31. ముప్పదిఒకటవ అధ్యాయము

యుధిష్ఠిరుడు ద్రౌపది ఆక్షేపమునకు సమాధానము చెప్పుట.

యుధిష్ఠిర ఉవాచ
వల్గు చిత్రపదం శ్లక్ష్ణం యాజ్ఞసేని త్వయా వచః ।
ఉక్తం తచ్ఛ్రుతమస్మాభిః నాస్తిక్యం తు ప్రభాషసే ॥ 1
యుధిష్ఠిరుడిట్లన్నాడు - యాజ్ఞసేనీ! నీవు మనోహరమై చిత్ర పదాలతో కూడిన, నిపుణమైన మాటను చెప్పావు. మేము దాన్ని విన్నాం. కాని నీవు తెలియకుండానే నాస్తికత్వాన్ని ప్రతిపాదించావు. (1)
నాహం కర్మఫలాన్వేషీ రాజపుత్రి చరామ్యుత ।
దదామి దేయమిత్యేవ యజ్ఞై ర్యష్టవ్యమిత్యుత ॥ 2
రాజపుత్రీ! నేను కర్మఫలాన్ని ఆపేక్షించి కర్మలనాచరించటం లేదు. దానం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. యజ్ఞం చేయాలనే కర్తవ్యబుద్ధితో యజ్ఞం చేస్తున్నాను. (2)
అస్తు వాత్ర ఫలం మా వా కర్తవ్యం పురుషేణ యత్ ।
గృహే వా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్ ॥ 3
కర్మకు ఫలం ఉండుగాక! లేకుండుగాక, గృహస్థాశ్రమంలోని పురుషుడు చేయదగిన కర్మను యథాశక్తిగా నేను చేస్తున్నాను. (3)
ధర్మం చరామి సుశ్రోణి న ధర్మఫలకారణాత్ ।
ఆగమాననతిక్రమ్య సతాం వృత్తమవేక్ష్య చ ॥ 4
ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావాచ్చైవ మే ధృతమ్ ।
ధర్మవాణిజ్యకో హీనః జఘన్యో ధర్మవాదినమ్ ॥ 5
సుశ్రోణీ! ధర్మం ఆచరిస్తున్నాను, కాని ధర్మఫలాన్ని అపేక్షించి మాత్రం కాదు. శాస్త్రాలను పరిశీలించి, సత్పురుషుల నడవడిని చూసి, సహజంగానే నా మనస్సు ధర్మాన్ని ధరించింది. ఫలాన్ని కోరి ధర్మం చేయడం ధర్మంతో వ్యాపారం చేయడమే. అటువంటివాడు ధర్మపరులలొ నిందింపదగినవాడు. (4,5)
న ధర్మఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్ఛతి ।
యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతనః ॥ 6
పాపాత్ముడైన మానవుడు నాస్తిక్యబుద్ధితో ధర్మానుష్ఠాన విషయాన్ని శంకించినా, ధర్మం పేరుతో స్వార్థాన్ని పొందాలని భావించినా, ధర్మఫలాన్ని పొందజాలడు. (6)
అతివాదాద్ వదామ్యేషః మా ధర్మనుభిశంకిథాః ।
ధర్మాభిశంకీ పురుషః తిర్యగ్గతిపరాయణః ॥ 7
శాస్త్ర ప్రమాణాలన్నింటి సారం బాగా గ్రహించి నేను చెపుతున్నాను - ధర్మాన్ని శంకించవద్దు. ధర్మాన్ని శంకించేవాడు పశుజాతిలో, పక్షిజాతిలో జన్మిస్తాడు. (7)
ధర్మో యస్యాభిశంక్యః స్యాద్ ఆర్షం వా దుర్బలాత్మనః ।
వేదాచ్ఛూద్ర ఇవాపేయాత్ స లోకాదజరామరాత్ ॥ 8
ధర్మాన్ని శంకించేవాడు, దుర్బలుడై వేదాది శాస్త్రాలపై అవిశ్వాసం కలవాడు అజరామరమైన లోకాన్ని కోల్పోతాడు. శూద్రుడు వేదాధ్యయనాన్ని కోల్పోయినట్లు వీడు అజరామరమయిన లోకాన్ని కోల్పోతాడు. (8)
