20. ఇరువదియవ అధ్యాయము

శ్రీకృష్ణశాల్వుల భయంకరయుద్ధము.

వాసుదేవ ఉవాచ
ఆనర్తనగరం ముక్తం తతోఽహమగమం తదా ।
మహాక్రతౌ రాజసూయే నివృత్తే నృపతే తవ ॥ 1
వాసుదేవుడిలా అన్నాడు - రాజా! నీ రాజసూయమహాక్రతువు పూర్తయిన తరువాత శాల్వవిముక్తమైన ఆనర్తనగరానికి వెళ్లాను. (1)
అపశ్యం ద్వారకాం చాహం మహారాజ హతత్విషమ్ ।
నిఃస్వాధ్యాయవషట్కారాం నిర్భూషణవరస్త్రియమ్ ॥ 2
మహారాజా! అక్కడకు వెళ్ళిన నేను ఐశ్వర్యహీనమై స్వాధ్యాయవషట్కారాలు లేని, అలంకారాలు లేని స్త్రీ వలె ఉన్న ద్వారకను చూశాను. (2)
అనభిజ్ఞేయరూపాణి ద్వారకోపవనాని చ ।
దృష్ట్వా శంకోపపన్నోఽహం అపృచ్ఛం హృదికాత్మజమ్ ॥ 3
ద్వారకలోని ఉపవనాలు నామరూపాలు తెలియకుండా ఉన్నాయి. వాటిని చూసిన నాకు సందేహం కలిగింది. అపుడు కృతవర్మను అడిగాను. (3)
అవస్థనరనారీకమ్ ఇదం వృష్ణికులం భృశమ్ ।
కిమిదం నరశార్దూల శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ 4
'నరశ్రేష్ఠా! వృష్ణివంశంలో స్త్రీపురుషులంతా మిక్కిలి అస్వస్థులుగా ఎందుకున్నారు? యథార్థాన్ని నేను వినాలనుకొంటున్నాను. (4)
ఏవముక్తః స తు మయా విస్తరేణేదమబ్రవీత్ ।
రోధం మోక్షం చ శాల్వేన హార్దిక్యో రాజసత్తమ ॥ 5
రాజశ్రేష్ఠా! నేనిలా అడగ్గానే, అతడు - శాల్వుడు ద్వారకను చుట్టుముట్టడమూ, మరల విడిచిపెట్టడమూ - అంతా వివరించి చెప్పాడు. (5)
తతోఽహం భరతశ్రేష్ఠ శ్రుత్వా సర్వమశేషతః ।
వినాశే శాల్వరాజస్య తదైవాకరవం మతిమ్ ॥ 6
భరతశ్రేష్ఠా! అతడు చెప్పినది పూర్తిగా విన్న తర్వాత శాల్వరాజవినాశనానికి అపుడే సంకల్పించాను. (6)
తతోఽహం భరతశ్రేష్ఠ సమాశ్వాస్య పురే జనమ్ ।
రాజానమాహుకం చైవ తథైవానకదుందుభిమ్ ॥ 7
సర్వాన్ వృష్ణిప్రవీరాంశ్చ హర్షయన్నబ్రువం తదా ।
అప్రమాదః సదా కార్యః నగరే యాదవర్షభాః ॥ 8
అనంతరం నగరంలోని జనులందరిని ఊరడించి, రాజు ఉగ్రసేనునీ, తండ్రి వసుదేవునీ వృష్ణివంశవీరులందరినీ ఉత్సాహపరుస్తూ ఇలా చెప్పాను - యాదవశ్రేష్ఠులారా! నగరంలో ఎప్పుడూ రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. (7,8)
శాల్వరాజవినాశాయ ప్రయాతం మాం నిబోధత ।
నాహత్వా తం నివర్తిష్యే పురీం ద్వారవతీం ప్రతి ॥ 9
నేను శాల్వరాజును నాశనం చేయడానికి వెళుతున్నాను. మీ రీవిషయం నిశ్చయంగా తెలిసికోండి. శాల్వుని చంపకుండా ద్వారవతీనగరానికి తిరిగి రాను. (9)
సశాల్వం సౌభనగరం హత్వా ద్రష్టాస్మి వః పునః ।
త్రిః సమాహన్యతామేషా దున్దుభిః శత్రుభీషణా ॥ 10
శాల్వునితో పాటుగ సౌభనగరాన్ని నాశనం చేసి మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. శత్రుభయంకరమైన ఈ దుందుభిని ముమ్మారు మ్రోగించండి. (10)
తే మయాఽశ్వాసితా వీరా యథావద్ భరతర్షభ ।
సర్వే మామబ్రువన్ హృష్టాః ప్రయాహి జహి శాత్రవాన్ ॥ 11
