవిహీనేన శక్యో రాజన్ నిషేవితుమ్ ।
అఖిలాః పురుషవ్యాఘ్ర గుణాః స్యుర్యద్యపీతరే ॥ 47
రాజా! ఈ ధర్మం ధనంలేనివానికి ఆచరణ సాధ్యం కాదు. పురుషవ్యాఘ్రా! ఇతరాలైన గుణాలన్నీ ఉన్నప్పటికీ ధనం లేకపోతే ధర్మాచరణం సాధ్యం కాదు. (47)
ధర్మమూలం జగద్ రాజన్ నాన్యద్ ధర్మాద్ విశిష్యతే ।
ధర్మశ్చార్థేన మహతా శక్యో రాజన్ నిషేవితుమ్ ॥ 48
రాజా! ఈజగత్తంతా ధర్మమూలక మైనదే. ధర్మం కంటె విశిష్టమైంది ఏదీ లేదు. మిక్కిలి ధనంతో ధర్మాచరణం చేయశక్యమవుతుంది. (48)
న చార్థో భైక్ష్యచర్యేన నాపి క్లైబ్యేన కర్హిచిత్ ।
వేత్తుం శక్యః సదా రాజన్ కేవలం ధర్మబుద్ధినా ॥ 49
రాజా! భిక్షాటన చేత, శారీరకశ్రమచేత, కేవలం ధర్మబుద్ధిచేత ధనసంపాదన ఎప్పుడూ సాధ్యం కాదు. (49)
ప్రతిషిద్ధా హి తే యాచ్నా యయా సిద్ధ్యతి వై ద్విజః ।
తేజసైవార్థలిప్సాయాం యతస్వ పురుషర్షభ ॥ 50
పురుషశ్రేష్ఠా! బ్రాహ్మణునికి యాచనచేత కార్యసిద్ధి జరుగుతుంది. కాని నీవంటి క్షత్రియునకు యాచన నిషిద్ధం. అందువలన పరాక్రమంతోనే అర్థాన్ని పొందడానికి ప్రయత్నించు. (50)
భైక్ష్యచర్యా న విహితా న చ విట్శూద్రజీవికా .
క్షత్రియస్య విశేషేణ ధర్మస్తు బలమౌరసమ్ ॥ 51
క్షత్రియునకు భిక్షావృత్తి శాస్త్రవిహితం కాదు. వైశ్యునివలె, శూద్రునివలె జీవించడమూ విహితం కాదు. క్షత్రియునకు ప్రత్యేకంగా బలం, ఉత్పాహం ధర్మంగా చెప్పబడింది. (51)
స్వధర్మం ప్రతిపద్యస్వ జహి శత్రూన్ సమాగతాన్ ।
ధార్తరాష్ట్రవనం ప్రార్థ మయా పార్థేన నాశయ ॥ 52
కుంతీనందనా! స్వధర్మాన్ని ఆశ్రయించు. నీమీదికి వచ్చిన శత్రువులను సంహరించు. నాద్వారా, అర్జునుని ద్వారా ధార్తరాష్ట్రవనాన్ని నాశనం చెయ్యి. (52)
ఉదారమేవ విద్వాంసః ధర్మం ప్రాహుర్మనీషిణః ।
ఉదారం ప్రతిపద్యస్వ నావరే స్థాతుమర్హసి ॥ 53
విద్వాంసులైన మహామనీషులు దానశీలాన్నీ ధర్మంగా చెప్పారు. అందువల్ల అట్టి దానశీలాన్నీ పొందు. నీవు ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉండడం తగదు. (53)
అనుబుధ్యస్వ రాజేంద్ర వేత్థ ధర్మాన్ సనాతనాన్ ।
క్రూరకర్మాభిజాతోఽసి యస్మాదుద్విజతే జనః ॥ 54
రాజేంద్రా! సనాతన ధర్మాలు నీవెరుగుదువు. నీవు కఠోరకర్మలు చేసే క్షత్రియకులంలో పుట్టావు. క్షత్రియజాతికి జనులంతా భయపడతారు. అందువల్ల నీవు నీ ఆభిజాత్యాన్ని, కర్తవ్యాన్ని గుర్తించు. (54)
ప్రజాపాలనసంభూతం ఫలం తవ న గర్హితమ్ ।
ఏష తే విహితో రాజన్ ధాత్రా ధర్మః సనాతనః ॥ 55
ప్రజాపాలనధర్మం వల్ల పొందిన ఫలం నీకు గర్హింప తగిందికాదు. ఇది ఈశ్వరునిచే నీకు విహితమైన సనాతన ధర్మం. (55)