వేదాధ్యాయీ ధర్మపరః కులే జాతో మనస్విని ।
స్థవిరేషు స యోక్తవ్యః రాజర్షిర్ధర్మచారిభిః ॥ 9
మనస్వినీ! వేదాధ్యయనం చేసిన ధర్మపరుడు, కులీనుడూ అయిన వ్యక్తి రాజ - ఋషి - ధర్మచారుల చేత వృద్ధుల యందు లెక్కింపదగినవాడు. (9)
పాపీయాన్ స హి శూద్రేభ్యః తస్కరేభ్యో విశిష్యతే ।
శాస్త్రాతిగో మందబుద్ధిః యో ధర్మమభిశంకతే ॥ 10
మందబుద్ధియై, శాస్త్రాన్ని ఉల్లంఘించి, ధర్మాన్ని శంకించేవాడు శూద్రుల కంటె, చోరులకంటె పాపాత్ముడు. (10)
ప్రత్యక్షం హి త్వయా దృష్టః ఋషిర్గచ్ఛన్ మహాతపాః ।
మార్కండేయోఽప్రమేయాత్మా ధర్మేణ చిరజీవితా ॥ 14
అప్రమేయుడు, మహాతపస్వి ఐన మార్కండేయ మహర్షిని నీ ఎదురుగా వెళ్ళడం నీవు ప్రత్యక్షంగా చూశావు కదా! అతడు ధర్మపాలన చేతనే చిరంజీవి అయ్యాడు. (11)
వ్యాసో వసిష్ఠో మైత్రేయః నారదో లోమశః శుకః ।
అన్యే చ ఋషయః సర్వే ధర్మేణైవ సుచేతసః ॥ 12
వ్యాసుడు, వసిష్ఠుడు, మైత్రేయుడు, నారదుడు, లోమశుడు, శుకుడు, ఇంకా ఇతర మహర్షులంతా ధర్మంచేతనే శుద్ధ మనస్సును పొందారు. (12)
ప్రత్యక్షం పశ్యసి హ్యేతాన్ దివ్యయోగసమన్వితాన్ ।
శాపానుగ్రహణే శక్తాన్ దేవేభ్యోఽపి గరీయసః ॥ 13
దివ్యమైన యోగశక్తితో కూడియున్న వీరిని నీవుఉ ప్రత్యక్షంగా చూస్తున్నావు. వారు శపించటానికీ, అనుగ్రహించటానికీ (ఆగ్రహానుగ్రహాలయందు) సమర్థులు. దేవతల కంటె గొప్పవారు. (13)
ఏతే హి ధర్మమేవాదౌ వర్నయంతి సదానఘే ।
కర్తవ్యమమరప్రఖ్యాః ప్రత్యక్షాగమబుద్ధయః ॥ 14
పుణ్యశీలా! వీరు దేవతల కంటె ప్రఖ్యాతి కలవారు. వేదగమ్య విషయాలను ప్రత్యక్షం చేసుకోగలవారు, వీరు అన్నింటికంటె ముందుగా ధర్మాన్నే ఆచరింపదగినదిగా చెప్తారు. (14)
అతో నార్హసి కల్యాణి ధాతారం ధర్మమేవ చ ।
రాజ్ఞి మూఢేన మనసా క్షేప్తుం శంకితుమేవ చ ॥ 15
కల్యాణీ! అందువల్ల మూర్ఖుడైన మనస్సుతో ఈశ్వరుని, ధర్మాన్ని ఆక్షేపించడం, శంకించడం చేయరాదు. (15)
ఉన్మత్తాన్ మన్యతే బాలః సర్వానాగతనిశ్చయాన్ ।
ధర్మాభిశంకో నాన్యస్మాత్ ప్రమాణమధిగచ్ఛతి ॥ 16
ధర్మం యొక్క తత్త్వం తెలిసిన జ్ఞానులను బాలుడు ఉన్మత్తులుగా భావిస్తాడు. ధర్మాన్ని శంకించే బాలబుద్ధి ఇతరుల నుండి శాస్త్ర ప్రమాణాన్ని గ్రహింపజాలదు. (16)
ఇంద్రియప్రీతిసంబద్ధం యదిదం లోకసాక్షికమ్ ।
ఏతావన్మన్యతే బాలః మోహమన్యత్ర గచ్ఛతి ॥ 17
