32. ముప్పది రెండవ అధ్యాయము

ద్రౌపది పురుషార్థ సాధనకు ప్రోత్సహించుట.

ద్రౌపద్యువాచ
నావమన్యే న గర్హే చ ధర్మం పార్థ కథంచన ।
ఈశ్వరం కుత ఏవాహమ్ అవమంస్యే ప్రజాపతిమ్ ॥ 1
ద్రౌపది ఇలా అంది - కుంతీనందనా! నేను ధర్మాన్ని ఏ విధంగానూ అవమానించటం లేదు, నిందించటం లేదు. ఇక ప్రజలనందరినీ పాలించే ఈశ్వరునిమాత్రం ఎలా నిందించగలను? (1)
ఆర్తాహం ప్రలపామీదమ్ ఇతి మాం విద్ధి భారత ।
భూయశ్చ విలపిష్యామి సుమనాస్త్వం నిబోధ మే ॥ 2
భారతా! బాధితురాలనై నేనిలా మాట్లాడుతున్నాను. నన్ను అర్థం చేసుకో. నేనింకనూ మాట్లాడవలసి ఉంది. నీవు ప్రసన్నచిత్తంతో నా మాట విను. (2)
కర్మ ఖల్విహ కర్తవ్యం జానతామిత్రకర్శన ।
అకర్మాణో హి జీవంతి స్థావరా నేతరే జనాః ॥ 3
శత్రునాశనా! బుద్ధిమంతుడైన మానవుడు విహితకర్మను ఆచరించవలసిందే కదా! స్థావరాలైన వృక్షాదులకు కర్మలేదు. కాని జనులంతా కర్మహీనులుగా ఉండకూడదు. (3)
యావద్గోస్తనపానాశ్చ యావచ్ఛాయోపసేవనాత్ ।
జంతవః కర్మణా వృత్తిమ్ ఆప్నువంతి యుధిష్ఠిర ॥ 4
ధర్మజా! ఆవుదూడలు తల్లిదగ్గర పాలు త్రాగి, చెట్టు నీడను విశ్రమిస్తాయు. అలాగే జీవులన్నీ కర్మ చేస్తూనే జీవితం కొనసాగిస్తున్నాయి. (4)
జంగమేషు విశేషేణ మనుష్యా భరతర్షభ ।
ఇచ్ఛంతి కర్మణా వృత్తిమ్ అవాప్తుం ప్రేత్య చేహ చ ॥ 5
భరతశ్రేష్ఠా! చేతనాలలో, అందునా ప్రత్యేకించి మనుష్యులు కర్మ ద్వారా ఇహపరలోకాలలో జీవికను కోరుకొంటారు. (5)
ఉత్థానమభిజానంతి సర్వభూతాని భారత ।
ప్రత్యక్షం ఫలమశ్నంతి కర్మణాం లోకసాక్షికమ్ ॥ 6
భరతనందనా! అన్నిప్రాణులు తమ ఉన్నతిని కోరుకొంటాయి. తాము చేసిన కర్మల ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాయి. ఇందుకు ఈ లోకమే సాక్షి. (6)
సర్వే హి స్వం సముత్థానమ్ ఉపజీవంతి జంతవః ।
అపి ధాతా విధాతా చ యథాయముదకే బకః ॥ 7
నీటి దగ్గర కొంగ తన ఆహారం కోసం నిరీక్షిస్తూన్నట్లుగా ప్రాణులన్నీ కూడ తమ తమ ఉన్నతిని, జీవికను ఆశ్రయించికొని జీవిస్తాయి. చివరకు ధాత, విధాత కూడ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉంటారు. (7)
అకర్మణాం వై భూతానాం వృత్తిః స్యాన్న హి కాచన ।
తదేవాభిప్రపద్యేత న విహన్యాత్ కదాచన ॥ 8
కర్మ చేయకపోతే ప్రాణులను మనుగడ లేదు. అందువల్ల ఎప్పుడూ కర్మను ఆశ్రయించుకొనే ఉండాలి. ఎప్పుడూ కర్మను విడువరాదు. (8)
