21. ఇరువది యొకటవ అధ్యాయము
శాల్వుని మాయచే శ్రీకృష్ణుడు మూర్ఛనొందుట.
వాసుదేవ ఉవాచ
ఏవం స పురుషవ్యాఘ్ర శాల్వరాజో మహారిపుః ।
యుధ్యమానో మయా సంఖ్యే వియదభ్యగమత్ పునః ॥ 1
వాసుదేవుడిలా అన్నాడు - పురుషవ్యాఘ్రా! ఈ విధంగా ఆ మహాశత్రువైన శాల్వరాజు రణరంగంలో నాతో యుద్ధం చేస్తూ మళ్ళీ ఆకాశంలోకి వెళ్లాడు. (1)
తతః శతఘ్నీశ్చ మహాగదాశ్చ
దీప్తాంశ్చ శూలాన్ ముసలానసీంశ్చ ।
చిక్షేప రోషాన్మయి మందబుద్ధిః
శాల్వో మహారాజ జయాబికాంక్షీ ॥ 2
తరువాత నన్ను జయించాలనే కోరికతో మందబుద్ధి అయిన శాల్వుడు నాపై శతఘ్నులను, మహాగదలను, మండుతున్న శూలాలను, ముసలాలను, ఖడ్గాలను విసిరాడు. (2)
తానాశుగైరాపతతోఽహమాశు
నివార్య హంతుం ఖగమాన్ ఖ ఏవ ।
ద్విధా త్రిధా చాచ్ఛిదమాశుముక్తః
తతోఽంతరిక్షే నినదో బభూవ ॥ 3
వేగంగా వస్తూన్న ఆ ఆయుధాలను వెంటనే నివారించి, ఆకాశంలో సంచరించే శత్రువులను అక్కడే చంపడానికి నిశ్చయించుకొని, వేగంగా వెలువడిన బాణాలతో రెండుగా, మూడుగా ఛేదించాను. అనంతరం అంతరిక్షంలో పెద్దధ్వని అయింది. (3)
తతః శతసహస్రేణ శరాణాం నతపర్వణామ్ ।
దారుకం వాజినశ్చైవ రథం చ సమవాకిరత్ ॥ 4
ఆ తరువాత వంగిన పర్వాలు గల లక్షబాణాలతో నా సారథిని, గుర్రాలను రథాన్ని చెల్లాచెదరు చేశాడు. (4)
తతో మామబ్రవీద్ వీర దారుకో విహ్వలన్నివ ।
స్థాతవ్యమితి తిష్ఠామి శాల్వబాణప్రపీడితః ।
అవస్థాతుం న శక్నోమి అంగం మే వ్యవసీదతి ॥ 5
వీరశ్రేష్ఠా! అపుడు దారుకుడు నాతో ఇలా అన్నాడు - ప్రభూ! శాల్వుని బాణాలచే హింసింపబడి, వివశుణ్ణి అవుతున్నాను. ఉండాలని ఉంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. నా శరీరం శిథిలమై పోతోంది. (5)
ఇతి తస్య నిశమ్యాహం సారథేః కరుణం వచః ।
అవేక్షమాణో యంతారం అపశ్యం శరపీడితమ్ ॥ 6
సారథి జాలిగా పలికిన ఈ మాటలను విని శరపీడితుడైన అతడిని చూశాను. (6)
న తస్యోరసి మూర్ధ్ని న కాయే న భుజద్వయే ।
అంతరం పాండవశ్రేష్ఠ పశ్యామ్యనిచితం శరైః ॥ 7
స తు బాణవరోత్పీడాద్ విస్రవత్యసృగుల్బణమ్ ।
అభివృష్టే యథా మేఘే గిరిర్గైరికధాతుమాన్ ॥ 8
పాండవశ్రేష్ఠా! అతని వక్షఃస్థలం, శిరస్సు, శరీరం, రెండు భుజాలు అంతటా బాణాలు తగిలాయి. అతని శరీరంలో బాణాలు తగిలాయి. అతని శరీరంలో బాణాలు గ్రుచ్చుకోని ప్రదేశమే లేదు. మేఘం వర్షిస్తే గైరికాది ధాతువులతో ఎర్రగా ఉండే పర్వతంలా బాణాలదెబ్బలవల్ల కలిగిన రక్తప్రవాహంతో అతడు ప్రకాశిస్తున్నాడు. (7,8)
అభిషుహస్తం తం దృష్ట్వా సీదంతం సారథిం రనే ।
అస్తంభయం మహాబాహో శాల్వబాణప్రపీడితమ్ ॥ 9
మహాబాహూ! యుద్ధంలో శాల్వుని బాణాలచే దెబ్బతిని కళ్ళాలు చేతబట్టియే మరణించబోతూన్న ఆ సారథిని చూసి అతడు మరణించకుండా ఆపాను. (9)
అథ మాం పురుషః కశ్చిద్ ద్వారకానిలయోఽబ్రవీత్ ।
త్వరితో రథమభ్యేత్య సౌహృదాదివ భారత ॥ 10