కేవలం స్వబుద్ధినే ప్రమాణంగా తీసికొని శ్రేష్ఠులను, ఉత్తమధర్మాలను అవహేళన చేసేవాడు ఇంద్రియ ప్రీతి సంబద్ధమైన లోకంలో కనబడేవాటినే సత్యాలుగా గ్రహిస్తాడు. అప్రత్యక్షంగా ఉన్నవాటి విషయంలో మోహపడతాడు. (17)
ప్రాయశ్చిత్తం న తస్యాస్తి యో ధర్మమభిశంకతే ।
ధ్యాయన్ స కృపణః పాపః న లోకాన్ ప్రతిపద్యతే ॥ 18
ధర్మాన్ని శంకించేవాడికి ప్రాయశ్చిత్తం లేదు. ధర్మానికి విరుద్ధంగా ఆలోచించే దీనుడు, పాపాత్ముడూ అయిన వ్యక్తి ఉత్తమలోకాలను పొందలేడు. (18)
ప్రమాణాద్ధి నివృత్తో హి వేదశాస్త్రార్థనిందకః ।
కామలోభాతిగో మూఢః నరకం ప్రతిపద్యతే ॥ 19
ప్రమాణాలను తిరస్కరించేవాడు, వేదశాస్త్రార్థాలను నిందించేవాడు, కామలోభపరాయణుడూ అయిన మూర్ఖుడు నరకం పొందుతాడు. (19)
యస్తు నిత్యం కృతమతిః ధర్మమేవాభిపద్యతే ।
అశంకమానః కల్యాణి సోఽముత్రానంత్యమశ్నుతే ॥ 20
కల్యాణీ! నిశ్చయబుద్ధితో నిత్యమూ ధర్మాన్ని శంకించకుండా ఆచరించేవాడు పరలోకంలో అనంతసుఖాన్ని పొందుతాడు. అనగా పరమాత్మ ప్రాప్తి నొందుతాడు. (20)
అర్షం ప్రమాణముత్ర్కమ్య ధర్మం న ప్రతిపాలయన్ ।
సర్వశాస్త్రాతిగో మూఢః శం జన్మసు న విందతి ॥ 21
అర్ష ప్రమాణాన్ని ఉల్లంఘించి, ధర్మాన్ని పాలించక సర్వశాస్త్రాలను అతిక్రమించే మూఢుడు ఎన్ని జన్మలెత్తినా సుఖాన్ని పొందలేడు. (21)
యస్య నార్షం ప్రమాణం స్యాద్ శిష్టాచారశ్చ భావిని ।
న వై తస్య పరో లోకః నాయమస్తీతి నిశ్చయః ॥ 22
భావినీ! ఋషివచనం కాని, శిష్టుల ఆచారం కాని ప్రమాణంగా అంగీకరించని వానికి ఇహపరలోకాలు రెండూ లేవు. ఇది నిశ్చయం. (22)
శిష్టైరాచరితం ధర్మం కృష్ణే మా స్మాభిశంకిథాః ।
పురాణమృషిభిః ప్రోక్తం సర్వజ్ఞైః సర్వదర్శిభిః ॥ 23
కృష్ణా! సర్వజ్ఞులు, సర్వదర్శులు అయిన ఋషులు చెప్పిన, శిష్టులు ఆచరించిన పురాతనమైన ధర్మాన్ని శంకించవద్దు. (23)
ధర్మ ఏవ ప్లవో నాన్యః స్వర్గం ద్రౌపది గచ్ఛతామ్ ।
సైవ నౌః సాగరస్యేవ వణిజః పారమిచ్ఛతః ॥ 24
ద్రౌపదీ! స్వర్గానికి వెళ్ళేవారికి ధర్మమే నావ. సముద్రం యొక్క ఆవలి ఒడ్డుకు చేరాలనుకొనే వర్తకునకు అది నావ వంటిది. (24)
అఫలో యది ధర్మః స్యాత్ చరితో ధర్మచారిభిః ।
అప్రతిష్ఠే తమస్యేతద్ జగన్మజ్జేదనిందితే ॥ 25
సాధ్వీ! ధర్మాచార పరాయణులు ఆచరించిన ధర్మం నిష్ఫలమే అయితే ఈ సమస్తజగత్తూ అంతులేని అంధకారంలో మునిగిపోతుంది. (25)
నిర్వాణం నాధిగచ్చేయుః జీవేయుః పశుజీవికామ్ ।
విద్యాం తే నైవ యుజ్యేయుః న చార్థం కేచిదాప్నుయుః ॥ 26
ధర్మం నిష్ఫలమైతే ధర్మాత్ములు మోక్షాన్ని పొందరు. వారు విద్యలనే అభ్యసించరు. ఎటువంటి ప్రయోజనానికి ప్రయత్నమే చెయ్యరు. కేవలం పశువుల్లా జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు. (26)