స్వకర్మ కురు మా గ్లాసీః కర్మణా భవ దంశితః ।
కృతం హి యోఽభిజానాతి సహస్రే సోఽస్తి నాస్తి చ ॥ 9
నీకు విహితమైన కర్మను నీవు చెయ్యి. అది చెయ్యడానికి బాధపడకు. కర్మ నిన్నెప్పుడూ అంటిపెట్టుకొని ఉండి రక్షిస్తూంటుంది. వేలకొలదీ మనుష్యులలో కర్మను బాగా చెయ్యడం తెలిసినవాడు ఒక్కడైనా ఉంటాడో లేదో చెప్పడం కష్టం. (9)
తస్య చాపి భవేత్ కార్యం వివృద్ధౌ రక్షణే తథా ।
భక్ష్యమాణో హ్యనాదానాత్ క్షీయేత హిమవానపి ॥ 10
ధనవంతుడైనప్పటికీ, ధనాన్ని వృద్ధి పరుచుకోవటానికి, రక్షించుకోవాటానికి కర్మ చేయాలి. సంపాదించకుండా తింటూ ఉంటే హిమత్పర్వతం వంటి సంపద కూడా తరిగిపోతుంది. (10)
ఉత్సీదేరన్ ప్రజాః సర్వాః న కుర్యుః కర్మ చేద్ భువి ।
తథా హ్యేతా న వర్ధేరన్ కర్మ చేదఫలం భవేత్ ॥ 11
ఈ భూలోకంలోని ప్రజలందరూ కర్మ చేయకుండా ఉంటే నశించిపోతారు. కర్మ నిష్ఫలమైనదే అయితే ప్రజలు అభివృద్ధి చెందరు. (11)
అపి చాప్యఫలం కర్మ పశ్యామః కుర్వతో జనాన్ ।
నాన్యథా హ్యపి గచ్ఛంతి వృత్తిం లోకాః కథంచన ॥ 12
కొంతమంది నిష్ఫలకర్మలను చేస్తూండటం మనం చూస్తున్నాం. కర్మ చేయకపోతే ప్రజలకు ఏ విధంగాను బ్రతుకు తెరువు లభించదు. (12)
యశ్చ దిష్టపరో లోకే యశ్చాపి హఠవాదికః ।
ఉభావపి శఠావేతౌ కర్మబుద్ధిః ప్రశస్యతే ॥ 13
ఉన్న భాగ్యం మీది నమ్మకంతో కర్మ చేయనివాడు, మూర్ఖంగా మనకు ప్రాప్తం ఉన్నది లభిస్తుందిలే అని కర్మ చేయనివాడు ఈ ఇద్దరూ మూర్ఖులే. కర్మపట్ల బుద్ధికలవాడే ప్రశంసింపదగినవాడు. (13)
యో హి దిష్టముపాసీనః నిర్విచేష్టః సుఖం శయేత్ ।
అవసీదేత్ స దుర్భుద్ధిః ఆమో ఘట ఇవోదకే ॥ 14
ప్రారబ్ధ కర్మఫలమైన భాగ్యం మీది నమ్మకంతో, ఏపనీ చెయ్యకుండా సుఖంగా నిద్రపోయే బుద్ధిహీనుడు నీటిలోని (కాల్చని) మట్టికుండవలె నశిస్తాడు. (14)
తథైవ హఠదుర్బుద్ధిః శక్తః కర్మణ్యకర్మకృత్ ।
ఆసీత న చిరం జీవేద్ అనాథ ఇవ దుర్బలః ॥ 15
అదే విధంగా పెంకితనం వల్లనో దుర్బుద్ధి వల్లనో సమర్థుడై కూడా కర్మలనాచరించకుండా ఉంటే అనాథుడైన దుర్బలునివలె అతడు చిరకాలం జీవించలేడు. (15)
అకస్మాదిహ యః కశ్చిద్ అర్థం ప్రాప్నోతి పూరుషః ।
తం హఠేనేతి మన్యంతే స హి యత్నో న కస్యచిత్ ॥ 16