తస్మాదపచితః పార్థ లోకే హాస్యం గమిష్యసి ।
స్వధర్మాద్ధి మనుష్యాణాం చలనం న ప్రశస్యతే ॥ 56
కుంతీనందనా! ఈ ధర్మం నుండి తప్పుకొనటం వల్ల లోకంలో అపహాస్యం పాలవుతావు. మానవులకు స్వధర్మాన్ని విడువడం ప్రశంసింపదగింది కాదు. (56)
స క్షాత్రం హృదయం కృత్వా త్యక్త్వేదం శిథిలం మనః ।
వీర్యమాస్థాయ కౌరవ్య ధురముద్వహ ధుర్యవత్ ॥ 57
కురునందనా! హృదయాన్ని క్షత్రియోచితమైన ఉత్సాహంతో కరిపి, ఈ శిథిలమైన మనస్సును విడిచిపెట్టు. పరాక్రమాన్ని ఆశ్రయించి, దురందరుడైన పురుషునిలా యుద్ధభారాన్ని వహించు. (57)
న హి కేవలధర్మాత్మా పృథివీం జాతు కశ్చన ।
పార్థివో వ్యజయద్ రాజన్ న భూతిం న పునః శ్రియమ్ ॥ 58
మహారాజా! కేవలం ధర్మాత్ముడైన పార్థివుడెవడూ కూడ ఈ పృథ్విని జయించలేదు. ఐశ్వర్యాన్ని కాని, రాజ్యలక్ష్మిని కాని పొందలేదు. (58)
జిహ్వాం దత్త్వా బహూనాం హి క్షుద్రాణాం లుబ్ధచేతసామ్ ।
నికృత్యా లభతే రాజ్యమ్ ఆహారమివ శల్యకః ॥ 59
వేటగాడు ఎరచూపి, ఆశపడే మృగాలను మోసంతో పట్టుకున్నట్లుగా, రాజు శత్రువుల పట్ల కూట నీతి ప్రయోగించి రాజ్యాన్ని పొందుతాడు. (59)
భ్రాతరః పూర్వజాతాశ్చ సుసమృద్ధాశ్చ సర్వశః ।
నికృత్యా నిర్జితా దేవైః అసురాః పార్థివర్షభ ॥ 60
నృపశ్రేష్ఠా! సోదరులు, తమకంటె పెద్దవారూ, బలైశ్వర్యాదులచే అన్ని విధాలా సమృద్ధులు అయిన అసురులను దేవతలు మోసగించి, జయించారు. (60)
ఏవం బలవతః సర్వమ్ ఇతి బుద్ధ్వా మహీపతే ।
జహి శత్రూన్ మహాబాహో పరాం నికృతిమాస్థితః ॥ 61
మహారాజా! మహాబాహూ! ఈ విధంగా అన్నింటిపై అధికారం బలవంతునిదే అని గ్రహించి, కూటనీతిని ఆశ్రయించి, శత్రువులను జయించు. (61)
న హ్యర్జునసమః కశ్చిద్ యుధి యోద్ధా ధనుర్ధరః ।
భవితా వా పుమాన్ కశ్చిత్ మత్సయో వా గదాధరః ॥ 62
అర్జునుడితో సమానమైన ధనుర్ధారి, యోధుడూ లేడు. ఉమ్డబోడు. నాతోసమానమైన గదాధారి లేడు, ఉండబోడు. (62)
సత్త్వేన కురుతే యుద్ధం రాజన్ సుబలవానపి ।
అప్రమాదీ మహోత్సాహీ సత్త్వస్థో భవ పాండవ ॥ 63
రాజా! పాండునందనా! ఎంతటి బలవంతుడైనాసరే ఆత్మబలంతోనే యుద్ధం చేస్తాడు. అప్రమత్తుడవు. ఉత్సాహవంతుడవు అయి ఆత్మబలాన్ని ఆశ్రయించు. (63)
సత్త్వం హి మూలమర్థస్య వితథం యదతోఽన్యథా ।
న తు ప్రసక్తం భవతి వృక్షచ్ఛాయేవ హైమనీ ॥ 64
ధనానికి మూలం ఆత్మబలమే. ఇంతకంటే వేరైనది వ్యర్థమైనదే. హేమంత ఋతువులోని చెట్టునీడవలె ఆత్మయొక్క దుర్బలత ఏపనిలోనూ పనికిరాదు. (64)
అర్థత్యాగోఽపి కార్యః స్యాద్ అర్థం శ్రేయోంసమిచ్ఛతా ।