ఆహుకస్య వచో వీర తస్యైవ పరిచారకః ।
విషణ్ణః సన్నకంఠేన తన్నిబోధ యుధిష్ఠిర ॥ 11
భారతావీరా! ఇంతలో ద్వారకా నివాసి ఒకానొకడు స్నేహం వల్ల కాబోలు తొందరతో నారథం దగ్గరకు వచ్చి నాతో ఇలా చెప్పాడు. యుధిష్ఠిరా! ఉగ్రసేనుని సేవకుడైన ఆ పురుషుడు గద్గదకంఠంతో విచారగ్రస్తుడై చెప్పిన సంగతిని నీకు చెపుతాను. తెలుసుకో. (10,11)
ద్వారకాధిపతిర్వీర ఆహ త్వామాహుకో వచః ।
కేశావైహి విజానీష్వ యత్ త్వాం పితృసఖోఽబ్రవీత్ ॥ 12
వీరా! కేశావా! ద్వారకాధిపతి ఉగ్రసేనుడు నీకు ఈ సందేశాన్ని చెప్పాడు. కేశవా! వారు నీతండ్రికి మిత్రులు 'ఇక్కడకు రా. తెలుసుకో' అని వారు నీకు చెప్పారు. (12)
ఉపయాయాద్య శాల్వేన ద్వారకాం వృష్ణినందన ।
విషక్తే త్వయి దుర్ధర్ష హతః శూరసుతో బలాత్ ॥ 13
కృష్ణా! నీవు యుద్ధాసక్తుడవై ఉంటే శాల్వుడు ఈ రోజు ద్వారకకు వచ్చి వసుదేవుని బలవంతంగా చంపాడు. (13)
తదలం సాధు యుద్ధేన నివర్తస్వ జనార్దన ।
ద్వారకామేవ రక్షస్వ కార్యమేతన్మహత్ తవ ॥ 14
అందువల్ల జనార్దనా! ఇక యుద్ధంచాలు. వెనుదిరుగు. ద్వారకనే నీవు రక్షించు. ఇదే నీకు గొప్పపని. (14)
ఇత్యహం తస్య వచనం శ్రుత్వా పరమదుర్మనాః ।
నిశ్చయం నాధిగచ్ఛామి కర్తవ్యస్యేతరస్య చ ॥ 15
రాజదూత యొక్క ఆ మాటను విని నా మనస్సు చాలా బాధపడింది. కర్తవ్యాకర్తవ్య నిర్ణయం చేయలేకపోయాను. (15)
సాత్యకిం బలదేవం చ ప్రద్యుమ్నం చ మహారథమ్ ।
జగర్హే మనసా వీర తచ్ఛ్రుత్వా మహదప్రియమ్ ॥ 16
వీరా! నామనసుకు మిక్కిలి అప్రియమైన ఆ మాటను విని సాత్యకి బలదేవులను, మహారథుడైన ప్రద్యుమ్నుని మనఃపూర్వకంగా నిందించాను. (16)
అహం హి ద్వారకాయాశ్చ పితుశ్చ కురునందన ।
తేషు రక్షాం సమాధాయ ప్రయాతః సౌభపాతనే ॥ 17
కురునందనా! నేను ద్వారకా రక్షణను, నా తండ్రి రక్షణను వారిచేతిలో పెట్టి సౌభవిమాననాశనం కొరకు వెళ్లాను కదా! (17)
బలదేవో మహాబాహుః కచ్చిజ్జీవతి శత్రుహా ।
సాత్యకీ రౌక్మిణేయశ్చ చారుదేష్ణశ్చ వీర్యవాన్ ॥ 18
సాంబప్రభృతయశ్చైవేత్యహమాసం సుదుర్మనాః ।
ఏతేషు హి నరవ్యాఘ్ర జీవత్సు స కథంచన ॥ 19
శక్యః శూరసుతో వ్యక్తం వ్యక్తం చైతే పరాసవః ॥ 20
బలదేవముఖాః సర్వే ఇతి మే నిశ్చితా మతిః ।
సోఽహం సర్వవినాశం తం చింతయానో ముహుర్ముహుః ।
అవిహ్వలో మహారాజ పునః శాల్వమయోధయమ్ ॥ 21
శత్రుఘాతకుడైన మహాబాహువు బలదేవుడు జీవించి ఉన్నాడా! సాత్యకి, రుక్మిణీకుమారుడు ప్రద్యుమ్నుడు, బలవంతుడైన చారుదేష్ణుడు, సాంబుడు మున్నగు వారు జీవించి ఉన్నారా! అని నా మనస్సు కలత చెందింది. నరవ్యాఘ్రా! వీరంతా జీవించి ఉండగా శూరసేనుని కుమారుడు వసుదేవుడు స్వయంగా ఇంద్రునిచేత కూడా చంపశక్యం కాడు. దీనిని బట్టి శూరసుతుడైన నా తండ్రి వసుదేవుడు మరణించి ఉంటాడు అని స్పష్టమౌతోంది. బలదేవాదిప్రముఖులు కూడా మరణించి ఉండటం స్పష్టమే. అని నేను మనస్సులో ఒక నిశ్చయానికి వచ్చాను. మహారాజా! వారందరి వినాశనాన్ని ఆలోచిస్తూన్న నేను విహ్వలత విడిచి మరల శాల్వునితో పోరాడాను. (18-21)