లోకంలో అకస్మాత్తుగా, ఏ ప్రయత్నమూ లేకుండా ఎవడైనా ధనాన్ని పొందితే వాడిని హఠాత్తుగా ధనవంతుడయ్యాడని లోకులంటారు. అందుకోసం అతడు చేసిన ప్రయత్నమేదీ కనబడదు. (16)
యచ్ఛాపి కించిత్ పురుషః దిష్టం నామ భజత్యుత ।
దైవేన విధినా పార్థ తద్ దైవమితి నిశ్చితమ్ ॥ 17
కుంతీనందనా! ఒకానొక పురుషుడు ప్రారబ్ధవశాన ప్రాప్తమైన సంపదను అనుభవిస్తూంటే, దాన్ని దైవదత్తమైనదిగా భావిస్తారు. (17)
యత్ స్వయం కర్మణా కించిత్ ఫలమాప్నోతి పూరుషః ।
ప్రత్యక్షమేతల్లోకేషు తత్ పౌరుషమితి శ్రుతమ్ ॥ 18
తాను చేసిన కర్మకు తగిన ఫలితంగా సంపదను పొందితే దాన్ని పౌరుషమని అంటారు. ఇది లోకంలో మనకు కనబడుతూనే ఉంటుంది. (18)
స్వభావతః ప్రవృత్తో యః ప్రాప్నోత్యర్థం న కారణాత్ ।
తత్ స్వభావాత్మకం విద్ధి ఫలం పురుషసత్తమ ॥ 19
సహజసిద్ధంగా కర్మాచరణం వల్ల అతడు సంపదను పొందితే ఆ సంపదను స్వాభావికమైనదిగా భావించాలి. (19)
ఏవం హఠాచ్చ దైవాచ్చ స్వభావాత్ కర్మణస్తథా ।
యాని ప్రాప్నోతి పురుషః తత్ ఫలం పుర్వకర్మణామ్ ॥ 20
ఈ విధంగా మానవుడు హఠాత్తుగా, దైవవశాన, స్వభావం వల్ల పొందిన సంపదలను పూర్వకర్మ ఫలంగా భావించాలి. (20)
ధాతాపి హి స్వకర్మైవ తైస్తైర్హేతుభిరీశ్వరః ।
విదధాతి విభజ్యేహ ఫలం ఫుర్వకృతం నృణామ్ ॥ 21
జగదాధారుడైన పరమేశ్వరుడు కూడా మానవులకు వారి వారి పూర్వకర్మల ననుసరించే సంపదలను ఆయా విధాలుగా విభజించి కర్మఫలంగా అందిస్తాడు. (హఠాత్తుగా, దైవవశాన, స్వభావం వల్ల, అనే విధాలుగా సంపదలనిస్తాడు). (21)
యద్ధ్యయం పురుషః కించిత్ కురుతే వై శుభాశుభమ్ ।
తద్ ధాతృవిహితం విద్ధి పూర్వకర్మఫలోదయమ్ ॥ 22
మానవుడు చేసే శుభాశుభ కర్మలను ఈశ్వర విహితమైన పూర్వకర్మ ఫలోదయంగా భావించాలి. (మునుపు చేసిన కర్మఫలం యొక్క ప్రారంభంగా). (22)
కారణం తస్య దేహోఽయం ధాతుః కర్మణి వర్తతే ।
స యథా ప్రేరయత్యేనం తథాయం కురుతేఽవశః ॥ 23
మానవుని శరీరము ఈశ్వరప్రేరితమైన కర్మలో ప్రవర్తించే సాధనము. ఈశ్వరుడు ఎలా నిర్దేశిస్తే అలా అవశుడై, ఈశ్వరాధీనుడై మానవుడు కర్మను ఆచరిస్తాడు. (అనగా ప్రారబ్ధకర్మఫలాన్ని ఈ దేహం ద్వారా ఈశ్వరుడు జీవునిచే అనుభవింపజేస్తాడు.) (23)
తెషు తేషు హి కృత్యేషు వినియోక్తా మహేశ్వరః ।
సర్వభూతాని కౌంతేయ కారయత్యవశాన్యపి ॥ 24
