19. పందొమ్మిదవ అధ్యాయము

ప్రద్యుమ్నుడు శాల్వుని ఓడించుట.

వాసుదేవ ఉవాచ
ఏవముక్తస్తు కౌంతేయ సూతపుత్రస్తతోఽబ్రవీత్ ।
ప్రద్యుమ్నం బలినాం శ్రేష్ఠం మధురం శ్లక్ష్ణమంజసా ॥ 1
వాసుదేవుడిలా అన్నాడు - కుంతీనందనా! ప్రద్యుమ్నుడు ఇలా చెప్పగా, సూతపుత్రుడు బలవంతులలో శ్రేష్ఠుడైన ప్రద్యుమ్నునితో మధురంగా, సంగ్రహంగా, నేర్పుగా ఇలా అన్నాడు. (1)
న మే భయం రౌక్మిణేయ సంగ్రామే యచ్ఛతో హయాన్ ।
యుద్ధజ్ఞోఽస్మి చ వృష్ణీనాం నాత్రకించిదతోఽన్యథా ॥ 2
రౌక్మిణేయా! యుద్ధంలో గుర్రాలను అదుపుచేసే నాకు భయం లేదు. వృష్ణివీరుల యుద్ధాన్ని గురించి కూడ తెలుసు. నివు చెప్పిన దాంట్లో మరొక అభిప్రాయమేమీ లేదు. (2)
ఆయుష్మన్నుపదేశస్తు సారథ్యే వర్తతాం స్మృతః ।
సర్వార్థేషు రథీ రక్ష్యః త్వం చాపి భృశపీడితః ॥ 3
ఆయుష్మంతుడా! సారథి యొక్క ధర్మంలో ఇలా ఉపదేశించడం నాకు గుర్తుంది. అన్ని దశలలోనూ కూడ సారథికి రథికుడు రక్షింపదగినవాడు. ఆ సమయంలో నీవు బాగా హింసింపబడి ఉన్నావు. (3)
త్వం హి శాల్వప్రయుక్తేన శరేణాభిహతో భృశమ్ ।
కశ్మలాభిహతో వీర తతోఽహమపయాతవాన్ ॥ 4
వీరా! శాల్వుడు వేసిన బాణం చేత నీవు బాగా దెబ్బతిని ఉన్నావు. స్పృహతప్పి పడి ఉన్నావు. అందువల్ల నేను నిన్ను దూరంగా తీసికొని వెళ్లాను. (4)
స త్వం సాత్వతముఖ్యాద్య లబ్ధసంజ్ఞో యదృచ్ఛయా ।
పశ్య మే హయసంయానే శిక్షాం కేశవనందన ॥ 5
కేశవనందనా! ఇపుడు దైవవశాత్తు నీకు తెలివి వచ్చింది. ఇక గుర్రాలను నడపడంలో నా విద్య ఎటువంటిదో చూడు. (5)
దారుకేణాహముత్పన్నః యథావచ్చైవ శిక్షితః ।
వీతభీః ప్రవిశామ్యేతాం శాల్వస్య ప్రథితాం చమూమ్ ॥ 6
నేను దారకుని పుత్రుడని. సారథ్య విద్యను యథావిధింగా నేర్చుకొన్నాను. గణుతికెక్కిన ఈ శాల్వసేనలోనికి నిర్భయంగా ప్రవేశిస్తాయి. (6)
వాసుదేవ ఉవాచ
ఏవముక్త్వా తతో వీర హయాన్ సంచోద్య సంగరే ।
రశ్మిభిస్తు సముద్యమ్య జవేనాభ్యపతత్ తదా ॥ 7
వీరా! ఇలా చెప్పి సూతపుత్రుడు గుర్రాలను కళ్ళాలతో లాగిపెట్టి వేగంగా రణరంగంలోకి పరుగెత్తించాడు. (7)
మండలాని విచిత్రాణి యమకానీతరాణి చ ।
సవ్యాని చ విచిత్రాని దక్షిణాని చ సర్వశః ॥ 8
అతడు గుర్రాలను మండలాకారంగా, సమానంగా, వంకరగా కుడిఎడమలకు చిత్రవిచిత్రాలైన గతులతో నడిపించాడు. (8)
ప్రతోదేనాహతా రాజన్ రశ్మిభిశ్చ సముద్యతాః ।
ఉత్పతంత ఇవాకాశే వ్యచరంస్తే హయోత్తమాః ॥ 9
రాజా! ఆ గుర్రాలు చెర్నాకోలదెబ్బలు తిని కళ్ళెం బిగపెట్టి, ఆకాశంలోకి ఎగురుతున్నట్లుగా పరుగెత్తాయి. (9)
తే హస్తలాఘవోపేతం విజ్ఞాయ నృప దారుకిమ్ ।
