34. ముప్పది నాల్గవ అధ్యాయము
యుధిష్ఠిరుడు ధర్మమునకు కట్టుబడి ఉందునని ప్రకటించుట.
వైశంపాయన ఉవాచ
స ఏవముక్తస్తు మహానుభావః
సత్యవ్రతో భీమసేనేన రాజా।
అజాతశత్రుస్తదనంతరం వై
ధైర్యాన్వితో వాక్యమిదం బభాషే ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు-భీమసేనుడు ఈ విధంగా చెప్పిన తర్వాత, మహానుభావుడు, సత్యవ్రతుడు, అజాతశత్రువు అయిన యుధిష్ఠిరుడు ధైర్యంగా ఇలా అన్నాడు. (1)
యుధిష్ఠిర ఉవాచ
అసంశయం భారత సత్యమేతద్
యన్మాం తుదన్ వాక్యశల్యైః క్షిణోషి ।
న త్వాం విగర్హే ప్రతికూలమేవమ్
అమానయాద్ధి వ్యసనం వ ఆగాత్ ॥ 2
యుధిష్ఠిరుడు ఇలా చెప్పాడు - భారతా! నాహృదయాన్ని సూటి మాటలతో బ్రద్దలు చేస్తూ నీవు నిజమే చెప్పావు. ఇమ్దులో సందేహం లేదు. నాకు ప్రతికూలంగా చెప్పినా నేను నిన్ను నిందించను. నా అనైతికమైన పనివల్లే ఈ కష్టం వచ్చింది కదా! (2)
అహం హ్యక్షానన్వపద్యం జిహీర్షన్
రాజ్యం సరాష్ట్రం ధృతరాష్ట్రస్య పుత్రాత్ ।
తన్మాం శఠః కితవః ప్రత్యదేవీత్
సుయోధనార్థం సుబలస్య పుత్రః ॥ 3
అపుడు నేను ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధనుడి నుండి రాజ్యాన్ని, రాజపదవిని హరించడానికే జూదమాడాను. కాని ధూర్తుడు, జూదరి అయిన శకుని సుయోధనునికోసం నాకు ప్రతిపక్షంలో ఆడాడు. (3)
మహామాయః శకునిః పర్వతీయః
సభామధ్యే ప్రవపన్నక్షపూగాన్ ।
అమాయినం మాయయా ప్రత్యజైషీత్
తతోఽపశ్యం వృజినం భీమసేన ॥ 4
భీమసేనా! పర్వతప్రాంతనివాసి, మహామాయావి అయిన శకుని జూదసభలో పాచికలు వేస్తూ మాయతో మాయ తెలియని నన్ను జయించాడు. అందువల్ల ఇటువంటి కష్టాన్ని పొందాను. (4)
అక్షాంశ్చ ద్ఱ్రుష్ట్వా శకునేర్యథావత్
కామానుకూలానయుజో యుజశ్చ ।
శక్యో నియంతుమభవిష్యదాత్మా
మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యమ్ ॥ 5
శకుని యొక్క పాచికలు అతని ఇచ్ఛానుసారంగా సరి బేసి సంఖ్యలలో యథాతథంగా పడటం చూసి నా మనస్సు జూదాన్ని నిలిపివేయగలిగేదే. కాని క్రోధం మానవుని ధైర్యాన్ని నాశనం చేస్తుంది. (అందుకే జూదం నిలువరించలేకపోయాను) (5)
యంతుం నాత్మా శక్యతే పౌరుషేణ
మానేన వీర్యేణ చ తాత నద్ధః ।
న తే వాచో బీమసేనాభ్యసూయే
మన్యే తథా తద్ భవితవ్యమాసీత్ ॥ 6
భీమసేనా! పురుషప్రయత్నం చేత మనస్సును నియంత్రించడం శక్యంకాదు. అభిమానం చేత, పరాక్రమం చేత కూడా మనస్సు బంధింపబడదు. నాయనా! నీమాటలను నేను తప్పుబట్టలేను. అలా జరగవలసి ఉంది, జరిగింది అని భావిస్తున్నాను. (6)
స నో రాజా ధృతరాష్ట్రస్య పుత్రో
న్యపాతయద్ వ్యసనే రాజ్యమిచ్ఛన్ ।
దాస్యం చ నోఽగమయద్ భీమసేన
యత్రాభవచ్ఛరణం ద్రౌపదీ నః ॥ 7
భీమసేనా! ధృతరాష్ట్రుని పుత్రుడు దుర్యోధనుడు రాజ్యకాంక్షతో ఈ కష్టంలోకి నెట్టాడు. మనకు దాస్యాన్ని కూడా కల్పించాడు. కాని ఆ సమయంలో మనకు ద్రౌపది రక్షణ అయినది. (7)
త్వం చాపి తద్ వేత్థ ధనంజయశ్చ
పునర్ద్యూతాయాగతానాం సభాం నః ।
యన్మాఽబ్రవీద్ ధృతరాష్ట్రస్య పుత్రః
ఏకగ్లహార్థం భరతానాం సమక్షమ్ ॥ 8