కుంతీనందనా! ఈశ్వరుడు అన్నిప్రాణులను ఆయాకృత్యములందు నియోగిస్తాడు. పరవశులు/పరాధీనులైన ప్రాణులచే ఆయా పనులను చేయిస్తాడు. (24)
మనసార్థాన్ వినిశ్చిత్య పశ్యాత్ ప్రాప్నోతి కర్మణా ।
బుద్ధిపూర్వం స్వయం వీర పురుషస్తత్ర కారణమ్ ॥ 25
వీరా! ముందుగా మనస్సుతో పొందవలసిన అర్థములను నిర్ణయించుకొని, ఆ తర్వాత పని ద్వారా బుద్ధి పూర్వకంగా వాటిని పొందుతాడు. అందువల్ల పురుషుడు అందుకు కారణమౌతాడు. (25)
సంఖ్యాతుం నైవ శక్యాని కర్మాణి పురుషర్షభ ।
అగారనగరాణాం హి సిద్ధిః పురుషహైతుకీ ॥ 26
తిలే తైలం గవి క్షీరం కాష్ఠే పావకమంతతః ।
ధియా ధీరో విజానీయాద్ ఉపాయం చాస్య సిద్ధయే ॥ 27
పురుషశ్రేష్ఠా! కర్మలను లెక్కించడం సాధ్యం కాదు. గృహాదులు, నగరాదులు పొందడానికి పురుషుడే కారణం. తిలలలో తైలం, గోవులలో పాలు, కర్రలో అగ్ని ఉన్నదని బుద్ధి ద్వారా ముందు నిశ్చయంచుకొని బుద్ధిమంతుడైన వాడు అది పొందడానికి ఉపాయాన్ని తెలుసుకోవాలి. (26,27)
తతః ప్రవర్తతే పశ్చాత్ కారణైస్తస్య సిద్ధయే ।
తాం సిద్ధిముపజీవంతి కర్మజామిహ జంతవః ॥ 28
అనంతరం ఆయా కార్యసిద్ధికి తగిన ఉపాయాలతో అతడు ప్రవర్తిస్తాడు. అలా సిద్ధించినదాన్ని కర్మజం, - పురుషప్రయత్నం వల్ల సిద్ధించినదని - అంటారు. లోకంలో అటువంటి దాని సహకారంతో జీవిస్తారు. (28)
కుశలేన కృతం కర్మ కర్ర్తాసాధు స్వనుష్ఠితమ్ ।
ఇదం త్వకుశలేనేతి విశేషాదుపలభ్యతే ॥ 29
"ఇతడు (కర్త) ఈ పనిని నైపుణ్యంతో చేశాడు. పద్ధతి ప్రకారం బాగా చేశాడు. ఇతడు ఈ పనిని నైపుణ్యంతో చేయలేదు" అని ఈ విధంగా ప్రత్యేకంగా చెప్పడం సహజమే. (29)
ఇష్టాపూర్తఫలం న స్యాద్ న శిష్యో న గురుర్భవేత్ ।
పురుషః కరసాధ్యేషు స్యాచ్చేదయమకారణమ్ ॥ 30
కర్మసాధ్యమైన ఫలం విషయంలో పురుషుడు కారణం కాదంటే, ఇక ఎవడూ యజ్ఞాదికర్మల ఫలితాన్ని పొందలేడు. అటువంటి పక్షంలో, ఎవరూ ఎవరికీ గురువూ కాదు, శిష్యుడూ కాదు. (30)
కర్తృత్వాదేవ పురుషః కర్మసుద్ధౌ ప్రశస్యతే ।
అసిద్ధౌ నింద్యతే చాపి కర్మనాశాత్ కథంత్విహ ॥ 31
కర్మ యందు కర్తృత్వం ఉండడం వల్లనే కర్మ సిధించినపుడు (కర్త) పురుషుడు ప్రశంసింపబడుతున్నాడు. ఇదే విధంగా సిధించకపోతే నిందింపబడుతున్నాడు. కూడ. కర్మ నిష్ఫలమై నశించేదైతే, ఇక ఈ లోకంలో కార్యసిడ్ధి ఎలా జరుగుతుంది? (31)
సర్వమేవ హఠేనైకే దైవేనైకే వదంత్యుత ।