బీజౌపమ్యేన కౌంతేయ మా తే భుదత్ర సంశయః ॥ 65
కుంతీకుమారా! ఎక్కువ ధాన్యరాశిని పొందగోరి రైతు కొంతధాన్యాన్ని బీజరూపంలో త్యాగం చేస్తాడు. అదేవిధంగా ఎక్కువ ధనాన్ని పొందగోరినవాడు కొంత అర్థత్యాగం కూడా చేయాలి. ఈ విషయంలో నీకు సందేహం అక్కరలేదు. (65)
అర్థేన తు సమో నార్థః యత్ర లభ్యేత నోదయః ।
న తత్ర విపణః కార్యః ఖరకణ్డూయనం హి తత్ ॥ 66
విడిచిన ధనంతో సమంగా కాని, ఎక్కువగా కాని లభిస్తుందంటేనే ధనాన్ని త్యాగం చేయాలి. లేకుంటే త్యాగం చెయ్యకూడదు. అలా చేయడం గాడిదను గోకడం వంటిదే. వ్యర్థం. (66)
ఏవమేవ మనుష్యేంద్ర ధర్మం త్యక్త్వాల్పకం నరః ।
బృహంతం ధర్మమాప్నోతి స బుద్ధ ఇతి నిశ్చితమ్ ॥ 67
మనుష్యేంద్రా! ఇదే విధంగా స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అధికమైన ధర్మాన్ని పొందినవాడిని బుద్ధిమంతుడు అని నిశ్చయంగా చెప్పవచ్చు. (67)
అమిత్రం మిత్రసంపన్నం మిత్రైర్భిందంతి పండితాః ।
భిన్నైర్మిత్రైః పరిత్యక్తం దుర్బలం కుర్వతే వశమ్ ॥ 68
పండితులు మిత్రసంపద గల శత్రువును మిత్రుల నుండి వేరు చేస్తారు. అపుడు భేదించిన మిత్రులు విడువగా, దుర్బలుడైన ఆ శత్రువును లొంగదీసుకొంటారు. (68)
సత్త్వేన కురుతే యుద్ధం రాజన్ సుబలవానపి ।
నోద్యమేన న హోత్రాభిః సర్వాః స్వికురుతే ప్రజాః ॥ 69
రాజా! మిక్కిలి బలవంతుడు కూడా ఆత్మబలంతో యుద్ధం చేస్తాడు. వేరొక ప్రయత్నంచే కాని, ప్రశంసలచే కాని జనులందరినీ తనవశం చేసికోలేడు. (69)
సర్వథా సంహతైరేవ దుర్బలైర్బలవానపి ।
అమిత్రః శక్యతే హంతుం మధుహా భ్రమరైరివ ॥ 70
తేనెటీగలన్నీ కలిసి తేనెను తీసికొనిపోయేవాడిని చంపినట్లుగా, దుర్బలులంతా అన్నివిధాలా కలిసి బలవంతుడైన శత్రువును చంపగలరు. (70)
యథా రాజన్ ప్రజాః సర్వాః సూర్యః పాతి గభస్తిభిః ।
అత్తి చైవ తథైవ త్వం సదృశః సవితుర్భవ ॥ 71
రాజా! సూర్యుడు భూమిమీదున్న నీటిని తన కిరణాలతో గ్రహించి, మరల ప్రజలను వర్షరూపంగా రక్షిస్తున్నట్లుగా, నీవు కూడా సూర్యునితో సదృశుడవై ప్రజలను రక్షించు. (71)
ఏతచ్చాపి తపో రాజన్ పురాణమితి నః శ్రుతమ్ ।
విధినా పాలనం భూమేః యత్ కృతం నః పితామహైః ॥ 72
రాజా! నీపితామహులు చేసినట్లుగా ధర్మపూర్వకంగా భూమిని పాలించడం కూడా పురాతనమైన తప్స్సుగా మేము విన్నాం. (72)
న తథా తపసా రాజన్ లోకాన్ ప్రాప్నోతి క్షత్రియః ।
యథా సృష్టేన యుద్ధేన విజయేనేతరేణ వా ॥ 73
రాజా! క్షత్రియుడు తపస్సు ద్వారా పుణ్యలోకాలను పొందలేడు. తనకు విహితమైన యుద్ధంచేస్తూ విజయం పొందినా, అందు మరణించినా కూడా అతడు పుణ్యలోకాలను పొందుతాడు. (73)