నీవూ, ధనంజయుడూ కూడా ఈ విషయాన్ని ఎరుగుదురు. మనం మళ్ళీ జూదానికి ఆహ్వానింపబడి వెళ్ళినపుడు భరతవంశీయులందరి సమక్షంలో సభలో దుర్యోధనుడు ఒకే పందెం కోసం మనతో ఇలా అన్నాడు - (8)
వనే సమా ద్వాదశ రాజపుత్ర
యథాకామం విదితమజాతశత్రో ।
అథాపరం చావిదితం చరేథాః
సర్వైః సహ భ్రాతృభిశ్చద్మగూఢః ॥ 9
రాజపుత్రా! అజాతశత్రూ! పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో అందరికి తెలిసేటట్లుగా స్వేచ్ఛగా సంచరించి, ఆపై ఒక సంవత్సరం అజ్ఞాతంగా సోదరులందరితో రహస్యంగా సంచరించాలి. (9)
త్వాం చేచ్ఛ్రుత్వా తాత తథా చరంతమ్
అవభోత్స్యంతే భరతానాం చరాశ్చ ।
అన్యాంశ్చరేథాస్తావతోఽబ్దాంస్తథా త్వం
నిశ్చిత్య తత్ ప్రతిజానీహి పార్థ ॥ 10
కుంతీనందనా! భరతవంశీయ గూఢచారులు ఆ సమయంలో నిన్ను గుర్తుపడితే, మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాలి. నీవీ విషయం నిశ్చయించుకొని ప్రతిజ్ఞ చెయ్యి. (10)
చరేశ్చేన్నోఽవిదితః కాలమేతం
యుక్తో రాజన్ మోహయిత్వా మదీయాన్ ।
బ్రవీమి సత్యం కురుసంసదీహ
తవైవ తా భారత పంచనద్యః ॥ 11
ఆ అజ్ఞాతవాసకాలమంతా మాకు తెలియకుండా, మాగూఢచారులను మోహపరచి చరించినట్లయితే, పంచనద ప్రదేశమంతటి మీదా నీదే అధికారం - ఈ కురుసభలో నేనీ సత్యప్రతిజ్ఞను చేస్తున్నాను. (11)
వయం చైతద్ భారత సర్వ ఏవ
త్వయా జితాః కాలమపాస్య భోగాన్ ।
వసేమ ఇత్యాహ పురా స రాజా
మధ్యే కురూణాం స మయోక్తస్తథేతి ॥ 12
భారతా! మేమంతా మీచే జయింపబడినట్లయితే, మేము కూడ ఈ భోగాలన్నింటిని విడిచిపెట్టి ఈ నియమానుసారంగా వనవాసం చేస్తాం అని దుర్యోధనుడు కురువంశీయులందరి సమక్షంలో చెప్పాడు. అపుడు నేను 'అలాగే' అన్నాను. (12)
తత్ర ద్యూతమభవన్నో జఘన్యం
తస్మిన్ జితాః ప్రవ్రజితాశ్చ సర్వే ।
ఇత్థం తు దేశాననుసంచరామః
వనాని కృచ్ఛ్రాణి చ కృచ్ఛ్రరూపాః ॥ 13
అనంతరం నిందింపదగిన ఆ జూదం ఆడడం, చివరిసారిగా అందులో మనమంతా ఓడిపోవడం, రాజ్యం విడిచిరావడం జరిగాయి. ఈ విధంగా మనం కష్టమైన వేషధారణతో కష్టదాయకమైన వనాలలో, అనేక ప్రదేశాలలో కష్టాలనుభవిస్తూ సంచరిస్తున్నాం. (13)
సుయోధనశ్చాపి న శాంతిమిచ్ఛన్
భూయః స మన్యోర్వశమన్వగచ్ఛత్ ।
ఉద్యోజయామాస కురూంశ్చ సర్వాన్
యే చాస్య కేచిద్ వశమన్వగచ్ఛన్ ॥ 14
సుయోధనుడు శాంతిని కోరకుండా మరల క్రోధానికి వశుడయ్యాడు. మనలను కష్టాల్లోకి నెట్టిన అతడు కురువంశీయులను తనవశంలోకి తెచ్చుకొని వారిని ఉన్నతపదవులలో నియోగించాడు. (14)
తం సంధిమాస్థాయ సతాం సకాశే
కో నామ జహ్యాదిహ రాజ్యహేతోః ।
ఆర్యస్య మన్యే మరణాద్ గరీయో
యద్ధర్మముత్కృమ్య మహీం ప్రశాసేత్ ॥ 15
ఆ నాడు కౌరవసభలో సత్పురుషుల సమక్షంలో ఆ విధంగా ప్రతిజ్ఞచేసి, రాజ్యం కారణంగా ఈనాడు దాన్ని ఎవడు విడిచిపెడతాడు? శ్రేష్ఠుడైనవానికి
ధర్మాన్ని అతిక్రమించి రాజ్యాన్ని శాసించడం మరణం కంటె ఎక్కువ దుఃఖాన్ని కల్గిస్తుంది. (15)
తథైవ చేద్ వీర కర్మాకరిష్యో
యదా ద్యూతే పరిఘం పర్యమృక్షః ।
బాహూ దిధక్షన్ వారితః ఫాల్గునేన
కిం దుష్కృతం భీమ తదాభవిష్యత్ ॥ 16