పుంసః ప్రయత్నజం కేచిత్రైధమేతన్నిరుచ్యతే ॥ 32
అన్ని పనులు హఠాత్తుగా (అకస్మాత్తుగా) సిధిస్తాయని కొందరు. దైవవశాన సిధిస్తాయని కొందరు అంటుంటారు. కొందరు పురుషప్రయత్నం వల్లనే కార్యసిద్ధి కలుగుతుందని అంటారు. అందువల్ల ఇది మూడు విధాలుగా నిర్వచింపబడుతోంది. (32)
న చైవైతావతా కార్యం మన్యంత ఇతి చాపరే ।
అస్తి సర్వమదృశ్యం తు దిష్టం చైవ తథా హఠః ॥ 33
కొందరు 'కార్యసిద్ధికి మనుష్యప్రయత్నం అవసరం లేదు. అంతా అదృశ్యమైన దైవం వల్లనే జరుగుతుంది లేదా హఠాత్తుగా, అకస్మాత్తుగా జరుగుతుంది' అని అంటారు. (33)
దృశ్యతే హి హఠాచ్చైవ దిష్టాచ్చార్థస్య సంతతిః ।
కించిద్ దైవాద్ధఠాత్ కించిత్ కించిదేవ స్వభావతః ॥ 34
పురుషః ఫలమాప్నోతి చతుర్థం నాత్ర కారణమ్ ।
కుశలాః ప్రతిజానంతి యే వై తత్త్వవిదో జనాః ॥ 35
లోకంలో హఠాత్తుగా, దైవాత్తుగా కార్యసిద్ధి, అర్థసంతతి కలగడం కనబడుతూంది. 'కొంతదైవం వల్ల, కొంత హఠాత్తుగాను, కొంత స్వభావం వల్ల మానవుడు ఫలాన్ని పొందుతాడు, ఈ మూడు తప్ప, నాల్గవ కారణమేదీ (ఫలం పొందడానికి) లేదు.' అని తత్త్వజ్ఞులు, నిపుణులు అంటున్నారు. (34,35)
తథైవ ధాతా భూతానామ్ ఇష్టానిష్టఫలప్రదః ।
యది న స్యాన్న భూతానాం కృపణో నామ కశ్చన ॥ 36
అదేవిధంగా ఈశ్వరుడే ప్రాణులకు ఇష్టానిష్టఫలాలను ఇచ్చేవాడు. అలా కాకపోతే ప్రాణులలో దీనుడనేవాడెవడూ ఉండేవాడు కాదు. (36)
యం యమర్థమభిప్రేప్సుః కురుతే కర్మ పూరుషః ।
తత్తత్ సఫలమేవ స్యాద్ యది న స్యాత్ పురాకృతమ్ ॥ 37
పూర్వజన్మకృతమైన కర్మయొక్క ప్రభావం లేకపోతే, మానవుడు ఏ ఫలాన్ని కోరి కర్మ చేస్తున్నాడో, ఆ ఫలాన్ని తప్పక పొందేవాడు కానీ అలా జరగటం లేదు కదా! (37)
త్రిద్వారామర్థసిద్ధిం తు నానుపశ్యంతి యే నరాః ।
తథైవానర్థసిద్ధీమ్ చ యథా లోకాస్తథైవ తే ॥ 38
అర్థసిద్ధికి కాని, అనర్థానికి కాని దైవ, హఠాత్ స్వభావాలనే మూడు కారణాలను అంగీకరించని మానవులు అజ్ఞులుగానే ఉండిపోతున్నారు. (38)
కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయః ।
ఏకాంతేన హ్యనీహోఽయం పరాభవతి పూరుషః ॥ 39
'మానవుడు కర్మను చేయవలసిందే. కర్మను విడిచి నిశ్చేష్టునిగా ఉన్నవాడు పరాభవాన్ని పొందుతాడు' ఇది మనువు యొక్క నిశ్చితాభిప్రాయం. (39)
కుర్వతో హి భవత్యేవ ప్రాయేణేహ యుధిష్ఠిర ।