తపశ్చ బ్రహ్మచర్యం చ యజ్ఞః స్వాధ్యాయ ఏవ చ ।
దానమార్జవమేతాని యది స్యురఫలాని వై ॥ 27
నాచరిష్యన్ పరే ధర్మం పరే పరతరే చ యే ।
విప్రలంభోఽయమత్యంతం యది స్యురఫలాః క్రియాః ॥ 28
ఋషయశ్చైవ దేవాశ్చ గంధర్వాసురరాక్షసాః ।
ఈశ్వరాః కస్య హేతోస్తే చరేయుర్ధర్మమాదృతాః ॥ 29
తపస్సు, బ్రహ్మచర్యం, యజ్ఞం, స్వాధ్యాయం, దానం, ఋజువర్తనం ఇవి నిష్ఫలాలైతే శ్రేష్ఠులైనవారు ధర్మాన్ని ఆచరించేవారే కారు. ధార్మికాలైన క్రియలు నిష్పలాలైతే ఋషులు, దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు, ప్రభావశాలులైన ఆదరపూర్వకంగా ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు? (27-29)
ఫలదం త్విహ విజ్ఞాయ ధాతారం శ్రేయసి ధ్రువమ్ ।
ధర్మం తే వ్యచరన్ కృష్ణే తద్ధి శ్రేయః సనాతనమ్ ॥ 30
కృష్ణా! ధర్మఫలాన్నిచ్చేవాడు ఈశ్వరుడు అని తెలిపే ఋషులు మున్నగువారు ధర్మాన్ని ఆచరించారు. ధర్మమే సనాతన శ్రేయస్సు. ఇది నిశ్చయం. (30)
స నాయమఫలో ధర్మః నాధర్మోఽఫలవానపి ।
దృశ్యంతేఽపి హి విద్యానాం ఫలాని తపసాం తథా ॥ 31
త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథా శ్రుతమ్ ।
వేత్థా చాపి యథా జాతః ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ॥ 32
అటువంటి ధర్మమూ నిష్ఫలం కాదు. అధర్మం కూడా నిష్ఫలమైంది కాదు. విద్యలకు, తపస్సులకు ఫలాలు కనబడుతూనే ఉన్నాయి. కృష్ణా! నీవు ప్రసిద్ధమైన నీ జన్మ వృత్తాంతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ సోదరుడు, ప్రతాపవంతుడూ అయిన దృష్టద్యుమ్నుడు ఎలా జన్మించాడో నీకు తెలుసు. (31,32)
ఏతావదేవ పర్యాప్తమ్ ఉపమానం శుచిస్మితే ।
కర్మణాం ఫలమాప్నోతి ధీరోఽల్పేనాపి తుష్యతి ॥ 33
తెలినవ్వుకలదానా! ఈ చెప్పిన దృష్టాంతం చాలు నీకు. ధీరుడు కర్మఫలాన్ని పొందుతాడు. ఆ ఫలం స్వల్పమైనా సంతోషిస్తాడు. (33)
బహునాపి హ్యవిద్వాంసః నైవ తుష్యంత్యబుద్ధయః ।
తేషాం న ధర్మజం కించిత్ ప్రేత్య శర్మాస్తి వా పునః ॥ 34
కాని బుద్ధిహీనులు ఎక్కువఫలాన్ని పొంది కూడా సంతృప్తి నొందరు. అటువంటి వారికి పరలోకంలో ధర్మం వల్ల కలిగే సుఖం కొంచెం కూడా ఉండదు. (34)
కర్మణాం శ్రుతపుణ్యానాం పాపానాం చ ఫలోదయః ।
ప్రభవశ్చాత్యయశ్చైవ దేవగుహ్యాని భావిని ॥ 35
భావినీ! వేదోక్త పుణ్యఫలాలనిచ్చే సత్కర్మల ఫలాలు కానీ, అనిష్టఫలాన్నిచ్చే పాపకర్మల ఫలాలు కానీ ఆరంభమగుట, పుట్టుట, నశించుట అను విషయాలు కానీ దేవరహస్యాలు. (35)