తతోఽపశ్యం మహారాజ ప్రపతంతమహం తదా ।
సౌభాచ్ఛూరసుతం వీర తతో మాం మోహ ఆవిశత్ ॥ 22
మహారాజా! అపుడు నేను సౌభవిమానం నుండి నా తండ్రి వసుదేవుడు క్రిందకు పడుతూండటం చూశాను. అంతలోనే నన్ను మోహం ఆవేశించింది. (22)
తస్య రూపం ప్రపతతః పితుర్మమ నరాధిప ।
యయాతేః క్షీణపుణ్యస్య స్వర్గాదివ మహీతలమ్ ॥ 23
నరాధిప! అలా పడుతూన్న నా తండ్రి యొక్క రూపం పుణ్యం క్షీణించి స్వర్గం నుండి భూమిపైకి పడుతున్న యయాతి రూపంలా ఉంది. (23)
విశీర్ణమలినోష్ణీషః ప్రకీర్ణాంబరమూర్ధజః ।
ప్రపతన్ దృశ్యతే హ స్మ క్షీణపుణ్య ఇవ గ్రహః ॥ 24
చిరిగిన, మలినమైన తలపాగా కల్గి చెదరిన వస్త్రం, జుట్టు కల్గిన ఆ వసుదేవుడు పుణ్యం నశించి, క్రిందికి పడుతున్న గ్రహం వలె ఉన్నాడు. (24)
తతః శర్ ఙ్గం ధనుఃశ్రేష్ఠ కరాత్ ప్రపతితం మమ ।
మోహాపన్నశ్చ కౌంతేయ రథోపస్థ ఉపావిశమ్ ॥ 25
కుంతీనందనా! ఆ స్థితిలో ఉన్న నా తండ్రిని చూడగానే, ధనుఃశ్రేష్ఠమైన నాశార్ ఙ్గం చేతి నుండి క్రిందపడింది. మోహం పొంది రథంలోనే కూర్చుండిపోయాను. (25)
తతో హాహాకృతం సర్వం సైన్యం మే గతచేతనమ్ ।
మాం దృష్ట్వా రథనీడస్థం గతాసుమివ భారత ॥ 26
భారతా! తరువాత ప్రాణం పోయినవాడిలా రథంలో అలా నిశ్చేతనంగా పడి ఉన్న నన్ను చూసి సైన్యమంతా హాహాకారాలు చేసింది. (26)
ప్రసార్య బాహూ పతతః ప్రసార్య చరణావపి ।
రూపం పితుర్మే విబభౌ శకునేః పతతో యథా ॥ 27
రెండుకాళ్ళూ, రెండు చేతులూ చాచి క్రిందపడుతూన్న నా తండ్రి రూపం చనిపోయి నేల మీదపడుతున్న పక్షిరూపంలా ఉంది. (27)
తం పతంతం మహాబాహో శూలపట్టిశపాణయః ।
అభిఘ్నంతో భృశం వీర మమ చేతో హ్యకంపయన్ ॥ 28
వీరవరా! మహాబాహూ! అలా పడుతూన్న అతణ్ణి శూలపట్టిసాలు ధరించిన శత్రువులు కొట్టారు. క్రూరమైన ఆ కృత్యం చూసి నా మనస్సు చలించిపోయింది. (28)
తతో ముహూర్తాత్ ప్రతిలభ్య సంజ్ఞమ్
అహమ్ తదా వీర మహావిమర్దే ।
న తత్ర సౌభం న రిపుం చ శాల్వం
పశ్యామి వృద్ధం పితరం న చాపి ॥ 29
వీరవరా! అటు తరువాత ఒక ముహూర్తసమయానికి నాకు మెలకువ వచ్చింది. ఆ సమయానికి యుద్ధరంగంలో సౌభ విమానం జాడలేదు. శత్రువు శాల్వుడు కూడా లేడు. వృద్ధుడైన నా తండ్రి కూడా కనిపించలేదు. (29)
తతో మమాసీన్మనసి మాయేయమితి నిశ్చితమ్ ।
ప్రబుద్ధోఽస్మి తతో భూయః శతశోఽవాకిరం శరాన్ ॥ 30
అపుడు నామనస్సులో ఇదంతా మాయ అని నిశ్చయం కలిగింది. తరువాత వెంటనే లేచి మళ్ళీ వందలకొద్దీ బాణాలను కురిపించాను. (30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే ఏకవింశోఽధ్యాయః ॥ 21 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను ఇరువది ఒకటవ అధ్యాయము. (21)