దహ్యమానా ఇవ తదా నాస్పృశంశ్చరణైర్మహీమ్ ॥ 10
మహారాజా! హస్తలాఘవం (చేతినేర్పు) గల దారుకుని గురించి తెలిసిన ఆ గుర్రాలు మండుతున్న అగ్నిలా పాదాలు నేలను తాకకుండా పరుగెత్తుతున్నాయి. (10)
సోఽపసవ్యాం చమూం తస్య శాల్వస్య భరతర్షభ ।
చకార నాతియత్నేన తదద్భుతమివాభవత్ ॥ 11
భరతశ్రేష్ఠా! దారుకపుత్రుడు ఆ శాల్వుని సైన్యాన్ని పెద్ద ప్రయత్నం లేకుండగానే, అపసవ్యంగా (కుడివైపుకు) ఉండేటట్లు చేశాడు. అది చాలా అద్భుతంగా జరిగింది. (11)
అమృష్యమాణోఽపసవ్యం ప్రద్యుమ్నేన చ సౌభరాట్ ।
యంతారమస్య సహసా త్రిభిర్బాణైః సమార్దయత్ ॥ 12
ప్రద్యుమ్నుడు తన సైన్యాన్ని అపసవ్యంగా ఉండేటట్లు చేయడం సహించలేని సౌభపతి శాల్వుడు, ప్రద్యుమ్నుని రథసారథిని మూడు బాణాలతో హింసించాడు. (12)
దారుకస్య సుతస్తత్ర బాణవేగమచింతయన్ ।
భూయ ఏవ మహాబాహో ప్రయయావపసవ్యతః ॥ 13
తతో బాణాన్ బహువిధాన్ పునరేవ స సౌభరాట్ ।
ముమోచ తనయే వీర మమ రుక్మిణినందనే ॥ 14
తానప్రాప్తాన్ శితైర్బాణైః చిచ్ఛేద పరవీరహా ।
రౌక్మిణేయః స్మితం కృత్వా దర్శయన్ హస్తలాఘవమ్ ॥ 15
ఛిన్నాన్ దృష్ట్వా తు తాన్ బాణాన్ ప్రద్యుమ్నేన చ సౌభరాత్ ।
ఆసురీం దారుణీం మాయామ్ ఆస్థాయ వ్యసృజచ్ఛరాన్ ॥ 16
మహాబాహూ! దారుకుని పుత్రుడపుడు బాణవేగాన్ని గురించి ఏమాత్రం చింతించక, మళ్లీ అపసవ్యంగానే వెళ్ళాడు. తరువాత సౌభపతి శాల్వుడు రుక్మిణీనందనుడైన ప్రద్యుమ్నునిపై అనేకవిధాలైన బాణాలను వేశాడు. శత్రువీరులను చంపే ప్రద్యుమ్నుడు చిరునవ్వు నవ్వి, తన హస్తలాఘవాన్ని చూపిస్తూ, ఆ బాణాలు తనపై పడకుండానే వాటిని తన తీక్ష్ణమైన బాణాలతో ఛేదించాడు. ప్రద్యుమ్నుడు తన బాణాల్ని చేదించడం చూసి సౌభపతి శాల్వుడు దారుణమైన ఆసురీమాయను ఆశ్రయిమ్చి, బాణాలను విడిచాడు. (13-16)
ప్రయుజ్యమానమాజ్ఞాయ దైతేయాస్త్రం మహాబలమ్ ।
బ్రహ్మాస్త్రేణాంతరాచ్ఛిత్త్వా ముమోచాన్యాన్ పతత్రిణః ॥ 17
రాక్షసుడు ప్రయోగించే మహాబలమైన అస్త్రాన్ని తెలిసికొని, మధ్యలోనే బ్రహ్మాస్త్రంతో దాన్ని ఛేదించి, ఇతరబాణాలను శాల్వునిపై విడిచాడు. (17)
తే తదస్త్రం విధూయాశు వివ్యధూ రుధిరాశనాః ।
శిరస్యురసి వక్త్రే చ స ముమోహ పపాత చ ॥ 18
శత్రువుల రక్తాన్ని త్రాగే ఆ బాణాలు అతని అస్త్రాన్ని నాశనం చేసి, శిరసుపై, వక్షస్థలంపైన, ముఖంమీద దెబ్బతీశాయి. దానితో అతడు స్పృహతప్పి పడిపోయాడు. (18)
తస్మిన్ నిపతితే క్షుద్రే శాల్వే బాణప్రపీడితే ।
రౌక్మిణేయో పరం బాణమ్ సందధే శత్రునాశనమ్ ॥ 19