అపేయాత్ కిల భాః సూర్యాత్ లక్ష్మీశ్చంద్రమసస్తథా ।
ఇతి లోకో వ్యవసితః దృష్ట్వేమాం భవతో వ్యథామ్ ॥ 74
నీ యొక్క ఈ కష్టాన్ని / చూసిన లోకం సూర్యుని నుండి కాంతి, చంద్రుని నుండి వెన్నెల కూడా శోభ తొలగిపోతాయని భావిస్తున్నది. (74)
భవతశ్చ ప్రశంసాభిః నిందాభిరితరస్య చ ।
కథాయుక్తాః పరిషదః పృథగ్ రాజన్ సమాగతాః ॥ 75
రాజా! జనులు వేరు వేరు సమావేశాలకు వచ్చి, నిన్ను ప్రశంసిస్తూ, దుర్యోధనుని నిందిస్తూ మాటలాడుకొంటున్నారు. (75)
ఇదమభ్యధికం రాజన్ బ్రాహ్మణా కురవశ్చ తే ।
సమేతాః కథయంతీహ ముదితాః సత్యసంధతామ్ ॥ 76
రాజా! బ్రాహ్మణులు, కురువంశీయులు ఒకచోట కలుసుకొని ఆనందంతో నీసత్యసంధతను గురించి మాట్లాడుకొంటున్నారు అని నా వినికిడికి వచ్చింది. (76)
యన్న మోహాన్న కార్పణ్యాద్ న లోభాన్న భయాదపి ।
అనృతం కించిదుక్తం తే న కామాన్నార్థకారణాత్ ॥ 77
మోహం వల్లకాని, దైన్యం వల్లకాని, లోభంతో కాని, భయంతో కాని, కామం వల్ల కాని, ధనకారణంగా కాని నీవు అసత్యాన్ని కొంచెం కూడా పలుకలేదని వారనుకొంటున్నారు. (77)
యదేనః కురుతే కించిద్ రాజా భూమిమవాప్నువన్ ।
సర్వం తన్నుదతే పశ్చాద్ యజ్ఞైర్విపులదక్షిణైః ॥ 78
రాజు రాజ్యం కోసం చేసిన యుద్ధంలో హింసచేయడం వల్ల పొందిన పాపాన్ని, రాజ్యం పొందినపిదప యజ్ఞాలలో భూరిదక్షిణలను ఇవ్వడం ద్వారా తొలగించుకొంటాడు. (78)
బ్రాహ్మణేభ్యో దదద్ గ్రామాన్ గాశ్చ రాజన్ సహస్రశః ।
ముచ్యతే సర్వపాపేభ్యః తమోధ్య ఇవ చంద్రమాః ॥ 79
రాజా! చీకటులనుండి చంద్రుడు బైటపడినట్లుగా, బ్రాహ్మణులకు గ్రామాలను, వేలకొలది గోవులను ఇవ్వడం ద్వారా రాజు పాపాల నుండి విముక్తుడౌతాడు. (79)
పౌరజానపదాః సర్వే ప్రాయశః కురునందన ।
సవృద్ధబాలసహితాః శంసంతి త్వాం యుధిష్ఠిర ॥ 80
కురునందనా! యుధిష్ఠిరా! నగర్ల్లో, పల్లెల్లో నివసిస్తూన్న వృద్ధులు, బాలురతో సహా అందరూ తరచుగ నిన్ను ప్రశంసిస్తున్నారు. (80)
శ్వదృతౌ క్షీరమాసక్తం బ్రహ్మ వా వృషలే యథా ।
సత్యం స్తేనే బలం నార్యాం రాజ్యం దుర్యోధనే తథా ॥ 81
కుక్క తోలుసంచిలోని పాలు, శూద్రుని వద్దనున్న వేదం, దొంగ దగ్గర సత్యం, స్త్రీ యొక్క బలం అనిచితమైనట్లే, దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉండటం కూడా తగనిదే. (81)
ఇతి లోకే నిర్వచనం పురశ్చరతి భారత ।
అపి చైతాః స్త్రియో బాలాః స్వాధ్యాయమధికుర్వతే ॥ 82