ఏకాంతఫలసిద్ధిం తు న విందత్యలసః క్వచిత్ ॥ 40
యుధిష్ఠిరా! సాధారణంగా కర్మచేసేవాడే ఫలసిద్ధిని పొందుతాడు. అలసుడై తన కర్తవ్యాన్ని విడిచినవాడు ఫలసిద్ధిని పొందలేడు. (40)
అసంభవే త్వస్య హేతుః ప్రాయశ్చిత్తం తు లక్షయేత్ ।
కృతే కర్మణి రాజేంద్ర తథానృణ్యమవాప్నుతే ॥ 41
రాజేంద్రా! కర్మకు ఫలం కలగకపోవడానికి కారణమేమీ కనబడటం లేదు. అందలి దోషనివారణకు ప్రాయశ్చిత్తం పై దృష్టిపెట్టాలి. సాంగోపాంగంగా కర్మను చేయడం వల్ల కర్త దోషరహితుడవుతాడు. (41)
అలక్ష్మీరావిశత్యేనం శయానమలసం నరమ్ ।
నిః సంశయః ఫలం లబ్ధ్వా దక్షో భూతిముపాశ్నుత్ ॥ 42
అలసుడై, కర్మచేయకుండా పడుకొనే మానవుని దారిద్ర్యం ఆవహిస్తుంది. సమర్థుడైనవాడు కర్మను ఆచరించి నిఃసంశయంగా ఫలాన్ని పొంది ఐశ్వర్యవంతుడౌతాడు. (42)
అనర్థాః సంశయావస్థాః సిద్ధ్యంతే ముక్తసంశయాః ।
ధీరా నరాః కర్మరతాః నను నిఃసంశయాః క్వచిత్ ॥ 43
కర్మఫలం ఉంటుందా? ఉండదా? అని సందేహించేవారు అనర్థాలు పొందుతారు. సంశయం లేకుండా కర్మను ఆచరించేవారు ఫలాన్ని పొందుతారు. కర్మరతులు, ధీరులు అయిన మానవులు సంశయరహితులుగా ఉంటారు. (43)
ఏకాంతేన హ్యనర్థోఽయం వర్తతేఽస్మాసు సాంప్రతమ్ ।
స తు నిః సంశయం న స్యాత్ త్వయి కర్మణ్యవస్థితే ॥ 44
ఇపుడు మనపై రాజ్యాపహరణరూపమైన అనర్థం వచ్చి పడింది. నీవు కర్మపరుడవై ఉన్నట్లయితే నిఃసంశయంగా ఆ ఆపద తొలగిపోతుంది. (44)
అథవా సిద్ధిరేవ స్యాద్ అభిమానం తదేవ తే ।
వృకోదరస్య బీభత్సోః భ్రాత్రోశ్చ యమయోరపి ॥ 45
కార్యసిద్ధి జరిగినట్లయితే అది నీకు, నీ సోదరులైన భీమార్జున నకులసహదేవులకు విశేష గౌరవం అవుతుంది. (45)
అన్యేషాం కర్మ సఫలమ్ అస్మాకమపి వా పునః ।
విప్రకర్షేణ బుధ్యేత కృతకర్మా యథాఫలమ్ ॥ 46
కర్మ చేసినవాడు చివరకు పొందిన ఫలితాన్ని బట్టి ఇతరుల కర్మ సఫలమైందా, లేక తన కర్మ సఫలమైందా అనే విషయం తెలుస్తుంది. (46)
పృథివీం లాంగలేనేహ భిత్త్వా బీజం వపత్యుత ।
ఆస్తేఽథ కర్షకస్తూష్ణీం పర్జన్యస్తత్ర కారణమ్ ॥ 47
వృష్ణిశ్చేన్నానుగృహ్ణీయాద్ అనేనాస్తత్ర కర్షకః ।
యదన్యః పురుషః కుర్యాత్ తత్ కృతం సఫలం మయా ॥ 48
తచ్చేదం ఫలమస్మాకమ్ అపరాధో న మే క్వచిత్ ।
ఇతి ధీరోఽన్వవేక్ష్యైవ నాత్మానం తత్ర గర్హయేత్ ॥ 49