నైతాని వేద యః కశ్చిద్ ముహ్యంతేఽత్ర ప్రజా ఇమాః ।
అపి కల్పసహస్రేణ న స శ్రేయోఽధిగచ్ఛతి ॥ 36
ఈ దేవరహస్యాలను సాధారణ మానవులు తెలియలేక, మోహితులౌతూ ఉంటారు. అటువంటివారు కల్పసహస్రం గడిచినా శ్రేయస్సును (శాశ్వతసుఖాన్ని) పొందలేరు. (36)
రక్ష్యాన్యేతాని దేవానాం గూఢమాయా హి దేవతాః ।
కృతాశాశ్చ వ్రతాశాశ్చ తపసా దగ్ధకిల్బిషాః ।
ప్రసాదైర్మానసైర్యుక్తాః పశ్యంత్యేతాని వై ద్విజాః ॥ 37
ఇవి దేవతలకు రక్షింపదగినవి. దేవతల మాయ తెలియరానిది కదా! ఆశను విడిచినవారు, నియమబద్ధమైన ఆహారం తీసికొనేవారు, తపస్సు చేత పాపాలను దహించినవారూ ప్రసన్నమనస్సులు కల ద్విజులు ఈ రహస్యాలను చూడగలుగుతారు. (37)
నఫలాదర్శనాద్ధర్మః శంకితవ్యో న దేవతాః ।
యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చానసూయతా ॥ 38
ధర్మఫలం తొందరగా కనబడకపోతే అందుకు ధర్మాన్ని కాని, దేవతలను కాని శంకించకూడదు. దోష దృష్టి లేకుండా ప్రయత్నించి యజ్ఞదానాలను చెయ్యాలి. (38)
కర్మాణాం ఫలమస్తీహ తథైతద్ ధర్మశాసనమ్ ।
బ్రహ్మా ప్రోవాచ పుత్రాణాం యదృషిర్వేద కశ్యపః ॥ 39
కర్మలఫలం తప్పక పొందబడుతుంది. ఇది ధర్మశాస్త్ర విధానం. బ్రహ్మ ఈ విషయాన్ని తన పుత్రులకు చెప్పాడు. కశ్యపుడు ఈ విషయం ఎరుగును. (39)
తస్మాత్ తే సంశయః కృష్ణే నీహార ఇవ నశ్యతు ।
వ్యవస్య సర్వమస్తీతి నాస్తిక్యం భావముత్సృజ ॥ 40
కృష్ణా! అందువల్ల నీ సంశయం మంచువలె నశించుగాక! ధర్మం, ఈశ్వరుడు ఇవన్నీ సత్యమని నిశ్చయించుకొని, నాస్తిక్యభావాన్ని విడిచిపెట్టు. (40)
ఈశ్వరం చాపి భూతానాం ధాతారం మా చ వై క్షిప ।
శిక్షస్వైనం నమస్వైనం మా తేఽభూద్ బుద్ధిరీదృశీ ॥ 41
ప్రాణులన్నింటి ధారణ, పోషణ చేసే ఈశ్వరుని ఆక్షేపించకు. శాస్త్ర, హురుజనోపదేశాల వల్ల ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నించు. అతనికి నమస్కరించు. మళ్ళీ ఇటువంటి బుద్ధి నీకు కలుగకుండుగాక! (41)
యస్య ప్రసాదాత్ తద్భక్తః మర్త్యో గచ్ఛత్యమర్త్యతామ్ ।
ఉత్తమాం దేవతాం కృష్ణే మావమంస్థాః కథంచన ॥ 42
కృష్ణా! ఈశ్వరభక్తుడు మర్త్యుడైనా ఈశ్వరుని అనుగ్రహం వల్ల అమరుడౌతాడు. ఉత్తమమగు దైవాన్ని ఏ విధంగానూ అవహేళన చేయకు. (42)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి యుధిష్ఠిరవాక్యే ఏకత్రింశోఽధ్యాయః ॥ 31 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర వాక్యమను ముప్పది ఒకటవ అధ్యాయము. (31)