నీచుడైన శాల్వుడు బాణాల దెబ్బలచే పీడితుడై క్రిందపడగానే, ప్రద్యుమ్నుడు శత్రునాశనమైన ఒక ఉత్తమబాణాన్ని సంధించాడు. (19)
తమర్చితం సర్వదశార్హపూగైః
ఆశీవిషాగ్నిజ్వలనప్రకాశమ్ ।
దృష్ట్వా శరం జ్యామభినీయమానం
బభూవ హాహాకృతమంతరిక్షమ్ ॥ 20
యాదవవీరులందరిచే పూజింపబడి, సర్పం యొక్క విషంతోనూ అగ్నిజ్వాలతోను సమంగా ప్రకాశిస్తూ, నారికి సంధింపబడే ఆ బాణాన్ని చూసి అంతరిక్షమంతా హాహాకారాలు చేసింది. (20)
తతో దేవగణాః సర్వే సేంద్రాః సహధనేశ్వరాః ।
నారదం ప్రేషయామాసుః శ్వసనం చ మనోజవమ్ ॥ 21
అపుడు ఇంద్రుడు, కుబేరునితో సహా దేవగణాలన్నీ నారదుని పంపించారు. మనోవేగం గల వాయువును కూడా పంపారు. (21)
తౌ రౌక్మిణేయమాగమ్య వచోఽబ్రూతాం దివౌకసామ్ ।
నైష వధ్యస్త్వయా వీర శాల్వరాజః కథంచన ॥ 22
వారిరువురూ రుక్మిణీనందనుడైన ప్రద్యుమ్నుని సమీపించి, దేవతల మాటను చెప్పారు - వీరా! ఈ శాల్వరాజును నీవు ఏవిధంగానూ చంపడానికి వీలులేదు. (22)
సంహరస్వ పునర్బాణమ్ అవధ్యోఽయం త్వయా రణే ।
ఏతస్య చ శరస్యాజౌ నావధ్యోఽస్తి పుమాన్ క్వచిత్ ॥ 23
నీవు వెంటనే మళ్ళీ బాణాన్ని ఉపసంహరించు. ఇతడు యుద్ధంలో నీచే చంపదగినవాడు కాదు. ఈ బాణం ప్రయోగిస్తే యుద్ధరంగంలో చావనివాడెవడూ ఉండడు. (23)
మృత్యురస్య మహాబాహో రణే దేవకినందనః ।
కృష్ణ సంకల్పితో ధాత్రా తన్మిథ్యా న భవేదితి ॥ 24
మహాబాహూ! బ్రహ్మచేత దేవకీనందనుడైన శ్రీకృష్ణుని ద్వారా యుద్ధంలో ఇతనికి మరణం సంకల్పించబడింది. అది అసత్యం కాకూడదు. (24)
తతః పరమసంహృష్టః ప్రద్యుమ్నః శరముత్తమమ్ ।
సంజహార ధనుఃశ్రేష్ఠాత్ తూణే చైవ న్యవేశయత్ ॥ 25
ఆ మాటలు విని మిక్కిలి ఆనందించిన ప్రద్యుమ్నుడు ఉత్తమమైన ఆ బాణాన్ని శ్రేష్ఠమగు ధనుస్సు నుండి ఉపసంహరించి, అమ్ముల పొదిలో ఉంచాడు. (25)
తతః ఉత్థాయ రాజేంద్ర శాల్వః పరమదుర్మనాః ।
వ్యపాయాత్ సబలస్తూర్ణం ప్రద్యుమ్నశరపీడితః ॥ 26
రాజేంద్రా! ఆ తరువాత శాల్వుడు లేచి, ప్రద్యుమ్నుని బాణాలచే పీడింపబడి, మిక్కిలి దుఃఖిస్తున్న మనస్సుతో సైన్యంతోపాటు త్వరగా యుద్ధరంగం నుండి నిష్క్రమించాడు. (26)
స ద్వారకాం పరిత్యజ్య క్రూరో వృష్ణిభిరార్దితః ।
సౌభమాస్థాయ రాజేంద్ర దివమాచక్రమే తదా ॥ 27
రాజేంద్రా! క్రూరుడైన ఆ శాల్వుడు వృష్ణిసైనికులచే హింసింపబడి, ద్వారకను విడిచి, సౌభవిమానాన్ని ఎక్కి, అంతరిక్షంలోకి వెళ్ళాడు. (27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే ఏకోనవింశోఽధ్యాయః ॥ 19 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను పందొమ్మిదవ అధ్యాయము. (19)