నాగలితో భూమిని దున్ని, విత్తనం నాటి, కర్షకుడు మిన్నకుంటాడు. వర్షం పడి అది మొలకెత్తుతోంది. అక్కడ వర్షం కారణం. రైతు కాదు. వర్షం అనుగ్రహించకపోతే రైతుది దోషం కాదు, తనలాగే చేసిన వేరొక కర్షకుడు ఫలం పొందితే అతడు 'అతని వలె నేనూ చేశాను. నేను ఫలం పొందలేదు. అతడు ఫలంపొందాడు, ఇందులో నా దోషం ఏమీ లేదు' అని గ్రహించి ధీరుడై ఆత్మనిందను చేసుకోడు. (47-49)
కుర్వతో నార్థసిద్ధిర్మే భవరీతి హ భారత ।
నిర్వేదో నాత్ర కర్తవ్యః ద్వావన్యౌ హ్యత్ర కారణమ్ ॥ 50
భారతా! పురుషప్రయత్నం చేసినా ఫలసిద్ధి జరగకపోతే నిర్వేదం పొందకూడదు. కర్మసిద్ధి పొందడంలో పురుష ప్రయత్నంతోపాటు ప్రారబ్ధం, ఈశ్వరకృప అనే మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. (50)
సిద్ధిర్వాప్యథవాసిద్ధిః అప్రవృత్తిరతోఽన్యథా ।
బహూనాం సమవాయే హి భావానాం కర్మ సిద్ధ్యతి ॥ 51
మహారాజా! కార్యం సఫలమవుతుందా కాదా అనే సందేహం మనస్సులో ఉంచుకొని, కర్మలో ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించడం ఉచితంకాదు. అనేక కారణాలు ఒక చోట కలిస్తేనే కర్మ సఫలమవుతుంది. (51)
గుణాభావే ఫలం న్యూనం భవత్యఫలమేవ చ ।
అనారంభే హి న ఫలం న గుణో దృశ్యతే క్వచిత్ ॥ 52
కర్మాచరణంలో నైపుణ్యం లేకపోతే ఫలం తక్కువగా లభిస్తుంది. లేదా ఒక్కొక్కప్పుడు ఫలం లేకపోవచ్చు. అలాగని కర్మ చేయకుండా ఉంటే ఫలితమూ ఉండదు, కర్తయొక్క శౌర్యాదిగుణాలూ బయటపడవు. (52)
దేశకాలావుపాయాంశ్చ మంగలం స్వస్తివృద్ధయే ।
యునక్తి మేధయా ధీరః యథాశక్తి యథాబలమ్ ॥ 53
ధీరుడైన మనుష్యుడు మంగళమయమగు శుభాల అభివృద్ధి కొరకు తన బుద్ధి ద్వారా తనశక్తిని, బలాన్ని అనుసరించి, దేశకాలాలను అనుసరించి ఉపాయాలను ప్రయోగిస్తాడు. (53)
అప్రమత్తేన తత్ కార్యమ్ ఉపదేష్టా పరాక్రమః ।
భూయిష్ఠం కర్మయోగేషు దృష్ట ఏవ పరాక్రమః ॥ 54
అప్రమత్తుడై దేశకాలాలకు తగిన కార్యం చేయాలి. ఇందులో పరాక్రమం ప్రధానమైంది. కార్యసాధనకు గల ఉపాయాలన్నింటిలో పరాక్రమమే గొప్పదిగా తెలియబడుతోంది. (54)
యత్ర ధీమానవేక్షేత శ్రేయాంసం బహుభిర్గుణైః ।
సామ్నైవార్థం తతో లిప్సేత్ కర్మ చాస్మై ప్రయోజయేత్ ॥ 55
బుద్ధిమంతుడైనవాడు సామంచేతనే అనేకగుణాలతో కూడి శ్రేయస్కరమగు అర్థాన్ని (కార్యాన్ని, ప్రయోజనాన్ని) చూసినట్లయితే, అందుకు తగిన పనికి (సంధికి) ప్రేరేపించాలి.