భారతా! ఈవిధంగా ముందునుండీ లోకంలో ప్రవాదం ఉంది. స్త్రీలు, బాలురు వేదాధ్యయనం చేస్తే, స్వరం చెడినట్లుగా, దుర్యోధనుడి దగ్గర రాజ్యముంటే చెడిపోతుంది. (82)
ఇమామవస్థాం చ గతే సహాస్మాభిరరిందమ ।
హంత నష్టాః స్మ సర్వే వై బవతోపద్రవే సతి ॥ 83
శత్రుదమనా! ఇది చాలా విచారించదగిన విషయం. మా అందరితో పాటుగా నీవు ఇటువంటి దురవస్థలో ఉన్నావు. నీమూలంగా మేమంతా కూడా నష్టపోతున్నాం. (83)
స భవాన్ రథమాస్థాయ సర్వోపకరణాన్వితమ్ ।
త్వరమాణోఽభినిర్యాతు విప్రేభ్యోఽర్థవిభావకః ॥ 84
మహారాజా! విప్రులకు ధనాన్ని దానంగా ఇవ్వడం కోసం, నీవు అస్త్రశస్త్రాది సామగ్రితో సిద్ధమై రథమెక్కి శీఘ్రంగా ఇక్కడ నుండి యుద్ధానికి బయలుదేరు. (84)
వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్ అద్యైవ గజసాహ్వయమ్ ।
అస్త్రవిద్భిః పరివృతః భ్రాతృభిర్దృఢధన్విభిః ॥ 85
ఆశీవిషసమైర్వీరైః మరుద్భిరివ వృత్రహా ।
అమిత్రాం స్తేజసా మృద్నన్నసురానివ వృతహా ।
శ్రియమాదత్స్వ కౌంతేయ ధార్తరాష్ట్రాన్ మహాబల ॥ 86
సర్పాలతో సమానంగా భయంకరమైన వీరులైన
దేవతలతో ఇంద్రుడు శత్రువులైన అసురులపై ఆక్రమణ చేసినట్లుగా, నీవు కూడ అస్త్రవేత్తలు, దృఢమైన విలుకాండ్రు అయిన సోదరులతో కలిసి బ్రాహ్మణులచే స్వస్తి వచనాలు పలికించుకొని, హస్తినాపురంపై ఈ రోజే దండెత్తు. (86)
న హి గాండీవముక్తానాం శరాణాం గార్థ్రవాససాం ।
స్పర్శమాశీవిషాభానాం మర్త్యః కశ్చన సంసహేత్ ॥ 87
అర్జునుని గాండీవం నుండి వెలువడిన గ్రద్దల రెక్కల బాణాలనే సర్పాల భయంకరమైన తాకిడిని మానవమాత్రుడెవడూ సహింపజాలడు. (87)
న స వీరో న మాతంగః న చ సోఽశ్వోవ్స్తి భారత ।
యః సహేత గదావేగం మమ క్రుద్ధస్య సంయుగే ॥ 88
భారతా! యుద్ధంలో నా గదయొక్క వేగాన్ని సహింపగల వీరుడుకాని, ఏనుగుకాని, అశ్వంకాని లేదు. (88)
సృంజయైః సహ కైకేయైః వృష్ణీనాం వృషభేణ చ ।
కథంస్విద్ యుధి కౌంతేయ న రాజ్యం ప్రాప్నుయామహే ॥ 89
కుంతీనందనా! సృంజయవీరులతో, కైకయవీరులతో, వృష్ణివంశతిలకుడైన శ్రీకృష్ణునితో కలిసి సంగ్రామంలో మనరాజ్యాన్ని మనం ఎందుకు పొందలేం? (89)
శత్రుహస్తగతాం రాజన్ కథంస్విన్నహరేర్మహీమ్ ।
ఇహ యత్నముపాహృత్య బలేన మహతాన్వితః ॥ 90
రాజా! పెద్దసేనాబలంతో ప్రయత్నపూర్వకంగా యుద్ధంచేస్తే, శత్రుహస్తగతమైన రాజ్యాన్ని మళ్ళీ ఎందుకు పొందలేవు? (90)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి భీమవాక్యే తయస్త్రింశోఽధ్యాయః ॥ 33 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున భీమ వాక్యమను ముప్పది మూడవ అధ్యాయము. (33)