ఈ విధంగా యదువీరుల నందరినీ నేను ఊరడించాను. వారంతా సంతోషించి 'వెళ్ళు శత్రువులను సంహరించు' అని నాతో అన్నారు. (11)
తైః ప్రహృష్టాత్మభిర్వీరైః ఆశీర్భిరభినందితః ।
వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్ ప్రణమ్య శిరసా భవమ్ ॥ 12
శైబ్యసుగ్రీవయుక్తేన రథేనానాదయన్ దిశః ।
ప్రధ్మాప్య శంఖప్రవరం పాంచజన్యమహం నృప ॥ 13
ప్రయాతోఽస్మి నరవ్యాఘ్ర బలేన మహతా వృతః ।
క్లప్తేన చతురంగేణ యత్తేన జితకాశినా ॥ 14
ప్రసన్నులైన ఆ యదువీరులంతా ఆశీస్సులతో నన్ను అభినందించారు. ద్విజశ్రేష్ఠులు స్వస్తివచనాలు పలికారు. నేను శిరస్సు వంచి శివునికి నమస్కరించాను. రాజా! శైబ్య సుగ్రీవాలనే గుర్రాలు పూన్చిన రథాన్ని ఎక్కి, దిక్కులన్నీ ప్రతిధ్వనింపజేస్తూ శ్రేష్ఠమయిన శంఖాన్ని - పాంచజన్యాన్ని - పూరించి, చతురంగబలంతో కూడిన, విజయకాంక్షతో ఉన్న మహాసేనతో కూడి శల్వుని పైకి యుద్ధానికి వెల్ళాను. (12-14)
సమతీత్య బహూన్ దేశాన్ గిరీంశ్చ బహుపాదపాన్ ।
నరాంసి సరితశ్చైవ మార్తికావతమాసదమ్ ॥ 15
అనేక దేశాలను దాటి, ఎన్నో వృక్షాలతో ఉన్న పర్వతాలను దాటి, సరస్సులను, నదులను దాటి మార్తికావతనగరానికి చేరాను. (15)
తత్రాశ్రౌషం నరవ్యాఘ్ర శాల్వం సాగరమంతికాత్ ।
ప్రయాంతం సౌభమాస్థాయ తమహం పృష్ఠతోఽన్వయామ్ ॥ 16
నరవ్యాఘ్రా! అక్కడకు వెళ్ళి, శాల్వుడు సౌభవిమానమెక్కి సాగరసమీపంలో వెళ్ళుతున్నాడని విన్నాను. అతణ్ణి వెనుక నుండి అనుసరించాను. (16)
తతః సాగరమాసాద్య కుక్షౌ తస్య మహోర్మిణః ।
సముద్రనాభ్యాం శాల్వోఽభూత్ సౌభమాస్థాయ శత్రుహన్ ॥ 17
శాల్వుడు సముద్రం దగ్గరకు వెళ్ళి మహాతరంగాలతో ఉన్న ఆ సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం చేరి, అక్కడ సౌభవిమానమెక్కి తిరుగుతున్నాడు. (17)
స సమాలోక్య దూరాన్మాం స్మయన్నివ యుధిష్ఠిర ।
ఆహ్వాయామాస దుష్టాత్మా యుద్ధాయైవ ముహుర్ముహుః ॥ 18
యుధిష్ఠిరా! దూరం నుండి నన్ను చూసి, గర్వంతో ఆ దుర్మార్గుడు మాటిమాటికి నన్ను యుద్ధానికి ఆహ్వానించాడు. (18)
తస్య శార్ ఙ్గవినిర్ముక్తైః బహుభిర్మర్మభేదిభిః ।
పురం నాసాద్యత శరైః తతో మాం రోష ఆవిశత్ ॥ 19
నా శార్ ఙ్గధనువు నుండి వెలువడ్డ ప్రాణాంతకాలైన బాణాలు అతని సౌభవిమానాన్ని తాకలేదు. అందువల్ల నాకు రోషం కలిగింది. (19)
స చాపి పాపప్రకృతిః దైతేయాపసదో నృప ।
మయ్యవర్షత దుర్ధర్షః శరధారాః సహస్రశః ॥ 20
రాజా! ఎదిరింపశక్యంగాని ఆ రాక్షసాధముడు శాల్వుడు కూడ నాపై వేలకొలది బాణాలను వర్షధారల వలె కురిపించాడు. (20)
సైనికాన్ మమ సూతం చ హయాంశ్చ సమవాకిరత్ ।
అచింతయంతస్తు శరాన్ వయం యుధ్యామ భారత ॥ 21
భరతశ్రేష్ఠా! అతడు తన బాణాలతో నా సారథిని, గుర్రాలను, సైనికులను చెల్లాచెదరు చేశాడు. మేము బాణాలను లక్ష్యపెట్టక, యుద్ధం చేస్తున్నాం. (21)