ప్రాగేవ చైవం సమయక్రియాయాః
కిం నాబ్రవీః పౌరుషమావిదానః ।
ప్రాప్తుం తు కాలం త్వభిపద్య పశ్చాత్
కిం మామిదానీమతివేలమాత్థ ॥ 17
వీరా! భీమసేనా! ఆ నాడు జూదం సమయంలో నీవు నారెండు చేతులను తగలపెట్టాలనుకొన్నపుడు నిన్ను అర్జునుడు నివారించాడు. అపుడు నీవు శత్రువులను కొట్టడానికి గదమీద చెయ్యి వేశావు. అపుడు నీవలా చేసి ఉంటే ఎంతటి అనర్థం జరిగి ఉండేది? పురుషార్థాన్ని తెలిసిన నీవు నేను ప్రతిజ్ఞ చెయ్యడానికి ముందే ఈ మాటలెందుకు చెప్పలేదు? ప్రతిజ్ఞానుసారంగా వనవాసానికి నావెనకే వచ్చి, ఇపుడు నాతో మిక్కిలి కఠినంగా మాట్లాడుతున్నావేమిటి? (16,17)
భూయోఽపి దుఃఖం మమ భీమసేన
దూయే విషస్యేన రసం హి పీత్వా ।
యద్ యాజ్ఞసేనీం పరిక్లిశ్యమానాం
సందృశ్య తత్ క్షాంతమితి స్మ భీమ ॥ 18
భీమసేనా! నాకీవిషయంలో కూడా చాలా దుఃఖం కలుగుతోంది. ఆ నాడు శత్రువుల చేతిలో యాజ్ఞసేని ద్రౌపది కష్టపడుతూంటే మనం కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా సహించాం కదా! విషరసం త్రాగినట్లుగా దానివల్ల ఇపుడు నేను పరితపిస్తున్నాను. (18)
న త్వద్య శక్యం భరతప్రవీర
కృత్వా యదుక్తం కురువీరమధ్యే ।
కాలం ప్రతీక్షస్వ సుఖోదయస్య
పక్తిం ఫలానామివ బీజవాపః ॥ 19
భరతప్రవీరా! కురువీరులసమక్షంలో ప్రతిజ్ఞచేసి వనవాసం స్వీకరించాక, ఇపుడు రాజ్యాన్ని ఆక్రమించడం నాకు శక్యంకాదు. విత్తనాలు నాటినరైతు ఫలం వచ్చేదాక ఎదురు చూసినట్లుగా, మనకు సుఖసమయం వచ్చేదాకా నిరీక్షించు. (19)
యదా హి పూర్వం నికృతో నికృంతేద్
వైరం సపుష్పం సఫలం విదిత్వా ।
మహాగుణం హరతి హి పౌరుషేణ
తదా వీరో జీవతి జీవలోకే ॥ 20
ముందు శత్రువుల చేత దెబ్బతిన్న వీరుడైన పురుషుడు వైరం కుసుమించి ఫలిస్తుందని గ్రహించి, తన పౌరుషం చేత దానిని సమూలంగా నాశనం చెయ్యాలి. అపుడే అతడు శత్రువుల సంపదలను హరింపగలడు. అటువంటివాడే ఈ లోకంలో సుఖంగా జీవించగలడు. (20)
శ్రియం చ లోకే లభతే సమగ్రాం
మన్యే చాస్మై శత్రవః సంనమంతే ।
మిత్రాణి చైన మచిరా ద్భజంతే
దేవా ఇవేంద్రముపజీవంతి చైనమ్ ॥ 21
అటువంటి వీరపురుషుడు లోకంలో సంపూర్ణ సంపదను పొందుతాడు. అటువంటి వాడికి శత్రువులు వంగి నమస్కరిస్తారు. త్వరలోనే అతనికి మిత్రులు ఏర్పడతారు. దేవతలు ఇంద్రుని సేవించినట్లుగా మిత్రగణం అతడిని ఆశ్రయిస్తుంది. (21)
మమ ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యాం
వృణే ధర్మమమృతాజ్జీవితాచ్చ ।
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ
సర్వం న సత్యస్య కలాముపైతి ॥ 22
భీమసేనా! నా ఈ సత్యమైన ప్రతిజ్ఞను గ్రహించు. నేను మోక్షం కంటే, జీవితం కంటే కూడా ధర్మాన్నే కోరుకొంటాను.
రాజ్యం, పుత్రులు, యశస్సు, ధనం - అన్నీ కలిసినా సత్యంలో పదహారోవంతుతో కూడా సమానం కావు. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి యుధిష్ఠిరవాక్యే చతుస్త్రింశోఽధ్యాయః ॥ 34 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర వాక్యమను ముప్పది నాలుగవ అధ్యాయము. (34)