బుద్ధిమంతుడైనవాడు తన శత్రువు అనేకగుణాలచే శ్రేష్ఠుడని తెలిసినట్లయితే, సామోపాయం ద్వారానే కార్యాన్ని సాధించాలి. అందుకు అవసరమైన సంధికి ప్రేరేపించాలి. (55)
వ్యసనం వాస్య కాంక్షేత వివాసమ్ వా యుధిష్ఠిర ।
అపి సింధోర్గిరేర్వాపి కిం పునర్మర్త్యధర్మిణః ॥ 56
యుధిష్ఠిరా! శత్రువుకు పెద్ద కష్టం వచ్చేటట్లు కోరుకోవాలి. లేదా అతడు దేశం విడిచివెళ్ళేలా చూడాలి. శత్రువు సముద్రమైనా, పర్వతమైనా సరే దాని మీద కూడ కష్టాన్ని కోరుకోవాలి. ఇక మరణస్వభావం గల మానవుడైతే వేరే చెప్పాలా! (56)
ఉత్థానయుక్తః సతతం పరేషామంతరైషణే ।
ఆనృణ్యమాప్నోతి నరః పరస్యాత్మన ఏవ చ ॥ 57
శత్రువులలోని లోపాన్ని/బలహీనతను వెతకటంలో ఎప్పుడూ ప్రయత్నిస్తూండాలి. అలా చేసినట్లయితే తనదృష్టిలోను, ఇతరుల దృష్టిలోను నిర్దోషి అవుతాడు. (57)
న త్వేవాత్మావమంతవ్యః పురుషేణ కదాచన ।
న హ్యాత్మపరిభూతస్య భూతిర్భవతి శోభనా ॥ 58
మానవుడు తన్నుతాను ఎపుడూ అవమానిమ్చుకోకూడదు. తన్నుతాను నిందించుకొనేవాడు ఉత్తమమైన ఐశ్వర్యాన్ని ఎన్నటికీ పొందలేడు. (58)
ఏవం సంస్థితికా సిద్ధిః ఇయం లోకస్య భారత ।
తత్ర సిద్ధిర్గతిః ప్రోక్తా కాలావస్థావిభాగతః ॥ 59
భారతా! లోకంలో కార్యసిద్ధికి ఈ విధమైన వ్యవస్థ ఉంది. కాలం, అవస్థ అనే రెండింటిని అనుసరించి కార్యసిద్ధి ఉంటుంది. (శత్రువు దుర్బలుడుగా ఉన్నప్పుడు, తగిన కాలంలో ప్రయత్నిస్తే కార్యసిద్ధి జరుగుతుంది.) (59)
బ్రాహ్మణం మే పితా పూర్వం వాసయామాస పండితమ్ ।
సోఽపి సర్వామిమాం ప్రాహ పిత్రే మే భరతర్షభ ॥ 60
నీతిం బృహస్పతి ప్రోక్తాం భ్రాతౄన్ మేఽగ్రాహయత్ పురా ।
తేషాం సకాశాదశ్రౌషమ్ అహమేతాం తదా గృహే ॥ 61
భరతశ్రేష్ఠా! పూర్వం నా తండ్రి మాగృహంలో ఒక బ్రాహ్మణునకు విడిది నిచ్చారు. అతడు నా తండ్రికి బృహస్పతి చెప్పిన ఈ నీతినంతా చెప్పాడు. నా సోదరులకు కూడా దీన్ని నేర్పాడు. అపుడు ఇంటిలో ఉన్న నేను వారి నుండి దీన్ని విన్నాను. (60,61)
స మాం రాజన్ కర్మవతీమ్ ఆగతామాహ సాంత్వయన్ ।
శుశ్రూషమాణామాసీనాం పితురంకే యుధిష్ఠిర ॥ 62
రాజా! అపుడు నేను ఒక పని మీద నాతండ్రి దగ్గరకు వెళ్ళి, వారు చెప్పేది వినాలనే ఆసక్తితో నా తండ్రి ఒడిలో కూర్చున్నాను. అపుడా బ్రాహ్మణుడు సాంత్వనవచనాలతో నాకు దీన్ని ఉపదేశించాడు. (62)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపదీవాక్యే ద్వాత్రింశోఽధ్యాయః ॥ 32 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్రౌపదీ వాక్యమను ముప్పది రెండవ అధ్యాయము. (32)