తతః శతసహస్రాణి శరాణాం నతపర్వణామ్ ।
చిక్షిపుః సమరే వీరాః మయి శాల్వపదానుగాః ॥ 22
తర్వాత శాల్వుని అనుచరులైన వీరులు వంగినకణుపులు గల బాణాలను వేలకొద్దీ నాపై వేశారు. (22)
తే హయాంశ్చ రథం చైవ తదా దారుకమేవ చ ।
ఛాదయామాసురసురాః తైర్బాణైర్మర్మభేదిభిః ॥ 23
ఆ సమయంలో ఆ అసురవీరులు మర్మఘాతకాలైన బాణాలతో నా గుర్రాన్ని, రథాన్ని, సారథిదారుకుని కప్పివేశారు. (23)
న హయా న రథో వీర న యంతా మమ దారుకః ।
అదృశ్యంత శరైశ్ఛన్నాః తథాహం సైనికాశ్చ మే ॥ 24
ఆ సమయంలో నా గుర్రాలు, రథం, సారథి దారుకుడు ఎవరూ కనబడటం లేదు. ఆ బాణాలు నన్ను, నా సైనికులను కూడా కప్పివేశాయి. (24)
తతోఽహమపి కౌంతేయ శరణామయుతాన్ బహూన్ ।
ఆమంత్రితానాం ధనుషా దివ్యేన విధినాక్షిపమ్ ॥ 25
కుంతీనందనా! అపుడు నేను కూడా నాదివ్యమైన ధనుస్సు నుండి శాస్త్రప్రకారం అభిమంత్రించి వేలకొలది బాణాలు వేశాను. (25)
న తత్ర విషయస్త్వాసీత్ మమ సైన్యస్య భారత ।
ఖే విషక్తం హి తత్ సౌభం క్రోశమాత్ర ఇవాభవత్ ॥ 26
అపుడు ఆ సౌభవిమానం ఆకాశంలో క్రోసెడు దూరం వెళ్ళింది. అందువల్ల నాసైనికులకు లక్ష్యం కనబడకుండా పోయింది. (26)
తతస్తే ప్రేక్షకాః సర్వే రంగవాట ఇవ స్థితాః ।
హర్షయామాసురుచ్చైర్మాం సింహనాదతలస్వనైః ॥ 27
అనంతరం రంగశాలలో ఉన్న ప్రేక్షకులవలె మా సైనికులంతా సింహనాదాలతోను, కరతాలధ్వనులతోను నన్ను సంతోషపెట్టారు (ఉత్సాహపరిచారు). (27)
మత్కరాగ్రవినిర్ముక్తాః దానావానాం శరాస్తథా ।
అంగేషు రుచిరాపాంగాః వివిశుః శలభా ఇవ ॥ 28
నాచేతి నుండి వెలువడిన అందమైన అంచులు గల బాణాలు దానవుల శరీరాలతో శలభాలవలె ప్రవేశించాయి. (28)
తతో హలహలాశబ్దః సౌభమధ్యే వ్యవర్ధత ।
వధ్యతాం విశిఖైస్తీక్ష్ణైః పతతాం చ మహార్ణవే ॥ 29
అనంతరం తీక్ష్ణాలైన నా బాణాల చేత చంపబడిన సైనికులు మహాసముద్రంలో పడుతూ చేసిన శబ్దం చేత సౌభవిమానంలో కోలాహలం బయలుదేరింది. (29)
తే నికృత్తభుజస్కంధాః కబంధాకృతిదర్శనాః ।
నదంతో భైరవాన్ నాదాన్ నిపతంతి స్మ దానవాః ॥ 30
భుజస్కంధాలు తెగిన దానవులు కంబంధుని ఆకృతిలో కనబడుతూ భయంకరమైన శబ్దం చెస్తూ సముద్రంలో పడుతున్నారు. (30)
పతితాస్తేఽపి భక్ష్యంతే సముద్రాంభోనివాసిభిః ।
తతో గోక్షీరకుందేందుమృణాలరజతప్రభమ్ ॥ 31
జలజం పాంచజన్యం వై ప్రాణేనాహమపూరయమ్ ।
తాన్ దృష్ట్వా పతితాంస్తత్ర శాల్వః సౌభపతిస్తతః ॥ 32
మాయాయుద్ధేన మహతా యోధయామాస మాం యుధి ।
తతో గదా హలాః ప్రాసాః శూలశక్తిపరశ్వధాః ॥ 33
అసయః శక్తికులిశపాశర్ ష్టికనపాః శరాః ।
పట్టిశాశ్చ భుశుండ్యశ్చ ప్రపతంత్యనిశం మయి ॥ 34
అలా సముద్రంలో పడిన ఆ దానవులను సముద్రంలో నివసించే జంతువులు తింటున్నాయి. అటుపై నేను గోక్షీరంవలె, మల్లెవలె, చంద్రునివలె, మృణాలంవలె, వెండివలె తెల్లగా ప్రకాశిస్తున్న పాంచజన్యాన్న్ పూరించాను. నాబాణాలకు పడిపోయిన సైనికులను చూసి సౌభపతి శాల్వుడు నాతో మాయాయుద్ధం చేయసాగాడు. గదలు, హలాలు, ప్రాసాలు, శక్తి, పరశువులు, ఖడ్గాలు, శక్తులు, వజ్రాయుధాలు, ఋష్టి, కనప, బాణాలు, పట్టిశాలు, భుశండి మున్నగు ఆయుధాలు నిరంతరం నాపై పడసాగాయి. (31-34)
తామహం మాయయైవాశు ప్రతిగృహ్య వ్యనాశయమ్ ।
తస్యాం హతాయాం మాయాయాం గిరిశృంగైరయోధయత్ ॥ 35
శాల్వుని ఆ మాయను నేను మాయ ద్వారా గ్రహించి నాశనం చేశాను. ఆ మాయ నాశనంకాగానే, అతడు పర్వతశిఖరాలతో యుద్ధం చేశాడు. (35)
తతోఽభవత్ తమ ఇవ ప్రకాశ ఇవ చాభవత్ ।
దుర్దినం సుదినం చైవ శీతముష్ణం చ భారత ॥ 36
అంగారపాంశువర్షం చ శస్త్రవర్షం చ భారత ।
ఏవం మాయాం ప్రకుర్వాణః యోధయామాస మాం రిపుః ॥ 37
భారతా! అటు తరువాత అతడి మాయ వల్ల ఒక్కసారిగా చీకటి వ్యాపించడం, మళ్ళి వెంటనే వెలుతురు రావడం; ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కప్పి ఉండడం, మరల ఆకాశం నిర్మలంగా స్వచ్ఛందంగా ప్రకాశించడం; ఒకసారి చలి వ్యాపించడం, మళ్ళి అంతలోనే వేడిగా ఉండటం, నిప్పులు, ధూళి, శస్త్రాలు వర్షంగా కురవడం... ఈవిధమ్గా మాయతో శాల్వుడు యుద్ధం చేయసాగాడు. (36,37)
విజ్ఞాయ తదహం సర్వం మాయమైన వ్యనాశయమ్ ।
యథాకాలం తు యుద్ధేన వ్యధమం సర్వతః శరైః ॥ 38
అదంతా తెలిసిన సర్వం మాయయైవ వ్యనాశయమ్ ।
యథాకాలం తు యుద్ధేన వ్యధమం సర్వతః శరైః ॥ 38
అదంతా తెలిసిన నేను దాన్ని మాయతోనే నశింపజేశాను. సమయానుకూలంగా యుద్ధంచేస్తీ నేను బాభాలతో శాల్వుని సైనికులను హింసింపసాగాను. (38)
తతో వ్యోమ మహారాజ శతసూర్యమివాభవత్ ।
శతచంద్రం చ కౌంతేయ సహస్రాయుతతారకమ్ ॥ 39
మహారాజా! అపుడు ఆకాశమంతా నూర్గురు సూర్యులు ప్రకాశిస్తూన్నట్టుగా అయింది. ఆకాశంలో నూరుగురు చంద్రులూ, పదివేల తారకలూ ప్రకాశింపసాగాయి. (39)
తతో నాజ్ఞాయత తదా దివారాత్రం తథా దిశః ।
తతోఽహం మోహమాపన్నః ప్రజ్ఞాస్త్రం సమయోజయమ్ ॥ 40
అపుడు రాత్రిపగలు తెలియలేదు. దిక్కులు తెలియలేదు. అందువల్ల భ్రాంతికలిగిన నేను ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించారు. (40)
తతస్తదస్త్రం కౌంతేయ ధూతం తూలమివానిలైః ।
తథా తదభవద్ యుద్ధం తుములం లోమహర్షణమ్ ।
లబ్ధాలోకస్తు రాజేంద్ర పునః శత్రుమయోధయమ్ ॥ 41
కుంతీనందనా! వాయువుచే దూది ఎగిరిపోయినట్లుగా, అస్త్రం చేత అతని మాయ దూరం చేయబడింది. అపుడు రోమాలు గగుర్పాటు చెందేటట్లు యుద్ధం జరిగింది. రాజేంద్రా! అపుడు అంతటా ప్రకాశం రాగా, శత్రువుతో యుద్ధం చేయసాగాను. (41)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే వింశోఽధ్యాయః ॥ 20 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను ఇరువదియవ అధ్యాయము. (20)